జార్జియా: మొదటి ప్రపంచ యుద్ధంలో వాడిన ప్రమాదకర రసాయనాన్ని నిరసనకారులపై ప్రయోగించారా?- బీబీసీ పరిశోధన

    • రచయిత, మాక్స్ హడ్సన్, ఓనా మారోసికో, సారా బక్లీ
    • హోదా, బీబీసీ ఐ ఇన్వెస్టిగేషన్స్
జార్జియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలో పాల్గొన్న నిరసనకారులపై వాటర్ కెనాన్‌ ప్రయోగం

ఫొటో సోర్స్, Shutterstock

ఫొటో క్యాప్షన్, జార్జియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు

జార్జియాలో గత ఏడాది ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులను చెదరగొట్టడానికి మొదటి ప్రపంచ యుద్ధం కాలం నాటి రసాయన ఆయుధాన్ని అధికారులు ఉపయోగించారని బీబీసీ సేకరించిన ఆధారాలు సూచిస్తున్నాయి.

"ఆ నీరు పడినప్పుడు మండుతున్నట్లుగా అనిపించింది'' అని జార్జియా రాజధాని టిబిలీసి వీధుల్లో తనపై, ఇతరులపై ప్రయోగించిన జల ఫిరంగుల (వాటర్ కేనన్) గురించి నిరసనకారులలో ఒకరు చెప్పారు.

మండుతున్నట్లు అనిపించిన చోట నుంచి ఆ నీటిని వెంటనే తొలగించడమూ సాధ్యం కాలేదని ఆయన అన్నారు.

యూరోపియన్ యూనియన్‌లో జార్జియా చేరేందుకు సంబంధించిన బిడ్‌ను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపేయడాన్ని వ్యతిరేకిస్తూ ఈ ప్రదర్శనలు జరిగాయి.

ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్న తమకు శ్వాస ఆడకపోవడం, దగ్గు, వారాల తరబడి వాంతులు కొనసాగాయని నిరసనకారులు ఫిర్యాదు చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

ఫొటో సోర్స్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
వాటర్ కేనన్

ఫొటో సోర్స్, Gela Khasaia

ఫొటో క్యాప్షన్, వాటర్ కేనన్ ప్రయోగించిన తర్వాత తన చర్మం మండుతున్నట్లుగా అనిపించిందని గేలా ఖసాయా చెప్పారు.

‘కేమైట్’ మళ్లీ వాడకంలోకి తెచ్చారా?

బీబీసీ వరల్డ్ సర్వీస్.. రసాయన ఆయుధ నిపుణులు, జార్జియా పోలీసుల్లో కొందరు విజిల్ బ్లోయర్స్, డాక్టర్లతో మాట్లాడి కొన్ని ఆధారాలు సేకరించింది.

ఫ్రెంచ్ సైన్యం కేమైట్ అని పేరు పెట్టిన ఒక కెమికల్ ఏజెంట్‌ను జార్జియా అధికారులు ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులపై ప్రయోగించినట్లు ఆ ఆధారాలు సూచిస్తున్నాయి.

అయితే, జార్జియా అధికారులు మా పరిశోధన ఫలితాలను "అసంబద్ధం" అని పేర్కొన్నారు. అంతేకాదు.. ‘క్రూరమైన నేరస్థులు పాల్పడిన చట్టవ్యతిరేక చర్యలకు’ ప్రతిస్పందనగా తమ పోలీసులు చట్టప్రకారం వ్యవహరించారని చెప్పారు.

మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఫ్రాన్స్ 'కేమైట్‌'ను జర్మనీకి వ్యతిరేకంగా ఉపయోగించింది.

అయితే, అనంతర కాలంలో కేమైట్ వినియోగానికి సంబంధించి పెద్దగా సమాచారం అందుబాటులో లేదు.

