జవహర్‌లాల్ నెహ్రూ: స్వాతంత్య్రం వచ్చిన పక్షం రోజుల్లోనే అణు కార్యక్రమంపై ఏం చేశారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రెహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత అణు కార్యక్రమ పితామహుడు హోమీ జహంగీర్ భాభా, నెహ్రూ తొలిసారి ఎప్పుడు కలుసుకున్నారనే విషయంపై పెద్దగా ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు.
కానీ, బాంబేలో హోమీ భాభా ఆడిటోరియాన్ని ప్రారంభోత్సవంలో ఇందిరాగాంధీ చేసిన ప్రసంగంలో హోమీ భాభాను తొలిసారి 1938లో తన తండ్రితో కలిసి ఫ్రాన్స్‌లోని మార్సేయిల్‌కు నౌకలో వెళుతున్నప్పుడు కలుసుకున్నట్లు గుర్తు చేసుకున్నారు.
శాస్త్రీయ దృక్పథాన్ని సమర్థించిన ప్రపంచ నాయకులలో నెహ్రూ ఒకరు. దీనికి అతిపెద్ద ఉదాహరణ.. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన పక్షం రోజులలోనే హోమీ భాభా నేతృత్వంలో బోర్డు ఆఫ్ రీసర్చ్ ఆన్ అటామిక్ ఎనర్జీను ఏర్పాటు చేయడమే.
నెహ్రూ, భాభా ఇద్దరూ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకున్నారు.
''వారి మధ్య గాఢమైన స్నేహ బంధం ఏర్పడింది. మహాత్మా గాంధీ, ఇందిరా గాంధీ, ఆమె కుటుంబ సభ్యులు, కృష్ణ మేనన్ కాకుండా.. భాభా వలే నెహ్రూతో సన్నిహితంగా ఉన్నవారు మరెవరూ లేరని నమ్ముతాను'' అని అటామిక్ ఎనర్జీ కమిషన్ మాజీ చైర్మన్ ఎం.ఆర్ శ్రీనివాసన్ రాశారు.
''భాభా ఎప్పుడూ నెహ్రూను 'సోదరా' అని పిలిచేవారు. భాభా కోసం తన తండ్రి ఎప్పుడూ సమయం కేటాయించేవారని ఇందిరా గాంధీ కూడా చెప్పారు. కేవలం భాభాతో ముఖ్యమైన విషయాలను చర్చించడమే కాకుండా.. భాభాతో మాట్లాడటాన్ని నెహ్రూ ఇష్టపడేవారు. రాజకీయాల్లో నిమగ్నమవ్వడం వల్ల ఆయన తెలుసుకోలేకపోయిన కొత్త విషయాలను నెహ్రూకు వివరిస్తూ భాభా ఆయన మేధో దాహాన్ని తీర్చేవారు'' అని శ్రీనివాసన్ రాశారు.
అటామిక్ ఎనర్జీ కమిషన్ 1954 నాటికి ప్రభుత్వానికి చెందిన ఒక ప్రత్యేక విభాగంగా మారింది. దానికి హోమీ భాభాను తొలి కార్యదర్శిగా నియమించారు. అప్పటి వరకు ఆయన పాత్ర సలహాదారుడిగానే ఉండేది. దీంతో పాటు, అటామిక్ ఎనర్జీ కమిషన్, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసర్చ్‌కు హెడ్‌గా కూడా వ్యవహరించారు.
నెహ్రూ, భాభా నాయకత్వంలో అల్వాయేలోని థోరియం ప్లాంట్, ఆ తర్వాత ట్రాంబేలో తొలి న్యూక్లియర్ రియాక్టర్ పనులు 1955లో ప్రారంభమయ్యాయి.


ఫొటో సోర్స్, TIFR
నవీన భారతానికి ప్రాజెక్టులే దేవాలయాలు
భారత్‌కు స్వాతంత్య్రం రాగానే సైన్స్ సంబంధిత సంస్థలకు పునాది వేయడం ప్రారంభించారు నెహ్రూ. భారత్‌లో ఆర్థిక వనరులు పరిమితంగా ఉన్న సమయంలోనే నెహ్రూ నేడు మనం చూస్తోన్న ఐఐటీలు, ఐఐఎంలు, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ, ఎయిమ్స్ లాంటి వాటిని ఏర్పాటు చేశారు.
