ఇమ్రాన్ ఖాన్ జైలులోనే ఉన్నారా? నెల రోజులుగా ‘ఎవరినీ కలవనివ్వలేదు’ ఎందుకు?

ఇమ్రాన్‌ఖాన్, పాకిస్తాన్, ఇస్లామాబాద్, జైలు, మానవ హక్కులు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఉమర్ దరాజ్ నంగియానా, ఫుర్కాన్ ఇలాహీ
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ దాదాపు మూడు సంవత్సరాలగా జైలులో ఉన్నప్పటికీ వార్తల్లోనే ఉన్నారు. ఆయనను చూడడానికి వెళ్లే కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు మీడియా ద్వారా ఆయన సందేశాలను తెలియజేస్తూనే ఉన్నారు.

ఇమ్రాన్‌ఖాన్ చెప్పే మాటలు బయటిప్రపంచానికి తెలియడం ప్రభుత్వానికిష్టం లేదని, అందుకే దాదాపు నెల రోజులుగా ఆయన్ను కలవడానికి తమకు అనుమతివ్వడం లేదని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

"ఇమ్రాన్‌ఖాన్ మాటలు బయట ప్రపంచానికి తెలుస్తున్నాయని వారు (ప్రభుత్వ అధికారులు) ఆందోళన చెందుతున్నారు. అందుకే ఆయన్ను కలవనివ్వడం పూర్తిగా ఆపేశారు" అని బీబీసీకిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఇమ్రాన్‌ఖాన్ సోదరి నౌరీన్‌ఖాన్ ఆరోపించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఇమ్రాన్‌ఖాన్, పాకిస్తాన్, ఇస్లామాబాద్, జైలు, మానవ హక్కులు
ఫొటో క్యాప్షన్, నవంబరు 4 తర్వాత ఇమ్రాన్‌ఖాన్‌ను కలవలేదని ఆయన సోదరి చెప్పారు.

‘నవంబరు 4 తర్వాత కలవలేదు’

కోర్టు ఆదేశం ప్రకారం అంతకుముందు ప్రతి మంగళవారం తమ సోదరుణ్ని కలిసేవారమని, కానీ నవంబరు 4 తర్వాత ఆయన్ను కలవలేదని ఆయన సోదరి చెబుతున్నారు.

పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ)కి చెందిన శాసనసభ్యులంతా మంగళవారం ఇస్లామాబాద్ హైకోర్టు, అడియాలా జైలు వెలుపల శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చారు. దీంతో ఇస్లామాబాద్, రావల్పిండిలో 144 సెక్షన్ విధించారు.

నవంబరు 4న ఇమ్రాన్‌ఖాన్‌ను కలిసేందుకు నౌరీన్‌ఖాన్‌కు జైలు అధికారులు అనుమతిచ్చారని, ఆ తర్వాత ఆయన్ను కలిసేందుకు ఎవరినీ పంపించడం లేదని ఇమ్రాన్‌ఖాన్ రెండో సోదరి అలీమాఖాన్ బీబీసీతో చెప్పారు.

ఇమ్రాన్‌ఖాన్ ఎలా ఉన్నారు? జైలులో ఆయన్ను కలిసిన సోదరి ఏం చెప్పారు?

ఇస్లామాబాద్ హైకోర్టు, అడియాలా జైలు వెలుపల పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) నిరసన వ్యక్తం చేసిన తరువాత ఇమ్రాన్‌ఖాన్‌ను కలిసేందుకు ఆయన మరో సోదరి ఉజ్మాఖాన్‌ను అనుమతించారు.

ఇమ్రాన్‌ఖాన్‌ను కలవడానికి ఉజ్మాఖాన్‌కు అనుమతి లభించిందని పీటీఐ ప్రతినిధి, అడియాలా జైలు అధికారి బీబీసీ ఉర్దూతో ధృవీకరించారు.

