హన్స్‌రాజ్ ‘వైర్‌లెస్’: లార్డ్ ఇర్విన్‌ను చంపడానికి రైలు కింద బాంబులు పెట్టిన ఈ వ్యక్తి దాదాపు వందేళ్ల కిందటే ఓ గొప్ప ఆవిష్కర్త

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వకార్ ముస్తఫా
- హోదా, జర్నలిస్ట్, రీసెర్చర్
అది 1929 డిసెంబర్ 23 ఉదయం. దట్టమైన పొగమంచు ఆవరించి ఉంది. వైస్రాయ్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా లార్డ్ ఇర్విన్, ఆయన భార్య రైలులో ప్రయాణిస్తున్నారు.
వారు ప్రయాణిస్తున్న స్పెషల్ ట్రైన్ దిల్లీకి ఆరు మైళ్ల (9.6 కి.మీల) దూరంలో ఉండగా దాని మీద బాంబు దాడి జరిగింది.
దక్షిణ భారతదేశం నుంచి దిల్లీకి తిరిగి వస్తున్న సమయంలో ఇర్విన్‌పై బాంబు దాడి జరిగిందని, ఆయన దానినుంచి తృటిలో తప్పించుకున్నారని మరుసటి రోజు 'ది స్టేట్స్‌మన్' పత్రిక కథనం తెలిపింది.
ఈ బాంబు పేలుడును పొగమంచు సమయంలో రైల్వే వాళ్లు ఇచ్చే సిగ్నల్‌గా దీనిని ఇర్విన్ భావించారు.
మరోవైపు ఇది వైస్రాయికి స్వాగతం పలుకుతూ పేల్చిన ఫిరంగి శబ్దమని రైల్లోని ప్రయాణికులు అనుకున్నారు.

‘దేవుడి మహిమ’
అమెరికన్ వార్తా పత్రిక ‘ది న్యూయార్క్ టైమ్స్’ ఈ సంఘటనను "పొగమంచు దేవుడి సృష్టి" అని, దాని వల్లనే ఇర్విన్ దంపతులు ప్రాణాలతో బయటపడ్డారని రాసింది.
పైలట్ ఇంజిన్ హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్‌ను సురక్షితంగా దాటిందని 'ది స్టేట్స్‌మన్' రాసింది.
"13 కోచ్‌లున్న ప్రత్యేక రైలులో మూడో కోచ్ డైనింగ్ కోసం ప్రత్యేకంగా కేటాయించారు. పేలుడు ధాటికి డైనింగ్ కార్, నాలుగో కోచ్ పూర్తిగా దెబ్బ తిన్నాయి. ఇర్విన్ ఉండే కోచ్ వెనుక రెండు కోచ్‌లు ఉన్నాయి. పొగమంచు కారణంగా దాడి చేసిన వారు వైస్రాయ్, లేడీ ఇర్విన్ కోసం కొత్తగా తయారు చేసిన బోగీని గుర్తించలేక పోయారు" అని స్టేట్స్‌మన్ తెలిపింది.
‘‘పేలుడు వల్ల ట్రాక్ మీద కోచ్‌లు ఒకదాని తర్వాత ఒకటి రెండు అడుగుల దూరంతో పక్కకు ఒరిగాయి. ట్రాక్ కింద ఉన్న చెక్క స్లీపర్లు అగ్గి పుల్లల మాదిరిగా చెల్లా చెదురుగా పడ్డాయి’’ అని టైమ్స్ కథనం తెలిపింది.
బాంబును చాలా జాగ్రత్తగా పట్టాలపై అమర్చి, దానిని భూగర్భ కేబుల్ ద్వారా 200 గజాల దూరంలో ఉన్న బ్యాటరికీ అనుసంధానించారనీ, పొగమంచు కారణంగా దాడికి పాల్పడిన వారిని గుర్తించలేకపోయారని స్టేట్స్‌మన్ రాసింది.
శాస్త్రీయ పరిజ్ఞానం, నైపుణ్యం ఉన్న వ్యక్తులు ప్రణాళికా బద్ధంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు పోలీసులు భావించారని టైమ్స్ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
'అనుమానితుల్ని ప్రభుత్వం పట్టుకుంటుంది'
1922 ప్రారంభంలో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని మహాత్మా గాంధీ అకస్మాత్తుగా ఆపేశారు. దీంతో కాంగ్రెస్ నుంచి హిందూస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ అనే విప్లవాత్మక వర్గం కొత్తగా ఏర్పడింది.
