ఇమ్రాన్ ఖాన్‌కు ఏమైంది? పాకిస్తాన్‌లో వ్యాపిస్తున్న వదంతులపై ఆ దేశ ప్రభుత్వం ఏం చెబుతోంది?

పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) నాయకుడు, మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇమ్రాన్ ఖాన్

పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) నాయకుడు, పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ గురించి బుధవారం నుంచి అక్కడి సోషల్ మీడియాలో పలు వార్తలు ప్రచారం అవుతున్నాయి.

ఇమ్రాన్ ఖాన్‌ను రావల్పిండిలోని అదియాలా జైలు నుంచి తరలించారని నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయన ఆరోగ్యంపై ప్రశ్నలు లేవనెత్తారు.

ఇమ్రాన్ ఖాన్ రెండేళ్ల నుంచి రావల్పిండిలోని అదియాలా జైలులో ఖైదుగా ఉన్నారు. 190 మిలియన్ పౌండ్ల (సుమారు 2,000 కోట్ల రూపాయలు) అవినీతి కేసులో ఆయనకు కోర్టు జైలు శిక్ష విధించింది.

కాగా, ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్ తన సోదరుడి విషయంలో వ్యాపించిన వదంతులను తోసిపుచ్చారు.

మరోవైపు, ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగానే ఉన్నారని, జైలు నిబంధనలు, కోర్టు సూచనల ప్రకారం ఆయనకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని అదియాలా జైలు అధికారులు బీబీసీతో తెలిపారు.

జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ గురించి గతంలోనూ అనేక వదంతులు వచ్చాయి. అయితే, ఇమ్రాన్ ఖాన్‌ను కలవడానికి గత మూడు వారాలుగా ఆయన కుటుంబ సభ్యులను అనుమతించలేదనే వార్తలు రావడం మరోసారి వదంతులకు ఆజ్యం పోసింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) నాయకుడు, ఇమ్రాన్ ఖాన్, అదియాలా జైలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇమ్రాన్ ఖాన్

వదంతులు ఎలా మొదలయ్యాయి?

బుధవారం రాత్రి నుంచి పాకిస్తాన్‌లో సోషల్ మీడియాలో #WHEREISIMRANKHAN హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. సోషల్ మీడియాలో యూజర్లు, పీటీఐ కార్యకర్తలు ఇమ్రాన్ ఖాన్ ఎక్కడ ఉన్నారు? ఆయనను కలవడానికి ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు.

అదియాలా జైలులో ఖైదీలను సందర్శించడానికి సాధారణంగా వారానికి ఒక రోజు కేటాయిస్తుంటారు. ఆ రోజున, ఇమ్రాన్ ఖాన్‌ను కలవడానికి పెద్ద సంఖ్యలో పీటీఐ కార్యకర్తలు అదియాలా జైలు వెలుపల గుమిగూడారు. కానీ, జైలు అధికారులు ఆయనను కలవడానికి అనుమతించలేదు. దీంతో, ఇమ్రాన్ కుటుంబం, పీటీఐ నాయకులు జైలు బయట నిరసన తెలిపారు.

అనంతరం, లండన్‌కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) నాయకుడు జుల్ఫీ బుఖారీ, ఇమ్రాన్ ఖాన్ గురించి ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టారు. ఆయన ప్రకటన అప్పటికే సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న వదంతులను బలపరిచింది.

"నిర్బంధంలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. నేను వారాలుగా ఆయన్ను కలవలేదు" అని జుల్ఫీ బుఖారీ తెలిపారు.

"ఆయన్ను (ఇమ్రాన్ ఖాన్) వేరే చోటికి తరలించినట్లయితే, కుటుంబానికి ఎందుకు సమాచారం ఇవ్వలేదు? కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఇమ్రాన్ ఖాన్ దగ్గరికి ఎందుకు అనుమతించడం లేదు" అని జుల్ఫీ బుఖారీ ప్రశ్నించారు.