దాని దీర్ఘకాలిక ప్రభావాలపై ఉన్న ఆందోళనల కారణంగా 1930లలో కేమైట్‌ను వినియోగం నుంచి తప్పించినట్లు భావిస్తున్నారు.

దానికి ప్రత్యామ్నాయంగా సీఎస్ గ్యాస్‌(దీన్నే టియర్ గ్యాస్ అని పిలుస్తారు)ను ఉపయోగిస్తున్నారు.

2024 నవంబర్ 28న జార్జియాలో నిరసనలు ప్రారంభమయ్యాయి. నిరసనలు మొదలైన తొలి వారంలో టిబిలీసిలోని జార్జియా పార్లమెంట్ వెలుపల గుమిగూడిన వారిలో కాన్‌స్టాంటైన్ చాఖునాష్విలి ఒకరు.

యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో సభ్యత్వానికి సంబంధించిన చర్చలను నిలిపివేస్తున్నట్లు అధికార పార్టీ ప్రకటించడంతో ప్రదర్శనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈయూ సభ్యత్వం లక్ష్యమని జార్జియా రాజ్యాంగంలో పొందుపరిచి ఉంది.

డాక్టర్ కాన్‌స్టాంటైన్ చాఖునాష్విలి
ఫొటో క్యాప్షన్, డాక్టర్ కాన్‌స్టాంటైన్ చాఖునాష్విలి

నిరసనకారులందరిలో ఒకే తరహా లక్షణాలు...

జార్జియా పోలీసులు అల్లర్ల నియంత్రణకు వాటర్ కేనన్, పెప్పర్ స్ప్రే, సీఎస్ గ్యాస్ ప్రయోగం సహా వివిధ రకాలుగా చర్యలు తీసుకున్నారు.

చిన్న పిల్లల వైద్యుడు డాక్టర్ కాన్‌స్టాంటైన్ చాఖునాష్విలి కూడా నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. వాటర్ కేనన్‌లను ప్రయోగించినప్పుడు తన చర్మం రోజుల తరబడి మండుతున్నట్లు అనిపించిందని, ఆ మంటను తగ్గించలేమని ఆయన చెప్పారు.

"దాన్ని కడగడానికి ప్రయత్నించినప్పుడు అది మరింత దారుణంగా ఉండేది" అని ఆయన అన్నారు.

దీంతో.. తనలా ఇంకెవరైనా ఇలాంటి ప్రభావాలను ఎదుర్కొన్నారేమో తెలుసుకోవడానికి డాక్టర్ చాఖునాష్విలి ప్రయత్నించారు.

నిరసనలు మొదలైన తొలివారంలో అందులో పాల్గొన్నవారు దీనిపై స్పందించాలని ఆయన సోషల్ మీడియాలో కోరారు. అందుకోసం ఆయన ఒక సర్వేే ఫాం అందుబాటులో ఉంచి అది నింపాలని కోరారు.

దాదాపు 350 మంది స్పందించారు. వారిలో సుమారు సగం మంది తాము 30 రోజులకు పైగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ దుష్ప్రభావాలను ఎదుర్కొన్నామని వెల్లడించారు.

తలనొప్పి, అలసట, దగ్గు, శ్వాస ఆడకపోవడం, వాంతులు వంటి లక్షణాలతో బాధపడినట్లు చాలామంది చెప్పారు.

అప్పటి నుంచి అధ్యయనం చేసి ఆయన రూపొందించిన నివేదికను నిపుణులు సమీక్షించిన తర్వాత అంతర్జాతీయ జర్నల్ టాక్సికాలజీ రిపోర్ట్స్‌లో ప్రచురణ కోసం ఆమోదం పొందింది.

డాక్టర్ చాఖునాష్విలి సర్వే చేసిన వారిలో 69 మందిని ఆయన పరీక్షించారు. 'గుండెలోని ఎలక్ట్రిక్ సిగ్నల్స్‌లో అసాధారణ తీరు తీవ్రంగా ఉన్నట్లు గుర్తించారు.