1928లో ఈ సంఘం సోషలిస్ట్ అనే పదాన్ని జోడించుకుని హెచ్ఎస్ఆర్ఏగా మారింది.
ఈ సంస్థ మేనిఫెస్టో 'ది ఫిలాసఫీ ఆఫ్ బాంబ్'ను భగవతి చరణ్ వోహ్రా రాశారు.
ఈ సంస్థకు చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, సుఖ్‌దేవ్, బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్‌తోపాటు మరికొందరు ప్రముఖ విప్లవకారులతో సంబంధం ఉంది.
"మన సహచరులు జైలులో ఉన్నారు. అనేక ప్లాన్లు ఫెయిలయ్యాయి. న్యాయ వ్యవస్థ పేరుతో దారుణాలు కొనసాగుతున్నాయి. అందుకే వాళ్లు నిప్పుతో ఆడుకుంటున్నారని బ్రిటీషర్లకు తెలిసేలా ఒకడుగు ముందుకేయాలి" అని ఒక సాయంత్రం భగవతి అన్నట్లు అభిజిత్ బాల్‌రావ్ తన పుస్తకం "ది మ్యాన్ హూ అవెంజ్డ్ భగత్ సింగ్" పుస్తకంలో రాశారు.
మీ సలహా ఏంటని యశ్‌పాల్ అడిగారు. "పాము తలను నరికి వేయడమే" అని భగవతి చెప్పారు. దీని అర్థం వైస్రాయ్ లార్డ్ ఇర్విన్‌ను హత్య చేయడమేనని ఆజాద్ స్పష్టం చేశారు.
తన చిన్ననాటి స్నేహితుడు, నిపుణుడైన ఎలక్ట్రీషియన్ హన్స్‌రాజ్ సాయం తీసుకోవాలని యశ్‌పాల్‌కు ధరంపాల్ సలహా ఇచ్చినట్లు యశ్‌పాల్ జీవిత చరిత్ర "యశ్‌పాల్ లుక్స్ బ్యాక్" చెబుతోంది.
అప్పట్లో హన్స్‌రాజ్‌ను ‘వైర్‌లెస్’ అని పిలిచేవారు. ఆయన దూరంగా ఉండి పేల్చగల బాంబు తయారు చేయగలరని చెప్పారు.
"హన్స్‌రాజ్ సాయం చేయడానికి సిద్ధంగా ఉండటమే కాదు, బాంబు లోపల అమర్చే ఒక చిన్న పరికరాన్ని, బాంబుకు దూరంగా ఉండి మొత్తం వ్యవస్థను నియంత్రించే వైర్లు లేదా బాంబుని పేల్చే రిమోట్ లాంటి చిన్న పరికరాన్ని తయారు చేస్తానని చెప్పారు"
"అయితే, ఆ మాట చెప్పిన తర్వాత హన్స్‌రాజ్ మనసు మార్చుకున్నారు. ఎందుకంటే తాను మాత్రమే అలాంటి బాంబు తయారు చేయగలనని ప్రభుత్వానికి తెలుసని, ప్రభుత్వం తనపై అనుమానం పెంచుకుంటుందని చెప్పారు. హన్స్‌రాజ్ ఆశావాది, ఉత్సాహవంతుడు. విద్యుత్‌తో అద్భుతమైన విన్యాసాలు చేసేవాడు" అని యశ్‌పాల్ తన జీవిత చరిత్రలో రాశారు.

ఫొటో సోర్స్, makeheritagefun
"హన్స్‌రాజ్ అలియాస్ వైర్‌లెస్"
హన్స్‌రాజ్ దక్షిణ పంబాజ్‌లోని లైయా నగరం నుంచి మధ్య పంజాబ్‌లోని లాయల్‌పూర్( ప్రస్తుత ఫైసలాబాద్)కు, ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అప్పటి పంజాబ్ రాజధాని లాహోర్‌కు వెళ్లారు.
