కిమ్ జోంగ్ ఉన్: చైనా పర్యటనలో ఆయన కూర్చున్న కుర్చీని, బల్లను, తాకిన ప్రతీ వస్తువును ఎందుకు క్లీన్ చేశారు?

చైనాలో కిమ్ జోంగ్ ఉన్, పుతిన్‌తో సమావేశం అయ్యారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చైనాలో కిమ్ జోంగ్ ఉన్, పుతిన్‌తో సమావేశం అయ్యారు
    • రచయిత, భరత్ శర్మ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

చైనా రాజధాని బీజింగ్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్, ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ మధ్య ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో వీళ్లిద్దరు మాట్లాడుకున్న అంశాలు బాగా చర్చనీయం అయ్యాయి. అయితే సమావేశం తర్వాత జరిగిన ఒక సంఘటన అంతకన్నా పెద్ద డిస్కషన్ పాయింట్‌గా మారింది.

సమావేశం తర్వాత ఇద్దరు నేతలు అక్కడి నుంచి బయల్దేరగానే, ఉత్తర కొరియా సిబ్బంది కిమ్ జోంగ్ ఉన్ కూర్చున్న కుర్చీ దగ్గరకు వెళ్లారు.

వాళ్ల చేతుల్లో ఒక వస్త్రం ఉంది. కిమ్ జోంగ్ ఉన్ తాకిన ప్రతీ వస్తువును తుడవటమే వారి పని. అలాగే కిమ్ జోంగ్ ఉన్ కూర్చున్న కుర్చీని కూడా వారు ఆ వస్త్రంతో చాలా జాగ్రత్తగా శుభ్రం చేశారు.

కానీ, ఎందుకు?

''ఉత్తర కొరియా నాయకుడి భద్రతా చర్యల్లో ఇది కూడా భాగం. ఇలా చేయడం వల్ల విదేశీ లేదా శత్రుదేశాల గూఢచారుల ప్రయత్నాలను అడ్డుకోవచ్చు’’ అని విశ్లేషకులు భావిస్తున్నారంటూ రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
చైనాలో పుతిన్, కిమ్ జోంగ్ ఉన్

ఫొటో సోర్స్, Getty Images

ఆ వీడియోలో ఏం కనిపించింది?

రష్యా రిపోర్టర్ అలెగ్జాండర్ యునాషెవ్, టెలిగ్రామ్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు.

పుతిన్, కిమ్ జోంగ్ ఉన్ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన గదిని ఉత్తరకొరియాకు చెందిన ఇద్దరు వ్యక్తులు శుభ్రం చేస్తున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తుంది. కిమ్ కూర్చున్న కుర్చీ బ్యాక్‌రెస్ట్, చేతులు పెట్టుకున్న ఆర్మ్‌రెస్ట్‌లను వారు శుభ్రం చేయడం వీడియోలో చూడొచ్చు.

కిమ్ కుర్చీ పక్కన ఉన్న బల్లను శుభ్రం చేసి, దానిపై ఉన్న గ్లాసును కూడా తీసేశారు.

చర్చలన్నీ ముగిసిన తర్వాత, ఉత్తర కొరియా నాయకుడితో వచ్చిన సిబ్బంది, కిమ్ జోంగ్ ఉన్ ఉనికికి సంబంధించిన అన్ని ఆధారాలను చాలా జాగ్రత్తగా నాశనం చేశారని ఆ రిపోర్టర్ పేర్కొన్నారు.

కిమ్ జోంగ్ ఉన్ ప్రత్యేక రైలు

ఫొటో సోర్స్, Disney via Getty Images

రైలులో టాయ్‌లెట్‌ను కూడా ప్యాక్ చేసి తెచ్చారా?

గత విదేశీ పర్యటనల తరహాలోనే ఈసారి కూడా ఆకుపచ్చ రైలులో కిమ్ జోంగ్ ఉన్ ఉపయోగించే ప్రత్యేక టాయ్‌లెట్‌ను ప్యాక్ చేసి చైనాకు తీసుకొచ్చినట్లుగా దక్షిణ కొరియా, జపాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను ఉటంకిస్తూ జపాన్ వార్తాపత్రిక నిక్కీ పేర్కొంది.