ఇమ్రాన్‌ఖాన్ ముగ్గురు సోదరీమణులు అలీమాఖాన్, నౌరీన్‌ఖాన్, ఉజ్మా ఖాన్ అడియాలా జైలు దగ్గరకు వెళ్లినప్పుడు అక్కడ ఉన్న పోలీసు అధికారులు వారిని మార్గమధ్యంలో ఆపివేశారు.

కొంత సమయం తర్వాత, జైలు అధికారులు ఒక అధికారిని ఇమ్రాన్‌ఖాన్ సోదరీమణుల వద్దకు పంపి, ఉజ్మాఖాన్ వెళ్లేందుకు అనుమతి లభించిందని చెప్పారు.

ఇమ్రాన్‌ఖాన్ ఏం మాట్లాడారు?

అడియాలా జైలులో ఇమ్రాన్‌ఖాన్‌ను కలిసి వచ్చిన తర్వాత ఉజ్మాఖాన్ తన సోదరుడి పరిస్థితి గురించి మీడియాకు వివరించారు.

"ఆయన చాలా కోపంగా ఉన్నారు. వారు తనను మానసికంగా హింసిస్తున్నారని, రోజంతా గదిలో బంధించి ఉంచుతున్నారని, కొద్దిసేపు మాత్రమే బయటకు వెళ్ళనిస్తున్నారని చెప్పారు. తనను ఎవరితోనూ మాట్లాడటానికి అనుమతించడం లేదన్నారు. వీటన్నంటికీ అసిమ్ మునీర్‌దే బాధ్యత అని ఇమ్రాన్‌ఖాన్ చెప్పారు" అని ఉజ్మాఖాన్ తెలిపారు.

20 నిమిషాలు మాత్రమే ఇమ్రాన్‌ఖాన్‌తో మాట్లాడగలిగానని, ఆయన ఆరోగ్యం బాగుందని ఉజ్మాఖాన్ చెప్పారు.

దాదాపు నెల రోజులుగా ఇమ్రాన్‌ఖాన్‌ను కలవడానికి తమకు అనుమతి లేదని అంతకుముందు ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. "ప్రభుత్వ అధికారులు ఇమ్రాన్ ఖాన్ సందేశాలు జైలు నుంచి బయటకు రావాలని కోరుకోవడం లేదు" అని వారు అన్నారు.

ఇమ్రాన్‌ఖాన్, పాకిస్తాన్, ఇస్లామాబాద్, జైలు, మానవ హక్కులు

ఫొటో సోర్స్, X/@Jemima_Khan

ఫొటో క్యాప్షన్, ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య జెమీమా పోస్ట్

ఇమ్రాన్‌ఖాన్‌ మాజీ భార్య ఏమంటున్నారు?

ఇమ్రాన్‌ఖాన్ కొడుకులు సహా ఎవరినీ ఫోన్‌లో మాట్లాడటానికి అనుమతించడం లేదని ఇమ్రాన్‌ఖాన్ మాజీ భార్య జెమీమా గోల్డ్‌స్మిత్ 'ఎక్స్‌'లో ఆరోపించారు.

ఇమ్రాన్‌ఖాన్‌కు కొడుకు ఒక్క ఉత్తరం కూడా పంపలేకపోయారని ఆమె అన్నారు.

" మే 9న జరిగిన ఘటనకు ఇమ్రాన్‌ఖాన్ బాధ్యత వహించాలని పాకిస్తాన్ ప్రభుత్వం కోరుకుంటోంది" అని నౌరీన్‌ఖాన్ ఆరోపించారు.

"మే 9 ఘటనకు తానే కారణమని, విధ్వంసం తానే చేశానని, తన సొంత ప్రజలను తానే కాల్చి చంపానని చెప్పి, ఇమ్రాన్‌ఖాన్ క్షమాపణ కోరాలని బహుశా వారు కోరుకుంటున్నారేమో'' అని నౌరీన్‌ఖాన్ వ్యాఖ్యానించారు.

