పుతిన్ పర్యటన: ''మాకు చైనా ఎంత దగ్గరో భారత్ కూడా అంతే దగ్గర'' అని రష్యా ఎందుకు అంటోంది?

ఫొటో సోర్స్, Getty Images
రష్యా అధ్యక్షుడు పుతిన్ గురువారం నుంచి రెండు రోజులపాటు భారత్‌లో పర్యటిస్తున్నారు.
రెండు దేశాల మధ్య జరిగే వార్షిక సమావేశంలో ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీతో పలు అంశాలపై చర్చిస్తారు.
రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేయవద్దంటూ భారత్‌పై గత కొన్ని నెలలుగా అమెరికా ఒత్తిళ్లు పెంచుతున్న తరుణంలోనే, భారత్-రష్యాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేసుకునే అవకాశం ఉంది.
అయితే, పుతిన్ భారత పర్యటనకు ముందు రష్యా ఒక కీలకమైన వ్యాఖ్య చేసింది.
తమకు చైనా ఎంత ముఖ్యమో భారత్ కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేసింది. ఈ ప్రకటనకు కారణమేంటి? భారత్‌తో సంబంధాలు రష్యాకు ఎందుకంత ముఖ్యం?


ఫొటో సోర్స్, Getty Images
రష్యా ఏమన్నది?
పుతిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ మంగళవారంనాడు ఓ మీడియా సమావేశంలో మాట్లాడారు.
రష్యా-చైనాల మధ్య సంబంధాలను బలంగా ఉన్నాయనీ, భారత్ విషయంలో రష్యా అదే వైఖరితో ఉందని పెస్కోవ్ స్పష్టం చేశారు.
ఇప్పుడు తమతో ముందుకు సాగడానికి భారత్ ఎంత వరకు సిద్ధంగా ఉందనే దానిపైనే ఈ సంబంధాల కొనసాగింపు ఆధారాపడి ఉంటుందని ఆయన అన్నారు.
''చైనా మా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామి. చైనాతో సరిహద్దులుదాటే స్నేహాన్ని కొనసాగించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. భారతదేశంతో కూడా మాకు అదే రకమైన విధానం ఉంది. ఈ స్నేహాన్ని ఎంత దూరం తీసుకెళ్లాలన్నా మేం సిద్ధంగా ఉన్నాం'' అని పెస్కోవ్ అన్నారు.
రష్యాతో సంబంధాల విషయంలో భారతదేశానికి కొన్ని ఇబ్బందులున్నాయని పెస్కోవ్ అభిప్రాయపడ్డారు.
"భారతదేశం ఒత్తిడిలో ఉందని మేం అర్థం చేసుకున్నాం. అందుకే రెండు దేశాలు సంబంధాలను మెరుగుపరుచుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన సంబంధాలు మూడో దేశం ప్రభావం నుంచి విముక్తి పొందాలి. రెండు దేశాలకు ప్రయోజనకరంగా ఉండే మన వాణిజ్యాన్ని కాపాడుకోవాలి" అని పెస్కోవ్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రష్యా వ్యూహం ఏమిటి?
భారత్, చైనాలతో సంబంధాలను కొత్త ఎత్తులకు తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు ఇండియా పర్యటనకు ముందు మంగళవారం నాడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు.
అయితే, చైనాతో సమానంగా భారత్‌కు ఈ ఆఫర్ ఇవ్వడం ద్వారా రష్యా ఒక సందేశాన్ని ఇవ్వాలనుకుందని భౌగోళిక రాజకీయ వ్యూహకర్త వెలినా చకరోవా అభిప్రాయపడ్డారు.
"ఇది ఒక కీలక సంకేతం. భారతదేశానికి బహిరంగంగా సమాన వ్యూహాత్మక హోదాను ఇవ్వడం ద్వారా, చైనాపై ఎక్కువగా ఆధారపడటాన్ని బ్యాలన్స్ చేసేందుకు రష్యా ప్రయత్నిస్తోంది" అని చకరోవా అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భారతదేశం ఏం కోరుకుంటోంది?
స్నేహ సంబంధాల విషయంలో బంతిని భారతదేశం కోర్టులోకి నెట్టినప్పటికీ రష్యా కల నెరవేరదని జిందాల్ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ డీన్, 'ఫ్రెండ్స్: ఇండియాస్ క్లోజెస్ట్ స్ట్రాటజిక్ పార్టనర్స్' రచయిత శ్రీరామ్ చౌలియా అన్నారు.