ఆరో తరగతిలో ఉన్నప్పుడు హన్స్‌రాజ్ ఒక టార్చ్‌లైటు తయారు చేశాడని, రాత్రిపూట దాని వెలుగుతో వచ్చే పోయే వారిని చూస్తూ అలాగే నిద్ర పోయేవాడినని హన్స్‌రాజ్ స్కూల్ క్లాస్‌మేట్ మెహర్ అబ్దుల్ హక్ తన ఆత్మకథ 'జో హమ్ పే గుజ్రీ'లో రాశారు.
"ఆ రోజుల్లో వైర్‌లెస్ పరికాలను అప్పటికింకా కనుక్కోలేదు. కింగ్ జార్జ్ 5, భారత వైస్రాయ్ మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి. హన్స్‌రాజ్ తన వైర్‌లెస్ పరికరం ద్వారా ఆ సంభాషణను గాలి తరంగాల ద్వారా అర్థం చేసుకుని, దానిని మరుసటి రోజు వార్తా పత్రికలలో ప్రచురించారు" అని మెహర్ అబ్దుల్ హక్ తన పుస్తకంలో వివరించారు.
"ఆ రోజు నుంచి 'వైర్‌లెస్' అతని పేరులో భాగమైంది. అతనికి 'హన్స్‌రాజ్ వైర్‌లెస్' గా గుర్తింపు వచ్చింది. హన్స్‌రాజ్ పరీక్షల్లో పాసైన తర్వాత ఆయన తల్లిదండ్రులు లియాల్‌పూర్‌కు మకాం మార్చారు. మూడేళ్ల తర్వాత ఆయన మళ్ళీ లైయాకు వచ్చి తన ఆవిష్కరణలలో కొన్నింటిని ప్రదర్శించి వెళ్లిపోయారు"
ఆయేషా సయీద్ భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన విప్లవకారుడు మీర్జా నసీమ్ చంగేజీని ఒక చారిత్రక వెబ్‌సైట్ కోసం 2016లో ఇంటర్వ్యూ చేశారు.
అప్పుడు చంగేజీకి 106 సంవత్సరాలు. ఆయన ఓల్డ్ దిల్లీలో ఉంటున్నారు. తన సహచరులు సలావుద్దీన్, హన్స్‌రాజ్ 'వైర్‌లెస్'లతో కలిసి లార్డ్ ఇర్విన్ ప్రయాణించే రైలు కింద బాంబును పేల్చడం గురించి ఆయన ఆ ఇంటర్వ్యూలో వివరించారు.
"మేము హార్డింజ్ బ్రిడ్జి దగ్గర రైల్వే లైన్‌పై బాంబు పెట్టి అడవిలో దాక్కున్నాము. ఆ రోజుల్లో ప్రగతి మైదాన్ ఒక అడవిలా ఉండేది. లార్డ్ ఇర్విన్ రైలులో ప్రయాణిస్తున్నప్పుడు బాంబు పేలింది. ఆయన దాడి నుండి బయటపడ్డారని మాకు తర్వాత తెలిసింది"
అయితే యశ్‌పాల్‌తో కలిసి ఇంద్రపాల్, భాగ్‌రామ్ 1929 డిసెంబర్ 22-23 రాత్రి పురానా ఖిలాలో బాంబులు, వైర్లు అమర్చారని కమలేష్ మోహన్ తన 'మిలిటెంట్ నేషనలిజం ఇన్ ది పంజాబ్' పుస్తకంలో రాశారు.
"మరుసటి రోజు తెల్లవారుజామున, యశ్‌పాల్, భాగ్‌రామ్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. వైస్రాయ్ కోచ్ వచ్చాక బటన్ నొక్కాల్సి ఉన్నా, దట్టమైన పొగమంచు కారణంగా యశ్‌పాల్ సరైన సమయంలో బటన్ నొక్కలేకపోయారు. అయితే బాంబు పేలింది" పేర్కొన్నారు.
"రైలు నిర్దిష్ట స్థానానికి చేరుకున్న వెంటనే ఇంజిన్ ముందు బాంబు పేలుతుంది. ఇంజిన్ పట్టాలు తప్పి బోల్తా పడటం మొదలవుతుంది. అయితే, పొగమంచు కారణంగా రైలు శబ్దం విని బ్యాటరీ స్విచ్‌ను నొక్కాల్సి వచ్చింది" అని యశ్‌పాల్ చెప్పారు.
