ఉదయ్‌పూర్: మంతెనవారి పెళ్లికి ట్రంప్ జూనియర్, జెన్నిఫర్ లోపెజ్, జస్టిన్ బీబర్, రాంచరణ్ లాంటి ప్రముఖులు, ఎవరీ మంతెన రామరాజు?

ఫొటో సోర్స్, x.com/bharatidubey
- రచయిత, పారా పద్దయ్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలుగు నేల మూలాలున్న నేత్ర మంతెన, అమెరికన్ వ్యాపారవేత్త వంశీ గాదిరాజు వివాహం ఉదయ్‌పూర్‌లో జరిగింది.
ఈ వివాహానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలను ఈవెంట్ మేనేజ్‌మెంట్ సేవల్ని అందించే విజ్‌క్రాఫ్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఏజెన్సీ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది.
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన ఈ హై ప్రొఫైల్ పెళ్లికి జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు హాజరయ్యారు. పెళ్లి కూతురు నేత్ర మంతెన, పద్మజ మంతెన, రామరాజు మంతెనల కుమార్తె. అమెరికన్ ఫార్మా రంగంలో ప్రముఖుడిగా గుర్తింపు పొందారు రామరాజు మంతెన.
వరుడు వంశీ గాదిరాజు "సూపర్ ఆర్డర్" అనే యాప్ సహ వ్యవస్థాపకుడు. రెస్టారెంట్ల నుంచి ఫుడ్ డెలివరీ, టేక్ అవేల సేవలకు ఈ సంస్థ సాయం చేస్తుంది.
అమెరికాలో నివసిస్తున్న వంశీ కొలంబియా విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి అని ఆయన లింక్డిన్ ప్రొఫైల్ సూచిస్తోంది. ఆయన ఇటీవల ఫోర్బ్స్ అండర్ 30 జాబితాలో స్థానం పొందారు.
ఉదయ్‌పుర్‌లోని జగ్‌మందిర్ ఐలాండ్ ప్యాలెస్‌లో వీరి వివాహం జరిగింది. 17వ శతాబ్దానికి చెందిన ఈ ప్యాలెస్‌ను విలాసవంతమైన హోటల్‌గా, డెస్టినేషన్ వివాహాలకు కేంద్రంగా అభివృద్ధి చేశారు.ఈ హై ప్రొఫైల్ వివాహం కోసం హోటల్ ఆరు బయటి ప్రాంతాన్ని పూలతో అందంగా అలంకరించారు.


ఫొటో సోర్స్, facebook.com/TeamRamcharan
ఎవరీ రామరాజు మంతెన?
రామరాజు మంతెన అచ్చతెలుగు మూలాలున్న అమెరికన్ పారిశ్రామికవేత్త. ఇన్‌జెనుస్ ఫార్మాసూటికల్స్ చైర్మన్. ఇన్‌జెనుస్ ఫార్మా అమెరికా, స్విట్జర్లాండ్, భారత్‌లో తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
రామరాజు మంతెన పశ్చిమ గోదావరి జిల్లా జువ్వల పాలెంలో పుట్టారు. విజయవాడలో చదువుకున్నారు. జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ ఆండ్ ఇంజనీరింగ్ పూర్తిచేశారని ఆయన మేనమామ గోకరాజు రాము బీబీసీతో చెప్పారు.
1980ల్లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన రామరాజు యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ లో క్లినికల్ ఫార్మా పూర్తిచేశారు. కొంతకాలం వివిధ ఫార్మా సంస్థల్లో పని చేసి సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించారు.
ఫ్లోరిడాలోని పీ4 హెల్త్‌కేర్‌లో సీఈఓగా కెరీర్ మొదలు పెట్టారు. తర్వాత ఐసీఓఆర్ఈ హెల్త్‌కేర్‌ను స్థాపించారు.
ఆయన మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు ఏకైక కుమార్తె పద్మజను పెళ్లి చేసుకున్నారు. రామరాజు మంతెన, పద్మజ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు.
రామరాజు మంతెన శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం 2017లో తిరుమల వచ్చారు. ఆ సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి సహస్ర నామ కాసుల హారాన్ని బహుకరించారు. 28 కేజీల బరువైన ఈ బంగారు నెక్లెస్‌ను శ్రీనివాసుడి పేరు రాసి ఉన్న 1008 బంగారు నాణేలతో తయారు చేశారు.
అమెరికన్ మీడియా సంస్థలు ఆయన్ని బిలియనీర్ అని చెబుతున్నాయి. అయితే అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఆయన నికర ఆస్తి దాదాపు 167 కోట్ల రూపాయలు. 2023లో ఆయన ఫ్లోరిడాలో రూ.400 కోట్ల విలువైన విలాసవంతమైన ఆస్తిని కొనుగోలు చేసినట్లు అమెరికన్ మీడియాలో కథనాలు వచ్చాయి. వీటిని బీబీసీ స్వయంగా ధృవీకరించలేదు.

