'మహిళగా యుద్ధ క్షేత్రంలో జీవితం ఎలా ఉంటుందోనని భయంగా ఉంది'

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, ఎమిలియా జాన్సన్, అన్నా హోలిగాన్
- హోదా, బీబీసీ గ్లోబల్ విమెన్
డెన్మార్క్‌లో 18 ఏళ్లు వచ్చిన ప్రతి మహిళా ఏప్రిల్ 1 నుంచి.. మిలిటరీ అసెస్‌మెంట్ సెంటర్‌కు వెళ్లి,లాటరీ తరహాలో అక్కడున్న డ్రమ్ నుంచి ఒక నెంబర్ తీయాలి.
ఆ తర్వాత, ఎప్పుడైనా సైనిక సేవలో స్వచ్ఛంద సేవకులు తగ్గితే, ఆమె నెంబర్‌ను పిలుస్తారు. ఈ నెంబర్ ఎంత తక్కువుంటే, అంత ఎక్కువగా ఆమెను నిర్బంధ సైనిక సేవకు పిలిచే అవకాశం ఉంటుంది.
డెన్మార్క్ ఎప్పుడూ సైన్యంలో పురుషుల సేవలనే వాడేది. కానీ, ఇప్పుడు తొలిసారి మహిళలను కూడా దీనిలో భాగం చేస్తోంది. లాటరీ విధానంలో వీరు పాల్గొనాలి. యుక్రెయిన్‌పై రష్యా పూర్తి స్థాయి ఆక్రమణ ప్రారంభించిన రెండేళ్ల తర్వాత 2024లో మహిళలు తప్పనిసరిగా సైనిక సేవ చేయాలని డెన్మార్క్ నిర్ణయించింది.
నార్వే, స్వీడన్ ఇప్పటికే ఈ చర్యలు తీసుకున్నాయి. గత పదేళ్లలో సరిపడా స్థాయిలో స్వచ్ఛంద సేవకులు ఉండేవారు. ఎవరినీ బలవంతంగా సైన్యంలో చేర్చుకునేవారు కాదు. కానీ, సైనిక సేవల కోసం మరింత మంది యువత కావాలని డెన్మార్క్ కోరుకుంటోంది. ఇది రాబోయే ఏళ్లల్లో పరిస్థితిని మార్చవచ్చు.
నిర్బంధ సైనిక సేవపై డెన్మార్క్ యువతుల్లో మిశ్రమ స్పందనలు ఉన్నాయి.
''నేను చనిపోవాలనుకోవడం లేదు. పీటీఎస్‌డీ (పోస్టు ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్) నాకొద్దు. మహిళగా యుద్ధ క్షేత్రంలో జీవితం ఎలా ఉంటుందోనని భయంగా ఉంది'' అని ఇసబెల్లా అన్నారు. మరో నాలుగేళ్లలో ప్రభుత్వం రూపొందించిన ముసాయిదాకు ఆమె అర్హురాలు.
''ప్రధానంగా పురుషులు మాత్రమే చేయగలిగేదిగా భావించిన ఒక దానిలో మమ్మల్ని కూడా చేర్చడం బావుంది'' అని మిలిటరీ అసెస్‌మెంట్ సెంటర్ వద్ద సైన్యానికి స్వచ్ఛంద సేవ చేస్తున్న 19 ఏళ్ల సారా అన్నారు. 1998 నుంచి డెన్మార్క్‌లోని మహిళలు సైన్యంలో చేరేందుకు అవకాశం ఉంది. గత ఏడాది సైనిక సేవను పూర్తి చేసుకున్న వారిలో పావు వంతు మహిళలే ఉన్నారు.

స్త్రీ,పురుషులకు సమాన హక్కులు
పురుషులా, స్త్రీలా అనే దానితో సంబంధం లేకుండా నిర్బంధ సైనిక సేవల్లో చేర్చుకునే విధానాన్ని యూరప్‌లో ప్రవేశపెట్టిన తొలి దేశం నార్వే. పౌరులందరికీ ఒకే రకమైన హక్కులు, బాధ్యతలు ఉండాలని నమ్ముతూ 2013లో ఈ నిర్ణయం తీసుకుంది.
