బ్రెజ్నెవ్: ఈ రష్యా నేతకు రాష్ట్రపతి భవన్‌లో చవకైన ‘లైఫ్‌బాయ్’ సబ్బును ఇచ్చిన వేళ...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రేహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
లియోనిడ్ బ్రెజ్నెవ్ మొదటిసారి 1961 డిసెంబర్ 15న భారత్‌కు వచ్చినప్పుడు, ఆయన సుప్రీం సోవియట్ ప్రెసీడియం చైర్మన్. సోవియట్ యూనియన్‌కు అధికారికంగా అధ్యక్షులు కాదు. కానీ ప్రభుత్వాధినేత పదవిలో ఉన్నారు.
ఈ పర్యటనను అకస్మాత్తుగా ఒకవారం ముందు మాత్రమే షెడ్యూల్ చేశారు.
భారత పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించాలని, భారత ప్రాజెక్టులకు సంబంధించిన సోవియట్ పరికరాలను దించుతున్న ఓడరేవు విశాఖపట్నాన్ని సందర్శించాలని భారత్ రాకముందు బ్రెజ్నెవ్ భావించారు. కానీ ఈ రెండు కోరికలు నెరవేరలేదు.
ఆ సమయంలో పార్లమెంటు సమావేశాలు జరగడంలేదు. 1962 ఫిబ్రవరి వరకు పార్లమెంట్ వాయిదా పడింది. ఆ సమయంలో ప్రభుత్వాధినేతకు సౌకర్యవంతమైన వసతి లేనందున బ్రెజ్నెవ్‌ను విశాఖపట్నంకు పంపడానికి భారత ప్రభుత్వం ఇష్టపడలేదు.
రాష్ట్రపతి భవన్ సెక్రటేరియట్‌లోని పత్రాల ప్రకారం "బ్రెజ్నెవ్‌కు విశాఖపట్నంలో బస ఏర్పాటు చేయవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి విదేశాంగ మంత్రిత్వ శాఖను కోరారు"


ఫొటో సోర్స్, Getty Images
భారతదేశంలోని అనేక నగరాల సందర్శన
బ్రెజ్నెవ్ ఇల్యూమినేషన్-18 విమానంలో దిల్లీకి చేరుకున్నారు. భారత వైమానిక దళానికి చెందిన ఎనిమిది యుద్ధ విమానాలు బ్రెజ్నెవ్ విమానానికి ఎస్కార్ట్‌గా దిల్లీ విమానాశ్రయానికి వచ్చాయి.
పాలం విమానాశ్రయంలో దిగగానే బ్రెజ్నెవ్‌కు 21-గన్ సెల్యూట్‌తో గౌరవ వందనం సమర్పించారు.
ఆ సమయంలో రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ అనారోగ్యంతో ఉండడంతో సోవియట్ నాయకుడిని ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ స్వాగతించారు.
టైమ్స్ ఆఫ్ ఇండియా తన డిసెంబరు 16, 1961 సంచికలో ఇలా రాసింది, "బ్రెజ్నెవ్‌ను స్వాగతించడానికి పాలం విమానాశ్రయం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు రోడ్డుకు ఇరువైపులా ప్రజలు బారులు తీరారు. వారు ఆయనపై పూల వర్షం కురిపించారు. బ్రెజ్నెవ్ వారికి నమస్కారం చెబుతూ ముందుకు సాగారు. బ్రెజ్నెవ్ మోటారు వాహనం విజయ్ చౌక్ చేరుకున్నప్పుడు రాష్ట్రపతి అంగరక్షకులు ఆయనకు స్వాగతం పలికి రాష్ట్రపతి భవన్‌కు తీసుకెళ్లారు"
బ్రెజ్నెవ్‌కు రాష్ట్రపతి భవన్‌లోని ద్వారకా సూట్‌లో వసతి కల్పించారు. బ్రెజ్నెవ్ పర్సనల్ కుక్ ఆయనతో పాటు భారతదేశానికి వచ్చారు. రాష్ట్రపతి భవన్‌లోని వంటవాళ్లతో కలిసి ఆయన బ్రెజ్నెవ్ కోసం భోజనం తయారుచేశారు.
రాత్రి భోజనం తర్వాత, పాటలు, నృత్య విభాగానికి చెందిన కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రదర్శించారు. మరుసటి రోజు బ్రెజ్నెవ్ తీన్ మూర్తి భవన్‌ను సందర్శించి నిరాయుధీకరణ, జర్మనీ, వలసవాదం, ప్రపంచ శాంతి వంటి అంశాలపై జవహర్ లాల్ నెహ్రూతో చర్చలు జరిపారు.