తొలి ఐఐటీని 1952లో పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌లో ఏర్పాటు చేశారు. భాక్రాలోని సట్లేజ్ నదిపై ఏర్పాటు చేసిన డ్యామ్‌ను ఆయన 'నవీన భారతానికి సరికొత్త ఆలయంగా' వర్ణించారు.
ప్రతి ఏడాది ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సులకు నెహ్రూ హాజరయ్యేవారు.
'నెహ్రూ మిత్ అండ్ ట్రూత్ ' అనే పేరుతో పీయూష్ బబేలే రాసిన పుస్తకంలో, '' నెహ్రూ ఒక ప్రధానిగా దేశంలోని పంట పొలాలకు నీరు అందించాల్సిన బాధ్యతను తీసుకున్నారు. కోట్లాది మందికి ఉపాధి కల్పించాల్సి వచ్చింది. పిల్లలను విద్యావంతులు చేయాలి,. సైన్స్‌లో కొత్తదనాన్ని దేశానికి పరిచయం చేయాలి ,దేశ రక్షణ కోసం సైనిక ఏర్పాట్లు చేయాలి. కళలు, సంస్కృతిని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లాలి. విదేశీ అతిథులకు హోటళ్లను, ఛండీగఢ్ లాంటి నగరాలను నిర్మించాలి. కానీ, ఆయన చేయనవి ఏమున్నాయి? నెహ్రూ ఉదయం 5 నుంచి రాత్రి ఒంటిగంట వరకు పనిచేసేవారు. ఆయనకు విస్తృతమైన సంకల్పాలు ఉండేవి. చాలా దూరదృష్టి కలవారు'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, JAICO Publication
భారతరత్న అందించిన రాజేంద్ర ప్రసాద్
నెహ్రూ తన తీవ్ర విమర్శకులైన డాక్టర్. భీమ్‌రావ్ అంబేడ్కర్, శ్యామా ప్రసాద్ ముఖర్జీలను స్వతంత్ర భారత తొలి కేబినెట్‌లో చేర్చారు. ఇది అద్భుతమైన ప్రయోగం. మరే ఇతర ప్రధానమంత్రి మళ్లీ ఇలా చేసేందుకు సాహసించలేదు.
నెహ్రూ కేబినెట్ సభ్యుడైన భీమ్‌రావ్ అంబేడ్కర్ ఆయన్ను తెగ విమర్శించేవారు. ''కాంగ్రెస్‌ను ఆయన ఒక ధర్మశాలగా మార్చేశారు. దీనిలో సిద్ధాంతాలు, విధానాలకు ఎలాంటి ప్రాధాన్యం లేదు. మోసగాళ్లకు, మూర్ఖులకు చోటు ఉంది. శత్రువులు, స్నేహితులు ఇందులోకి రావొచ్చు. కమ్యూస్టులకు, లౌకిక వాదులకు కూడా దాని తలుపులు తెరిచే ఉండేవి. క్యాపిటలిస్టులకు, దాని ప్రత్యర్థులకు కూడా కాంగ్రెస్‌లో చోటు ఉండేది'' అని అనేవారు.
జవహర్‌లాల్ నెహ్రూ యూరప్ పర్యటనలో ఉన్న సమయంలో 1955లో భారతరత్న ప్రకటించారు . ఆయనకు ఈ అవార్డును ఆయన సొంత ప్రభుత్వమే ఇచ్చిందని చాలామంది తప్పుగా నమ్ముతుంటారు.
అయితే, రషిద్ కిద్వాయ్ రాసిన పుస్తకం 'ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, స్టేట్ ఆఫ్ ద నేషన్'లో పలు వివరాలను వెల్లడించారు.
'' అప్పటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్‌కి, ప్రధాని నెహ్రూకు చాలా విషయాల్లో పడేది కాదు. అయినప్పటికీ, నెహ్రూకు భారతరత్నను ఇచ్చే పూర్తి బాధ్యతను రాజేంద్ర ప్రసాదే తీసుకున్నారు. 'నా సొంత చొరవతోనే ఈ నిర్ణయం తీసుకున్నా. నా ప్రధాని సలహాను తీసుకోలేదు. ఆయనతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదు. ఈ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమైనదని చెప్పి నా నిర్ణయాన్ని విమర్శించవచ్చు. అయితే, నా ఈ నిర్ణయాన్ని ఎంతో ఉత్సాహంతో స్వాగతిస్తారని నాకు తెలుసు'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
రోజులో 17 గంటలు పని
నెహ్రూ చాలా కష్టించి పనిచేసేవారు. తెల్లవారుజామునే మేల్కొనేవారు. రోజులో 16 నుంచి 17 గంటల పనిచేసేవారు. ఆ సమయంలోనే ఇంటర్వ్యూలకు, మీటింగ్‌లకు సమయాన్ని కేటాయించేవారు. అధికారులను, విదేశీ దౌత్యవేత్తలను కలిసేవారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు దాని ప్రొసీడింగ్స్‌లో పాల్గొనేవారు. ఆయన దినచర్యలో యోగా, ఐదు నుంచి పది నిమిషాలు శీర్షాసనం కూడా భాగం. స్విమ్మింగ్, గుర్రపు స్వారీని ఆయన ఎక్కువగా ఆస్వాదించేవారు.
