ఉక్కు కర్మాగారాలను అమ్మేస్తాం.. అలా వీలుకాకపోతే మూసివేత ఆలోచన: కేంద్ర మంత్రి : ప్రెస్ రివ్యూ

ఉక్కు పరిశ్రమ

ఫొటో సోర్స్, EPA

ఉక్కు తయారీ వ్యూహాత్మక రంగంలోకి రాదని, అలాంటి ప్రభుత్వరంగ వాణిజ్య పరిశ్రమలను సాధ్యమైన చోటల్లా ప్రైవేటీకరిస్తామని, వీలుకాకుంటే మూసివేత గురించి ఆలోచిస్తామని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకుర్‌ తెలిపినట్టు ఈనాడు ఒక కథనాన్ని ప్రచురించింది.

మంగళవారం రాజ్యసభలో ప్రభుత్వరంగ ఉక్కు కర్మాగారాల విక్రయం, ప్రైవేటీకరణపై ఒడిశాకు చెందిన బిజద సభ్యుడు సస్మిత్‌పాత్ర అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ గత ఐదేళ్లలో ఉక్కు పరిశ్రమల ప్రైవేటీకరణకు అనుమతిచ్చినట్లు చెప్పారు.

2021 జనవరి 27న విశాఖ స్టీల్‌ ప్లాంటులో పెట్టుబడుల ఉపసంహరణకు ఆమోదముద్ర వేసినట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వం 2021 ఫిబ్రవరి 4న కొత్త ప్రభుత్వరంగ సంస్థల విధానాన్ని ప్రవేశపెట్టిందని, అది కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వరంగ బ్యాంకులు, ప్రభుత్వరంగ బీమా సంస్థలకు వర్తిస్తుందని చెప్పారు.

ఈ విధానం ప్రకారం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వరంగ వాణిజ్య సంస్థలను (మినహాయించినవి తప్ప) స్ట్రాటజిక్‌, నాన్‌స్ట్రాటజిక్‌ రంగాలుగా విభజించినట్లు తెలిపారు. నాన్‌స్ట్రాటజిక్‌ రంగంలోని ప్రభుత్వరంగ సంస్థలను సాధ్యమైనచోట ప్రైవేటీకరించడానికి ప్రయత్నిస్తామని, లేదంటే మూసేయడం గురించి ఆలోచిస్తామని తెలిపారు.

ఉక్కు పరిశ్రమ నాన్‌స్ట్రాటజిక్‌ రంగంలోకే వస్తుందన్నారని ఈ వార్తలో రాశారు.

కేసీఆర్

ఫొటో సోర్స్, TELANGANACMO/FB

29% ఫిట్‌మెంట్‌ ఉంటుందని కేసీఆర్ హామీ ఇచ్చారు: ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల వెల్లడి

ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆంధ్రప్రదేశ్‌లో 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్‌) అమల్లో ఉందని, తెలంగాణలో దానికన్నా రెండు శాతం అధికంగానే ఫిట్‌మెంట్‌ (వేతన సవరణ) అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చినట్లు తెలిసిందని ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రచురించింది.

వేతన సవరణ కమిషన్‌ సిఫారసుతో సంబంధం లేకుండానే ఫిట్‌మెంట్‌ ఉండనుందని సంకేతాలు ఇచ్చారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు 7.5 శాతం ఫిట్‌మెంట్‌ అమలు కోసం కమిషన్‌ సిఫారసు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సంఘాలన్నీ తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేశాయి.

గత ఏడాది డిసెంబరులోనే వేతన సవరణ కమిషన్‌ తన నివేదికను ప్రభుత్వానికి అందించగా.. ఆ తర్వాత తొలిసారిగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు సీఎం కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. ప్రగతి భవన్‌లో మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 6:30 గంటల వరకూ సుదీర్ఘంగా సమావేశమయ్యారు. పీఆర్సీ నివేదిక ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో నిరాశను నింపిందని, ఏపీలో మధ్యంతర భృతి 27 శాతం ఇస్తున్నారని, దానికన్నా ఎక్కువే ఫిట్‌మెంట్‌ ఉండాలని సమావేశంలో ఉద్యోగ సంఘాలు కోరాయి.

దాంతో, ఏపీ ఐఆర్‌ కంటే 2 శాతం ఎక్కువే ఇస్తానని, ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి కొత్త వేతన సవరణ అమల్లోకి వస్తుందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం మండలి ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున నిర్ణయాలు బయటికి చెప్పలేనని సీఎం గుర్తు చేశారని అనంతరం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తెలిపాయి.

బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఈనెల 19న వయో పరిమితి పెంపుపై నిర్ణయం తీసుకుంటానని సీఎం గుర్తు చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు వేరు వేరు అంటూ ప్రచారం జరుగుతోందని, తమను వేర్వేరు చేయకూడదని సంఘాలు కోరగా.. వయో పరిమితి పెంపు ఉద్యోగ, ఉపాధ్యాయులకు కలిసే ఉంటుందని సీఎం సంకేతాలు ఇచ్చారు. ఈ పెంపు కూడా ఏప్రిల్‌ 1వ తేదీ నుంచే అమల్లోకి వస్తుందన్నారు.

ఏపీలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులను రాష్ట్రానికి రప్పిస్తామని సీఎం తెలిపారు. ఏపీలో 1,218 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని, వారిని తెలంగాణకు రప్పించడానికి వీలుగా త్వరలోనే ఉత్తర్వులు వెలువడతాయని వివరించారని ఈ కథనంలో తెలిపారు.

అజహరుద్దీన్‌

ఫొటో సోర్స్, Getty Images

'నా చేతుల్లో మంత్రదండం లేదు': అజహరుద్దీన్‌

ఐపీఎల్‌–2021 మ్యాచ్‌లను హైదరాబాద్‌లో నిర్వహించే అవకాశం రాకపోవడం పట్ల తనపై వస్తున్న విమర్శలకు హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు మొహమ్మద్‌ అజహరుద్దీన్‌ వివరణ ఇచ్చారని సాక్షి ఒక కథనంలో పేర్కొంది.

హెచ్‌సీఏ సీనియర్‌ సభ్యులు ఈ విషయంపై తనను తప్పుపట్టడంలో అర్థం లేదన్న అజహర్‌... చివరి వరకు తాను ప్రయత్నించానని స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో ఈసారి లీగ్‌ను ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, అహ్మదాబాద్‌లలో మాత్రమే నిర్వహించనున్నారు.

‘అజహర్‌ వల్ల కాలేదని కొందరంటున్నారు. నా చేతుల్లో మంత్రదండం లేదు. పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే బోర్డు, గవర్నింగ్‌ కౌన్సిల్‌ వేదికలను ఖరారు చేశాయి. ఉప్పల్‌ స్టేడియానికి అవకాశం లభించడం లేదని వార్తలు వచ్చిన వెంటనే నేను మళ్లీ బోర్డు పెద్దలతో మాట్లాడాను కూడా. హైదరాబాద్‌ను తప్పించిన విషయంలో బోర్డు కూడా అధికారికంగా ఎలాంటి కారణం చూపించలేదు కాబట్టి నాకూ తెలీదు. అయితే ఇప్పటికే ప్రకటించిన వేదికల్లో ఏదైనా కారణం చేత మ్యాచ్‌ల నిర్వహణ సాధ్యం కాకపోతే మన నగరం అందుకు సిద్ధంగా ఉందని నేను చెప్పగలను. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే ఈ విషయంలో హామీ ఇచ్చింది’ అని అజహర్‌ వ్యాఖ్యానించారు.

కొందరు మాజీ క్రికెటర్లు తాజా ఐపీఎల్‌ వ్యవహారంలో తనను విమర్శిస్తున్నారని, నిజానికి వారి హయాంలో చేసిన తప్పులను ప్రస్తుత కమిటీ దిద్దుకుంటూ వస్తోందని మాజీ కెప్టెన్‌ అన్నారు.

‘ఆర్థికపరమైన బకాయిలు, జరిమానాలు... ఇలా చాలావాటిని మేం సరి చేస్తున్నాం. లేదంటే ఈపాటికి హెచ్‌సీఏ మూత పడేది. ఇన్ని మాటలు చెబుతున్నవారు తాము పదవిలో ఉన్నప్పుడు 2011 వన్డే వరల్డ్‌ కప్‌లో ఒక్క మ్యాచ్‌ అయినా తీసుకొచ్చారా’ అని ఆయన ప్రశ్నించారని ఈ వార్తలో రాశారు.

ఏలూరు పురపాలక ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికలకు ఏపీ హైకోర్టు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చిందని ప్రజాశక్తిలో వార్త రాశారు.

ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ పిల్‌పై సోమవారం విచారణ జరిపిన ఏకసభ్య ధర్మాసనం ఎన్నికలను నిర్వహించొద్దంటూ ఆదేశించింది.

అయితే, ఈ ఆదేశాలను హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ కొట్టేస్తూ.. ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. కానీ ఫలితాలు మాత్రం వెల్లడించొద్దని సూచించింది. ఈ కేసు తదుపరి విచారణను మార్చి 23కి హైకోర్టు వాయిదా వేసిందని ఈ వార్తలో రాశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)