వెనెజ్వెలా: తమ అధ్యక్షుడు మదురోను అమెరికా అదుపులోకి తీసుకోవడంపై ఆ దేశ ప్రజలు ఏమంటున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గ్రేస్ ఎలిజా గుడ్‌విన్, క్రిస్టోబల్ వాస్‌క్వెజ్, టామ్ బేట్‌మాన్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
వెనెజ్వెలా అధ్యక్షుడు మదురోను అమెరికా అదుపులోకి తీసుకున్న తర్వాత, రాజధాని నగరం కారకస్‌లో పరిస్థితులు కుదుటపడుతుండగా ఆ దేశ ప్రజలు ఆశ, భయాందోళన, అయోమయ స్థితిలో ఉన్నారు.
కారకస్ వ్యాలీ రాత్రంతా పేలుళ్లతో మార్మోగిన తర్వాత ప్రజలు వీధుల్లోకి వస్తున్నారు. కొందరు సంబరాలు చేసుకుంటుంటే, మరికొందరు మరికొందరు ఈ చర్యను ఖండిస్తున్నారు.
''మదురోను ఇక్కడి నుంచి తీసుకెళ్లినందుకు'' ఇప్పటివరకైతే అమెరికాకు కృతజ్ఞతలు చెబతున్నామని స్థానికురాలు డైనా బీబీసీతో చెప్పారు.
''ఇప్పుడు చీకట్లో నుంచి కాస్త వెలుగు కనిపిస్తున్నట్టు అనిపిస్తోంది'' అని ఆమె వ్యాఖ్యానించారు.
రాజకీయ వాతావరణం ఇంకా ఉద్రిక్తంగానే ఉండడంతో ఆమె తన అసలు పేరు బీబీసీతో చెప్పలేదు.


ఫొటో సోర్స్, Getty Images
కారకస్‌కు సమీపంలో నివసించే మరో స్థానికుడు జార్జ్, ''మద్దతుగా నిలిచిన ట్రంప్‌కు, మొత్తం అమెరికాకు'' కృతజ్ఞతలు చెబుతున్నప్పటికీ, రానున్న రోజులు అంత తేలిగ్గా ఉండవని భయంగా ఉన్నట్లు బీబీసీతో చెప్పారు.
''వాళ్లు ఆయన్ను తీసుకెళ్తున్నారు సరే, ఆ తర్వాత జరిగేదేంటి?" అని జార్జ్ ప్రశ్నిస్తున్నారు. "దానివల్ల కలిగే ప్రయోజనమేంటి? అంతా అయోమయంగా ఉంది. రాబోయే రోజులు ఎలా ఉంటాయో తెలీడం లేదు'' అన్నారు.
తమ నాయకుడిని విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తూ మదురో ప్రభుత్వ మద్దతుదారులు కారకస్ వీధుల్లో ర్యాలీలు చేస్తున్నారు. ప్రభుత్వ విధేయురాలైన కారకస్ మేయర్ కార్మెన్ మెలెండెజ్ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. మదురోను ''కిడ్నాప్ చేశారని'' ఆమె ఆరోపించారు.
కారకస్‌పై వరుస దాడులు చేసి వెనెజ్వెలా అధినేతను అమెరికా అదుపులోకి తీసుకుంది.
మదురో ''నార్కో-టెర్రరిస్ట్'' పాలన సాగిస్తున్నారని అమెరికా ఆరోపించింది. 2024 ఎన్నికల్లో మదురో అక్రమంగా గెలిచారని దేశంలోని ఆయన ప్రత్యర్థులు, పలు దేశాల ప్రభుత్వాలు భావిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Trump/Truth Social
అంతటా భయం, అనిశ్చితి
యునైటెడ్ సోషలిస్ట్ పార్టీకి నేతృత్వం వహిస్తున్న మదురో 2013 నుంచి అధికారంలో ఉన్నారు. ప్రతిపక్షాలను అణచివేయడం, అసంతృప్తిని హింసాత్మకంగా అణగదొక్కడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఆయుధాల ఆరోపణలపై విచారణ జరిపేందుకు మదురో, ఆయన భార్యను న్యూయార్క్ తరలించడంతో వెనెజ్వెలా భవిష్యత్తుపై అస్పష్టత నెలకొంది.
మదురోకు శాశ్వత ప్రత్యామ్నాయం దొరికే వరకు వెనెజ్వెలాను అమెరికానే నడిపిస్తుందని, చమురు నిల్వల నిర్వహణను కూడా చూసుకుంటుందని ట్రంప్ అన్నారు.
డ్రగ్స్ అక్రమ రవాణాలో తనకు ప్రత్యక్షపాత్ర ఉందన్న అమెరికా ఆరోపణలను మదురో గతంలో తిరస్కరించారు.
మదురోను తప్పించడంపై కృతజ్ఞతతో ఉన్నవారిలో సైతం చాలా భయం, అనిశ్చితి నెలకొని ఉందని అనేక మంది వెనెజ్వెలా వాసులు బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
‘మదురోకు వ్యతిరేకంగా మాట్లాడడం ఇప్పటికీ ప్రమాదకరమే’
ట్రంప్‌పై డైనాకు పెద్ద నమ్మకం లేదు.
''ఆయన ఇవాళ ఒకటి చెబుతారు. రేపు మనసు మార్చుకుంటారు. ఆయన మాటలను నేను సీరియస్‌గా తీసుకోవడం లేదు'' అని డైనా ట్రంప్ గురించి వ్యాఖ్యానించారు.
''మదురోను అదుపులోకి తీసుకున్న తర్వాత ట్రంప్ చేసిన ''ఒకే ఒక్క మంచిపని'' వెనెజ్వెలాలో అమెరికా పెట్టుబడులు పెడుతుందని చెప్పడం. సమస్యలతో సతమతమవుతున్న దేశ ఆర్థిక పరిస్థితి దీనివల్ల మెరుగుపడుతుందని ఆశిస్తున్నా'' అని డైనా చెప్పారు.
వెనెజ్వెలాలో ఇప్పటికీ మదురోకు వ్యతిరేకంగా మాట్లాడడం ప్రమాదకరమే. ఎందుకంటే, అమెరికా నౌకల మోహరింపుకు అనుకూలంగా మాట్లాడే వారిని ''దేశద్రోహులుగా'' ప్రకటించే చట్టాన్ని మదురో విధేయుల ఆధిపత్యంలో ఉన్న నేషనల్ అసెంబ్లీ కొద్ది వారాల కిందటే ఆమోదించింది.

