ఖలీదా జియాకు సహాయం చేస్తామన్న మోదీ ప్రకటనకు బంగ్లాదేశ్ ఎలా స్పందించింది?

ఫొటో సోర్స్, Getty Images
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్‌పీ) చైర్ పర్సన్ ఖలీదా జియా తీవ్ర అనారోగ్యంతో వారం రోజులుగా ఢాకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఖలీదా జియా కోలుకోవాలని భారత ప్రధాని నరేంద్రమోదీ ఆకాంక్షించారు. అవసరమైన సాయం చేస్తానని తెలిపారు.
ఖలీదా జియా చికిత్సకు సాయమందించేందుకు సోమవారం(డిసెంబరు 1)ఉదయం ఐదుగురు చైనా డాక్టర్ల బృందం ఢాకాలోని ఎవర్‌కేర్ ఆస్పత్రికి వెళ్లింది.
ఈ విషయాన్ని బంగ్లాదేశ్‌లోని ప్రధాన ఇంగ్లిష్ వార్తాపత్రిక ఢాకా ట్రిబ్యూన్ తెలిపింది. ఖలీదా జియా ఆరోగ్యం విషమంగానే ఉందని వెల్లడించింది.
''ఖలీదా జియాకు చికిత్స అందిస్తున్న డాక్టర్లతో చైనా మెడికల్ టీమ్ మాట్లాడింది. స్థానిక, విదేశీ డాక్టర్ల బృందం ఖలీదా జియాకు చికిత్స అందిస్తున్నారని, ఆమె పరిస్థితి విషమంగానే ఉందని బీఎన్‌పీ సెక్రటరీ జనరల్ మిర్జా ఫఖ్రుల్ ఇస్లామ్ ఆలంగీర్ చెప్పారు'' అని ది ఢాకా ట్రిబ్యూన్ రిపోర్ట్ చేసింది.
''బేగమ్ ఖలీదా జియా ఆరోగ్యపరిస్థితి గురించి తెలుసుకుని నేను తీవ్రంగా కలత చెందా. ప్రజాజీవితంలో ఎన్నో ఏళ్లపాటు బేగమ్ జియా బంగ్లాదేశ్‌కు ఎంతో చేశారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. ఏ సహాయం అయినా చేయడానికి భారత్ సిద్ధంగా ఉంది'' అని ప్రధాని మోదీ ఎక్స్‌లో రాశారు.
''బీఎన్‌పీ అధ్యక్షురాలు బేగమ్ ఖలీదా జియా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్న భారత ప్రధానికి కృతజ్ఞతలు. మద్దతుగా నిలుస్తామని చెప్పినందుకు ధన్యవాదాలు'' అని మోదీ పోస్ట్‌కు ప్రతిస్పందనగా బీఎన్‌పీ రాసింది.


ఫొటో సోర్స్, @narendramodi
బీఎన్‌పీ విషయంలో మెత్తబడిన భారత్?
గతంలో భారత ప్రభుత్వం, బీఎన్‌పీ మధ్య ఇలాంటి మంచి సంబంధాలు అరుదుగా ఉండేవి. షేక్ హసీనాను భారత్‌లో ఉంచినందుకు బీఎన్‌పీ భారత ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉంది.
2015 జూన్‌లో బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా భారత ప్రధాని ఖలీదాజియాతో సమావేశమయ్యారు. ఆ సమయంలో బంగ్లాదేశ్‌తో సరిహద్దుల ఒప్పందంపై భారత్ సంతకం చేసింది. అప్పుడు షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్నారు. బంగ్లాదేశ్ ప్రతిపక్షంతో ప్రధాని మోదీకి అది అసాధారణ సమావేశం. ఖలీదా జియాతో పాటు ఆ పార్టీకి చెందిన రోషన్ ఇర్షాద్‌తో కూడా భారత ప్రధాని సమావేశమయ్యారు.
పొరుగుదేశాల్లో.. ముఖ్యంగా బంగ్లాదేశ్, మాల్దీవులు, మియన్మార్, శ్రీలంకలోని అధికార పార్టీలతో భారత్ సత్సంబంధాలు కొనసాగిస్తుందని, అక్కడి ప్రతిపక్షపార్టీల విశ్వాసం గెలుచుకోవడానికి కావాల్సిన ప్రయత్నాలు చేయదని భావిస్తారు.