"నేను ఊపిరి బిగబట్టి, చెవులు రిక్కించి, చేతులతో స్విచ్ పట్టుకుని శబ్దం ద్వారా రైలు దూరాన్ని అంచనా వేస్తూ వేచి ఉన్నాను. తర్వాత స్విచ్ నొక్కాను. ఒక్క క్షణంలో భయంకరమైన పేలుడు సంభవించింది. అయితే మా అంచనాకు విరుద్ధంగా రైలు న్యూదిల్లీ వైపు వేగంగా వెళ్లింది" అని యశ్‌పాల్ తెలిపారు.
మిలిటరీ యూనిఫాం వేసుకుని ఉండటంతో యశ్‌పాల్ పోలీసుల నుంచి తప్పించుకోగలిగారనీ, యశ్‌పాల్‌కు భాగ్‌రామ్ ఆర్డర్లీ ( పోలీసు సహాయకుడు) అని చెప్పి వెళ్లిపోగలిగారని మోహన్ రాశారు.
"ఇంద్రపాల్, హన్స్‌రాజ్, భాగ్‌రామ్ దిల్లీ నుంచి నాలుగు గంటల రైలులో లాహోర్‌కు తిరిగి రావాలని, లేఖ్‌రామ్ రోహ్‌తక్‌కు వెళ్లాలని, భగవతి ఘజియాబాద్ స్టేషన్‌లో నా కోసం వేచి చూడాలని నిర్ణయించాం" అని యశ్‌పాల్ చెప్పారు.
భగవతి వార్తా పత్రిక చదువుతున్నారు. '' ఏం జరిగింది?'' అని ఆయన కళ్లు పెద్దవి చేసి అడిగారు. '' ఏం జరగలేదని నేను నా చేతులతోనే సైగ చేసి చెప్పాను. కానీ, భగవతి భాయ్‌కి అనుమానం వచ్చింది. హన్స్‌రాజ్ బ్యాటరీ లోపభూయిష్టంగా ఉండవచ్చునని భావించారు. పేలుడు చాలా శక్తివంతంగా జరిగిందని నేను ఆయనకు చెప్పాను. కానీ, ట్రైన్ ధ్వంసమైందని నేను భావించడం లేదన్నాను'' అని యశ్‌పాల్ తెలిపారు.
''భగవతి భాయ్, నేను ఒక ప్యాసింజర్ రైలులో మొరాదాబాద్ బయలుదేరాం. భగవతి భాయ్ ఒక మామూలు సూట్ వేసుకున్నారు. నేను నా మిలిటరీ యూనిఫామ్‌ను తీసేసి, సాధారణ పౌరుడు వేసుకునే దుస్తులు వేసుకున్నా. మేమిద్దరం నిశ్శబ్దంగా, బాధతో రైలులో కూర్చున్నాం. మా రైలు మొరాదాబాద్ చేరుకున్నాక, ఒక వార్తాపత్రిక వెండర్ అరుపులు వినిపించాయి. ''బ్రేకింగ్ న్యూస్! వైస్రాయ్ ట్రైన్ కింద బాంబు పేలింది! రైల్వే లైన్ ముక్కలైంది! కోచ్ ధ్వంసమైంది! ఒకరు మరణించారు!'' అని అంటున్నారు'' అని యశ్‌పాల్ చెప్పారు.
''హెచ్‌ఎస్ఆర్ఏకు చెందిన లాహోర్ వర్గం విడిపోయి, ఆ తర్వాత హన్స్‌రాజ్ ‘వైర్‌లెస్’ నేతృత్వంలో ''ఆతిషి చక్ర''గా ఏర్పడింది. 1930 జూన్‌లో పంజాబ్ అంతటా ఇది పలు బాంబు దాడులు నిర్వహించింది'' అని డాక్టర్ పఠాన్ పేర్కొన్నారు.
