బాలీవుడ్ తొలితరం యాక్షన్ హీరో ధర్మేంద్ర కన్నుమూత

- రచయిత, వందన
- హోదా, బీబీసీ ప్రతినిధి
హీ మ్యాన్ ఆఫ్ హిందీ సినిమాగా ప్రసిద్ధి పొందిన హీరో ధర్మేంద్ర 89ఏళ్ల వయసులో కన్నుమూశారు.
‘‘ధర్మేంద్ర అస్తమయంతో భారతీయ సినిమాలో ఒక శకం ముగిసింది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో నివాళులర్పించారు.
కొన్నిరోజుల కిందట ధర్మేంద్ర శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ముంబయిలోని బీచ్‌కాండీ ఆస్పత్రిలో చేారారు. అయితే చికిత్స అనంతరం ఆయన ఇంటికి చేరుకున్నారు.
బాలీవుడ్ తొలి తరం యాక్షన్ స్టార్, యాక్షన్ హీరో, హీ మ్యాన్ ఇలాంటి బిరుదులన్నింటికీ అర్హుడు.
నట జీవితంలో భాగంగా అనుపమ చిత్రంలో రచయిత, సత్యకమ్ సినిమాలో సమాజం పట్ల బాధ్యత ఉన్న మొండి ఘటం. చుప్కేచుప్కేలో ప్రొఫెసర్, పరిమళ్‌లో కామెడీ పాత్రలు పోషించారు.
నిజ జీవితానికి వస్తే రచయిత, ప్రేమికుడు, తండ్రి, ప్రపంచంలోని అందగాళ్లలో ఒకరు, తాగుడు అలవాటును అధిగమించిన వ్యక్తి, రాజకీయ నాయకుడు కూడా.
ఆరు దశాబ్ధాలు వివిధ పాత్రలు పోషించి దేశ విదేశాల్లో కోట్లమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images


ఫొటో సోర్స్, facebook.com/p/Dharmendra
నవాజ్ షరీఫ్‌కు అభిమాన నటుడు
అవిభాజ్య భారత్‌లోని పంజాబ్‌లో1935లో ధరంసింగ్ దేవల్ జన్మించారు. పూర్వీకుల స్వగ్రామం నస్రాలీ నుంచి ముంబయికి వెళ్లడం ఒక కలలాంటిదని ధర్మేంద్ర చెప్పేవారు.
భారత్‌లోనే కాదు, పాకిస్తాన్‌లో కూడా ధర్మేంద్రకు వీరాభిమానులు ఉన్నారు. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కూడా ఆయన అభిమాని.
"నవాజ్ షరీఫ్ భారత్ వచ్చినప్పుడు నేను ఆయనను కలిశాను. ఆయన ఒకసారి పంజాబ్‌లో (ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంది) కుటుంబంతో కలిసి ఆయన కారులో వస్తున్నప్పుడు మా ఇంటి ముందు ఆపారు. ఇదే ధర్మేంద్ర ఇల్లు అని కుటుంబ సభ్యులకు చెప్పినట్లు నాతో చెప్పారు" అని ధర్మేంద్ర చెప్పారు.

ఫొటో సోర్స్, facebook.com/p/Dharmendra
దిలీప్ కుమార్ ప్రేరణతో..
ధర్మేంద్ర తండ్రి లుథియానా సమీపంలోని సనేవాల్‌లో లెక్కల మాస్టర్.
థియేటర్‌లో సినిమా చూడటం ఆ కుటుంబానికి చాలా ఖరీదైన వ్యవహారం.
ధర్మేంద్ర చిన్నప్పుడు రహస్యంగా దిలీప్‌కుమార్ నటించిన షహీద్ సినిమా చూశారు.
తాను నటుడిని కావాలని ఆ రోజే నిర్ణయించుకున్నట్లు తర్వాత రోజుల్లో చెప్పారు.
కాలం కూడా కలిసొచ్చింది. 1958లో కొత్త నటీనటుల కోసం ఫిల్మ్‌ఫేర్ మేగజైన్ ప్రకటన ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్‌లో బిమల్ రాయ్, గురుదత్ లాంటి ప్రముఖులు కూడా ఉన్నారు.
ఆ సమయంలో ధర్మేంద్ర మలేర్ కోట్లా అనే పట్టణంలో ఉన్నారు. పట్టణంలోని ఓ ఫోటో స్టూడియోకు వెళ్లి దిలీప్‌కుమార్‌లాగా కనిపించేలా ఫోటో తీయాలని కోరారు.
ఆ ఫోటో తర్వాత ధర్మేంద్ర ఆ సినిమాకు ఎంపికయ్యారు. బొంబాయి వెళ్లారు. అలా ఆయన సినీ జీవితం మొదలైంది.