సాయంత్రం ఆయన ఇండియన్ ఇండస్ట్రీస్ ఫెయిర్‌ను సందర్శించారు. అక్కడ ఫెయిర్ నిర్వాహకులు ఆయనకు ఐవరీ టేబుల్ లాంప్‌ను, ఆయన భార్యకు బనారసి సిల్క్ స్కార్ఫ్‌ను బహూకరించారు. ఈ పర్యటనలో బ్రెజ్నెవ్ ఆగ్రా, ముంబై, అంకలేశ్వర్, బరోడా, కోల్‌కతా, మద్రాస్, జైపూర్, మహాబలిపురం లను సందర్శించారు.
భారత పర్యటనలోనే ఆయన డిసెంబరు 19న అంకలేశ్వర్‌లో తన 55వ పుట్టినరోజును కూడా జరుపుకున్నారు. జైపూర్‌లో ఏనుగుపై స్వారీ చేసిన తర్వాత బ్రెజ్నెవ్ హిందీలో "ధన్యవాదాలు" అని చెప్పి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు.
గోవా ఆపరేషన్‌లో మద్దతు ఇచ్చినందుకు ఎర్రకోట వద్ద జరిగిన పౌర స్వాగత కార్యక్రమంలో బ్రెజ్నెవ్‌కు జవహర్‌లాల్ నెహ్రూ కృతజ్ఞతలు తెలిపారు. వెళ్లేముందు భారత ప్రజలను ఉద్దేశించి ఆల్ ఇండియా రేడియోలో బ్రెజ్నెవ్ ప్రసంగించారు.

ఫొటో సోర్స్, Getty Images
1971 యుద్ధం తర్వాత రెండేళ్లకు తిరిగి భారత్‌లో పర్యటన
1973 నవంబరులో బ్రెజ్నెవ్ రెండోసారి భారతదేశాన్ని సందర్శించారు. 1971 యుద్ధం జరిగి రెండేళ్లుకూడా పూర్తికాని ఆ సమయంలో బ్రెజ్నెవ్ భారత్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ సమయంలో బ్రెజ్నెవ్ సోవియట్ యూనియన్‌లో అత్యంత సీనియర్ నాయకుడు అయినప్పటికీ ఆయన ప్రభుత్వ అధిపతి కాదు. ప్రోటోకాల్ ప్రకారం బ్రెజ్నెవ్‌కు విమానాశ్రయంలో రాష్ట్రపతి కాకుండా ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ స్వాగతం పలికారు.
"ది స్మైల్ దట్ బ్రేక్ ఆల్ రికార్డ్స్" అనే ఆసక్తికరమైన శీర్షికను టైమ్స్ ఆఫ్ ఇండియా పెట్టింది. విమానాశ్రయంలో ఉన్నంతసేపూ ఆయన చిరునవ్వులు చిందిస్తూనే ఉండటంతో ఆ పేపర్ ఈ హెడ్ లైన్ పెట్టింది.
బ్రెజ్నెవ్‌ను ఆరు డోర్ల బుల్లెట్ ప్రూఫ్ మెర్సిడెస్ కారులో, 32 కార్ల కాన్వాయ్‌లో రాష్ట్రపతి భవన్‌కు తీసుకెళ్లారు. దారి పొడవునా వివిధ ప్రదేశాలలో పిల్లలు భాంగ్రా నృత్యాలతో బ్రెజ్నెవ్‌ను స్వాగతించారు.
బ్రెజ్నెవ్ దిల్లీ చేరుకునే ముందు రాష్ట్రపతి భవన్‌కు సోవియట్ రాయబార కార్యాలయం నుంచి రెండు వింత విజ్ఞప్తులొచ్చాయి. మొదటిది సోవియట్ అతిథుల కోసం రాష్ట్రపతి భవన్‌లోని ప్రతి బాత్రూమ్లో "లైఫ్‌బాయ్" సబ్బును ఉంచాలనేది.
భారత రాష్ట్రపతి సచివాలయ రికార్డుల ఫైనల్ నంబరు 30 ప్రకారం రాష్ట్రపతి భవన్ సిబ్బంది ఈ విజ్ఞప్తితో కొంత ఆశ్చర్యపోయారు. ఎందుకంటే రాష్ట్రపతి భవన్‌లోని బాత్రూమ్‌ల్లో సాధారణంగా విదేశీ అతిథుల కోసం ప్రపంచంలోనే అత్యుత్తమ బ్రాండ్ సబ్బులు ఉంచుతారు. ఆ సమయంలో భారత మార్కెట్లో లభించే అత్యంత చౌకైన సబ్బు లైఫ్‌బాయ్.
అయితే, రాష్ట్రపతి భవన్ హౌస్‌హోల్డ్ కంట్రోలర్ ప్రతి బాత్రూమ్‌లో టాప్ బ్రాండ్ల సబ్బులతో పాటు లైఫ్‌బాయ్ బార్‌ను ఉంచాలని ఆదేశించారు.

