అమెరికా శాంతి ఒప్పందంపై యుక్రెయిన్, రష్యా ఏమన్నాయి?

ఫొటో సోర్స్, PA Media
- రచయిత, లారా గోజీ, ఒట్టీలీ మిషెల్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
రష్యాతో యుద్ధం ముగింపు లక్ష్యంగా రూపొందిన శాంతి ఒప్పందంపై అమెరికాతో 'ప్రాథమిక అవగాహన' కుదిరినట్లు యుక్రెయిన్ తెలిపింది.
అమెరికా, యుక్రెయిన్ అధికారులు జెనీవాలో జరిపిన చర్చల అనంతరం.. అమెరికా యుక్రెయిన్‌కు అందజేసిన 28 అంశాల ప్రణాళిక ఆధారంగా ఈ ఒప్పందం రూపొందింది.
"ఇరువైపుల నుంచి వచ్చిన అదనపు సూచనలతో దీనిని మెరుగ్గా రూపొందించారు" అని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపారు.
వచ్చే వారం మాస్కోలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలవాలని తన ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్‌ను ఆదేశించానని, అలాగే అమెరికా ఆర్మీ సెక్రటరీ డాన్ డ్రిస్కాల్ యుక్రెయిన్ నేతలను కలవనున్నట్లు ఆయన చెప్పారు.


ఫొటో సోర్స్, Reuters
యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ మంగళవారం మాట్లాడుతూ, ట్రంప్‌తో సమావేశమై 'సున్నితమైన అంశాల'పై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
ఈ నెలాఖరులోపు సమావేశం జరగాలని ఆయన ప్రభుత్వం కోరుకుంటోంది.
"మున్ముందు కూడా అమెరికా వైపు నుంచి, ట్రంప్ నుంచి కూడా ఇలాగే సహకారం కొనసాగుతుందని ఆశిస్తున్నా. చాలా విషయాలు అమెరికాపైనే ఆధారపడి ఉన్నాయి, ఎందుకంటే రష్యా అమెరికా బలానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది" అని ఆయన అన్నారు.
దీనికి ఒకరోజు ముందు, 28 అంశాల ప్రణాళికలోని కొన్ని నిబంధనలను తొలగించినట్లు జెలియెన్‌స్కీ చెప్పారు.
"త్వరలో ఇరుదేశాల అధ్యక్షులు జెలియెన్‌స్కీ, పుతిన్‌లతో సమావేశం కోసం ఎదురుచూస్తున్నానని, కానీ అది ఈ యుద్ధ ముగింపు ఒప్పందం చివర్లో లేదా చివరి దశలో మాత్రమే" అని ట్రంప్ ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో రాశారు.
ఆ తర్వాత, విలేఖరులతో మాట్లాడుతూ, ఈ ఒప్పందంలో "రెండు విధాలు"గా భూ రాయితీలు ఉంటాయని, "బోర్డర్‌ను స్పష్టం చేయడానికి ప్రయత్నం" జరుగుతుందని అన్నారు.
ఇరుపక్షాలకూ ఎలాంటి గడువు తేదీ ఇవ్వలేదని, "నాకైతే అది ముగిసే సమయమే తుదిగడువు" అని ట్రంప్ అన్నారు.

ఫొటో సోర్స్, EPA
ఒప్పందం కొత్త ముసాయిదాపై ఇంకా సంప్రదింపులు జరపలేదని రష్యా ఇంతకుముందు చెప్పింది. అయితే, ఒప్పందంలో సవరణలకు అంగీకరించకపోవచ్చని గత వారం హెచ్చరించింది.
రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మాట్లాడుతూ, అమెరికా మొదట ప్రతిపాదించిన ఒప్పందానికి రష్యా అనుకూలంగా ఉన్నప్పటికీ.. అందులో భారీ మార్పులు జరిగితే మాత్రం పరిస్థితి "భిన్నంగా" ఉంటుందని అన్నారు.
