బుడాపెస్ట్ ‘ప్రైడ్’ కార్యక్రమానికి లక్షల మంది ప్రజలు.. ప్రధాని ఓర్బాన్‌కు ఏం సందేశం ఇచ్చారు?

బుడాపెస్ట్ ప్రైడ్ కార్యక్రమం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, నిక్ థోర్ప్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌ను పార్టీల నగరంగా ప్రచారం చేస్తుంటారు. అయితే శనివారం వేసవి ఎండ నిప్పులుకక్కుతున్నప్పుడు ఆ సందడి వీధుల్లోకి వచ్చి చేరింది. ఎలిజబెత్ బ్రిడ్జి, నదీ తీరాలు, అలాగే డాన్‌బ్యూ నది ఇరువైపులా, డౌన్‌టౌన్ ప్రాంతాలు పార్టీ వాతావరణంలో మునిగిపోయాయి.

పెస్ట్ నుంచి బుడా వరకు లక్ష నుంచి రెండు లక్షల మంది వరకు ముఖ్యంగా యువత డ్యాన్స్‌లు చేస్తూ, పాటలు పాడారు.

సాధారణంగా ఈ రెండు ప్రాంతాల మధ్యన దూరం కాలినడకన వెళ్తే కేవలం 20 నిమిషాలే. కానీ, వీధుల్లోకి ప్రజలు పోటెత్తడంతో మూడు గంటలు పట్టింది.

బుడాపెస్ట్ ప్రైడ్ ఈవెంట్‌పై ప్రధానమంత్రి విక్టర్ ఓర్బార్ నిషేధం విధించడంతో, సాధారణంగా ఈ కార్యక్రమానికి దూరంగా ఉండే తమను ఈసారి దీనిలో పాల్గొనేలా చేసిందని ఇందులో పాల్గొన్న చాలామంది ప్రజలు చెప్పారు.

ప్రైడ్ ఈవెంట్ ఎల్‌జీబీటీక్యూ ( లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్ క్వియర్) సమాజం నిర్వహించే వార్షిక కార్యక్రమం.

గత ఏడాది కేవలం 35 వేల మంది మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఓర్బాన్

ఫొటో సోర్స్, Reuters

ప్రధానిని ఎగతాళి చేస్తూ బ్యానర్లు

ప్రధానమంత్రిని ఎగతాళి చేస్తూ చాలామంది బ్యానర్లు పట్టుకున్నారు.

'' నా చరిత్ర పుస్తకాల్లో నియంతృత్వం గురించి కావాల్సినంత నేర్చుకున్నాను. మళ్లీ మీరు దాన్ని వివరించాల్సిన అవసరం లేదు – విక్!'' అంటూ ఒక బ్యానర్‌పై రాశారు.

మరో బ్యానర్‌పై ''ఫాసిజంతో నాకు చాలా విసుగేస్తోంది’’' అని ఉంది.

ప్రకాశవంతమైన ఐషాడో, లిప్‌స్టిక్‌ వేసుకుని ఉన్న ఓర్బాన్ ఫోటోతో టీ-షర్ట్‌లు ప్రతి చోటా కనిపించాయి.

ఈ ఏడాది ప్రైడ్‌ కార్యక్రమానికి ఎల్‌జీబీటీ కీలకమైనదిగా ఉన్నప్పటికీ ఈ కార్యక్రమం మొత్తం మానవహక్కులు, సంఘీభావ వేడుకగా మారింది.

పరేడ్‌లో పెద్ద సంఖ్యలో ప్రజలు

ఫొటో సోర్స్, Reuters

‘ఇది మన అందరి ప్రాథమిక హక్కు’

బుడాపెస్ట్ టెక్నికల్ యూనివర్సిటీ ముందు ప్రసంగించిన బుడాపెస్ట్ మేయర్ గెర్గెలీ కరాక్సోనీ మొహంపై వెలిగిపోతున్న చిరునవ్వుతో ''మనల్ని నిషేధించినట్లు మనం కచ్చితంగా చెప్పలేం!'' అన్నారు.

శనివారం మార్చ్ ఆయన రాజకీయ జీవితంలో ఒక కీలకమైన క్షణంగా నిలిచిపోతుంది.