ఆ వాటర్ కేనన్‌లో రసాయనం కలిపి ఉండవచ్చనే అభిప్రాయాన్ని స్థానిక జర్నలిస్టులు, వైద్యులు, పౌర హక్కుల సంస్థలు వ్యక్తంచేశారని డాక్టర్ చాఖునాష్విలి తన నివేదికలో పేర్కొన్నారు.

వాటర్ కేనన్‌లో ఏం ఉపయోగించారో గుర్తించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు, కానీ పోలీసులకు బాధ్యత వహించే అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అందుకు నిరాకరించింది.

అల్లర్ల నియంత్రణకు పనిచేసే జార్జియా పోలీస్ విభాగాన్ని అధికారికంగా 'స్పెషల్ టాస్క్ డిపార్ట్‌మెంట్‌' అంటారు. ఈ విభాగంలో ఉన్నత స్థాయిలో ఉన్న కొందరు విజిల్‌బ్లోయర్‌లు ఈ రసాయనం ఏమై ఉండొచ్చనేది నిర్ధరించడానికి బీబీసీకి సహాయపడ్డారు.

ఆ విభాగానికి చెందిన ఆయుధ తయారీ శాఖ మాజీ అధిపతి లాషా షెర్గెలాష్విలి స్పందిస్తూ.. 2009లో వాటర్ కేనన్‌లో ఉపయోగించడానికి పరీక్షించాలంటూ తనకు ఓ రసాయన సమ్మేళనం ఇచ్చారని.. అది కూడా ఇదేనని భావిస్తున్నానని చెప్పారు.

ఆ రసాయన ప్రభావాలు తాను అంతకుముందు అనుభవించిన అలాంటి రసాయనాలన్నిటికంటే భిన్నంగా ఉందని లాషా షెర్గెలాష్విలి చెప్పారు. ఆ రసాయనాన్ని స్ప్రే చేసిన ప్రదేశానికి దగ్గరగా నిలబడిన తర్వాత తనకు శ్వాస తీసుకోవడం కష్టమైందని ఆయన చెప్పారు.

"సాధారణ టియర్ గ్యాస్‌లా దీని ప్రభావం తొందరగా తగ్గడం లేదని మేం గమనించాం. మేం నీటితో ముఖం కడుక్కున్న తర్వాత, ఆపై ముందుగానే తయారుచేసిన బేకింగ్ సోడా, నీటితో కూడిన ప్రత్యేక ద్రావణంతో మా ముఖాలను కడిగినప్పటికీ, మేం సులభంగా శ్వాస తీసుకోలేకపోయాం'' అని చెప్పారు.

తన పరీక్షల ఫలితంగా, ఆ రసాయనాన్ని వాడకూడదని తాను సిఫార్సు చేశానని షెర్గెలాష్విలి చెప్పారు.

అయితే వాటర్ కేనన్ వాహనాల్లో అది నింపారని.. తాను ఉద్యోగం విడిచిపెట్టి దేశం విడిచివెళ్లిపోయిన 2002 సంవత్సరం వరకు అదే పరిస్థితి కొనసాగిందని అన్నారు.

యుక్రెయిన్‌లోని తన కొత్త నివాసం నుంచి ఆయన మాట్లాడుతూ.. నిరుడు జరిగిన నిరసనల ఫుటేజ్‌లను చూసినప్పుడు, ప్రదర్శనకారులు అదే రసాయనానికి గురవుతున్నారని తాను వెంటనే అనుమానించానని లాషా షెర్గెలాష్విలి బీబీసీతో చెప్పారు.

తాను టచ్‌లో ఉన్న, ఇప్పటికీ పోస్ట్‌లో ఉన్న కొందరు సహోద్యోగులు కూడా ఇదే విషయం తనకు చెప్పారని ఆయన వెల్లడించారు.

