తెలంగాణ పంచాయతీ ఎన్నికలు: 'గత పదవీకాలంలో 60 మంది సర్పంచుల ఆత్మహత్య', కారణమేంటి?

ఫొటో సోర్స్, Facebook
- రచయిత, బళ్ళ సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల వేళ గత పదవీ కాలం(టర్మ్)లో జరిగిన సర్పంచుల ఆత్మహత్యలు చర్చలోకి వచ్చాయి.
సాధారణంగా రైతు ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు వంటివి తరచూ వినిపించేవి. కానీ, 2019-2024 మధ్య సర్పంచులు పదుల సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
వారిలో ఎక్కువ మంది వారు చేసిన పనులకు సంబంధించిన నిధులు ప్రభుత్వం నుంచి రాక, అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నట్టు సర్పంచుల సంఘం నాయకులు చెబుతున్నారు.
గత టర్ములో సర్పంచులుగా ఎన్నికైన వారిలో కనీసంగా 60 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు తెలంగాణ సర్పంచుల సంఘాల నాయకులు చెబుతున్నారు. ఈ సంఖ్యను బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.

సొంత డబ్బులతో పనులు
ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను అధికారంలోకి రాకముందు, ''ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోవడం వల్ల 60 మంది ఆత్మహత్య చేసుకున్నారు'' అని ఆరోపించారు. వారి కోసం ధర్నా చేశారు.
అయితే, ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఆ డబ్బు విడుదల చేయలేదని సర్పంచుల సంఘం నాయకులు అంటున్నారు.
సర్పంచులు సొంత డబ్బుతో చేసిన పనులకు అప్పుడు కేసీఆర్, ఇప్పుడు రేవంత్.. ఇద్దరూ బిల్లులు ఇవ్వలేదని వారు చెబుతున్నారు.
సాధారణంగా పంచాయతీల్లో నిధులు ఉంటే లేదా నిధులు వస్తే పనులు చేస్తారు.
కానీ, తెలంగాణలో పరిస్థితి భిన్నంగా ఉండేది. ప్రతి గ్రామంలో హరితహారం నర్సరీల నిర్వహణ, ఆ మొక్కలను కాపాడటం, గ్రామీణ పార్కులు, చెత్త డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలూ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది.
ఆ బాధ్యత సర్పంచ్‌లకు అప్పగించింది. కానీ, అందుకు తగిన నిధులను ఇవ్వలేదు. పనులు పూర్తి చేయాలని మాత్రం ఉన్నతాధికారులు సర్పంచులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు.
దీంతో చాలా మంది సర్పంచులు అప్పులు చేసి మరీ పనులు చేశారు. కానీ, ప్రభుత్వాలు ఆ బిల్లులు విడుదల చేయలేదు.
చూస్తుండగానే కేసీఆర్ దిగి రేవంత్ వచ్చారు. ఆ సర్పంచుల పదవీకాలం ముగిసి, కొత్త సర్పంచుల ఎన్నికలు కూడా వచ్చాయి. కానీ, ఇంకా పాత సర్పంచుల బిల్లులు మాత్రం రాలేదు.