ఫొటో సోర్స్, facebook.com/p/Dharmendra
బిమల్ రాయ్‌తో ‘బందిని’
ప్రముఖ దర్శకుడు బిమల్ రాయ్ ధర్మేంద్రను ధర్మేందు అని పిలిచేవారు.
ఆయనే ‘బందిని’ చిత్రంలో ధర్మేంద్రకు తొలి అవకాశం ఇచ్చారు.
అయితే బందిని చిత్ర నిర్మాణం చాలా కాలం సాగడంతో ఈ సమయంలో అవకాశాల కోసం ధర్మేంద్ర ఇబ్బంది పడ్డారు.
అర్జున్ హింగోరాని నిర్మించిన దిల్ బీ తేరా హమ్ బీ తేరే అనే చిత్రంలో నటించారు.
1966లో వచ్చిన ఫూల్ ఔర్ పత్తర్‌లో ధర్మేంద్రకు హీరోగా తొలి అవకాశం వచ్చింది. ఈ చిత్రంలో ధర్మేంద్ర ఒక సీన్‌లో తాగి చొక్కా విప్పి దాన్ని ఒక బిక్షగాడి మీదకు విసిరేస్తాడు.
అప్పట్లో ధర్మేంద్రకున్న బాడీ హిందీ చిత్రాల్లో ఎవరికీ లేదు.
ఈ చిత్రంతోనే ఆయనకు హీ మ్యాన్ ఇమేజ్ వచ్చింది. ఫిల్మ్‌ఫేర్ నామినేషన్ కూడా దక్కింది. అక్కడ నుంచి ఆయన వెనక్కి తిరిగి చూడలేదు.
అలాగే 1971లో వచ్చి మేరా గావ్, మేరా దేశ్ చిత్రం ఆయనను యాక్షన్ హీరోగా స్థిరపరిచింది.
చక్కని శారీరక దారుఢ్యం, పొడవుగా ఉండే ధర్మేంద్ర సాహసోపేతమైన పోరాటాలను రిస్క్ తీసుకుని మరీ నటించేవారు.
ఓ పక్క రొమాన్స్, యాక్షన్ చిత్రాలు చేస్తూనే సస్పెన్స్ థ్రిల్లర్, కామెడీసినిమాలలోనూ నటించారు. చుప్కే చుప్కేలో ఆయన కామెడీ టైమింగ్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఫొటో సోర్స్, Dinodia
షోలే ‘వీరు’డు
ధర్మేంద్ర ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ 1975 నాటి బ్లాక్ బస్టర్ షోలేలో వీరుగా ఆయన నటన చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసింది.
అమితాబ్ బచ్చన్, హేమమాలిని, జయాబచ్చన్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాలో అమితాబ్, ధర్మేంద్ర పాత్రలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.
ఈ సినిమా ఓ కల్ట్ క్లాసిక్‌గా నిలిచిపోయింది.
అయితే అభిమానులు ఎక్కువగా ఈ సినిమా విజయం ఘనతను ధర్మేంద్రకే ఆపాదించారు. ఆయనను ‘షోలే ఆత్మ’గా అభివర్ణించారు.
వీరు పాత్ర తనకు బాగా నచ్చిన పాత్ర అని ధర్మేంద్ర కూడా చెబుతుండేవారు.
‘‘వీరుకంటే మెరుగైన పాత్ర చేయగలననుకోవడంలేదు’’ అని ధర్మేంద్ర చెప్పారు.

ఫొటో సోర్స్, facebook.com/p/Dharmendra
హేమమాలినితో ప్రేమాయణం
స్టార్ హీరోగా వెలుగొందుతున్న తరుణంలోనే హేమమాలినితో ఆయన ప్రేమ కథ వికసించింది.
అప్పటికే ధర్మేంద్రకు ప్రకాష్ కౌర్‌తో పెళ్లయింది.
1980లో ఆయన హేమమాలినిని పెళ్లి చేసుకున్నప్పుడు అదొక పెద్ద వివాదంగా మారింది.
ఈ వివాదం గురించి రామ్ కమల్ ముఖర్జీ రాసిన హేమమాలిని ఆత్మకథ "హేమమాలిని: బియాండ్ ది డ్రీమ్‌గాళ్" పుస్తకంలో ప్రస్తావించారు.
"1974లో జితేంద్ర, హేమమాలినికి పెళ్లి చేసేందుకు వారి తల్లిదండ్రులు అంగీకరించారు. అదే సమయంలో హేమమాలిని జీవితంలోకి ధర్మేంద్ర వచ్చారు. జితేంద్రతో ఆమెకు పెళ్లి జరుగుతుందనే విషయం తెలుసుకుని నేరుగా మద్రాస్ వెళ్లి హేమమాలినితో ఏకాంతంగా మాట్లాడారు. దీంతో ఆ పెళ్లి ఆగిపోయింది" అని ఆయన ఆ పుస్తకంలో రాశారు.

ఫొటో సోర్స్, facebook.com/p/Dharmendra
ఒక దశలో ధర్మేంద్ర కెరీర్ పతాక స్థాయికి చేరుకుంది.
అయితే తాగుడు అలవాటు ఆయన కెరీర్‌ను దెబ్బ తీసింది. ఈ విషయాన్ని ఆయన ఒక సందర్భంలో అంగీరించారు.
కొన్ని బి, సి గ్రేడ్ చిత్రాల్లో ఆయన చేసిన పాత్రల వల్ల కెరీర్ కూడా దిగజారింది.
సినిమాలతో పాటు ధర్మేంద్ర రాజకీయాల్లోనూ అడుగు పెట్టారు.
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలంటూ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆయనపై ఒత్తిడి తెచ్చారు.
ఎన్నికల్లో గెలిచినప్పటికీ రాజకీయాల్లోకి రావడం తప్పనేది ధర్మేంద్ర అభిప్రాయం.
నటనతో పాటు ధర్మేంద్రకు ఉర్దూ సాహిత్యం అంటే చాలా ఇష్టం.
ధర్మేంద్ర నటించిన ఆఖరి చిత్రం ‘ఇక్కీస్’ ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల కానుంది.
అభిమానులకు వెండితెర మీద ఆయన కనిపించే ఆఖరి చిత్రం ఇదే కావచ్చు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