''1947 ఆగస్టులో పంజాబ్‌లో అల్లర్లు చోటు చేసుకున్న ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత, అందరం అర్ధరాత్రి దిల్లీకి చేరుకున్నాం. తర్వాత రోజు 6 గంటలకు మా పని ప్రారంభించాలి. చాలా అలసిపోయాం. నాకు పడుకోగానే నిద్రపట్టేసింది. ఆ తర్వాత రోజు ఉదయం విమానాశ్రయానికి వెళ్లేందుకు ప్రధాని నివాసానికి వచ్చిన్నప్పుడు, ఆయన పీఏ నాకు కొన్ని లెటర్లను, టెలిగ్రామ్‌లను, స్టేట్‌మెంట్లను చూపించారు. వాటిని నెహ్రూ అందరం నిద్రపోయినప్పుడు రాశారు. ఆ రాత్రి ప్రధాని అర్ధరాత్రి 2 గంటలకు నిద్రపోయారు. కానీ, ఆ తర్వాత రోజు ఉదయం 5.30 కల్లా ఆయన రెడీగా ఉన్నారు'' అని ఆయన తొలి ప్రిన్సిపల్ ప్రైవేట్ సెక్రటరీ హెచ్‌వీఆర్ అయ్యంగర్ అన్నారు.
అధికారుల పనులూ స్వయంగా చేసేవారు
ప్రముఖ జర్నలిస్టు ఫ్రాంక్ మోరేస్ రాసిన నెహ్రూ బయోగ్రఫీలో, '' నిద్రపోయే ముందు 15 నుంచి 20 నిమిషాలు పుస్తకాలు చదివేవారు. రాజకీయం, సాహిత్యం, తత్త్వశాస్త్రం, ఆధునిక శాస్త్రానికి చెందిన పుస్తకాలు ఆయనకు చాలా ఇష్టం. ప్రధానిగా ఆయన ఫైళ్లపై విషయాలు స్పష్టంగా, క్లుప్తంగా ఉండేవి. ఎక్కువ కాలం ఫైళ్లు ఆయన డెస్క్‌పై ఉండేవి కావు. నెహ్రూ చాలా పద్ధతిగా, శుభ్రతను ఇష్టపడే వ్యక్తి. పక్కకు ఒరిగిన ఫోటోను సరిగ్గా పెట్టడం, తన స్నేహితుడి ఇంట్లో టేబుల్‌పై పేరుకుపోయిన దుమ్మును తన చేతితో శుభ్రపరచడం, కాగితాలను, పుస్తకాలను చక్కగా పెట్టుకోవడం ఆయన అలవాట్లు'' అని తెలిశాయి.
బహుశా నెహ్రూ వ్యక్తిత్వంలోని అత్యంత ప్రతికూల అంశం దేశ పరిపాలనను చాలా సూక్ష్మంగా నిర్వహించే ధోరణే. ఒక ప్రధాని పట్టించుకోవాల్సిన అవసరం లేని చాలా పనులపై ఆయన ఎక్కువ సమయాన్ని కేటాయించేవారు.
నెహ్రూ బయోగ్రఫీ 'నెహ్రూ, ద ఇన్వెన్షన్ ఆఫ్ ఇండియా'లో శశిథరూర్ ఇలా రాశారు.
''నెహ్రూ తన ప్రభుత్వ అధికారుల పనులను తానే స్వయంగా చేసేందుకు ఇష్టపడేవారు. ప్రతి లేఖకు ప్రధానే స్వయంగా సమాధానాలు రాయాల్సిన అవసరం లేదు. కానీ, అలా చేయడాన్ని నెహ్రూ సంతృప్తికరంగా భావించేవారు. 'నెహ్రూ వద్దకు ఎప్పుడెళ్లినా, ప్రపంచ విషయాలను నాతో చర్చించేవారు. ఇలాంటి విషయాలకు కూడా ఆయనకు సమయం ఉంటుందా అని ఆశ్చర్యపోయేవాడిని’ అని రక్షణ శాఖలోని ఒక అధికారి చెప్పారు.'' అని రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
నెహ్రూ కోపం
నెహ్రూ ప్రవర్తన చాలా మర్యాదతో ఉండేది. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, ఆయన తన ప్రత్యర్థులతో మర్యాదగా వ్యవహరించేవారు.
