New Labour Codes: ఉద్యోగుల సంక్షేమం కోసమని కేంద్రం చెబుతుండగా కార్మిక సంఘాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?

చిన్న కంపెనీల్లో ఉద్యోగులు (ప్రతీకాత్మక చిత్రం)

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చిన్న కంపెనీల్లో ఉద్యోగులు (ప్రతీకాత్మక చిత్రం)

పాత కార్మిక చట్టాల స్థానంలో నాలుగు కొత్త కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఒక సంవత్సరం సర్వీస్ తర్వాత గ్రాట్యుటీకి అర్హత, ఓవర్ టైమ్ పనికి రెట్టింపు వేతనం, మహిళలు రాత్రిపూట పని చేయడానికి అనుమతి వంటి నిబంధనలు ఈ కొత్త చట్టాల్లో ఉన్నాయి.

ఈ చట్టాలను కార్మికులు, ఉద్యోగుల సంక్షేమం కోసం తీసుకొచ్చినట్లుగా కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు, ఈ చట్టాలు కార్మికుల శ్రేయస్సుకు వ్యతిరేక చట్టాలని కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి.

ఇప్పటికే అమల్లో ఉన్న 29 కార్మిక చట్టాలకు బదులుగా, వాటన్నింటినీ కలిపేసి నాలుగు చట్టాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

  • కార్మికుల పరిహార చట్టం-2019,
  • పారిశ్రామిక సంబంధాల చట్టం-2020,
  • సామాజిక భద్రతా చట్టం-2020
  • వృత్తి భద్రత (ఆక్యుపేషనల్ సేఫ్టీ), ఆరోగ్యం (హెల్త్), పని ప్రదేశాల్లో పరిస్థితులు (వర్క్‌ప్లేస్ ఎన్విరాన్మెంట్) చట్టం- 2020

ఈ నాలుగు చట్టాలు 2025 నవంబర్ 21 నుంచి అమల్లోకి వచ్చాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కొరియర్ సంస్థ ఉద్యోగి

ఫొటో సోర్స్, Getty Images

ఆ చట్టాల్లో ఏముంది?

కొత్త కార్మిక చట్టాలను పాత కార్మిక చట్టాలతో పోల్చుతూ, వాటి ప్రయోజనాలను పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం...

  • కార్మికులందరికీ నియామక పత్రాలు జారీ చేయడం తప్పనిసరి.
  • కాంట్రాక్టు కార్మికులకు సెలవు, వైద్యం, సామాజిక భద్రత సహా శాశ్వత కార్మికులతో సమానమైన ప్రయోజనాలు మంజూరయ్యాయి.
  • 40 ఏళ్లు వయస్సు పైబడిన కార్మికులకు ప్రతి సంవత్సరం ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించాలి.
  • గిగ్ వర్కర్లు, తాత్కాలిక కాంట్రాక్ట్ కార్మికుల సహా అందరు కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్, బీమా, ఇతర ప్రయోజనాలు కల్పించాలి.
  • అయితే, ఒక సంస్థలో కనీస సంఖ్యలో కార్మికులను నిర్ధరించేవరకూ ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ వైద్య ప్రయోజనాలు, గ్రాట్యుటీ వంటి వాటి నిబంధనలలో సడలింపు లభించలేదని కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి.
  • ఒక కంపెనీ నుంచి గ్రాట్యుటీ పొందాలంటే ఉద్యోగులు కనీసం 5 సంవత్సరాలు పనిచేసి ఉండాలనే నిబంధనను సవరించి, ఆ కాల పరిమితిని ఒక సంవత్సరానికి తగ్గించారు.
  • చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో ఓవర్ టైం పని కోసం కార్మికులను నియమించుకుంటే, వారికి అదనపు వేతనాలు చెల్లించాలి.
  • ఐటీ రంగంలో పనిచేస్తున్న వారికి ప్రతి నెల 7వ తేదీలోపు జీతాలు చెల్లించాలి.
  • మహిళలు రాత్రిపూట పనిచేయడంపై ఉన్న ఆంక్షలు తొలగిపోయాయి. వారి సమ్మతితో రాత్రిపూట పనిలో వారిని యాజమాన్యాలు నియమించుకోవచ్చు.
  • ఉద్యోగులను తొలగించడానికి (లే ఆఫ్), యాజమాన్యాలు తమ కంపెనీల వ్యాపారాలను తగ్గించడానికి (డౌన్ సైజ్) లేదా మూసివేయడానికి ముందస్తుగా ప్రభుత్వ అనుమతి పొందే విధానంలో మార్పులు వచ్చాయి. గతంలో, కనీసం 100 మంది ఉద్యోగులు ఉన్న కంపెనీలు ప్రభుత్వ అనుమతి పొందవలసి వచ్చేది. కానీ ఇప్పుడు కనీసం 300 మంది ఉద్యోగులు ఉంటే అనుమతి అవసరమయ్యేలా నిబంధనలు మారాయి.
  • ప్రస్తుత ప్రభుత్వ నిబంధనల ప్రకారం కంపెనీ-ఉద్యోగి మధ్య ఒక స్పష్టమైన ఒప్పందం ఉంటే ఇంటి నుంచి పని చేయడానికి (వర్క్ ఫ్రం హోం) అనుమతి ఉంది. ఇకపై ఈ నిబంధనలు ఎలా ఉండాలి, ఒక సంస్థలో ఉద్యోగులను ఎలా చూసుకోవాలి, కార్యాలయంలో ఎలాంటి నియమాలు అమలు చేయాలనే దానిపై ప్రభుత్వ మార్గదర్శకాలు ఉంటాయి.
  • వాస్తవానికి, ఈ నియమాలు మొదట కనీసం 100 మంది ఉద్యోగులు ఉన్న కంపెనీలకు వర్తింపజేయాలని ఉద్దేశించినవి. భారాన్ని తగ్గించడానికి ఆ కనీస పరిమితిని 300 మంది ఉద్యోగులకు పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. దీని అర్థం ఈ నియమావళి 300 కంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్న కంపెనీలకు మాత్రమే వర్తిస్తుంది.
  • నిర్ణీత కాల ఉపాధిని ప్రవేశపెట్టింది. అంటే కంపెనీ, ఉద్యోగి మధ్య ప్రత్యక్ష ఒప్పందం ద్వారా నియామకం జరుగుతుంది. శాశ్వత ఉద్యోగుల మాదిరిగానే వారికి కనీస పని గంటలు, వేతనాలు కూడా అందుతాయి.
  • సమ్మె నిర్వచనం మార్చినట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కొత్త నిబంధనల ప్రకారం, ఒక సంస్థలోని ఉద్యోగులలో 50 శాతం కంటే ఎక్కువ మంది ఉద్యోగులు సామూహికంగా సాధారణ సెలవు తీసుకుంటే, దానిని సమ్మెగా పరిగణిస్తారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం, దానిని సమ్మెగా పరిగణించేవారుకాదు.
కార్మికులు

ఫొటో సోర్స్, Getty Images

కార్మిక సంఘాల పోరాటం...

ఈ కార్మిక చట్ట నిబంధనలు కార్మికులపై దోపిడీని పెంచుతాయని, యజమానుల ఒత్తిడితోనే వీటిని రూపొందించారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.

కార్మికులు సమ్మెకు వెళ్లకుండా కొత్త నిబంధనలు నిరోధిస్తున్నాయని విమర్శిస్తున్నాయి.

ఈ కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా నవంబర్ 26న దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని అనేక కార్మిక సంఘాలు నిర్ణయించాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)