క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకున్న తర్వాత నార్వే మార్గాన్ని స్వీడన్ అనుసరిస్తూ 2017లో ఆ దేశం కూడా ఈ నిర్ణయం తీసుకుంది. 2020లో నెదర్లాండ్స్ పురుషులు, స్త్రీలు తప్పనిసరిగా సైనిక సేవలో పాల్గొనేందుకు ఒక చట్టాన్ని ఆమోదించింది. కానీ ఇది స్వచ్ఛందమే.
రష్యా స్వాధీనం చేసుకునే అవకాశమున్న తదుపరి దేశాలుగా చెబుతున్న బాల్టిక్ దేశాలు (ఎస్టోనియా, లాత్వియా,లిథువేనియా)లు మహిళలను సైన్యంలో చేర్చుకోవడంపై ఇటీవల చర్చను ప్రారంభించాయి.
'' యుక్రెయిన్‌పై రష్యా ఆక్రమణతో నెలకొన్న 2022 పరిణామాలు ఈ చర్చలను పక్కకు మళ్లించాయి'' అని ఎస్టోనియన్ మిలటరీ అకాడమీ రీసర్చర్ ఎలెరి లిల్లెమే చెప్పారు. ''ఇది ఎవరూ ఊహించనది అనుకుంటున్నా'' అన్నారు.
సైనిక సేవల్లో మహిళలను తప్పనిసరి చేయడాన్ని 2028లో మొదలు పెట్టనున్నామని లాత్వియా రక్షణ మంత్రి ఆండ్రిస్ స్ప్రడ్స్ అన్నారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయని చెప్పారు.
'' ఎందుకంటే, మేం ఆక్రమణ స్వభామున్న దేశం పక్కనే నివసిస్తున్నాం. మా సమగ్రమైన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేశ రక్షణలో, భద్రతలో పౌరులందరికీ సమాన హక్కులు, బాధ్యతలు ఉంటాయని నిర్ధరించుకోవాలి. అందుకే, సూత్రప్రాయంగా లింగ తటస్థ విధానానికి (జెండర్ న్యూట్రల్ అప్రోచ్‌కు) ఓ మంత్రిగా మద్దతు ఇస్తాను'' అన్నారు.

ఫొటో సోర్స్, MADS CLAUS RASMUSSEN/Ritzau Scanpix/AFP via Getty Images
పునరుత్పత్తి రేటు తగ్గుతోంది..
అయితే యువత సంఖ్య కుంచించుకుపోవడం కూడా సైనికసేవలకు వారిని పిలవడం సమస్యగా మారుతోంది. 20 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న లాత్వియా దేశంలో ప్రతి చిన్నారినీ లెక్కిస్తారు.
లాత్వియాలో పునరుత్పత్తి రేటు – మహిళకు జన్మించే సగటు పిల్లల సంఖ్య 1.36కు పడిపోయింది. ఈ రేటు 2.1 వద్ద ఉంటే జనాభా స్థిరంగా ఉంటుంది. ఇతర బాల్టిక్ దేశాల్లో కూడా ఇదే ధోరణి కొనసాగుతోంది. ఎస్తోనియాలో 1.31, లిథువేనియాలో 1.18గా ఉంది.
గణాంకాల పరంగా చూసుకుంటే బాల్టిక్ దేశాల్లో మహిళలు సైన్యంలో చేరడం అనివార్యమవుతుందని ఎలెరి లిల్లెమే అన్నారు.
''2040లో సమస్య వస్తుంది. ఎందుకంటే, జననాల రేటు గత రెండు, మూడేళ్లలో నెమ్మదించింది. ఒకవేళ అప్పటికి కూడా ఇదే రకమైన భద్రతా పరిస్థితులు ఉంటే, సరిపడా ప్రజలు ఉండరు'' అని ఆమె చెప్పారు. తన మాతృభూమి ఎస్తోనియాను ఆమె ఉదాహరించారు.
ప్రస్తుతం ఎస్తోనియాలో అర్హులైన యువకుల్లో దాదాపు 40 శాతం మందిని, శారీరకంగా అత్యంత దృఢంగా ఉన్న అభ్యర్థులను ఎంపిక చేయడం ద్వారా సైనిక సేవకు తీసుకుంటోంది.