అదే సమయంలో చైనా మాత్రం ఈ దేశాల్లోని అధికార, ప్రతిపక్షాలతో సత్సంబంధాలను కొనసాగించే విధానం ఎంచుకుంది. షేక్ హసీనా అధికారంలో ఉన్నప్పుడూ, ఖలీదా జియా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడూ వారితో చైనాకు సత్సంబంధాలుండేవని రాజకీయ నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ ఇన్‌చార్జ్‌గా ఉన్న ముహమ్మద్ యూనస్‌తోనూ చైనాకు మంచి సంబంధాలున్నాయి.
ఖలీదా జియా ప్రధానిగా ఉన్న సమయంలోనూ, ముహమ్మద్ యూనస్ హయాంలోనూ భారత్‌కు బంగ్లాదేశ్‌తో గతంలోలా అంత సత్సంబంధాలు లేవు.
పదవి కోల్పోయిన తర్వాత షేక్ హసీనా భారత్‌కు వచ్చి ఇక్కడే ఉండిపోయారు. ఆమెను అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం కోరుతోంది.
బంగ్లాదేశ్‌లో షేక్ హసీనాకు మరణశిక్ష విధించారు. ఇది భారత్‌కు ఆందోళన కలిగించే విషయమని, చైనా మాత్రం వీటన్నింటికీ దూరంగా ఉందని దౌత్యవిశ్లేషకులు భావిస్తున్నారు.
ఖలీదా జియా ఆరోగ్యం ఇలా క్షీణించడంలో షేక్ హసీనాది కీలక పాత్ర అని, అలాంటి హసీనాకు భారత్ ఆశ్రయమిచ్చిందని దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో దక్షిణాసియా స్టడీస్ సెంటర్ ప్రొఫెసర్ మహేంద్ర పీ లామా వ్యాఖ్యానించారు.
''ప్రస్తుత పరిస్థితుల్లో మానవతాదృక్పథంతో ప్రధాని మోదీ స్పందించారు. ఇది అంత తేలికైన విషయం కాదు. వచ్చే ఏడాది బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. బీఎన్‌పీ అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారు. బంగ్లాదేశ్ విషయంలో మన విదేశాంగ విధానం అధికార, వ్యక్తి కేంద్రంగా ఉంటుంది. దాని పరిణామాలు అందరికీ తెలుసు'' అని ప్రొఫెసర్ లామా అన్నారు.
''షేక్ హసీనా అధికారం కోల్పోయిన దగ్గరినుంచి మనం ఎక్కడా కనిపించలేదు. షేక్ హసీనాతో తప్ప మరెవరితోనూ సంబంధాలు మెరుగుపర్చుకోవడానికి మనమెప్పుడూ ప్రయత్నించలేదనుకుంటా. ఈ విషయంలో చైనా వైఖరి పూర్తి భిన్నం. ఏ దేశంతో అయినా చైనా సంబంధాలు అక్కడ ఏ ప్రభుత్వం ఉందనేదానిపై ఆధారపడి ఉండవు'' అని ఆయనన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఖలీదా జియా
షేక్ హసీనా కుటుంబానికి భారత్‌తోనే సత్సంబంధాలున్నాయిగానీ చైనాతో కాదు. బంగ్లాదేశ్ ఏర్పాటులో హసీనా తండ్రి ముజిబుర్ రెహ్మాన్, భారత్ కీలకపాత్ర పోషించారు.
నాలుగు దశాబ్దాలుగా ఖలీదా జియా బంగ్లాదేశ్ రాజకీయాల్లో భాగంగా ఉన్నారు. భర్త హత్య తర్వాత ఆమె బీఎన్‌పీ నాయకత్వ బాధ్యతను తీసుకున్నారు.
1981లో హత్యకు గురయ్యేనాటికి జియాఉర్ రెహ్మాన్ బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా ఉన్నారు. బంగ్లాదేశ్‌లో బహుళ పార్టీల వ్యవస్థ, ప్రజాస్వామ్యానికి ఖలీదా జియా మద్దతిస్తున్నారు.
1991లో ఖలీదా జియా బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధాని అయ్యారు. 1991 ఎన్నికల్లో బీఎన్‌పీ గెలిచింది. 2001లో తిరిగి అధికారంలోకొచ్చిన ఖలీదా జియా 2006 వరకు ప్రధాని పదవిలో ఉన్నారు. గత మూడు ఎన్నికలను బీఎన్‌పీ బహిష్కరించింది. 2024లో షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమానికి ఖలీదా జియా మద్దతిచ్చారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో బీఎన్‌పీ అతిపెద్ద పార్టీగా ఉంది. వచ్చే ఏడాది ఎన్నికల్లో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్న అంచనాలు వెలువడుతున్నాయి.