ఇమ్రాన్‌ఖాన్, పాకిస్తాన్, ఇస్లామాబాద్, జైలు, మానవ హక్కులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇమ్రాన్‌ఖాన్ సిస్టర్స్

‘చేయని వాటిని ఒప్పుకోమంటున్నారు’

" మీరు సీసీటీవీ ఫుటేజ్ తీసుకోండి. కంటోన్మెంట్ లోపల చెక్‌పోస్టులు ఉన్నాయి. సైన్యం దృష్టిలో పడకుండా లేదా కెమెరాల్లో కనపడకుండా ఎవరూ ఇక్కడకు ప్రవేశించలేరు" అని ఇమ్రాన్‌ఖాన్ వారికి సమాధానమిచ్చినట్టు నౌరీన్‌ఖాన్ తెలిపారు.

గత ఏడాది మే 9న జరిగిన సంఘటనకు ముందు, ఆర్మీ ప్రతినిధి మేజర్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌధురిని పీటీఐతో చర్చల గురించి అడిగినప్పుడు, "తన సొంత సైన్యంపై దాడి చేసిన వారితో ఎవరూ మాట్లాడరు. అస్తవ్యస్త పరిస్థితులను సృష్టించే అలాంటివారికున్న ఏకైక మార్గం దేశానికి క్షమాపణ చెప్పడం, ద్వేషపూరిత రాజకీయాలను విడిచిపెట్టి నిర్మాణాత్మక రాజకీయాల్లో పాల్గొనడం" అని ఆయన సమాధానమిచ్చారు.

ఇమ్రాన్‌ఖాన్, పాకిస్తాన్, ఇస్లామాబాద్, జైలు, మానవ హక్కులు
ఫొటో క్యాప్షన్, ఇమ్రాన్‌ఖాన్ సోదరి అలీమాఖాన్

ప్రభుత్వ వాదనేంటి?

ఇమ్రాన్‌ఖాన్‌ను కలిసేందుకు కుటుంబసభ్యులను అనుమతించకపోవడం కేవలం ఆరోపణ మాత్రమే కాదు. ప్రభుత్వ డేటా కూడా ఈ అప్రకటిత నిషేధాన్ని ధ్రువీకరిస్తున్నట్టు కనిపిస్తోంది.

"దోషిగా నిర్థరణ అయిన వారు జైలులో ఉన్నప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు అనుమతించే చట్టం లేదు" అని పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ రాజకీయ వ్యవహారాల సలహాదారు రానా సనావుల్లాహ్ సమా టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ అన్నారు.

ఇమ్రాన్‌ఖాన్‌ను కలిసేందుకు కుటుంబాన్ని అనుమతించకపోవడంపై మానవ హక్కుల సంస్థలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి.

"దగ్గరి బంధువులు, సహచరులు లేదా న్యాయబృందం ఇమ్రాన్‌ఖాన్‌ను కలవడానికి అనుమతించలేదనే వార్తలపై వివరణ ఇవ్వాలి. ఎందుకంటే కుటుంబాన్ని కలవడం, న్యాయ సహాయం పొందడం ప్రాథమిక రక్షణ" అని పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్‌సీపీ) సోమవారం(డిసెంబరు 1) ఒక ప్రకటనలో తెలిపింది.

ఇమ్రాన్ ఖాన్ అనారోగ్యంతో ఉన్నారని, జైలులో ఆయన మరణించారని కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించాయి. వీటిని ప్రభుత్వ అధికారులు ఖండించారు.

ఇమ్రాన్‌ఖాన్, పాకిస్తాన్, ఇస్లామాబాద్, జైలు, మానవ హక్కులు
ఫొటో క్యాప్షన్, తాను చివరిసారి కలిసినప్పుడు ఇమ్రాన్‌ఖాన్ ఆరోగ్యంగా ఉన్నారని నౌరీన్‌ఖాన్ చెప్పారు.

ఇమ్రాన్‌ఖాన్ ఆరోగ్యం ఎలా ఉంది?