"ఈ మౌనం చట్టవిరుద్ధం, ఆందోళనకు గురిచేసేది" అని తెలిపారు.

బుధవారం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలలో పీటీఐ కార్యకర్తలు, నాయకులు అదియాలా జైలు బయట నినాదాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.

జైలు బయట ఉన్న పీటీఐ నాయకుడు షౌకత్ బాస్రా మీడియాతో మాట్లాడుతూ "జైలు అధికారులు ఆయన్ను (ఇమ్రాన్ ఖాన్) అదియాలా నుంచి వేరే చోటికి తరలించారనే అనుమానం ఉంది" అని అన్నారు.

పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్, సోషల్ మీడియాలో వదంతులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇమ్రాన్ ఖాన్‌ను కలవడానికి అదియాలా జైలుకు వెళ్లామని, కానీ కలవలేకపోయామని ఆయన అక్కచెల్లెళ్లు చెప్పారు.

దర్యాప్తునకు డిమాండ్

ఇమ్రాన్ ఖాన్ గురించి సోషల్ మీడియాలో వ్యాపించిన వదంతులు, వార్తలలో ఎక్కువ భాగం భారత్, అఫ్గాన్ నుంచి వాడుతున్న ఖాతాల నుంచి వచ్చాయని చెప్తున్నారు.

దీంతో, ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం గురించి స్పష్టమైన సమాచారాన్ని అందించాలని, వదంతులను ఖండించాలని ప్రభుత్వాన్ని పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్(పీటీఐ) డిమాండ్ చేసింది.

"అఫ్గాన్, భారతీయ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, విదేశీ సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌లలోని ఖాతాల ద్వారా పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం గురించి వదంతులు వ్యాప్తి చెందుతున్నాయి" అని పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ ఎక్స్‌లో తెలిపింది.

"ఇమ్రాన్ ఆరోగ్యం, భద్రత, ప్రస్తుత పరిస్థితికి సంబంధించి అధికారిక ప్రకటన వెల్లడించాలి. అటువంటి ప్రమాదకరమైన, సున్నితమైన వదంతులపై దర్యాప్తు చేపట్టాలి" అని ప్రకటన పేర్కొంది.

ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల పాత ఫోటో

ఫొటో సోర్స్, Hussain Ali/Anadolu via Getty Images

ఫొటో క్యాప్షన్, ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల పాత ఫోటో

ప్రభుత్వం ఏం చెప్పింది?

ఇమ్రాన్ ఖాన్‌ను రావల్పిండిలోని అదియాలా జైలు నుంచి తరలించారనే వార్తలను పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వం తిరస్కరించింది.

ఇమ్రాన్ ఖాన్ క్షేమంగా ఉన్నారని, ఆయనను జైలు నుంచి వేరే ప్రదేశానికి తరలిస్తున్నారనే వాదనలు అర్థరహితమని పంజాబ్(పాకిస్తాన్) సమాచార శాఖ మంత్రి అజ్మా బుఖారీ అన్నారు. జైలులో ఆయన అన్ని సౌకర్యాలు పొందుతున్నారని, వైద్యులు సాధారణ వైద్య పరీక్షలూ నిర్వహిస్తున్నారని మంత్రి తెలిపారు.

పీటీఐ చైర్మన్ జైలులో రాజకీయ సమావేశాలు నిర్వహిస్తున్నారని, అందులో ప్రదర్శనలు, అల్లర్లకు సూచనలు ఇస్తున్నారని అదియాలా జైలు సూపరింటెండెంట్ నిన్న ఒక ప్రకటన విడుదల చేశారని సమాచార మంత్రి అన్నారు.

ఇమ్రాన్ ఖాన్ ఖైదీ అని, ఆయన కుటుంబం, న్యాయవాదులు కలవడానికి అనుమతి ఉందని మంత్రి చెప్పారు. అయితే, ఈ నెలలో ఇమ్రాన్ ఖాన్‌ను కలవడానికి ఆయన కుటుంబం, పార్టీ నాయకులకు అనుమతి ఇవ్వలేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)