పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌కు కొత్త అధికారాలు దేనికి సంకేతం?

2022 నవంబర్ నుంచి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌గా ఉన్న ఫీల్డ్ మార్షల్ మునీర్, ఇకపై నేవీ, వైమానిక దళాల వ్యవహారాలను కూడా పర్యవేక్షించనున్నారు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌గా ఉన్న ఫీల్డ్ మార్షల్ మునీర్, ఇకపై నేవీ, వైమానిక దళాల వ్యవహారాలను కూడా పర్యవేక్షించనున్నారు
    • రచయిత, కరోలిన్ డేవిస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌కు కొత్త అధికారాలతోపాటు జీవితకాలం అరెస్టు, విచారణల నుంచి మినహాయింపు లభించేందుకు అనుకూలంగా పార్లమెంట్ ఓటు వేసింది. ఈ తరహా అధికారాలు నియంతృత్వం వైపు దారితీస్తాయని విమర్శకులు అంటున్నారు.

గురువారం 27వ రాజ్యాంగ సవరణ చట్టంగా ఆమోదం పొందింది. ఈ మార్పు దేశంలోని అత్యున్నత న్యాయస్థానాల నిర్వహణలోనూ గణనీయమైన మార్పులు తీసుకురానుంది.

ఇది సాయుధ దళాలకు స్పష్టతను, పరిపాలనా నిర్మాణాన్ని అందిస్తాయని, అదే సమయంలో కోర్టుల్లో పేరుకుపోయిన కేసుల భారాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయని ఈ మార్పులను సమర్థించేవారు చెబుతున్నారు.

అణుసామర్థ్యం కలిగిన పాకిస్తాన్ దేశ రాజకీయాల్లో సైన్యం చాలా కీలక పాత్ర పోషిస్తోంది. కొన్నిసార్లు సైనిక తిరుగుబాటుతో అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇతర సందర్భాల్లో తెరవెనుక చక్రం తిప్పుతోంది.

దీని చరిత్ర చూస్తే, జనరల్ పర్వేజ్ ముషారఫ్, జనరల్ జియా ఉల్ హక్ వంటి ఆర్మీ చీఫ్‌ల సమయంలో పాకిస్తాన్ పౌర స్వయం ప్రతిపత్తి నుంచి వారి ప్రత్యక్ష నియంత్రణలోకి మారుతూ వచ్చింది. ప్రజాప్రభుత్వం, సైన్యం మధ్య అధికార సమతుల్యతను హైబ్రిడ్ పాలన అని విశ్లేషకులు పేర్కొంటారు.

కొంతమంది ఈ సవరణను, ఆర్మీ వైపు అధికార సమతుల్యత మారుతోందని చెప్పడానికి ఒక సంకేతంగా చూస్తున్నారు.

''నా దృష్టిలో ఈ సవరణ అత్యంత తాజా సంకేతం, బహుశా ఇప్పటివరకూ బలమైంది. పాకిస్తాన్ ఇప్పుడు చూస్తున్నది హైబ్రిడ్ వ్యవస్థను కాదు, దానికి ముందున్న పరిస్థితిని '' అని వాషింగ్టన్‌లోని విల్సన్ సెంటర్ సౌత్ ఆసియా ఇన్‌స్టిట్యూట్ మాజీ డైరెక్టర్ మైఖేల్ కుగల్‌మాన్ అన్నారు.

నవంబర్ 2022 నుంచి ఆర్మీ చీఫ్‌గా వ్యవహరిస్తున్న మునీర్, తాజా రాజ్యాంగ సవరణ ప్రకారం పాకిస్తాన్ నేవీ, వైమానిక దళాల వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు.

జీవితాంతం ఫీల్డ్ మార్షల్ హోదాతోపాటు, యూనిఫాం కూడా ధరించవచ్చు. పదవీ విరమణ తర్వాత కూడా ప్రధానమంత్రి సలహా మేరకు దేశాధ్యక్షుడు నిర్ణయించిన 'బాధ్యతలు, విధులు' ఆయనకు కేటాయిస్తారు. తద్వారా ఆయన జీవితకాలం ప్రజాజీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారనేది అంచనా.

ఈ బిల్లును సమర్థించేవారు, ఇది పాకిస్తాన్ సైనిక వ్యవస్థ స్వరూపానికి స్పష్టత ఇస్తుందని వాదించారు.ఈ మార్పులు ఆధునిక యుద్ధ అవసరాలకు అనుగుణంగా పాకిస్తాన్ రక్షణ వ్యవస్థను తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన విస్తృత సంస్కరణల ఎజెండాలో భాగమని ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌ను ఉటంకిస్తూ పాకిస్తాన్ ప్రభుత్వ వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ ఆఫ్ పాకిస్తాన్ పేర్కొంది.