‘‘రష్యా, చైనాల మధ్య ఉన్న పొత్తు అమెరికాకు ఇష్టంలేని వ్యవహారం. ఈ కూటమిలో భాగం కావాలని భారతదేశం కోరుకోవడం లేదు. చైనా, రష్యా రెండూ అమెరికాను ప్రత్యర్థిగా భావిస్తాయి. కానీ భారతదేశం అందుకు సుముఖంగా లేదు. భారత్ తన అభివృద్ధి ప్రయాణంలో రష్యా కోసం అమెరికానుగానీ, అమెరికా కోసం రష్యానుగానీ వదులుకునే స్థితిలో లేదు’’ అని చౌలియా అన్నారు.
"రష్యా, చైనాల సంబంధం సరిహద్దులను దాటి, వారి అవసరాలకు అనుగుణంగా ఉంటుంది. మరోవైపు, భారతదేశానికి రష్యా, చైనా, అమెరికా.. ఈ మూడూ అవసరం. రష్యాతో భారత్ సంబంధం ఎనర్జీ, డిఫెన్స్‌కే పరిమితం. అమెరికాతో మాత్రం అది బహుముఖంగా ఉంటుంది. అలాంటప్పుడు అమెరికా వ్యతిరేక శిబిరంలో భారత్ ఎందుకు చేరాలి? భారత్‌కు ప్రస్తుతం అమెరికన్ టెక్నాలజీ అవసరం" అని చౌలియా అన్నారు.
భారత్, రష్యా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ప్రస్తుతం 63 బిలియన్ డాలర్లని, 2030 నాటికి ఇది 100 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు పెస్కోవ్ చెప్పారు.
యుక్రెయిన్ యుద్ధానికి ముందు 2021లో 13 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత్-రష్యా ద్వైపాక్షిక వాణిజ్యం 2024-25 నాటికి 68 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. అయితే, ఈ వృద్ధికి భారతదేశ చమురు దిగుమతులు ప్రధానంగా దోహదపడుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
పుతిన్ పశ్చిమ దేశాల పర్యటన దేనికి సంకేతం?
రెండో ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచం అమెరికా, రష్యా అనే రెండు ధ్రువాలుగా విడిపోయింది. అప్పుడు కూడా భారత్ ఏ కూటమి పంచనా చేరలేదు.
మొదటి నుంచి అలీన విధానంవైపు మొగ్గిన భారత్, ఇప్పటికీ అదే కొనసాగిస్తోంది. వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిపై భారతదేశం రాజీపడబోదని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పదేపదే చెబుతున్నారు.
అయినప్పటికీ, పుతిన్ భారత పర్యటన అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేస్తుందని వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు బ్రహ్మ చెల్లానీ అభిప్రాయపడ్డారు.
‘‘ కూటములుగా విడిపోయిన ప్రపంచంలో పుతిన్ న్యూదిల్లీ పర్యటన కేవలం దౌత్యపరమైన రాక అనుకోవడానికి వీల్లేదు. ఇది శక్తివంతమైన భౌగోళిక రాజకీయ సంకేతం’’ అని చెల్లానీ ఎక్స్‌లో రాశారు.
‘‘ భారతదేశం ఒక బలమైన సందేశాన్ని పంపుతోంది. ట్రంప్ నేతృత్వంలోని అమెరికా భారతదేశం పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తుండగా, రష్యాను ఒంటరిదాన్ని చేయాలని న్యూదిల్లీ భావించడం లేదు. పాశ్చాత్య దేశాల ఒత్తిళ్లకు తలొగ్గడం లేదు. పుతిన్‌కు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా, పశ్చిమ దేశాలు చెప్పే ‘‘మాతో ఉండండి లేదంటే మాకు ప్రత్యర్ధులుగా ఉండండి’’ అనే విధానాన్ని భారతదేశం అంగీకరించదని, తనదైన స్వతంత్ర మార్గాన్ని ఎంచుకుంటుందని ఈ ఆతిథ్యం ద్వారా స్పష్టం చేస్తోంది" అని చెల్లాని రాశారు.
యుక్రెయిన్‌పై దాడికి ముందు, రెండు దేశాలు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేసి, వారి భాగస్వామ్యాన్ని 'నో లిమిట్స్' అని పేర్కొన్నాయి.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