‘‘హెచ్‌ఎస్‌ఆర్ఏకు ఈ దాడులతో సంబంధాలను తప్పించేందుకు హన్స్‌రాజ్ 'వైర్‌లెస్', ఇంద్రపాల్‌లు కలిసి పంజాబ్‌లో ''ఆతిషి చక్ర''ను ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో ఇలాంటి బాంబు దాడులకు కూడా హన్స్‌రాజ్ ప్రణాళికలు రచించారు’’ అని ఇర్ఫాన్ హబీబ్ తన పుస్తకం ''టు మేక్ ద డెఫ్ హియర్: ఐడియాలజీ అండ్ ప్రోగ్రామ్ ఆఫ్ భగత్ సింగ్''లో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Waqar Mustafa
''విప్లవ పార్టీలో నా పనేంటో ఎవరికీ తెలియదు''
పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత, 1960ల్లో మజ్లిస్-ఎ-అహ్రార్ సంస్థకు చెందిన మాస పత్రిక తబస్రాలో ‘వైర్‌లెస్’ స్టోరీని వివిధ భాగాలుగా ప్రచురించారు. దీనికి జన్బాజ్ మీర్జా సంపాదకుడిగా వ్యవహరించారు.
లార్డ్ ఇర్విన్ ప్రత్యేక రైలును బాంబుతో పేల్చినట్లు ‘వైర్‌లెస్’ రాశారు. పంజాబ్‌లో ఏడు నగరాల్లో ఏకకాలంలో బాంబు పేలుళ్లు జరిగాయి.
పంజాబ్‌లోని వివిధ నగరాల్లో విప్లవ కేంద్రాలు వెలిశాయి. కానీ, వీటి వెనుకున్నది ఎవరన్నది బ్రిటీష్ ప్రభుత్వానికి అసలు తెలియదు.
''తన సహచరుల్లోఒకరైన అమ్రిక్ సింగ్ లాహోర్‌లోని సయ్యద్ మీఠా బజార్‌లోని ఒక షాపులో లస్సీ తాగేందుకు ఆగి, తన వెంట తెచ్చుకున్న గన్‌పౌడర్ సూట్‌కేసును అక్కడ పెట్టారు. అయితే, సమీపంలోని మంట సెగతో అది పేలింది. ఈ ఘటనలో ఆయన గాయపడ్డారు. ఈ ఘటనతో లాహోర్‌లోని గవాల్ మండీకి తిరిగి వచ్చారు. ఆయన్ను వెంబడించిన పోలీసులు, పేలుడు సామాగ్రినంతా స్వాధీనం చేసుకున్నారు'' అని ‘వైర్‌లెస్’ రాశారు.
''నేను ఎలాగో అక్కడి నుంచి బయటపడ్డాను. కానీ, దురదృష్టవశాత్తు, నాపేరుతో ఉన్న డైరీని అక్కడే వదిలేసిన సూట్‌కేసులోని నా కోట్ పాకెట్‌లో ఉంది. పంజాబ్ వ్యాప్తంగా చేసే బాంబు ఆపరేషన్లకు చెందిన మొత్తం ఫైల్ దానిలో ఉంది. అంతేకాక, వైస్రాయ్ ట్రైన్‌పై వాడిన బ్యాటరీ కూడా దానిలోనే పెట్టాను'' అని ‘వైర్‌లెస్’ హన్స్‌రాజ్ చెప్పారు.
''ఒకసారి వేసవి సెలవుల్లో, నేను బహవల్పూర్ నుంచి లైయాకు ప్రయాణిస్తున్నాను. షేర్‌షా రైల్వే స్టేషన్ వద్ద రైలు మారాల్సి ఉంది. నా క్లాస్‌మేట్ ఫోటోతో ఉన్న ఒక ప్రకటనను నేను చూశాను'' అని మెహర్ అబ్దుల్ హక్ రాశారు.
''ఈ ప్రకటన ప్రభుత్వం వేసింది. 'హన్స్‌రాజ్ వైర్‌లెస్'ను ఎవరైనా ప్రాణాలతో లేదా ప్రాణాలు లేకుండా పట్టుకుంటే, వారికి పది వేల రూపాయలు రివార్డుగా ఇస్తాం'' అని అందులో ఉందని తెలిపారు.
వంద రూపాయలు కావాలని స్నేహితుని ద్వారా తన కుటుంబం కోరినట్లు ‘వైర్‌లెస్’ హన్స్‌రాజ్ స్వయంగా రాశారు.