అయితే, 2040 నాటికి వారు ఇదే సంఖ్యలో సైనికులను కొనసాగించాలనుకుంటే, అర్హులైన యువకులందరిలో దాదాపు 90 శాతం మందిని సైనిక సేవకు తీసుకోవాల్సి వస్తుంది.లిథువేనియాలో మహిళలను సైన్యంలో చేర్చుకునే అంశంపై బహిరంగంగానే చర్చిస్తుంది. లాత్వియాలో రాజకీయ నేతలు ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నారు.
ఫిన్‌లాండ్ మాదిరి, మూడు బాల్టిక్ దేశాలు పురుషులకు సైనిక సేవను తప్పనిసరి చేశాయి. అలాగే, మహిళలు ఈ సేవల్లో పాల్గొనాలా వద్దా అనే దాన్ని వారు ఎంపిక చేసుకోవచ్చు.
రష్యాకు చెందిన కాలినిన్‌గ్రాడ్ సరిహద్దుల్లో ఉండే పోలాండ్, 2026 నుంచి పురుషులందరికీ సైనిక శిక్షణను పున: ప్రవేశపెట్టే యోచనలో ఉంది. మహిళలు కూడా స్వచ్ఛందంగా ఈ శిక్షణలో పాల్గొనవచ్చని చెప్పింది.

ఫొటో సోర్స్, Reuters
యుక్రెయిన్ ఉదాహరణ
ఎలెరి లిల్లేమే చెప్పిన ప్రకారం.. యుక్రెయిన్‌లో యుద్ధం మహిళలను పోరాటానికి సిద్ధం చేయాల్సిన ప్రాధాన్యాన్ని తెలియజేసింది. సాయుధ బలగాల్లో 70 వేల మందికి పైగా సేవలందిస్తున్నారని, వారిలో యుద్ధక్షేత్రంలో 5 వేల మంది ఉన్నట్లు యుక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
''దేశం క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు సైనిక సేవలో మహిళల అవసరమెంత? ప్రతి ఒక్కరూ తమ సహకారాన్ని ఎలా అందించాలో వారు ఉదాహరణగా నిలిచారు'' అని లిల్లేమే చెప్పారు.యుక్రెయిన్‌లో సైనిక సిబ్బంది కొరత ఉన్నప్పటికీ, మహిళలు తప్పనిసరిగా సైనిక సేవలో పాల్గొనాలని ఏ రాజకీయ నేతా పిలవలేదు.
యుక్రెయిన్‌లో యుద్ధం యూరప్ రక్షణలో నేటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) కీలక పాత్రను తెలియజేసింది. అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ నుంచి వచ్చిన కొంత ఒత్తిడితో నేటో సభ్యులు ఈ వేసవిలో హేగ్‌లో జరిగిన సదస్సులో రక్షణ వ్యయాల పెంపుకు అంగీకరించారు.
అయితే, తమని తాము రక్షించుకునేందుకు అమెరికాపై ఇక పూర్తిగా ఆధారపడలేమని యూరోపియన్ దేశాలకు తెలుసు. అవి తప్పనిసరిగా స్వయం సమృద్ధిగా మారాలి.
2026లో స్వచ్ఛంద సైనిక సేవలను ప్రవేశపెట్టేందుకు జర్మనీ ప్రస్తుతం ప్రతిపాదనలపై చర్చలు జరుపుతోంది. అలాగే, ఏదైనా యుద్ధంలో పోరాడేందుకు తన సైన్యాన్ని మరింత సన్నద్ధం చేసేందుకు ఫ్రాన్స్ ప్రస్తుతం స్వచ్ఛంద సైనిక సేవ కార్యక్రమాన్ని పునరుద్ధరించాలని యోచిస్తోంది.
సైనిక సేవల స్వభావాలు ఒక్కో దేశానికి ఒక్కోలా ఉంటాయి.
తప్పనిసరి సైనిక సేవలకు ప్రజల నుంచి వచ్చే మద్దతు కూడా భిన్నంగా ఉంటుంది.