కిమ్ జోంగ్ ఉన్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ కాలం నుంచే ఈ రకమైన భద్రతా చర్యలు ఉత్తర కొరియా ప్రామాణిక ప్రోటోకాల్‌లో భాగంగా ఉన్నాయని అమెరికాలోని స్టిమ్సన్ సెంటర్‌లో ఉత్తర కొరియా లీడర్‌షిప్ ఎక్స్‌పర్ట్ మైకేల్ మాడెన్ అన్నారు.

''ఈ ప్రత్యేక టాయ్‌లెట్, మలం, చెత్త, సిగరెట్ పీకలను ఉంచే చెత్త సంచులను తెచ్చారు. ఏ విదేశీ గూఢచార సంస్థ అయినా వాటి నమూనాలను సేకరించి పరిశోధించకుండా నిరోధించడానికి ఇలా చేస్తారు. ఈ వ్యర్థాల ద్వారా కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యం, వైద్య స్థితిగతుల గురించిన ఏదో ఒక సమాచారం పొందవచ్చు. ఇందులో వెంట్రుకలు, చర్మం అవశేషాలు కూడా ఉంటాయి'' అని రాయిటర్స్‌కు మైకేల్ వివరించారు.

తమ నాయకులకు సంబంధించిన సమాచారాన్ని ఉత్తర కొరియా బయటికి ఎందుకు రానివ్వదు అనే ప్రశ్నకు దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో కొరియన్ లాంగ్వేజ్ అండ్ స్టడీస్ ప్రొఫెసర్‌గా పనిచేసి రిటైర్ అయిన వైజయంతీ రాఘవన్ సమాధానం చెప్పారు.

‘‘ఉత్తర కొరియా నిగూఢ దేశం. తమ పాలకుడికి సంబంధించిన ఎలాంటి సమాచారం బయటకు తెలియడానికి ఇష్టపడదు. ఈ సమాచారం వారికి చాలా ముఖ్యమైనది. ఆయన తినే ఆహారం మొదలుకొని మలమూత్రాల వరకు ఏ సమాచారాన్ని కూడా ఎవరి చేతికి అందనీయరు. కిమ్ జోంగ్ ఉన్ అనుసరించే రాజకీయాలు, వారి దేశ విధానాల కారణంగా దేశం లోపల, బయట నుంచి కొన్ని ప్రమాదాల భయం ఎప్పుడూ ఉంటుంది. అందుకే వారు ఇతర దేశాలకు కూడా సొంత రైలులోనే వెళతారు’’ అని చెప్పారు.

డీఎన్‌ఏ

ఫొటో సోర్స్, Getty Images

డీఎన్‌ఏ అంటే..

కిమ్ జోంగ్ ఉన్ డీఎన్‌ఏ నమూనాలను ఎవరు సేకరించకుండా ఉండేందుకే ఆయన తాకిన ప్రతీ వస్తువును శుభ్రం చేస్తున్నారని మీడియా నివేదికలు చెబుతున్నాయి. అసలు డీఎన్‌ఏ అంటే ఏంటి? అది ఎందుకు అంత ముఖ్యమైనది?

డీఎన్‌ఏ పూర్తి పేరు డీఆక్సీరైబోన్యూక్లిక్ యాసిడ్. ఇది ఒక జెనెటిక్ కోడ్. ఇది జన్యువులను తయారు చేస్తుంది. ఈ జన్యువులు ఏ జీవికైనా ప్రత్యేక గుర్తింపు ఇస్తాయి. ఇది రెండు పొడవైన పోగులతో కూడిన ఒక రసాయనం. ఇది సర్పిలాకారంలో ఉంటుంది.

