అలక్‌నందా: భారతీయులు కనుగొన్న కొత్త గెలాక్సీ పేరు ఇదే..

నాసా

ఫొటో సోర్స్, NASA/ESA/CSA, I. Labbe/R. Bezanson/Alyssa Pagan (STScI), Rashi Jain/Yogesh Wadadekar (NCRA-TIFR)

    • రచయిత, ప్రాచీ కులకర్ణి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

విశ్వం తొలి కాలం నుంచి ఉన్న, పాలపుంతను (మిల్కీవే) పోలిన సర్పిలాకార గెలాక్సీని భారత ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

గెలాక్సీలు ఎలా పరిణామం చెందాయనే దానిపై ప్రస్తుతం మనకున్న అవగాహనను ఈ సరికొత్త ఆవిష్కరణ పూర్తిగా మార్చేసింది.

నాసా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌ను వాడుతూ ఈ పరిశోధనను నిర్వహించారు. ఈ పరిశోధనకు పీహెచ్‌డీ విద్యార్థి రాశి జైన్ నేతృత్వం వహించారు.

పుణె‌లోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లోని నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్‌లో పనిచేసే ప్రొఫెసర్ యోగేశ్ వడదేకర్ మార్గదర్శకత్వం వహించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

వీరి పరిశోధన ప్రముఖ యూరప్ ఖగోళ జర్నల్ 'ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్'లో ప్రచురితమైంది.

గెలాక్సీలు గురుత్వాకర్షణ శక్తితో నక్షత్రాలు, గ్రహాలు, వాయువు, ధూళి కణాల కలయికతో ఏర్పడిన అతిపెద్ద వ్యవస్థలు. వీటిలో వేల నుంచి లక్షల కొద్ది నక్షత్రాలు ఉంటాయి. ఇవి సర్పిలాకారం, దీర్ఘవృత్తాకారం లేదా క్రమరహిత ఆకారంలో ఉండొచ్చు.

గంగా నదికి చెందిన రెండు ప్రధాన ఉపనదుల్లోని హిమాలయాల నుంచి ప్రవహించే అలక్‌నందా నది పేరునే ఈ గెలాక్సీకి పెట్టారు పరిశోధకులు.

ఇది 12 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న సర్పిలాకార గెలాక్సీ. అంటే, కాంతి అక్కడి నుంచి భూమిని చేరుకునేందుకు 1200 కోట్ల ఏళ్లకు పైగా ప్రయాణించాల్సి ఉంటుంది.

''మనం ఈ గెలాక్సీని బిగ్ బ్యాంగ్ తర్వాత 1500 కోట్ల ఏళ్ల కిందట ఎలా ఉండేదో అలా చూస్తున్నాం. అప్పటి కాలంలో చక్కగా ఏర్పడిన సర్పిలాకార గెలాక్సీ కనుక్కోవడం నిజంగా అద్భుతం. మనం అనుకున్న దానికంటే చాలా ముందుగానే విశ్వంలో సంక్లిష్ట నిర్మాణాలు ఏర్పడుతున్నట్లు ఇది మనకు చెబుతోంది'' అని రాశి జైన్ చెప్పారు.

రాశి జైన్

ఫొటో సోర్స్, RASHI JAIN

ఫొటో క్యాప్షన్, రాశి జైన్ నేతృత్వంలో జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా కనుగొన్న ఆవిష్కరణ

కాస్మిక్ పవర్ హౌస్

అలక్‌నంద ను ఒక గెలాక్సీ మాదిరిగా కాకుండా.. ప్రభావంతమైన కాస్మిక్ పవర్ సెంటర్‌గా పరిశోధనా బృందం చూస్తోంది.