యూరోపియన్ కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ 2025 మే నెలలో నిర్వహించిన పోల్‌లో.. తప్పనిసరి సైనిక సేవలను తిరిగి ప్రవేశపెట్టడానికి ఫ్రాన్స్, జర్మనీ, పోలాండ్‌లోని ఎక్కువ మంది ప్రజలు బలంగా మద్దతు ఇచ్చారు, మద్దతు ఇచ్చేందుకు మొగ్గు చూపారు. మహిళలు తప్పనిసరిగా సైనిక సేవల్లో పాల్గొనాలని డెన్మార్క్ ప్రకటించినప్పుడు, ఆ దేశంలోని ప్రతిపక్షం మూగబోయింది. కానీ, బాల్టిక్ దేశాల్లో నిర్వహించిన పోల్స్‌లో ఈ ప్రతిపాదనకు కొంత మద్దతు మాత్రమే లభించినట్లు వెల్లడైంది.

ఫొటో సోర్స్, Norwegian Defence Ministry
మహిళల భద్రత
మరో సమస్య మౌలిక సదుపాయాలు. అకస్మాత్తుగా ఎక్కువ నియామకాలు చేపడితే నిర్వహించగలిగే సామర్థ్యం చాలా ఆర్మీలకు లేదు. బరాక్‌లు నిర్మించాల్సి ఉంది. శిక్షకులను సిద్ధం చేయాలి.
కొత్త యూనిఫామ్‌లు, రక్‌సాక్‌లు కొనుగోలు చేయాలి. పురుషుల కోసం డిజైన్ చేసిన స్టాండర్డ్ కిట్ మహిళల శరీరానికి సరిపోదు.
సైనిక సంస్కృతిపై కూడా పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మిలిటరీలు మహిళలకు సురక్షితమైన ప్రదేశాలేనా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.
''డానిష్ మహిళా నిపుణులకు చెందిన సంస్థలతో మేం సమావేశాలు నిర్వహించాం. వారు చెబుతున్న దాని ప్రకారం.. డానిష్ మిలటరీలో (డెన్మార్క్ సైన్యంలో) మహిళలు పనిచేయడం అంత తేలిక కాదని తెలుస్తుంది. ఇబ్బందికరమైన వాతావరణంలో పలు సమస్యలను వారు ఎదుర్కోవాలి'' అని డానిష్ విమెన్ సొసైటీ చైర్ లూయిస్ వింటర్ అలిస్ చెప్పారు.
డానిష్ సైన్యంలోని 20.3 శాతం మంది మహిళలు గత 12 నెలల్లో అనవసరమైన లైంగిక దృష్టిని , వేధింపులను ఎదుర్కొన్నట్లు 2023లో డెన్మార్క్ రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
ఈ వేధింపులను నిర్మూలించేందుకు తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నామని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
మరోవైపు బాల్టిక్ దేశాల గురించి చూసుకుంటే.. లాత్వియన్ సైన్యంలో ప్రస్తుతం వలంటీర్లుగా కొనసాగుతోన్న మహిళలకు (మొత్తం సైన్య సిబ్బందిలో 18 శాతం) లేదా భవిష్యత్‌లో తప్పనిసరి అయి దీనిలో చేరాల్సి వచ్చిన వారికి ఇది ప్రమాదకరమైన ప్రదేశం కాదని ఆండ్రిస్ స్ప్రడ్స్ విశ్వాసం వ్యక్తం చేశారు.
మహిళలను నిర్బంధంగా సైన్యంలో చేర్చుకోవడం అంతర్జాతీయంగా చాలా అరుదు. 2019లో ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదికలో.. ఇజ్రాయెల్, ఉత్తర కొరియాలో, ఆఫ్రికా దేశాల్లో కనీసం నాలుగు దేశాలు ఎరిత్రియా, మాలి, మొరాకో, తునీషియాలో సార్వత్రిక సైనిక సేవ అమల్లో ఉంది.
యూరప్‌లో చాలా వరకు నిర్బంధ సైనిక సేవ గురించి ముఖ్యంగా మహిళలు సైన్యంలో చేరడంపై అకస్మాత్తుగా తెరపైకి వచ్చింది. అయినప్పటికీ, అనుకున్నంత వేగంగా ఇది సాగడం లేదని ఎలెరి లిల్లేమే చెప్పారు.
''డెన్మార్క్ చాలా వేగంగా నిర్ణయం తీసుకుంది. ఆశ్చర్యకరమైన రీతిలో ఇది చర్యలు తీసుకుంది. చాలా ఇతర దేశాల్లో, దీని గురించి చాలా చర్చలు జరిగాయి. కానీ, ఎటువంటి చర్యలు లేవు'' అని తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