షేక్ హసీనా ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఖలీదా జియా జైలులో ఉన్నారు. ఆమె కొడుకు తారిక్ రహ్మాన్ కూడా అనేక కేసుల్లో దోషిగా తేలారు. అయితే ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఖలీదాను, ఆమె కుమారుణ్ని నిర్దోషులుగా ప్రకటించింది.
బంగ్లాదేశ్ ఏర్పాటులో భారత్ పాత్రను కూడా బీఎన్‌పీ ప్రశ్నిస్తూ ఉంటుంది. ''భారత్ రెండు హిందూ దేశాలను సృష్టించాలనుకుంటోంది. చిట్టగాంగ్‌ను ఆక్రమించుకోవాలని వారనుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ బంగ్లాదేశ్ చిన్న, పేద దేశమని చెప్తారు. కానీ బంగ్లాదేశ్ బలమైన ఉదారవాద దేశం. మా సైన్యం చిన్నదైనప్పటికీ 1971లో మేం శిక్షణలేకుండా పోరాడామన్న సంగతిని భారత్ గుర్తుంచుకోవాలి. ఇరవై కోట్ల బంగ్లాదేశ్ ప్రజలంతా సైనికులే'' అని బీఎన్‌పీ స్టాండింగ్ కమిటీ సభ్యులు మిర్జా అబ్బాస్ గత ఏడాది డిసెంబరులో వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం
''ఈ సంవత్సరం కూడా మా ప్రజలు ఆయుధాలతో పనిలేకుండా నియంత హసీనాను పదవి నుంచి తొలగించారు. బంగ్లాదేశ్‌కు విముక్తి కల్పించామని రాహుల్ గాంధీ చెబుతుంటారు. కానీ బంగ్లాదేశ్‌ను భారత్ ఏర్పాటుచేయలేదు. మాకు మేమే విముక్తి పొందాం. మా కోసం కాదు, స్వలాభంకోసం పాకిస్తాన్‌ను భారత్ విభజించింది'' అని మిర్జా అబ్బాస్ అన్నారు.
షేక్ హసీనా అధికారం కోల్పోయిన దగ్గరినుంచి భారత్‌పై దాడిని తీవ్రతరం చేసింది బీఎన్‌పీ.
''షేక్ హసీనాను పదవి నుంచి తొలగించడాన్ని భారత్ జీర్ణించుకోలేకపోతోంది. భారత్‌లోని అధికారపార్టీ, దాని మిత్రపక్షాలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయి. బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకోవడం, మా సార్వభౌమత్వానికి, స్వేచ్ఛకు వ్యతిరేకం'' అని గత ఏడాది డిసెంబరు 1న బీఎన్‌పీ జాయింట్ సెక్రటరీ జనరల్ రుహుల్ కబీర్ రిజ్వీ అన్నారు.
1971 యుద్ధాన్ని భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం అనుకోవాలా లేక బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం అనుకోవాలా?
భారత్‌తో యుద్ధంగా పాకిస్తాన్ దాన్ని చెబుతుంది. బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంగా పాకిస్తాన్ భావించదు. భారత్‌లోని పాఠ్యపుస్తకాల్లో కూడా భారత్, పాకిస్తాన్ యుద్ధంగానే చెబుతారు. అయితే బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం అని పిలవడానికి భారత్‌కు ఎలాంటి అభ్యంతరముండదు. అయినప్పటికీ ఇది వివాదాస్పదమైన అంశం.
భారత్‌తో దౌత్యసంబంధాలకు 50ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2021 డిసెంబరు 6న బంగ్లాదేశ్ విదేశాంగమంత్రి డాక్టర్ అబ్దుల్ ఏకే మోమెన్ బంగ్లాదేశ్ జాతీయ ప్రెస్ క్లబ్‌లో ఒక కార్యక్రమం ఏర్పాటుచేసి తమ పార్టీ వైఖరి ప్రకటించారు.
''బంగ్లాదేశ్ విముక్తి యుద్ధాన్ని భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధంగా చిత్రీకరించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. కానీ అది బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం. భారత్ దానికి సహకారం మాత్రమే అందించింది. డిసెంబరు 6న బంగ్లాదేశ్‌ను భారత్ సార్వభౌమదేశంగా గుర్తించింది'' అని మోమెన్ అన్నారు.
పశ్చిమ సరిహద్దుపై పాకిస్తాన్ దాడి చేయడంతో 1971 యుద్ధం మొదలయింది. తర్వాత అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ యుద్ధానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