ఈ గెలాక్సీ మన సూర్యుడికంటే 1000 కోట్ల రెట్లు ఎక్కువ ద్రవ్యరాశితో ఉంది. అలక్‌నంద ప్రతి ఏడాది కొత్త నక్షత్రాలను ఏర్పాటు చేస్తోంది. మన గెలాక్సీలో ప్రస్తుతం ఏర్పడుతున్న నక్షత్రాల రేటు కంటే 20 నుంచి 30 రెట్లు వేగంగా అక్కడ నక్షత్రాలు ఏర్పడుతున్నాయి.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. దీని సర్పిలాకార నిర్మాణం. ఈ గెలాక్సీ రెండు భుజాలతో (ఆర్మ్స్‌తో) ఒక ప్రకాశవంతమైన ఉబ్బెత్తును చుట్టేసినట్లు కనిపిస్తుంది.

భూమి నుంచి చాలా దూరంలో ఇది ఉంది. కానీ, గురుత్వాకర్షణ దీని వెలుతురును మరింత పెంచింది. దీనివల్ల, ఖగోళ శాస్త్రవేత్తలు మరింత స్పష్టంగా అలక్‌నందను చూడగలిగారు.

''మన గెలాక్సీకి చెందిన హిందీ పేరు మందాకిని. అందుకే, మేం ఈ గెలాక్సీకి అలక్‌నంద అనే పేరు పెట్టాం'' అని రాశి జైన్ చెప్పారు.

యోగేశ్ వడదేకర్

ఫొటో సోర్స్, Yogesh Wadadekar

ఫొటో క్యాప్షన్, ప్రొఫెసర్ యోగేశ్ వడదేకర్ గైడెన్స్ కింద అలక్‌నంద గెలాక్సీని కనుగొన్న రాశి జైన్

భిన్నమైన వాదనను పైకి తెచ్చిన అలక్‌నంద

జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఏర్పాటు చేయడానికి ముందు, విశ్వం ప్రారంభంలో ఈ గెలాక్సీలు అస్తవ్యస్థంగా, వికృతంగా ఉన్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు ఊహించారు. విశ్వానికి వందల ఏళ్ల వయసు దాటాకనే స్థిరమైన సర్పిలాకార నిర్మాణాలు ఏర్పడినట్లు భావించారు.

ప్రారంభంలో గెలాక్సీలు చాలా వేడిగా, అల్లకల్లోలంగా ఉండేవని ఒక ఫేమస్ థియరీ పేర్కొంది. ఇవి చల్లబడి, సర్పిలాకారంలోకి మారేందుకు సమయం పట్టిందని తెలిపింది.

అయితే, ''అలక్‌నంద దీనికి భిన్నమైన స్టోరీని తెలియజేసింది'' అని వడదేకర్ చెప్పారు.

ఈ గెలాక్సీ వెయ్యి కోట్ల సౌర ద్రవ్యరాశి కలిగిన నక్షత్రాలను పోగు చేయడంతో పాటు, సర్పిలాకార భుజాలు (స్పైరల్ ఆర్మ్స్) ఉన్న ఒక పెద్ద డిస్క్‌ను నిర్మించగలిగింది. కాస్మిక్ స్టాండర్డ్స్ ప్రకారం, ఈ ప్రక్రియ అంతా అద్భుతమైన వేగంతో జరిగింది" అని తెలిపారు.

చాలా వరకు గెలాక్సీలు వెయ్యి కోట్ల నుంచి 13 వందల కోట్ల సంవత్సరాల నాటివి. అంటే సుమారు విశ్వం ఆవిర్భవించిన కాలం నాటివే.

ఈ విస్తారమైన విశ్వ కాలక్రమంలో అలక్‌నంద ఆవిష్కరణ చాలా ప్రత్యేకమైనది.

ఖగోళ శాస్త్రవేత్తలు ప్రస్తుతం రెండు ప్రధాన అవకాశాలపై అధ్యయనం చేస్తున్నారు.

ఒకటి.. గెలాక్సీల డిస్క్‌ల గుండా ప్రయాణించే సాంద్రతా తరంగాలు సర్పిలాకార నమూనాను సృష్టించి, అలా మెయింటైన్ చేసి ఉండొచ్చు.