ఇమ్రాన్‌ఖాన్‌పై వచ్చిన వదంతులపై సోదరి నౌరీన్‌ఖాన్ స్పందించారు. ఈ వార్త ఎలా వ్యాపించిందో తనకు తెలియదన్నారు.

"ఇమ్రాన్‌ఖాన్‌ను జైలులో చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఆయన్ను ఒంటరిగా ఉంచుతున్నారు. ఇదంతా జైలు నిబంధనల ఉల్లంఘన" అని ఆమె ఆరోపించారు.

ఈ వదంతులు ఎలా వ్యాప్తి చెందాయో తనకు కూడా తెలియదన్నారు ఇమ్రాన్‌ఖాన్ రెండోసోదరి అలీమాఖాన్.

"ఈ వదంతులు ఎక్కడి నుండి వచ్చాయి, అవి జైలు లోపల నుంచి ఎలా వచ్చాయి? వీటిని వ్యాపింపచేస్తున్నవారు జైలు సిబ్బంది లేదా అధికారయంత్రాంగం అయి ఉండాలి" అని అలీమాఖాన్ బీబీసీ ఉర్దూతో అన్నారు.

"ప్రజలు ఎలా స్పందిస్తారో గమనించడానికి వారు ఇలా చేస్తున్నారని ఎవరో మాకు చెప్పారు. మాకేం తెలియదు" అని ఆమె అన్నారు.

''నా సోదరుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. సొంతంగా ఆహారం తీసుకుంటున్నారు. వ్యాయామం చేస్తున్నారు. మానసికంగా బలంగా ఉన్నారు" అని నవంబరు 4న ఇమ్రాన్‌ఖాన్‌ను కలిసిన నౌరీన్‌ఖాన్ చెప్పారు.

"అక్కడ (జైలులో) ఆహారం ఇమ్రాన్‌ఖాన్ సూచనల మేరకు వండుతారు. దానికి డబ్బులు ఆయనే చెల్లిస్తారు'' అని ఆమె తెలిపారు.

ఇమ్రాన్‌ఖాన్, పాకిస్తాన్, ఇస్లామాబాద్, జైలు, మానవ హక్కులు

ఫొటో సోర్స్, Getty Images

‘పుస్తకాలు కావాలి, పిల్లలతో మాట్లాడాలి’

ఇమ్రాన్‌ఖాన్‌ను కలిసేందుకు కుటుంబ సభ్యులను అనుమతించకపోవడంపై జైలు అధికారులు స్పష్టమైన ప్రకటన విడుదల చేయలేదు. అయితే ఇమ్రాన్‌ఖాన్ జైలులో కూర్చొని అరాచకం, గందరగోళాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారని ప్రధాని షాబాజ్ షరీఫ్ రాజకీయ వ్యవహారాల సలహాదారు రానా సనావుల్లాహ్ ఆరోపించారు.

"ఓ ఖైదీ తన కుటుంబ సభ్యులను, న్యాయవాదులను కలవడానికి చట్టం అనుమతిస్తుంది. కానీ దోషిగా తేలిన ఖైదీ జైలులో కూర్చుని ప్రభుత్వానికి లేదా దేశానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు అనుమతించే చట్టం ఏదీ లేదు" అని ఆయన సమా టీవీ కార్యక్రమంలో అంగీకరించారు.

"ఒక ఖైదీ తనను సందర్శించడానికి వచ్చేవారి ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అరాచకం, రాజద్రోహం, గందరగోళం, ఆందోళన నిర్వహింపచేయడానికి అనుమతించే చట్టం ఏదీ లేదు" అని ఆయనన్నారు.

ఇమ్రాన్‌ఖాన్, పాకిస్తాన్, ఇస్లామాబాద్, జైలు, మానవ హక్కులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్ ప్రధాని రాజకీయ వ్యవహారాల సలహాదారు రానా సనావుల్లాహ్

‘నిషేధం ఎవరు విధించారో తెలియదు’

ఇమ్రాన్‌ఖాన్ సందర్శనలపై నిషేధం విధించాలని ఎవరు ఆదేశించారో తనకు తెలియదని సనావుల్లాహ్ అన్నారు. "ఈ నిషేధాన్ని జైలు అధికారులు విధించి ఉండాలి" అని ఆయన వ్యాఖ్యానించారు.

