ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు కూడా 'సొంత పిల్లలకు తల్లిదండ్రులు' కాగలరా, కేరళ హైకోర్టు విచారణపై ఉత్కంఠ

ఎల్జీబీటీక్యూ, ట్రాన్స్‌జెండర్, స్వలింగ సంపర్కం, భారత్, చట్టాలు, కేరళ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు ( ప్రతీకాత్మక చిత్రం)
    • రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
    • హోదా, బీబీసీ కోసం

థర్డ్ జెండర్ వ్యక్తులు కూడా సొంతంగా పిల్లలను కలిగి ఉండడం అనే భావన 29 ఏళ్ల వయసున్న హరి దేవగీథ్ విషయంలో నిజమైతే అది తన జీవితంలో ఓ పెద్ద విజయం కావొచ్చు.

అమ్మాయిగా పుట్టిన హరి దేవగీథ్, అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (ఏఆర్‌టీ) సర్వీసులను ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి ఒక ప్రాథమిక హక్కుగా మార్చేందుకు న్యాయ పోరాటం చేస్తున్నారు.

హరి డిమాండ్ చేస్తున్న ఈ హక్కులు దేశంలోని మామూలు స్త్రీ పురుషులకు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.

హరి దేవగీథ్ ఒక ట్రాన్స్‌జెండర్ పురుషుడు. తన అండాలను క్రయోప్రిజర్వేషన్ (అండాలు, వీర్యకణాలను భవిష్యత్తులో ఉపయోగించుకునేందుకు వీలుగా ఫ్రీజ్ చేయడం) పద్ధతిలో భద్రపరచాలనుకుంటున్నారు.

హరి బీబీసీతో మాట్లాడుతూ, ‘‘ భవిష్యత్తులో నేను సొంత బిడ్డను పొందాలనుకుంటున్నా. దత్తత తీసుకోవడం దీనికంటే కష్టమైందని అనుకుంటున్నా. నా అండాలను నిల్వ చేసుకోలేకపోయాననే బాధ నాకు ఉండకూడదు" అని అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

హరి ఇప్పటికే మాస్టెక్టమీ (స్తనాలను ఆపరేషన్ ద్వారా తొలగించడం) చేయించుకున్నారు. కానీ, పూర్తి లింగమార్పిడి శస్త్రచికిత్స (ఇందులో గర్భాశయాన్ని తొలగించే హిస్టెరెక్టమీ కూడా భాగం) ప్రస్తుతానికి వాయిదా పడింది. తన అండాలను ఫ్రీజ్ చేసుకునే వరకు ఆపరేషన్ వద్దని హరి అనుకుంటున్నారు.

పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లినప్పుడు హరికి ఒక సమస్య ఎదురైంది.

"అండాలు ఎలా ఉన్నాయో పరీక్షించేందుకు నాకు మందులు ఇచ్చారు. కానీ, ఇందులో చట్టపరమైన ఇబ్బందులు ఉన్నాయని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి" అని హరి అన్నారు.

ట్రాన్స్ జెండర్ పీపుల్

ఫొటో సోర్స్, Getty Images

ఏఆర్‌టీ చట్టం ఏం చెబుతోంది?

ఏఆర్‌టీ చట్టంగా వ్యవహరించే.. అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ యాక్ట్‌ నిబంధనల్లో, ఒక జంట లేదా మహిళ మాత్రమే ఈ ప్రక్రియ ద్వారా సంతానాన్ని పొందగలరని స్పష్టంగా ఉంది.

హరి కేరళ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో, "ఇలాంటి లింగ ఆధారిత వర్గీకరణ నిర్హేతుకమని, సొంత బిడ్డను పొందాలనే పిటిషనర్ ఆకాంక్షకు ఇది విఘాతం కలిగిస్తుంది" అని పేర్కొన్నారు.