లాషా షెర్గెలాష్విలి

ఫొటో సోర్స్, Lasha Shergelashvili

ఫొటో క్యాప్షన్, లాషా షెర్గెలాష్విలి

గత కొన్నేళ్లుగా కేమైట్ వినియోగిస్తున్నట్లు అనుమానాలు

మరో మాజీ ఉన్నత స్థాయి పోలీసు అధికారితో బీబీసీ మాట్లాడింది. షెర్గెలాష్విలి పదవిలో ఉన్నప్పుడు వాటర్ కేనన్ వాహనాల్లో ఏ సమ్మేళనం నింపారో, 2024 నవంబర్-డిసెంబర్ నిరసనలలో ఉపయోగించింది కూడా అదే సమ్మేళనం అని ఆయన నిర్ధరించారు.

తాను పరీక్షించిన ఆ ఉత్పత్తి, కేవలం సీఎస్ గ్యాస్ (ఇది కళ్లు, చర్మం, శ్వాసకోశ వ్యవస్థను ఇబ్బంది పెడుతుంది, కానీ తాత్కాలికంగా మాత్రమే) కావచ్చునా అని షెర్గెలాష్విలిని అడిగినప్పుడు, అది దానికంటే చాలా బలంగా ఉన్నట్లు అనిపించిందని ఆయన చెప్పారు.

"నేను వేరే దేనితోనూ దీన్ని పోల్చలేను" అని ఆయన అన్నారు.

ఇది సంప్రదాయ అల్లర్ల నియంత్రణ ఏజెంట్ల కంటే 10 రెట్లు బలంగా ఉందని చెప్పారు.

"ఉదాహరణకు, ఈ రసాయనాన్ని నేలపై పోస్తే, మీరు దానిని నీటితో కడిగినా కూడా తర్వాత రెండు మూడు రోజుల వరకూ ఆ ప్రాంతంలో ఉండలేరు" అని షెర్గెలాష్విలి వివరించారు.

తనను పరీక్షించమని అడిగిన రసాయనం పేరు తెలియదని ఆయన చెప్పారు.

కానీ, 2019 డిసెంబర్ నాటి స్పెషల్ టాస్క్ డిపార్ట్‌మెంట్ వస్తువుల జాబితా కాపీని బీబీసీ పొందగలిగింది.

అందులో రెండు పేరులేని రసాయనాలు ఉన్నట్లు మేం గుర్తించాం. వీటిని "కెమికల్ లిక్విడ్ UN1710", "కెమికల్ పౌడర్ UN3439" అని జాబితాలో నమోదుచేశారు. వాటిని ఎలా కలపాలి అనే సూచనలను కూడా ఇచ్చారు.

ఈ జాబితా నిజమైనదో కాదో మేం తనిఖీ చేయాలనుకున్నాం, మేం దానిని మరొక మాజీ ఉన్నత స్థాయి పోలీసు అధికారికి చూపించాం. అతను అది నిజమైందిగా అనిపిస్తుందని చెప్పారు. ఈ పేరులేని రెండు రసాయనాలే వాటర్ కేనన్‌లో కలిపి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

UN1710 ను గుర్తించడం సులభం. ఎందుకంటే ఇది ట్రైక్లోరోఎథిలీన్ (టీసీఈ) అనే ద్రావకం కోడ్. ఇది ఇతర రసాయనాలను నీటిలో కరిగించడానికి సహాయపడే ఒక ద్రావకం. అయితే.. దీన్ని ఏ రసాయనాన్ని కరిగించడానికి వాడుతున్నారో తెలుసుకోవాలనుకున్నాం.

UN3439ను గుర్తించడం చాలా కష్టమైంది, ఎందుకంటే ఇది వివిధ రకాల పారిశ్రామిక రసాయనాల కోసం ఉపయోగించే ఒక సమగ్ర కోడ్‌. ఆ రసాయనాలన్నీ ప్రమాదకరమైనవి.