ఫొటో సోర్స్, ANI
ఈ పెళ్లికి 40 దేశాల నుంచి 126 మంది అతిథులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కుమారుడు ట్రంప్ జూనియర్ తన స్నేహితురాలితో సహా హాజరయ్యారు. జస్టిన్ బీబర్, జెన్నిఫర్ లోపెజ్, టియెస్టో, బ్లాక్ కాఫీ, సిర్క్యు డు సోలైల్, డీజే అమన్ నాగ్‌పాల్ వంటి అంతర్జాతీయ కళాకారులు తమ ఆటపాటలతో అలరించారు.
వివాహ వేడుకలు నవంబర్ 21న సంగీత్‌తో మొదలయ్యాయి. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్లు వరుణ్ ధావన్, జాహ్నవి కపూర్, రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్ నృత్య ప్రదర్శనతో పెళ్లి వేడుకల్లో జోష్ నింపారని వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.
శుక్రవారం రాత్రి సంగీత్ కార్యక్రమం మనక్ చౌక్ సిటీ ప్యాలెస్‌లో జరిగింది. ఈ కార్య్రమంలో బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ కపూర్ తన సినిమాల్లోని పాటలకు డాన్స్ చేశారు. రణ్‌వీర్‌కపూర్‌తో కలిసి రామరాజు మంతెన దంపతులు డాన్స్ చేయడం వీడియోల్లో కనిపించింది.
మెహందీ వేడుకలో మాధురీ దీక్షిత్, నోరా ఫతేహి కూడా డాన్స్ చేసి అతిధులను అలరించారు. దేవదాస్ సినిమాలోని డోలారే పాటకు మాధురీ డాన్స్ చేశారు.
పెళ్లి రోజున సింగర్, యాక్టర్ జెన్నిఫర్ లోపెజ్ తన సూపర్ హిట్ సింగిల్స్‌తో ఉత్సాహం రేపారు.
ఈ వివాహానికి టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ కూడా హాజరయ్యారు.
ప్రత్యేక ఏర్పాట్లు
అరుదైన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం పిచోలా సరస్సుపై ఉన్న జగ్ మందిర్ ఐలాండ్ ప్యాలెస్‌ను ప్రత్యేకంగా సిద్ధం చేశారు.
తాజ్ లేక్ ప్యాలెస్‌లో హల్దీ, సంగీత్ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాన్ని కరణ్ జోహార్, సోఫీ చౌదరీకి అతిధులుగా వ్యవహరించారు.
సంగీత్ వేడుకల్లో రణ్‌వీర్ సింగ్ ఆడుతూ పాడుతూ డొనల్డ్ ట్రంప్ జూనియర్, అతని స్నేహితురాలిని డ్యాన్స్ ఫ్లోర్‌కు తీసుకెళ్లడంతో హాలంతా కేరింతలతో నిండిపోయింది.
శనివారం మనెక్ చౌక్‌లో మెహందీ వేడుకలు జరిగాయి.
సిటీ ప్యాలెస్‌లో రాజరికపు తరహాలో ప్రదర్శన నిర్వహించారు.
2025లో నేత్ర మంతెన- వంశీ గాదిరాజు వివాహం 2024లో అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ పెళ్లి వేడుకల్ని గుర్తుకు తెచ్చిందని స్థానికులు కొంతమంది చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














