'కిటికీల దగ్గర సిగరెట్ పీకలు కనిపించాయి', హాంకాంగ్ భారీ అగ్నిప్రమాదంపై స్థానికుల్లో ఆగ్రహం

హాంకాంగ్, అగ్నిప్రమాదం, వాంగ్ ఫుక్ కోర్ట్ కాంప్లెక్స్

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, కో ఎవ్, కెల్లీ ఎన్‌జీ

హాంకాంగ్‌‌ భారీ అగ్నిప్రమాద మృతుల సంఖ్య 94కి పెరిగింది. వందల మంది గాయాలపాలయ్యారు. జనసాంద్రత ఎక్కువగా ఉండే గృహ సముదాయంలో జరిగిన ఈ భారీ అగ్నిప్రమాదానికి కారణాలు తెలుసుకుంటున్న ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

కొన్ని బ్లాక్‌లలో ఒక రోజుకు పైగా మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి. దాదాపు 300 మంది ఆచూకీ ఇంకా తెలియలేదు.

భవనాల కిటికీలపై నాణ్యత లేని మెష్, ప్లాస్టిక్ షీట్లు వేయడం వల్ల మంటలు వేగంగా వ్యాపించి ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు.

వాంగ్ ఫుక్ కోర్టులో మంటలు ఇంత వేగంగా ఎలా వ్యాపించాయి? ఎవరు బాధ్యులు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చాలా మంది హాంకాంగ్ వాసులు దీనిని "మనుషుల వల్ల జరిగిన విపత్తు"గా పిలుస్తున్నారు.

కాంప్లెక్స్‌లో మరమ్మతులకు బాధ్యులుగా భావిస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారు. అవినీతి కోణంలోనూ అధికారులు విచారణ మొదలుపెట్టారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
హాంకాంగ్

ఫొటో సోర్స్, Getty Images

అగ్నిప్రమాదం తర్వాత సోషల్ మీడియాలో "ఇది ప్రమాదం కాదు" అనే పోస్ట్ వైరల్ అయింది.

మంటలు చెలరేగినప్పుడు ఫైర్ అలారం మోగలేదని చాలామంది స్థానికులు ఇంటర్వ్యూలలో చెప్పారు.

వాంగ్ ఫుక్ కోర్టులోని ఓ అపార్ట్‌మెంట్ యజమాని కికో మా బీబీసీతో మాట్లాడుతూ, మరమ్మతుల సమయంలో కార్మికులు భవనం లోపలికి రావడనికి, బయటికి వెళ్లేందుకు ఫైర్ ఎగ్జిట్‌లు (అత్యవసర ద్వారాలను) ఉపయోగించారని, ఆ సమయంలో అలారం ఆపివేశారని చెప్పారు.

కికో మా తన కుటుంబంతో కెనడాలో ఉంటున్నారు. కానీ, హాంకాంగ్‌లోని తమ ఇంటికి వస్తూపోతూ ఉంటారు.

"ఈ ప్రమాదం జరగకుండా ఆపి ఉండొచ్చు. చాలామంది వారి విధులు సరిగ్గా నిర్వర్తించలేదు" అని 33 ఏళ్ల కికో అన్నారు. పునరుద్ధరణ సంస్థ నాశిరకం వస్తువులు, సులువుగా మండే పదార్థాలను వినియోగించిందన్నారు.

నిర్మాణ కార్మికులు సిగరెట్లు తాగుతుండడం స్థానికులు చూశారని, వారి కిటికీల వద్ద సిగరెట్ పీకలు కనిపించాయని కూడా ఆమె చెప్పారు.

"మంటలు అంటుకుంటే ఏమవుతుందో తెలుసా? అని అక్కడి వారు చెబుతూనే ఉన్నారు, చాలామంది దీనిపై ఆందోళనగానే ఉన్నారు" అని కికో మా తెలిపారు.

అగ్నిప్రమాదం, బాధితులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వందలాది మందిని తాత్కాలిక శిబిరాలకు తరలించారు. కొందరికి అత్యవసర హౌసింగ్ యూనిట్లు కేటాయిస్తున్నారు.

గత 63 ఏళ్లలో హాంకాంగ్‌లో జరిగిన అత్యంత ఘోరమైన అగ్నిప్రమాదం ఇది. ఇది 1962 ఆగస్టులో షామ్ షుయ్ పో పరిసరాల్లో జరిగిన కార్చిచ్చును మించిన ప్రమాదంగా నమోదైంది. ఆ ప్రమాదంలో 44 మంది చనిపోయారు. వందలాది మంది నిరాశ్రయులయ్యారు.

హాంకాంగ్‌లోని ఈశాన్య తైపో జిల్లాలో 1980లలో నిర్మించిన వాంగ్ ఫుక్ కోర్టులో 31 అంతస్తులతో 8 భవనాలు ఉన్నాయి. వాటిలో ఏడు అగ్నికి ఆహుతయ్యాయి. ఇక్కడి అపార్ట్‌మెంట్‌లను సబ్సిడీ ధరలకు విక్రయిస్తారు, ఈ ఎస్టేట్‌లో రోజువారీ వ్యవహారాలను ప్రైవేట్‌ సంస్థలు నిర్వహిస్తాయి.

2021 జనాభా లెక్కల ప్రకారం, ఈ కాంప్లెక్స్‌లో దాదాపు 4,600 మంది నివసిస్తున్నారు. వీరిలో దాదాపు 40% మంది 65 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గలవారు.

ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నంలో అధిక ఉష్ణోగ్రతలు, పరంజా కూలిపోయే ప్రమాదం, అపార్ట్‌మెంట్‌లలో ఇరుకుగా, రద్దీగా ఉండే భాగాలతో అగ్నిమాపక సిబ్బంది సవాళ్లు ఎదుర్కొన్నారని నగర అగ్నిమాపక విభాగం గురువారం తెలిపింది.

మంటలు చెలరేగినప్పుడు భవన సముదాయంలో ఎంత మంది ఉన్నారన్నది తెలియలేదు. కానీ, వందలాది మంది నివాసితులను తాత్కాలిక శిబిరాలకు తరలించారు. కొందరికి అత్యవసర హౌసింగ్ యూనిట్లు కేటాయిస్తున్నారు.

మరమ్మతుల కోసం వినియోగించిన మెష్ నెట్టింగ్, ప్లాస్టిక్, కాన్వాస్ షీట్లు ఫైర్ సేఫ్టీ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తుండగా, అపార్ట్‌మెంట్ బ్లాక్‌లను అనుసంధానించే వెదురు స్కాఫోల్డింగ్(పరంజా) అగ్నిప్రమాదానికి ఆజ్యం పోసిందని కొంతమంది నిపుణులు విశ్వసిస్తున్నారు.

ఇలాంటి పరంజాలు హాంకాంగ్ అంతటా సాధారణంగా కనిపించేవే. నిర్మాణ సమయంలో దీన్ని విస్తృతంగా ఉపయోగిస్తారు.

వెదురు వేగంగా కాలిపోతుందని, క్రమంగా బలహీనమవుతుందనే కారణాలతో వెదురు వాడకాన్ని దశలవారీగా తగ్గించి.. దృఢమైన, అగ్ని నిరోధకత కలిగిన ఉక్కును వినియోగించాలన్న ఆదేశాలు కూడా ఈ ఏడాది మొదట్లో జారీ అయ్యాయి.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)