''పోలీసుల చేతిలో నా కుటుంబం ఎంత చిత్రహింసలు పడుతుందో నా స్నేహితుడు నాకు చెప్పాడు. నేను వెంటనే స్టేషన్‌కు వెళ్లాను. నా గడ్డం గుబురుగా పెరిగేది. ప్లాట్‌ఫామ్ ఒక మూలన కూర్చునేవాడిని. చినిగిపోయిన బట్టలు వేసుకునేవాడిని. కొన్నిసార్లు కొందరు పోలీసులు నాపక్కనే కూర్చుని, నా గురించే మాట్లాడుకునేవాళ్లు. ఆ సంభాషణల్లో చాలా ఉపయోగకరమైన సమాచారం అందేది'' అని ‘వైర్‌లెస్’ రాశారు.
లండన్ నుంచి ముల్తాన్‌కు, అక్కడి నుంచి సింధ్‌కు ఎలా వెళ్లారో తన బయోగ్రఫీలో ‘వైర్‌లెస్’ రాసుకున్నారు.

ఫొటో సోర్స్, Waqar Mustafa
సింధ్‌లో హన్స్‌రాజ్ 'వైర్‌లెస్'
1931 మార్చిలో భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురును ఉరితీసినప్పుడు, అల్ఫ్రెడ్ పార్కు వద్ద జరిగిన పోలీసుల ఎన్‌కౌంటర్ సమయంలో చంద్రశేఖర్ ఆజాద్ ఆత్మహత్య చేసుకున్నట్లు డాక్టర్ దర్ మొహమ్మద్ పఠాన్ రాశారు.
ఆజాద్ మరణించిన తర్వాత, కేంద్ర నాయకత్వంలో ఎవరూ లేరు.
ఈ పరిస్థితుల్లో హన్స్‌రాజ్ ‘వైర్‌లెస్’ సింధ్‌ను తనకు సురక్షితమైన ప్రాంతంగా భావించారు. ఈ సమయంలో, సింధ్‌లో హిందూ, ముస్లిం విప్లవకారులు చాలా క్రియాశీలకంగా ఉండేవారు.
హర్ తెహ్రీక్ (ఉద్యమం) చాలా ఉధృతంగా సాగేది. హిందూ యువతలో సుభాష్ చంద్రబోస్ ప్రోత్సాహాన్ని ఇచ్చేవారు. హన్స్‌రాజ్ హిందూ యువతకు శిక్షణ ఇచ్చారు. కానీ, సింధ్‌లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
సింధ్‌లో తన జైలుశిక్షను, అక్కడ పెట్టిన చిత్రహింసలను బయోగ్రఫీలో రాశారు. ఆయన కార్యకలాపాలకు సంబంధించిన అపారమైన సమాచారం సింధీ భాషలో అందుబాటులో ఉంది.
హన్స్‌రాజ్‌ను అదుపులోకి తీసుకోవడం, ఆ తర్వాత హింసను త్యజిస్తానని ఇచ్చిన వాగ్దానంతో విడుదల చేయడం సింధ్ అసెంబ్లీలో ఎన్నోసార్లు చర్చనీయాంశమైంది.
కొన్నేళ్ల తర్వాత హన్స్‌రాజ్ ‘వైర్‌లెస్’ షోమ్యాన్‌గా ప్రసిద్ధికెక్కారు. తన ఆవిష్కరణలను టిక్కెట్లు పెట్టి షోలు నిర్వహించేవారు.
రేడియో పరికరాలు, రిమోట్‌తో నియంత్రించే మెషీన్లు, ఆటోమేటిక్ షూ పాలిష్ మెషీన్లు, చేతి సంజ్ఞల ద్వారానే ఆన్ లేదా ఆఫ్ అయ్యే లైట్లు, సౌండ్ రికార్డింగ్ వాయిస్ (ఆ సమయంలో మాగ్నెటిక్ టేపు అంత కామన్ కాదు) ఇలా తాను కనిపెట్టిన అనేక ఆవిష్కరణలను ప్రదర్శించారు.
1944-45 మధ్య లాహోర్‌లో నిర్వహించిన షోలు గణనీయమైన ప్రభావం చూపాయి.
పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత, తూర్పు పంజాబ్ నగరమైన జలాంధర్ వచ్చేశారు‘వైర్‌లెస్’. 1948 జనవరి 16 తేదీతో, భారత ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ రాసిన లేఖ ఒకటి చరిత్ర పుస్తకాలలో ఉంది.
ఈ లేఖలో హన్స్‌రాజ్‌కు ప్రతిభ, వినూత్నమైన ఆవిష్కరణ సామర్థ్యం ఉందని నెహ్రూ రాశారు. ప్రజాప్రయోజనాల రీత్యా ఆ ప్రతిభను ప్రోత్సహించాలని ఆయన పేర్కొన్నారు.
''ఒకవేళ ఖాళీగా ఉన్న వర్క్‌షాపును ప్రభుత్వం అధికారికంగా నడిపితే, అందులో హన్స్‌రాజ్‌ను నిపుణుడిగా చేర్చుకోవాలి. అప్పుడు ఆ వర్క్‌షాపు ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక ప్రయత్నం విఫలమైతే, వచ్చే నష్టం తక్కువగానే ఉంటుంది. విజయం సాధిస్తే అది ఉపాధిని, ఇతర అవకాశాలను సృష్టిస్తుంది'' అని ఆ లేఖలో రాశారు.
స్వాతంత్య్రం తర్వాత, పంజాబ్, ఉత్తర భారతంలో తన షోలను కొనసాగించారు ‘వైర్‌లెస్’. 1950ల్లో, దూరం నుంచే వాహనం ఇంజిన్‌ను ఆపేసే డివైజ్‌ను ఆయన ప్రదర్శించారు.
‘‘హన్స్‌రాజ్ 'వైర్‌లెస్' సైకిల్‌పై వివిధ రకాల బ్యాగులను తగిలించుకుని వెళ్తూ.. స్కూళ్లలో శాస్త్రీయ ప్రయోగాలను నిర్వహించేవారు. అలా వచ్చిన డబ్బుతో తన జీవితం నడుపుకునేవారు'' అని వార్తా పత్రిక 'ది ట్రైబ్యూన్'కు రాసిన వ్యాసంలో డీఎస్ చీమా పేర్కొన్నారు.
''1958లో నేను పదో తరగతి విద్యార్థిగా ఉన్నప్పుడు, మాకు దగ్గర్లోని కాలేజీలోని ఒక ఆడిటోరియంలో ఆయన ప్రోగ్రామ్ జరుగుతుందని తెలిసింది. మూడు స్కూళ్లకు చెందిన తొమ్మిది, పదో తరగతులకు చెందిన విద్యార్థులు హాజరయ్యారు. చిన్నగా, నవ్వుతూ వచ్చిన ఒక వ్యక్తి, విద్యార్థులని పలకరించారు. కేవలం నిమిషాల వ్యవధిలోనే చాలా సులభంగా ఒక వ్యవస్థను రూపొందించారు'' అని డీఎస్ చీమా రాశారు.
''ఒక పాడైన షీటుతో గదిని రూపొందించారు. ఆ గది లోపలికి, బయటికి వచ్చేటప్పుడు బల్బు ఎలా వెలుగుతుంది, ఆరిపోతుందో ప్రదర్శించారు. ట్యాప్ కింద చెయ్యి పెట్టగానే ఆటోమేటిక్‌గా నీరు రావడం, చేయి తీయగానే నీరు ఆగిపోవడంలాంటివి ప్రదర్శించారు. ఇవన్నీ మమ్మల్ని చాలా ఆశ్చర్యపరిచాయి'' అని తెలిపారు.
‘‘అందులో బాగా అబ్బురపరిచిన ప్రయోగం ఆటోమేటిక్ షూ పాలిష్ మెషీన్. ఒక చెక్క బాక్సులో విద్యార్థి షూ పెట్టగానే, మోటార్ తిరిగింది. షూ పాలిష్ కాగానే ఇది ఆగిపోయింది’’ అని చీమా తెలిపారు.
‘‘తన కాలం కంటే ఎంతో ముందుగా ఆలోచించే వ్యక్తి హన్స్‌రాజ్ 'వైర్‌లెస్' ’’ అని డీఎస్ చీమా ఆయన్ను అభివర్ణించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