అల్లర్ల నియంత్రణలో ఏజెంట్‌గా ఉపయోగించినట్లు మేం కనుగొన్న ఏకైక రసాయనం బ్రోమోబెంజైల్ సైనైడ్ ఆ పారిశ్రామిక రసాయనాలలో ఉంది. దీనిని కేమైట్ అని కూడా పిలుస్తారు. దీనిని మొదటి ప్రపంచ యుద్ధంలో ఉపయోగించడానికి మిత్రరాజ్యాలు అభివృద్ధి చేశాయి.

నిరసనకారులపై ఉపయోగించిన ఏజెంట్ కేమైట్ అయ్యే అవకాశం ఉందా లేదా అని మా దగ్గర ఉన్న ఆధారాలను బట్టి అంచనా వేయడానికి , ప్రపంచంలోనే ప్రముఖ టాక్సికాలజీ, రసాయన ఆయుధాల నిపుణుడు ప్రొఫెసర్ క్రిస్టోఫర్ హోల్‌స్టెజ్‌ను మేం అడిగాం.

గత ఏడాది నవంబరులో జార్జియా పార్లమెంటు భవనం బయట గుమిగూడిన జనం

ఫొటో సోర్స్, Shutterstock

ఫొటో క్యాప్షన్, గత ఏడాది నవంబరులో జార్జియా పార్లమెంటు భవనం బయట గుమిగూడిన జనం

‘అది చాలా ప్రమాదకరం’

డాక్టర్ చాఖునాష్విలి అధ్యయనం ఫలితాలు, బాధితుల సాక్ష్యం, పోలీసుల వద్ద ఉన్న వస్తువుల జాబితా, షెర్గెలాష్విలి రసాయన పరీక్షల నివేదిక ఫలితాల ఆధారంగా కేమైట్ ఉపయోగించారనే అభిప్రాయాన్ని ప్రొఫెసర్ హోల్‌స్టెజ్ కూడా వ్యక్తంచేశారు.

''అందుబాటులో ఉన్న ఆధారాలను బట్టి, బ్రోమోబెంజైల్ సైనైడ్‌ ప్రభావానికిలోనైనవారు, ఇతర సాక్షులు నివేదించిన క్లినికల్ ఫలితాలు దానికి అనుగుణంగా ఉన్నాయి'' అని చెప్పారు.

సాధారణంగా అల్లర్ల నియంత్రణలో వాడే సీఎస్ గ్యాస్ (దీన్ని కూడా గత సంవత్సరం జార్జియా అల్లర్ల నియంత్రణ పోలీసులు ఉపయోగించారు) కారణంగా ఈ లక్షణాలు వచ్చే అవకాశాన్ని ఆయన తోసిపుచ్చారు.

"ఆధునిక సమాజంలో కేమైట్ ఉపయోగించడాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. కేమైట్ చికాకు తెప్పిస్తుంది, అది దీర్ఘకాలం ఉంటుంది."

అది బలమైన నిరోధక శక్తిగా పనిచేస్తుంది కాబట్టి దానిని ఉపయోగించి ఉంటారని ఆయన ఊహించారు.

"ఇది ప్రజలను చాలా కాలం దూరంగా ఉంచుతుంది. వారు తమను తాము బాగుచేసుకోలేరు. వారు ఆసుపత్రికి వెళ్లవలసి ఉంటుంది. వారు ఆ ప్రాంతం వదిలి వెళ్లవలసి ఉంటుంది. ఒకవేళ నిజంగా అదే జరిగితే, ఈ రసాయనాన్ని తిరిగి తీసుకొస్తే, అది అత్యంత ప్రమాదకరమైనది" అని చెప్పారు.

మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికన్ పోలీసులు కేమైట్‌ను కొంతకాలం అల్లర్ల నియంత్రణ ఏజెంట్‌గా ఉపయోగించారు. కానీ, సీఎస్ గ్యాస్ వంటి సురక్షితమైన ప్రత్యామ్నాయాలు కనుగొన్న తర్వాత దానిని వినియోగించడం మానేశారు.