ఏఆర్‌టీ చట్టంలోని సెక్షన్ 21లో.. ట్రాన్స్‌జెండర్ పురుషుడు, ట్రాన్స్‌జెండర్ మహిళను పూర్తిగా మినహాయించారని, దీని వల్ల ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు తమ సంతానోత్పత్తి సంరక్షణతో(అండాలు, వీర్యకణాలను భద్రపరుచుకోవడం)పాటు, సంతానాన్ని పొందే హక్కులను కోల్పోతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

పిటిషన్ ప్రకారం, ఈ నిబంధన "నిర్హేతుకం, చట్టవిరుద్ధం, అలాగే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 21ల ఉల్లంఘన"

అయితే, కేంద్ర ప్రభుత్వం సమర్పించిన ప్రతిస్పందనలో, "ఏఆర్‌టీ చట్టంపై పార్లమెంటరీ కమిటీలు చర్చించి, ఆలోచించి నిర్ణయం తీసుకున్నాయి. ఏఆర్‌టీ, సరోగసీ చట్టం కింద జన్మించే పిల్లల ఉత్తమ ప్రయోజనాల కోసమే ఇందులో ఎల్జీబీటీ కమ్యూనిటీని చేర్చలేదు" అని పేర్కొంది.

సరోగసీ (రిజిస్ట్రేషన్) యాక్ట్ 2021 నిర్వచనంలో, ట్రాన్స్‌జెండర్ వ్యక్తులను చేర్చలేదని ప్రభుత్వం చెబుతోంది.

ఎల్జీబీటీక్యూ, ట్రాన్స్‌జెండర్, స్వలింగ సంపర్కం, భారత్, చట్టాలు, కేరళ

ఫొటో సోర్స్, hckrecruitment.nic.in

ఫొటో క్యాప్షన్, ఏఆర్‌టీ చట్టాన్ని కేరళ హైకోర్టులో సవాల్ చేశారు. (ఫైల్ ఫోటో)

"సహజంగా పిల్లలను కనే హక్కు ప్రాథమిక హక్కు. అయితే, సాంకేతిక పద్ధతులు, థర్డ్ పార్టీ వాణిజ్య సంస్థలు, వాణిజ్య లావాదేవీలు ఉండే ఏఆర్‌టీ వంటి సేవలను పొందే హక్కు ప్రాథమిక హక్కు కాదు, అది కేవలం ఒక చట్టబద్ధమైన హక్కు మాత్రమే. కాబట్టి, ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఉల్లంఘన కాదు" అని ప్రభుత్వం చెబుతోంది.

చట్టబద్ధమైన హక్కులు అంటే, పార్లమెంటరీ వ్యవస్థ రూపొందించిన చట్టాల ద్వారా మంజూరైన హక్కులు. రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్నవి ప్రాథమిక హక్కులు. వీటి ఆధారంగా ప్రభుత్వాన్ని కోర్టులో సవాల్ చేయవచ్చు.

హరి తన జీవిత లక్ష్యాన్ని సాధించేందుకు దీర్ఘకాలంపాటు న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. "మీ అండాలను ఫ్రీజ్ చేసుకునే హక్కు మీకు లేదని ఏ ఆస్పత్రీ, ఏ ఒక్కరికీ చెప్పలేని పరిస్థితి రావాలని కోరుకుంటున్నా" అని అంటున్నారు.

కేరళకు చెందిన హరి దేవగీథ్ పీజీ వరకు చదివారు. బెంగళూరులోని ఓ మల్టీనేషనల్ బ్యాంకులో పనిచేస్తున్నారు.

కేరళ ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు(ఐడీ) కార్డులో హరిని 'ట్రాన్స్‌జెండర్' అని కాకుండా 'పురుషుడు'గా పేర్కొందని కూడా కేంద్రం తెలిపింది.

హరి ఐడీ కార్డు ప్రకారం, ట్రాన్స్‌జెండర్ వ్యక్తిగా ఈ వ్యవహారంలో ప్రయోజనం పొందలేరని ప్రభుత్వం చెబుతోంది.

అలాగే, ‘‘హరి తన అండాలను వ్యక్తిగతంగా ఎలా ఉపయోగించుకోవాలనుకుంటున్నారో వివరంగా చెప్పలేదు’’ అని కూడా ప్రభుత్వం వాదించింది.

ఎల్జీబీటీక్యూ, ట్రాన్స్‌జెండర్, స్వలింగ సంపర్కం, భారత్, చట్టాలు, కేరళ

ఫొటో సోర్స్, Getty Images

హరి తన జెండర్‌ను ఎందుకు మార్చుకున్నారు?