కానీ, ఇతర విమర్శకులు దీన్ని సైన్యానికి అధికారాన్ని అప్పగించడంగా చూస్తున్నారు.

''సైన్యం, పౌరుల మధ్య సమతుల్యత లేదు'' అని పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ ఉపాధ్యక్షురాలు, జర్నలిస్టు మునిజే జహంగీర్ అన్నారు.

''ఆ అధికార సమతుల్యతను వారు మళ్లీ సైన్యం వైపు వంచారు. సైన్యాన్ని కట్టడి చేయాల్సిన సమయంలో వారికి మరింత అధికారాన్ని ఇచ్చారు'' అని ఆమె వ్యాఖ్యానించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఆర్మీ చీఫ్ మునీర్ పోస్టర్‌లతో ప్రదర్శన

ఫొటో సోర్స్, Getty Images

స్వతంత్ర కార్యాచరణకు చోటులేదు...

తాజా రాజ్యాంగ సవరణ ద్వారా మార్పుల్లో వివాదాస్పదమైన మరో అంశం న్యాయవ్యవస్థ.

ఈ సవరణ ప్రకారం, రాజ్యాంగపరమైన చిక్కుప్రశ్నలపై నిర్ణయం తీసుకోవడానికి కొత్తగా ఫెడరల్ రాజ్యాంగ న్యాయస్థానం (ఎఫ్‌సీసీ) ఏర్పాటవుతుంది. దీని తొలి ప్రధాన న్యాయమూర్తిని, అందులో సేవలందించే న్యాయమూర్తులను అధ్యక్షుడు నియమిస్తారు.

''ఇది న్యాయమైన విచారణ హక్కు స్వరూపాన్ని, స్వభావాన్ని శాశ్వతంగా మారుస్తుంది'' అని మునిజే జహంగీర్ అన్నారు.

''న్యాయమూర్తులను నియమించడంలోనే కాకుండా, రాజ్యాంగ ధర్మాసనాలను ఏర్పాటు చేయడంలో కూడా కార్యనిర్వాహక వ్యవస్థ (ఎగ్జిక్యూటివ్) ప్రభావం పెరిగింది. ఆ ధర్మాసనాల కూర్పు కూడా ప్రభుత్వమే నిర్దేశిస్తున్నప్పుడు, పిటిషన్ వేసిన వ్యక్తిగా నాకు న్యాయమైన విచారణ జరుగుతుందనే నమ్మకం ఏముంటుంది?'' అని ఆమె వ్యాఖ్యానించారు.

''న్యాయ వ్యవస్థ ఇప్పుడు కార్యనిర్వాహక వ్యవస్థకు దాసోహమై ఉంటుంది. సాధారణ అభిప్రాయం ఏమిటంటే, న్యాయవ్యవస్థకు ప్రస్తుతానికి స్వతంత్రంగా పనిచేయడానికి ఎటువంటి అవకాశం ఉండబోదు'' అని జర్నలిస్టు ఆరిఫా నూర్ అభిప్రాయపడ్డారు.

27వ రాజ్యాంగ సవరణ ఆమోదించడానికి ముందు, రాజ్యాంగపరమైన కేసులను సుప్రీంకోర్టు విచారించి, తీర్పులు ఇచ్చేది. న్యాయమూర్తులు రాజ్యాంగపరమైన కేసులపై వాదనలనూ వినాల్సివస్తుండటంతో, విచారణకు నోచుకోని క్రిమినల్, సివిల్ కేసుల సంఖ్య పెరిగిపోయిందని కొందరు అంటున్నారు. ఈ రెండు రకాల కేసులనూ వేరు చేయడం వల్ల కోర్టు ప్రక్రియ సులభమవుతుందని వారు వాదిస్తున్నారు.

ఈ వాదన న్యాయవాదులలో కొందరు సానుకూలంగా ఉన్నప్పటికీ, సుప్రీంకోర్టులో కరాచీకి చెందిన న్యాయవాది సలాహుద్దీన్ అహ్మద్ ఆ వాదనను నిజాయితీ లేనిదిగా చూస్తున్నారు. పాకిస్తాన్‌లో అత్యధిక కేసులు పెండింగ్‌లో ఉన్నది సుప్రీంకోర్టులో కాదని ఆయన ప్రస్తావించారు.

''న్యాయ వివాదాలను సత్వరమే పరిష్కరించడం గురించే మీరు నిజంగా ఆందోళన చెందుతుంటే, మీరు ఆ కేసులకు సంబంధించిన సంస్కరణలపై దృష్టి పెట్టాలి'' అని సలాహుద్దీన్ అహ్మద్ అన్నారు.