కొత్త ప్రణాళికకు సంబంధించిన కాపీ మంగళవారం ఉదయం నాటికి రష్యాకు ఇంకా అందలేదన్న లావ్రోవ్.. అమెరికా శాంతి యత్నాలను యూరప్ దెబ్బతీస్తోందని ఆరోపించారు.
డ్రిస్కాల్, రష్యా ప్రతినిధులు సోమ, మంగళవారాల్లో అబుదాబిలో భేటీ అయినప్పటికీ.. రష్యా అభ్యంతరాలను అమెరికా ప్రతినిధులు బహిరంగపరచలేదు.
రష్యా, యుక్రెయిన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న కొన్ని అంశాలపై ఇంకా ఒక పరిష్కారానికి రానట్లు సమాచారం.
యుక్రెయిన్‌కు భద్రతా హామీలు, యుద్ధం జరుగుతున్న తూర్పు యుక్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాల నియంత్రణ వంటివి వీటిలో ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఈ శాంతి ఒప్పందంపై వైట్‌హౌస్ ఆశాజనకంగా ఉన్నప్పటికీ, దాదాపు నాలుగేళ్ల యుద్దం తర్వాత శాంతి సాధ్యమేనా? అని యూరోపియన్ నాయకులు సందేహిస్తున్నట్లు అనిపిస్తోంది. "కాల్పుల విరమణకు రష్యా సుముఖంగా ఉన్నట్లు లేదు" అని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ అనగా, "ఇంకా చాలా ఉంది.. చాలా సవాళ్లున్నాయి" అని యూకే హెచ్చరించింది.
యూకే ప్రధాన మంత్రి సర్ కీర్ స్టార్మర్, మేక్రాన్‌ల అధ్యక్షతన మంగళవారం.. ' కోయెలిషన్ ఆఫ్ ది విల్లింగ్' పేరిట యుక్రెయిన్ మిత్రదేశాల సమావేశం జరిగింది. కాల్పుల విరమణ జరిగినా యుక్రెయిన్‌కు రక్షణ సాయం కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేసిన ఈ గ్రూప్, శాంతి నెలకొల్పేందుకు భద్రతా దళం ఏర్పాటుపై కూడా ప్రాథమికంగా చర్చలు జరిపింది.
ఈ సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా పాల్గొన్నారు. అమెరికాతో కలిసి ఒక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసేందుకు సమావేశంలో పాల్గొన్న నేతలు అంగీకరించారు. యుక్రెయిన్‌కు ఇవ్వగలిగే భద్రతా హామీలపై కార్యాచరణను వేగవంతం చేయడం ఈ టాస్క్‌ఫోర్స్ లక్ష్యం.
రష్యా, యుక్రెయిన్ విభేదిస్తున్న వాటిలో ఈ భద్రతాపరమైన హామీల అంశం కూడా ఒకటి. రష్యా స్వాధీనం చేసుకున్న భూభాగానికి అధికారిక గుర్తింపు ఇవ్వాలని పుతిన్ డిమాండ్ చేయడమే ఈ శాంతి ఒప్పందాన్ని అడ్డుకుంటున్న "ప్రధానమైన అంశం" అని జెలియెన్‌స్కీ సోమవారం అన్నారు.
డొనెట్స్క్, లుహాన్స్క్‌తో సహా తూర్పు డాన్‌బాస్ ప్రాంతం నుంచి యుక్రెయిన్ పూర్తిగా వెనక్కి వెళ్లిపోవాలని రష్యా డిమాండ్ చేస్తూ వస్తోంది. 2014లో స్వాధీనం చేసుకున్న క్రైమియన్ ద్వీపకల్పాన్ని కూడా రష్యా దళాలు నియంత్రిస్తున్నాయి. దానితో పాటు ఖేర్సన్, జపోరిజ్జియా అనే రెండు ప్రాంతాల్లోని భారీ భూభాగాలు కూడా రష్యా ఆధీనంలోనే ఉన్నాయి.