హరి తాను ఎదుర్కొంటున్న అడ్డంకులను చూసి ఏమీ ఆశ్చర్యపోవడం లేదు. "చిన్ననాటి నుంచి నాకు ఎప్పుడూ అసౌకర్యంగానే అనిపించేది. నా కజిన్ ఒకరు మా మధ్య ఉన్న తేడాలను ఎత్తిచూపుతుండేవాడు. ఎప్పుడూ నా సోదరుడు, నా కజిన్ సోదరుడు వేసుకునే దుస్తులే వేసుకోవాలనిపించేది" అని హరి చెబుతున్నారు.

చదువుకుంటున్న సమయంలో, హరి లింగమార్పిడి ఆపరేషన్ల గురించి చదివారు. స్వలింగ సంపర్కం నేరం కాదని 2018లో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినప్పుడు, ఈ పోరాటంలో తాను ఒంటరిని కాదని హరి గ్రహించారు.

"కానీ, అర్థం చేసుకోవడం ఒకటి. దానిని అంగీకరించడం మరో విషయం. క్రమంగా నేను దానిని అంగీకరించా" అన్నారు హరి.

"మా ఇంట్లో ముగ్గురు పిల్లల్లో నేను ఆఖరు. ఇంట్లో ఆడపిల్లలకు ముందుగా పెళ్లి చేయడం ఆచారం. పెళ్లి చేసుకోవాలంటూ మా అన్నయ్య నన్ను ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. అప్పుడు, అసలు విషయం అమ్మకు చెప్పా" అని హరి అన్నారు.

"ఆమె దానిని నమ్మలేకపోయారు. మానసిక వైద్యులను కలవమని ఒత్తిడి చేశారు. ఆ సైకియాట్రిస్ట్ చెప్పిన విషయాలు విని మా అమ్మ చాలా బాధపడ్డారు. పెంపకం సరిగ్గా లేకపోవడం వల్లే ఇలా జరిగిందని ఆయన అన్నారు. నా చిన్నప్పుడే మా నాన్న చనిపోయారు, దీంతో మా అమ్మ కుంగిపోయారు" అని హరి వెల్లడించారు.

ఎల్జీబీటీక్యూ, ట్రాన్స్‌జెండర్, స్వలింగ సంపర్కం, భారత్, చట్టాలు, కేరళ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హరి డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తూ, తన స్తనాల తొలగింపు ఆపరేషన్ కోసం డబ్బులు కూడబెట్టారు.(ప్రతీకాత్మక చిత్రం)

'నేను అలా చేయాలనుకోవడం లేదు'

హరి ఒక ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీలో డెలివరీ ఏజెంట్‌గా పనిచేశారు. "పుదుచ్చేరిలో స్తనాల తొలగింపు ఆపరేషన్ చేయించుకోవడం కోసం డబ్బులు కూడబెట్టాను" అని హరి చెప్పారు.

ఈ పదేళ్లలో, "నా ఫీలింగ్స్‌ను మా అమ్మ అర్థం చేసుకుంది. తను కోరుకుంటున్నట్లు నేను ఉండలేనని కూడా ఆమెకు అర్థమైంది. నేను నా అండాలను భద్రపరుచుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పినప్పుడు, ఆమె సంతోషించారు" అని అన్నారు.

ఆస్పత్రిలో హరికి ఎదురైన అనుభవం దిశ అనే ఎన్జీవోకు దగ్గర చేసింది.

దిశకు చెందిన దిను వెయిల్ బీబీసీతో మాట్లాడుతూ, "కేంద్రం లేవనెత్తిన ఐడీ కార్డుల సమస్యను పరిష్కరించవచ్చు. ఇక్కడ ప్రాథమికమైన విషయం ఏంటంటే, అణగారిన వర్గాల హక్కులను నియంత్రించకూడదు. డిసెంబర్ 1న ఈ కేసులో వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు న్యాయవాదిని తీసుకొస్తున్నాం" అని చెప్పారు.

బిడ్డ పుట్టిన తర్వాత జెండర్ మార్చుకున్న దేశంలోనే మొదటి ట్రాన్స్‌జెండర్ జంట జియా, జహాద్‌లను చూసి ఇదంతా చేయడం లేదని హరి చెబుతున్నారు.

"నేను కూడా అలా చేయగలను, కానీ చేయాలనుకోవడం లేదు" అన్నారు హరి.

డిసెంబర్ 1న ఈ కేసు విచారణ జరగనుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)