డీఎన్‌ఏలో జన్యు సమాచారం ఉంటుంది. దీన్నే జెనెటిక్ కోడ్ అని పిలుస్తారు. ఫలదీకరణం సమయంలో తల్లిదండ్రుల నుంచి ఈ డీఎన్‌ఏ పిల్లలకు బదిలీ అవుతుంది.

డీఎన్‌ఏ ప్రాముఖ్యత

డీఎన్‌ఏను నిపుణులు 'జీవితపు బ్లూప్రింట్' అని పిలుస్తారు. మనుషుల వేలిముద్రలు ఎలా వేర్వేరుగా ఉంటాయో, అలాగే ప్రతీ వ్యక్తి డీఎన్‌ఏ కూడా భిన్నంగా ఉంటుంది.

ప్రతి మనిషిలో మూడు బిలియన్లకు పైగా విభిన్న డీఎన్‌ఏ బేస్‌ పెయిర్స్ ఉంటాయి. ఐడెంటికల్ ట్విన్స్ (కవలలు)కు తప్ప, ప్రతీ వ్యక్తి డీఎన్‌ఏ వేరేగా ఉంటుంది. కవలల డీఎన్‌ఏ ఒకేలా ఉంటుంది.

మాములు మాటల్లో చెప్పాలంటే డీఎన్‌ఏ అనేది కొన్ని లక్షణాలను ఒక తరం నుంచి మరో తరానికి అందిస్తుందని దిల్లీ యూనివర్సిటీ బయోటెక్నాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ హరేన్ రామ్ అన్నారు.

మన కళ్ళ రంగు, జుట్టు రంగు వంటివన్నీ డీఎన్‌ఏనే నిర్ణయిస్తుందని తెలిపారు.

మానవుల వెంట్రుకల కుదుళ్లు, చర్మ కణాలు, లాలాజలం నుంచి కూడా డీఎన్‌ఏ సేకరించవచ్చు. అందుకే కిమ్ డీఎన్‌ఏ ఎవరి చేతికి చేరకుండా ఉండేందుకు ఆయన కూర్చున్న కుర్చీ మొదలుకుని ప్రతీది శుభ్రం చేశారు.

పుతిన్, కిమ్ జోంగ్ ఉన్

ఫొటో సోర్స్, Getty Images

డీఎన్‌ఏను కాపాడటానికి ఎందుకింత ఆరాటం?

ఎవరి వద్దనైనా ఒక వ్యక్తి డీఎన్‌ఏ ఉంటే, ఆ వ్యక్తికి ఏదైనా జన్యుపరమైన వ్యాధి ఉందో లేదో తెలుసుకోవచ్చని డాక్టర్ సియారి చెప్పారు. ఒకవేళ వారి కుటుంబంలో ఏదైనా వ్యాధి తరతరాలుగా వస్తున్నట్లయితే అది కూడా డీఎన్‌ఏతో తెలుసుకోవచ్చని తెలిపారు.

''దీనితో పాటు, శరీరంలో ఏదైనా మందు లేదా యాంటీబయాటిక్‌కు రియాక్షన్ ఉందా అనే సమాచారం కూడా రాబట్టవచ్చు. డీఎన్‌ఏ ద్వారా కుటుంబం గురించి, కుటుంబంలో వస్తున్న జన్యుపరమైన వ్యాధులు, లోపాల సమాచారం తెలుసుకోవచ్చు''అని వివరించారు.

కిమ్ జోంగ్ ఉన్ బృందం, ఆయన ఉపయోగించిన తర్వాత మాత్రమే కాకుండా, ఆయన ఉపయోగించడానికి ముందు కూడా ప్రతీ వస్తువును చాలా జాగ్రత్తగా శుభ్రం చేస్తుంది.

2018లో దక్షిణ కొరియా అధ్యక్షుడితో సమావేశమప్పుడు, 2023లో రష్యా అధ్యక్షుడితో సమావేశమైన సమయంలో కూడా ఆయన బృందం కుర్చీని స్ప్రేతో శుభ్రం చేయడం, మెటల్ డిటెక్టర్‌తో స్కాన్ చేయడం కనిపించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)