చక్రవర్తి రాజగోపాలాచారితో (రాజాజీ) 1942లో ఆయనకు విభేదాలు వచ్చాయి. భారత్‌లో ముస్లింలకు స్వీయ-నిర్ణయాధికార సూత్రాన్ని (సెల్ఫ్ డిటర్మినేషన్ ప్రిన్సిపల్‌ను) రాజాజీ అంగీకరించారు. దీనివల్ల ఆయన దేశంలో పెద్ద వర్గం ప్రజల దృష్టిలో అపఖ్యాతి పాలయ్యారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 1942 ఏప్రిల్‌లో అలహాబాద్‌లో సమావేశమైంది. రాజగోపాలాచారి కూడా ఆ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్లారు. కొందరు హిందూ మహాసభ మద్దతుదారులు నలుపు రంగు జెండాలతో రైల్వే స్టేషన్ వద్ద గుమిగూడారు.
''బిజీగా ఉన్నప్పటికీ, స్టేషన్ నుంచి రాజాజీని తీసుకొచ్చేందుకు ఆయన కారులో వెళ్లారు. అలహాబాద్‌లో రాజగోపాలాచారికి ఎవరు నలుపు జెండాలు చూపిస్తారో చూద్దామన్నారు. నలుపు రంగు జెండాలను పట్టుకున్న మద్దతుదారుల్నిచూడగానే, నెహ్రూ వారి చేతుల్లోంచి ఆ జెండా కర్రలను లాగి, ఆ కర్రలతోనే వారిని తరిమారు. అప్పుడు నెహ్రూ ముందుకు నిరసనకారుల నేత వచ్చినప్పుడు, నెహ్రూ ఆయనపై విరుచుకుపడ్డారు. 'అలహాబాద్‌లో నా అతిథిని అవమానించడానికి నీకెంత ధైర్యం?' అని అరిచారు. అయితే హిందూ మహాసభ నేత ఇందుకు సమాదానం చెప్పే ప్రయత్నం చేస్తుంటే, అక్కడున్న పోర్టర్లు నెహ్రూను అవమానిస్తున్నారని భావించి దాడి చేశారు. దీనిపై నెహ్రూ చాలా బాధపడ్డారు. ప్రతిపక్ష నాయకుడిని రక్షించడానికి ఆయన తన చేతులను కవచంగా ఉపయోగించారు'' అని పీడీ టాండన్ రాసిన 'అన్‌ఫర్గెటబుల్ నెహ్రూ' అనే పుస్తకంలో రాశారు.

ఫొటో సోర్స్, Publication Division
వ్యక్తిగత భద్రతను పట్టించుకోని నెహ్రూ
సాదాసీదా ఆహారాన్నే ఆయన తీసుకునేవారు. 1956 జూన్ 18న ఆయన ఆహారం విషయంలో ప్రభుత్వం ఒక నోటు జారీ చేసింది.
''ప్రధానమంత్రి తన ఆహారం కోసం ఎలాంటి ప్రత్యేక లేదా అసాధారణ ఏర్పాట్లు చేయొద్దని అభ్యర్థించారు. ఆయన ఎక్కడైతే ఉన్నారో ఈ ప్రదేశానికి చెందిన సాధారణ ఆహారాన్నే తీసుకుంటారు. మాంసం తింటారు కానీ, సాధారణంగా వెజిటేరియన్ ఫుడ్ తినేందుకే ఇష్టపడతారు. ఉదయం కాఫీ తాగుతారు. మధ్యాహ్నం ఒక కప్పు టీ తాగుతారు'' అని దానిలో పేర్కొంది.
గాంధీ హత్య తర్వాత కూడా నెహ్రూ తన భద్రత గురించి ప్రత్యేకంగా పట్టించుకోలేదు. ఆయన కారు ముందు ఎప్పుడూ బాడీగార్డుల కాన్వాయ్ కాకుండా, మోటార్ సైక్లిస్టులు మాత్ర ఉండేవారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