నిధుల కొరతతో, కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం పోరాటం చేసే సిటీ హాల్.. ప్రభుత్వం నిషేధించాలనుకున్న ఒక కార్యక్రమాన్ని ధైర్యం చేసి నిర్వహించి ప్రస్తుతానికి గెలిచింది.

ఈ కార్యక్రమానికి హాజరైనవారిలో ఫిన్లాండ్‌కు చెందిన యురోపియన్ పార్లమెంటు సభ్యురాలు లీ అండర్సన్ కూడా ఉన్నారు. ప్రైడ్ ప్రదర్శనను నిషేధించడానికి కుటుంబ విలువలను ఒర్బాన్ ఓ మసుగుగా ఉపయోగించారని విమర్శించారు. ''మనం ఇక్కడ ఉండటానికి కారణం ప్రైడ్ మాత్రమే కాదని తెలియజేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే, ఇది మన అందరి ప్రాథమిక హక్కు.'' అని తెలిపారు.

పార్లమెంటులో భారీ మెజార్టీ ఉన్న ఫిడెజ్ పార్టీ తీసుకువచ్చిన కొత్త చట్టం ఆధారంగా ఈ నిషేధాన్ని విధించారు. సమావేశాలు నిర్వహించే స్వేచ్చను 2021లో తీసుకువచ్చిన శిశు సంరక్షణ చట్టం కిందకు తెచ్చారు. ఈచట్టం ప్రకారం స్వలింగసంపర్కాన్ని పిల్లలపై లైంగిక దుర్వినియోగంతో సమానంగా చూస్తున్నారు.

పిల్లలు చూడగలిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహించడాన్ని లేదా చిత్రీకరించడాన్ని ఈ చట్టం నిషేధించింది.

పిల్లలు చూసే అవకాశం ఉందనే కారణంతోనే శనివారం మార్చ్‌పై నిషేధం విధించినట్లు పోలీసులు తెలిపారు. కౌన్సిళ్లు నిర్వహించే కార్యక్రమాలు, సమావేశ హక్కు కిందకు రావని 2001 చట్టాన్ని గుర్తు చేశారు బుడాపెస్ట్ మేయర్.

బుడాపెస్ట్ కార్యక్రమం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బుడాపెస్ట్‌లో జరిగిన ప్రైడ్ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రభుత్వం ప్రైడ్ ర్యాలీపై నిషేధం విధించడంతో ప్రజలు ధిక్కార స్వరం వినిపించారు.

మరోవైపు ప్రధాని ఓర్బాన్ నగరంలో ఓ గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు.

'' ఆర్డర్ తనకు తానుగా రాదు. దాన్ని సృష్టించాలి. ఎందుకంటే, ఇవి లేకపోతే నాగరిక జీవితాన్ని కోల్పోతాం.'' అని విద్యార్థులు, వారి కుటుంబాలను ఉద్దేశించి ఓర్బాన్ అన్నారు.

''ప్రైడ్'' అనే పదాన్ని సరికొత్తగా నిర్వచించడానికి ప్రధానిసహా, ఫిడెజ్ పార్టీలోని ప్రముఖులు తమ పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లతో కలిపి ఫోటోలను పోస్టు చేశారు.

బుడాపెస్ట్ కౌన్సిల్‌లోని ఫిడెజ్ నాయకురాలు అలెక్సాండ్రా సెంట్కిరాలీ సాదా సీదా హంగేరీ టీషర్ట్‌ వేసుకుని తన ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్టు చేస్తూ మేం దేనికి గర్వపడుతున్నామో తెలుపాలనుకుంటున్నా.'' అని రాశారు.

అయితే పోలీసులు ఈ కార్యక్రమానికి ఆటంకం కలిగించలేదు. కానీ పోలీసుల వాహనంపై పెట్టిన తాత్కాలిక కెమెరాలు మొత్తం కార్యక్రమాన్ని రికార్డు చేశాయి.

ప్రైడ్‌ను నిషేధించేందుకు తీసుకొచ్చిన చట్టం ముఖ గుర్తింపు సాఫ్ట్‌వేర్‌ను వాడుకునేందుకు పోలీసులకు సకల అధికారాలను అందించింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి 14 పౌండ్లు (సుమారు రూ.1,644) నుంచి 430 పౌండ్లు (సుమారు రూ.50,482) వరకు జరిమానాలు విధించే అవకాశం ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)