ఫొటో సోర్స్, UGC
''ఎక్కడైనా ఒక సదుపాయం కావాలి అంటే భూమి, డబ్బూ కావాలి. కానీ తెలంగాణలో అలా లేదు. నెలలో శ్మశాన వాటిక నిర్మించాలి అంటారు. లేదంటే డంపింగ్ యార్డ్ పెట్టాలి అంటారు. గ్రామానికి చెందిన ఖాళీ భూములు ఎక్కడ ఉన్నాయో రెవెన్యూ వారు చెప్పరు. మరి ఆ స్థలాలు సర్పంచ్‌లు ఎక్కడి నుంచి తేవాలి?
ఏదైనా ఖాళీ స్థలం చూస్తే, దాని రికార్డు సంగతి తెలీదు. కొన్ని సందర్భాల్లో చుట్టుపక్కల వాళ్లు ఒప్పుకోరు. అదో సమస్య. దీనికి మించిన సమస్య టార్గెట్లు. అవి పూర్తి చేయడానికి డబ్బు ఖర్చు పెడుతున్నారు సర్పంచ్‌లు. కానీ, ఆ నిధులు విడుదల కావడం లేదు'' అని తెలంగాణ సర్పంచ్‌ల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రణీల్ 2020లో బీబీసీతో చెప్పారు.
ఆ తరువాత కూడా పరిస్థితి పెద్దగా మారలేదు. ఈ క్రమంలో అధికారుల ఒత్తిడితో పెద్దయెత్తున అప్పులు తెచ్చి పనులు చేసిన సర్పంచులు, ఆ పనులు పూర్తయినా బిల్లులు రాక, అప్పుల ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి.
''సర్పంచులను నేరుగా పనులు చేయమనడం, కాంట్రాక్టులు చేయమనడమే పెద్ద తప్పు. డబ్బు ఇవ్వకుండా ఒత్తిడి చేయడం ఇంకా దారుణం. కాంట్రాక్టర్లు పనులు చేసి ఉంటే వారి పద్ధతిలో వారు డబ్బు తెచ్చుకుంటారు. కానీ, సర్పంచులు ఆ ఒత్తిడి తట్టుకోలేకపోయారు.
గతంలోలాగా ఇప్పుడు సర్పంచులు అంటే పెత్తందారులు, ఊరి పెద్దలు, బాగా ధనవంతులు కాదు. సామాన్యులు కూడా ఇప్పుడు సర్పంచులు అవుతున్నారు. కానీ, వారు ఈ ఆర్థిక ఒత్తిడి తీసుకోలేకపోయారు'' అని అంటున్నారు స్థానిక ప్రభుత్వాల సాధికారిక సమాఖ్య తెలంగాణ అధ్యక్షులు బండారు రామ్మోహన రావు.
''ఇది కాకుండా అవగాహన లేని కొందరు సర్పంచులు గ్రామస్థుల ఒత్తిడితో శాంక్షన్ లేని పనులు కూడా చేశారు. శాంక్షన్ లేని పనులకు ప్రభుత్వాలు బిల్లులు ఇవ్వవు. 'నువ్వు సర్పంచ్ అయ్యావు. పనులు చేయవా' అని గ్రామస్థులు ఒత్తిడి చేస్తారు. తీరా తొందరపడి పనిచేస్తే డబ్బు రాక ఇబ్బంది పడతారు'' అని అన్నారు రామ్మోహన రావు.

ఫొటో సోర్స్, @telangana CMO
చాలా చోట్ల పనులు చేయమని కలెక్టర్ల నుంచి ఎంపీడీవోల వరకూ అందరూ సర్పంచులను ఒత్తిడి చేశారు. పనులు చేయకపోతే సస్పెండ్ చేస్తామని చట్టాన్ని చూపించి బెదిరించారని పలువురు సర్పంచులు బీబీసీతో చెప్పారు.
''బీఆర్ఎస్ హయాంలో కలెక్టర్ నుంచి ఎంపీడీవో వరకూ అందరూ బెదిరించి మా చేత పనులు చేయించారు. దానికి వ్యతిరేకంగా మాతో ధర్నాలు చేయించిన కాంగ్రెస్ కూడా మాకు డబ్బులివ్వలేదు'' అని బీబీసీతో చెప్పారు తాజా మాజీ సర్పంచ్ మేడి అంజయ్య.
''నాకు తెలిసి 65 మంది వరకూ సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. కనీసం ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పరిహారం కూడా ఎవరూ ఇవ్వలేదు.
నాలా చాలా మంది బంగారం తాకట్టు పెట్టి, అప్పులు తెచ్చి పనులు చేసి, చివరకు వేధింపులతో ఆత్మహత్యల వరకూ వెళ్లారు.
పల్లె ప్రగతి, డంపింగ్ యార్డ్, క్రీడా ప్రాంగణం, శ్మశాన వాటికలు, హరితహారం చెట్లు, ఇంకుడుగుంతలు, సైడ్ డ్రైన్లు, వీధిలైట్లు, మురికి కాలువల శుభ్రత, ట్రాక్టర్ ఈఎంఐ, చెత్త సేకరణ.. ఇవన్నీ సొంత డబ్బుతో చేయించారు సర్పంచులు. ఇవి చేయకపోతే సర్పంచ్ పదవి నుంచి సస్పెండ్ చేస్తామంటే.. పరువుపోతుందని భయపడి పనులు చేశాం’’ అని తెలిపారు మేడి అంజయ్య.
‘‘ నేను స్వయంగా 25 లక్షల రూపాయల విలువైన పనులు చేశాను. ఇప్పటి వరకూ నాకు ఆ డబ్బు అందలేదు. పది లక్షల నుంచి 80 లక్షల వరకూ ఖర్చు చేసిన సర్పంచులు ఉన్నారు'' అని ఆయన చెప్పారు.
తనకు వ్యక్తిగతంగా తెలిసిన ఇద్దరు సర్పంచుల్లో ఒకరు ఇల్లంతుకుంట మండలంలో ఆత్మహత్య చేసుకోగా, మరొకరు గంగాధర మండలంలో ఆత్మహత్యాయత్నం చేసి ఆసుపత్రి పాలయ్యారని చెప్పారు అంజయ్య.