కొద్దివారాల పాటు దౌత్య ప్రయత్నాలు నిలిచిపోయినట్లు కనిపించినా.. అమెరికా మద్దతుతో రూపొందిన శాంతి ఒప్పందం ముసాయిదా లీక్ అయినప్పటి నుంచి మళ్లీ కార్యకలాపాలు ఊపందుకున్నాయి.
అసలు ముసాయిదాలో.. తన నియంత్రణలో ఉన్న ప్రాంతాలను వదులుకునేందుకు యుక్రెయిన్ అంగీకరించడం, నాటోలో చేరనని మాటివ్వడం, అలాగే తన సాయుధ బలగాల పరిమాణాన్ని తగ్గించుకోవడం వంటివి ఉన్నాయి. ఇవి రష్యా డిమాండ్లను ప్రతిబింబిస్తున్నాయి.
ఈ ముసాయిదాపై స్పందిస్తూ, ఇది ఒక ఒప్పందానికి ఆధారం కావొచ్చని పుతిన్ పేర్కొన్నారు.
అయితే, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ స్పందిస్తూ, అమెరికాను యుక్రెయిన్‌కు భాగస్వామిగా కొనసాగించాలా? లేదా తన గౌరవాన్ని కాపాడుకోవాలా? అనే ప్రశ్న ఎదురవుతుందని అన్నారు. యూరోపియన్ నాయకులు కూడా ముసాయిదాలోని పలు అంశాలను వ్యతిరేకించారు.
అమెరికన్, యూరోపియన్, యుక్రెయిన్ అధికారులు ఈ ప్లాన్‌పై ఆదివారం జెనీవాలో చర్చలు జరిపారు. దీనికి ముందు రోజు, ఈ ప్రణాళిక అమెరికా రూపొందించినదని విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రత్యేకంగా చెప్పాల్సి వచ్చింది.
ఎందుకంటే, కొంతమంది సెనేటర్లు ఇది వాస్తవానికి రష్యా ముసాయిదా అని, వైట్‌హౌస్ రూపొందించింది కాదని ఆయన చెప్పినట్లు ఆరోపించారు.
ఆ తర్వాత.. అమెరికా, యుక్రెయిన్ రెండూ ఈ ముసాయిదాలో మార్పులను స్వాగతించాయి. సవరణల అనంతరం, ఇది "సరైన మార్గాన్ని" సూచిస్తోందని జెలియెన్‌స్కీ పేర్కొన్నారు.
ఈ ప్లాన్‌ను త్వరగా ఆమోదించాలని మొదట ట్రంప్ యుక్రెయిన్‌ను ఒత్తిడి చేసినప్పటికీ, ఆ తర్వాత మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ ముసాయిదా "కేవలం ఒక రూట్ మ్యాప్" మాత్రమేనని, "అది పక్కా ప్లాన్ కాదు, అదొక కాన్పెస్ట్" అని అన్నారు.
మంగళవారం, బ్లూమ్‌బర్గ్ ఒక ట్రాన్‌స్క్రిప్ట్‌ను ప్రచురించింది. అది అక్టోబర్ 14న జరిగిన ఫోన్ కాల్ సంభాషణగా పేర్కొంది. అందులో ట్రంప్ ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, పుతిన్ విదేశాంగ విధాన సలహాదారు యురి ఉషకోవ్ మాట్లాడుతున్నట్లుగా ఉంది.
రష్యా ట్రంప్‌ను ఎలా సంప్రదించాలి, శాంతి ఒప్పందం కోసం యుక్రెయిన్ తన భూభాగాన్ని వదులుకోవాల్సి ఉంటుందంటూ విట్కాఫ్ చర్చించినట్లు చెబుతున్న ట్రాన్‌స్క్రిప్ట్ గురించి ట్రంప్ మాట్లాడుతూ, "ఇవి ప్రాథమిక చర్చలు మాత్రమే" అని అన్నారు. అయితే, ఈ కాల్ లీక్‌ను బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