ఫొటో సోర్స్, Reuters
వెనెజ్వెలాలో ప్రభుత్వ అనుకూల పారామిలటరీ గ్రూపులైన కలెక్టివోస్‌కు చెందినవారు ఆయుధాలు చేతబూని మోటార్ సైకిళ్లపై వీధుల్లో గర్జిస్తూ అరవడం తాను చూశానని జార్జ్ చెప్పారు.
''ఇప్పుడు బ్రెడ్ కొనుక్కోవడానికి బయటకు వెళ్లాలన్నా కొంచెం భయంగా ఉంది. మనం మంచి రోజుల కోసం కొంచెం వేచిచూడాలి'' అని ఆయన చెప్పారు.
మదురో మిత్రుడు, అంతర్గత వ్యవహారాలు, న్యాయ, శాంతి శాఖల మంత్రి డియెస్‌డాడో కాబెల్లో గురించి జార్జ్ ఆందోళన వ్యక్తం చేశారు.
''ఆయన చాలా దుర్మార్గుడు. కక్షపూరిత వ్యక్తి. ఆయన వెంట ఎంతమంది ఉన్నారో తెలియదు. ఆర్మీ ప్రజల పక్షాన ఉంటే ఆయన నియంత్రణ కాస్త తగ్గుతుంది'' అని జార్జ్ అన్నారు.

ఫొటో సోర్స్, Joe Raedle/Getty
మదురోను తప్పించడాన్ని డైనా, జార్జ్‌లాగే ఉపశమనంగా భావిస్తున్నారు సాండ్రా. కానీ, ఆమె కూడా భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రవాసంలో ఉన్న వెనెజ్వెలా వాసుల సంగతేంటనే అనిశ్చితి ఉందన్నారు.
మదురో అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి దాదాపు 80 లక్షల మంది వెనెజ్వెలా ప్రజలు దేశాన్ని విడిచి వెళ్లారు. వారిలో చాలా మంది మదురోను అమెరికాలో అదుపులోకి తీసుకోవడాన్ని మద్దతిస్తూ తాము నివసిస్తున్న నగరాల్లోని వీధుల్లో బహిరంగంగా సంబరాలు జరుపుకుంటున్నారు.
లక్షల మంది ప్రవాసానికి వెళ్లిపోయారని, అనేక మంది కనిపించకుండా పోయారని, జైలు పాలయ్యారని, చనిపోయారని, జీవచ్ఛవాల్లా బతుకుతున్నారని సాండ్రా చెప్పారు. ''ఇది ఏ దేశమూ పట్టించుకోని నిజమైన విషాదం'' అని ఆమె అన్నారు.
''ఇది ఆరంభం మాత్రమే. మున్ముందు ఇంకా చాలా ఉందని మాకు తెలుసు'' అని సాండ్రా అన్నారు.
''ఈ విషాదాన్ని ఎదుర్కొంటూ వెనెజ్వెలా ప్రజలు చేసిన ఆర్తనాదాలను ఏ దేశమూ దీనికిముందు వినిపించుకోలేదు'' అని ఆమె వ్యాఖ్యానించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