అంతర్జాతీయ చట్టాల ప్రకారం.. పోలీసు దళాలు రసాయనాలను జనసమూహ నియంత్రణ ఏజెంట్లుగా ఉపయోగించవచ్చు. అయితే, వాటి ప్రభావం స్వల్పకాలం మాత్రమే ఉండాలి.

మా పరిశోధన ఫలితాలు ఆందోళనకరంగా ఉన్నాయని ఐక్యరాజ్యసమితి ప్రత్యేక రిపోర్టర్ ఆలిస్ ఎడ్వర్డ్స్ అన్నారు. నిరసనల సమయంలో పోలీసు హింస, హింస ఆరోపణలకు సంబంధించి ఆమె గతంలో జార్జియా ప్రభుత్వానికి లేఖ రాశారు.

ఐక్యరాజ్యసమితి ప్రత్యేక రిపోర్టర్ ఆలిస్ ఎడ్వర్డ్స్
ఫొటో క్యాప్షన్, ఐక్యరాజ్యసమితి ప్రత్యేక రిపోర్టర్ ఆలిస్ ఎడ్వర్డ్స్

'ఇది పూర్తిగా మానవ హక్కుల ఉల్లంఘనే...'

వాటర్ కేనన్‌లో రసాయనాల వాడకంపై కఠినమైన నియంత్రణ లేకపోవడం అనేది పరిష్కరించాలని కోరుకుంటున్న సమస్య అని ఆలిస్ ఎడ్వర్డ్స్ చెప్పారు. "ప్రజలను ఎప్పుడూ ప్రయోగాలకు గురిచేయకూడదు. ఇది పూర్తిగా మానవ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించడమే" అన్నారు.

అంతర్జాతీయ చట్టం ప్రకారం, అల్లర్ల నియంత్రణకు చేపట్టే చర్యల ప్రభావం ఏదైనా తాత్కాలికంగా ఉండాలని ఆమె చెప్పారు. అయితే, జార్జియాలో ప్రయోగించిన వాటి లక్షణాలు అంతకు మించి ఉన్నాయి, కాబట్టి ఆ కేసులన్నీ హింస లేదా ఇతర దుర్వినియోగం కింద దర్యాప్తు చేయాలి అని చెప్పారు.

జార్జియా అధికారులు మా పరిశోధన ఫలితాలను "ఏమాత్రం విలువ లేనివి", "అసంబద్ధమైనవి" అని ఆరోపించారు.

కాగా.. ప్రభుత్వం జరిమానాలు, జైలు శిక్షలను పెంచినప్పటి నుంచి టిబిలీసిలోని రుస్తావేలి అవెన్యూలో నిరసనలు తగ్గలేదు.

ఎన్నికలలో రిగ్గింగ్ చేసిన ప్రభుత్వం రాజీనామా చేయాలని, రష్యా ప్రయోజనాలకు మద్దతు ఇస్తోందని, పౌర సమాజానికి వ్యతిరేకంగా కఠినమైన చట్టాలను ఆమోదిస్తోందని ఆరోపిస్తూ గత ఏడాది దాదాపు ప్రతి రాత్రి అక్కడ నిరసన ప్రదర్శనలు జరిగాయి.

ప్రభుత్వం కానీ, పార్టీ గౌరవాధ్యక్షులు బిడ్జినా ఇవానిష్విలి రష్యన్ అనుకూలురు కాదని, రష్యా ప్రయోజనాలకు మద్దతు ఇవ్వలేదని అధికార జార్జియన్ డ్రీమ్ పార్టీ ఖండించింది. గత సంవత్సరంలో చేసిన చట్టపరమైన మార్పులు ప్రజాసంక్షేమానికి సంబంధించి ఉత్తమ ప్రయోజనాలకు వీలు కల్పించాయని అది బీబీసీకి తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)