ఇస్లామాబాద్‌లోని పాకిస్తాన్ సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇస్లామాబాద్‌లోని పాకిస్తాన్ సుప్రీంకోర్టు

ముక్కలుముక్కలుగా సుప్రీంకోర్టు విభజన...

రాజ్యాంగ సవరణ చట్టంగా మారడానికి పార్లమెంటులో ఆమోదం పొందిన కొన్ని గంటల వ్యవధిలోనే పాకిస్తాన్ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు ఇద్దరు తమ రాజీనామాను అందజేశారు.

''నేను పరిరక్షించడానికి, సమర్థించడానికి ప్రమాణం చేసిన రాజ్యాంగం ఇప్పుడు లేదు'' అని జస్టిస్ అథర్ మినల్లా తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

27వ రాజ్యాంగ సవరణ న్యాయవ్యవస్థను ప్రభుత్వం నియంత్రణలోకి తెచ్చిందని, సుప్రీంకోర్టును ముక్కలు ముక్కలుగా చేసిందని మరో న్యాయమూర్తి జస్టిస్ మన్సూర్ అలీ షా వ్యాఖ్యానించారు.

న్యాయమూర్తుల రాజీనామా గురించి రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందిస్తూ, ''సుప్రీంకోర్టుపై వారి గుత్తాధిపత్యాన్ని తగ్గించారు కాబట్టి, వారి మనస్సాక్షి మేల్కొంది. రాజ్యాంగం ఆధిపత్యాన్ని నిరూపించడానికి పార్లమెంటు ప్రయత్నించింది'' అన్నారు.

ఇకపై న్యాయమూర్తులను వారి సమ్మతితో సంబంధం లేకుండానే ఇతర కోర్టులకు బదిలీ చేయవచ్చు. ఒకవేళ వారు ఆ బదిలీకి అంగీకరించకపోతే ఆ న్యాయమూర్తులు జ్యుడీషియల్ కమిషన్‌కు అప్పీల్ చేసుకోవచ్చు. అయితే, వారి బదిలీ నిరాకరణకు చూపించిన కారణాలు సహేతుకమైనవి కాదని తేలితే, ఆ న్యాయమూర్తి పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది.

దీనికి అనుకూలమైనవారు, తాజా సవరణ ద్వారా దేశంలోని అన్ని ప్రాంతాల్లో కోర్టులకు తగినంత సిబ్బందిని నియమించవచ్చని వాదిస్తున్నారు. అయితే, దీన్ని బెదించడానికి ఉపయోగించుకొనే అవకాశం ఉందని కొందరు ఆందోళన చెందుతున్నారు.

''ఒక న్యాయమూర్తిని ఆయన పనిచేస్తున్న ప్రావిన్స్ నుంచి తప్పించి, మరో హైకోర్టుకు బదిలీ చేయడమనేది, ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా నడుచుకోవాలని వారిని మరింత ఒత్తిడికి గురిచేస్తుంది'' అని సలాహుద్దీన్ అహ్మద్ అన్నారు. ఈ మార్పు పాకిస్తాన్‌లో వ్యవస్థల మధ్య సమతుల్యతను దెబ్బతీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

''మన న్యాయవ్యవస్థ గతంలో నియంతలకు సహకరించింది. కానీ, వారు కొన్నిసార్లు కార్యనిర్వాహక వ్యవస్థను కూడా సరిదిద్దారు. మీరు ప్రజల నుంచి ఆ ఆకాంక్షను పూర్తిగా లాగేసుకుంటే, అది వారిని ఇతర, మరింత దారుణమైన మార్గాల వైపు నడిపిస్తుందని భావిస్తున్నాను'' అని అహ్మద్ చెప్పారు.

''అసంతృప్తుల అణచివేత సామాజిక స్థిరత్వానికి శ్రేయస్కరం కాదు'' అని మైఖేల్ కుగల్‌మాన్ అంగీకరించారు.

''ఇది నిరంకుశత్వం వైపు మొగ్గు చూపుతున్నట్లు స్పష్టంగా సూచిస్తోంది'' అని జర్నలిస్టు ఆరిఫా నూర్ అన్నారు. గత సంవత్సరం చేసిన 26వ రాజ్యాంగ సవరణకు కొనసాగింపుగా ప్రస్తుత 27వ సవరణను చూస్తున్నట్లు చెప్పారు. పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తిని ఎన్నుకునే అధికారం చట్టసభ సభ్యులకు 26వ సవరణ ద్వారా కల్పించారని, ఇక 28వ సవరణ గురించి అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయని వ్యాఖ్యానించారు.

''ఇది అధికార సమతుల్యత వ్యవస్థాపరమైన వర్గానికి అనుకూలంగా భారీగా మొగ్గు చూపుతున్నట్లుగా సూచిస్తోంది'' అని నూర్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)