ఫొటో సోర్స్, twitter/Guravaiahgoud
ఆర్థికంగా చితికిపోతున్న సర్పంచుల కుటుంబాలు
చాలా గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిన వారు ఆర్థికంగా చితికిపోతున్నారు. ఎన్నికల సందర్భంగా పరువు ప్రతిష్ఠల కోసమంటూ లక్షల్లో ఖర్చు పెట్టి, ఆర్థికంగా దెబ్బతిన్న కథలు సర్పంచుల్లో కోకొల్లలుగా కనిపిస్తాయి.
ఏకగ్రీవంగా గెలిచిన చోట్ల కూడా గ్రామస్థులకు విందు పేరుతో లక్షల రూపాయలు ఖర్చు కావడం సర్పంచ్ అభ్యర్థులకు పెద్ద తలనొప్పిగా మారింది.
''అభ్యర్థులు ఫాల్స్ ప్రెస్టేజ్‌కి వెళ్తున్నారు. భారీగా ఖర్చు చేస్తున్నారు. చివరకు ఎన్నికయ్యాక సమావేశాలకు వెళ్లడానికి కూడా ఖర్చులు ఉండని వారిని నేను చూశాను'' అన్నారు రామ్మోహన రావు.
బీబీసీ పరిశీలనలో ఇలాంటివి ఎన్నో కనిపించాయి.
యాదాద్రి జిల్లాకు చెందిన ఒక గిరిజన మహిళా సర్పంచ్‌ను ఏకగ్రీవం చేయించడం కోసం పదవికి పోటీ పడ్డ ముగ్గురికి ఐదేసి లక్షల చొప్పున ఇచ్చారు. మీరంతా ఏకమైతే మా పరిస్థితి ఏంటన్నారు ఓటర్లు. దీంతో ఓటర్లకు డబ్బు, మద్యం పెద్దయెత్తున పంచారు. వ్యక్తిగతంగా ఇస్తే చాలదు.. గ్రామానికి ఏదో ఒకటి చేయాలని అడిగి, గ్రామ దేవత గుడికి అర ఎకరం భూమి విరాళంగా రాయించుకున్నారు. మొత్తంగా భూమితో పాటు, 30 లక్షల రూపాయల వరకూ ఖర్చు పెట్టించారు. ఇదంతా చేసిన ఆ మహిళకు ఉన్నదే రెండెకరాలు. 800 ఓట్లున్న చిన్న పంచాయతీ గొడవ ఇది.
''పదవి వల్ల తీవ్రంగా నష్టపోయాంటూ'' కన్నీటి పర్యంతమయ్యారు ఆ మహిళ.

ఫొటో సోర్స్, Getty Images
హైదరాబాద్ శివార్లలోని పంచాయతీల్లో, రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరిగే చోట మాత్రమే కొందరు సర్పంచులు ఆ పదవిని వ్యాపారం కోసం బాగా వాడుకుంటున్నట్టు కొందరు బీబీసీకి చెప్పారు.
చాలా మంది సర్పంచులు డబ్బు ఖర్చు పెట్టడానికి మరో కారణం ఉంది. గత టర్ములో ఇచ్చిన రిజర్వేషన్లే రెండోసారి కూడా ఇస్తామని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. దీంతో రెండోసారీ గెలవొచ్చన్న ఆశతో పనిచేశారు సర్పంచులు. కానీ, ఇప్పుడంతా మారిపోయింది. దీంతో రెంటికీ చెడ్డట్టయింది సర్పంచుల పరిస్థితి.
"అప్పట్లో పంచాయతీరాజ్ మంత్రిగా చేసిన దయాకర రావు గల్లా పట్టుకుని అడుగుదాం అన్నారు రేవంత్. ఇప్పుడు పంచాయతీరాజ్ మంత్రి సీతక్కనూ అడుగుతున్నాం కానీ ఉపయోగం లేదు" అన్నారు అంజయ్య.
దీనిపై స్పందన కోసం ఎర్రబెల్లి దయాకర రావు, ధనసరి సీతక్కలను బీబీసీ సంప్రదించింది. వారు స్పందించాల్సి ఉంది.
- ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి.
- సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.
- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