మరో సిద్ధాంతం.. చిన్న గెలాక్సీలకు దగ్గర్లో అల్లకల్లోలం ఏర్పడి సర్పిలాకార నమూనాలు ఏర్పడి ఉండొచ్చు. అయితే, ఈ ఆర్మ్స్ సాధారణంగా కొంత కాలానికే ఏర్పడి ఉంటాయి.

అయితే, మరో అంశం అలక్‌నంద ఏర్పాటుకు చెందిన సంక్లిష్టతను తెలియజేస్తోంది. ఎలాంటి బలమైన విలీనాల ద్వారా కాకుండా ఆకస్మికంగా ఇది ఏర్పడి ఉండొచ్చని ఆధారాలు సూచిస్తున్నాయి.

60 కోట్ల ఏళ్ల కాలంలోనే తన నక్షత్రాలను అలక్‌నంద ఎలా ఏర్పాటు చేసిందో అర్థం చేసుకోవడమే అసలైన సవాలు.

ఈ ప్రక్రియకు ఎన్నో వందల కోట్ల సంవత్సరాలు పడుతుంది.

గెలాక్సీల్లోని స్పైరల్ ఆర్మ్స్ ఏర్పాటు గురించి ఎంతోకాలంగా ఉన్న భావనలు, సిద్ధాంతాలను ఖగోళ శాస్త్రవేత్తలు రివ్యూ చేసుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తోంది.

అలక్‌నందలోని పదార్థాలను పరిశీలించేందుకు, స్పెక్ట్రల్ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ (ఎస్‌ఈడీ) మోడలింగ్‌ను పరిశోధనా బృందం వాడుతోంది. ఈ గెలాక్సీలో కొంత మొత్తం ధూళి ఉందని ఈ పరిశోధన సూచిస్తోంది. ఇది 19 కోట్ల ఏళ్ల కాలం నాటిదని తెలిపింది.

గెలాక్సీ

ఫొటో సోర్స్, NCRA-TIFR

తర్వాత ఏం జరగనుంది?

అలక్‌నంద దూరాన్ని కచ్చితంగా లెక్కించామని, అయితే, అంతర్గత నిర్మాణంపై లోతుగా పరిశోధించాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు.

భవిష్యత్‌లో జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్, అటకామా లార్జ్ మిల్లీమీటర్ అరే (ఏఎల్ఎంఏ) వంటి పరికరాలు ఈ యువ గెలాక్సీ గురించి మరింత తెలుసుకునేందుకు సాయపడనున్నాయని పరిశోధకులు రాశి జైన్, యోగేశ్ వడదేకర్ చెప్పారు.

ఈ పరికరాలు గెలాక్సీ డిస్క్‌ల వేగాన్ని కొలవనున్నాయి. అయితే, స్పైరల్ ఆర్మ్స్‌ను ఏర్పాటు చేసేందుకు డిస్క్ చల్లగా, ప్రశాంతంగా ఉండాలా? లేదా వేడిగా, వేగంగా తిరగాలా? అనే విషయాలను కూడా ఇవి నిర్ధరించగలవు.

''అలక్‌నంద డిస్క్ చల్లగా లేదా వేడిగా ఉండేదో తెలుసుకోవడం ద్వారా దీని స్పైరల్ ఆర్మ్స్ ఎలా ఏర్పడ్డాయో కనుగొనవచ్చు'' అని వడదేకర్ చెప్పారు. విశ్వం ప్రారంభంలో ఇలాంటి గెలాక్సీలు భిన్నమైన మార్గాన్ని ఎలా ఎంచుకున్నాయో కూడా తెలుసుకోగలం.

అలక్‌నంద, విశ్వం ప్రారంభంలోని ఇతర సర్పిలాకార గెలాక్సీలను ఇప్పుడు కనుగొనడం గెలాక్సీలు పరిణతి చెందే విధానంపై ప్రస్తుతం మనకున్న అవగాహనను మరింత అప్‌డేట్ చేసుకోవాల్సి అవసరాన్ని సూచిస్తున్నాయి.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)