పంజాబ్ ప్రభుత్వం నిషేధం విధించిందా అని అడిగినప్పుడు, తనకు దాని గురించి తెలియదని ఆయన బదులిచ్చారు.

" ప్రస్తుతం ఏం జరుగుతోంది, ఇకముందు ఏం జరగనుంది, బయటకు వెళ్ళినప్పుడు ఏమి చెప్పాలి అనేవి ఇమ్రాన్‌ఖాన్ నాకు చెబుతారు. మా మధ్య మామూలు మాటలే ఉంటాయి'' అని సోదరి నౌరీన్‌ఖాన్ అన్నారు.

'' ఇమ్రాన్ ఖాన్ టీవీ ఆపేశారు, వార్తాపత్రిక నిలిపివేశారు. జైలు నిబంధనల ప్రకారం ఏ ఖైదీనీ నాలుగు రోజుల కంటే ఎక్కువ కాలం ఏకాంత నిర్బంధంలో కూడదు'' అని ఆమె అన్నారు.

ఇమ్రాన్‌ఖాన్ అదనపు సౌకర్యాలేమీ అడగడం లేదని పుస్తకాలు కావాలని, తన పిల్లలతో మాట్లాడాలని మాత్రమే అడుగుతున్నారని నౌరీన్‌ఖాన్ చెప్పారు.

ఇస్లామాబాద్‌లో పీటీఐ నిరసన ప్రదర్శనలు జరిపింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇస్లామాబాద్‌లో పీటీఐ నిరసన ప్రదర్శనలు జరిపింది.

దేశ చట్టాలు, జైలు మాన్యువల్‌లో ఏముంది?

పాకిస్తాన్ జైలు చట్టాల ప్రకారం, ఖైదీలు వారి కుటుంబాలను, న్యాయ బృందాలను కలవడానికి అధికారులు అనుమతించాల్సి ఉంటుందని ఖైదీల హక్కుల నిపుణులు అంటున్నారు.

"జైలు మాన్యువల్ ప్రకారం రాజకీయ ఖైదీ అయినా లేదా సాధారణ ఖైదీ అయినా వారు ప్రతి వారం కుటుంబసభ్యులను, లాయర్లను కలవొచ్చు" అని సొసైటీ ఫర్ హ్యూమన్ రైట్స్ అండ్ ప్రిజనర్స్ ఎయిడ్ (ఎస్‌హెచ్ఏఆర్‌పీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ముహమ్మద్ ముదస్సర్ జావేద్ బీబీసీ ఉర్దూతో అన్నారు.

ఖైదీలను కలవకుండా ఆపే హక్కు ఎవరికీ లేదని ఆయన అంటున్నారు.

భద్రతా కారణాల దృష్ట్యా జైలు ఐజీ చర్యలు తీసుకోవచ్చు. కానీ ప్రతిరోజూ ఖైదీలను కలవడానికి, వారికి సౌకర్యాలు కల్పించడానికి ఏర్పాట్లు చేయడం ఐజీ బాధ్యత" అని ఆయన స్పష్టం చేశారు.

కుటుంబాన్ని కలవడానికి అనుమతించకుండా ఇమ్రాన్‌ఖాన్‌ను వేధిస్తున్నారని ఆయన సోదరీమణులు ఆరోపిస్తున్నారు.

"ఎవరైనా, ఎప్పుడైనా ఇమ్రాన్‌ఖాన్‌ను ఏమైనా చేస్తే వారు పాకిస్తాన్‌లోనే కాదు ప్రపంచంలో మరెక్కడా జీవించలేరని గుర్తుంచుకోండి" అని నౌరీన్‌ఖాన్ హెచ్చరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)