ఫొటో సోర్స్, Getty Images
తినే ముందు ఆహారం తనిఖీ
సోవియట్ వైపు నుండి వచ్చిన రెండో విజ్ఞప్తి బ్రెజ్నెవ్ బస చేసిన ద్వారకా సూట్ కిటికీలకు మందపాటి కర్టెన్లు వేయాలని. రాష్ట్రపతి భవన్ సిబ్బందిని ఈ డిమాండ్ కూడా ఆశ్చర్యపరిచింది.
ఎందుకంటే రాష్ట్రపతి భవన్ అనేక వందల ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దాని ముందు రోడ్డు లేదు. కాబట్టి ట్రాఫిక్ శబ్దం బ్రెజ్నెవ్ బెడ్ రూమ్ వరకు చేరుకునే అవకాశం లేదు. సాధారణంగా ఎవరైనా విదేశీ అతిథి సందర్శించే సమయంలో భద్రతను కఠినతరం చేస్తారు.
అయితే సోవియట్ రాయబార కార్యాలయం నుంచి వచ్చిన ఈ డిమాండ్ కూడా నెరవేరింది. అధ్యక్ష భవనం దగ్గర నివసించేవారు కిటికీల నుంచి బయటకు చూడవద్దని లేదా ఎలాంటి శబ్దం చేయవద్దని ఆదేశించారు. బ్రెజ్నెవ్ గదిలో రెండు అధిక-నాణ్యత గల ఎలక్ట్రిక్ ఇస్త్రీలు, ఇస్త్రీ బోర్డు అమర్చాలనేది మరో ఆసక్తికరమైన విజ్ఞప్తి.
ఆహారం విషయానికొస్తే ప్రతి గదిలోని రిఫ్రిజిరేటర్లలో పైనాపిల్, జామ, ద్రాక్ష రసం ఉంచారు. బ్రెజ్నెవ్‌కు వడ్డించే మాంసం, చికెన్, పౌల్ట్రీ నాణ్యతను వైద్యులు తనిఖీ చేయాలనే డిమాండ్ కూడా ఉంది. బ్రెజ్నెవ్ ప్రతినిధి బృందంలోని ఒక సభ్యునికి ఈ తనిఖీ బాధ్యతను ప్రత్యేకంగా అప్పగించారు.
బ్రెజ్నెవ్‌కు ఉడికించిన బంగాళాదుంపలతో హిల్సా చేపలు తినడం ఇష్టమని అధ్యక్ష భవనంలోని సిబ్బందికి చెప్పారు. స్నాక్‌గా మయోన్నైస్ లేదా మసాలా దినుసులు లేని సలాడ్‌ను బ్రెజ్నేవ్ ఇష్టపడ్డారు. క్యాబేజీ సూప్‌ను కూడా ఆస్వాదించారు.
బ్రెజ్నెవ్ "సినందలి", "ముకుజాని" డ్రై వైన్లను మాత్రమే తాగుతారని, "బోర్జోమి" "నూర్జాన్" కంపెనీలకు చెందిన మినరల్ వాటర్ మాత్రమే కావాలని కూడా సమాచారమిచ్చారు.
విదేశాంగ మంత్రిత్వ శాఖ సహాయంతో వాటిని అధ్యక్ష భవనంలో ఏర్పాటు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎర్రకోట వద్ద బ్రెజ్నెవ్‌కు పౌర గౌరవం
ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా లెటర్ బాంబుల సంఘటనలు నమోదయ్యాయి. అందుకే సోవియట్ అతిథుల కోసం ఉద్దేశించిన మెయిల్‌ను నేరుగా వారికి పంపే బదులు సోవియట్ రాయబార కార్యాలయానికి ఫార్వార్డ్ చేయాలని రాష్ట్రపతి భవన్‌లోని పోస్ట్‌మాస్టర్‌కు సూచించారు.
బ్రెజ్నెవ్ పర్యటన కోసం ప్రత్యేక కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీని కోసం సామగ్రిని సోవియట్ యూనియన్ నుంచి ప్రత్యేకంగా దిగుమతి చేసుకున్నారు. ఏడు ట్రక్కుల్లో దాదాపు 20 టన్నుల పరికరాలను రాష్ట్రపతి భవన్‌కు తరలించారు.
బ్రెజ్నెవ్ ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి సోవియట్ యూనియన్ నుంచి వైద్యుల బృందం కూడా వచ్చింది. మరుసటి రోజు ఇందిరా గాంధీని బ్రెజ్నెవ్ ఆమె కార్యాలయంలో కలిశారు. 35 నిమిషాల సమావేశం తర్వాత రెండు దేశాల ప్రతినిధి బృందాలు సౌత్ బ్లాక్‌లోని మీటింగ్ హాల్‌లో సమావేశమయ్యాయి.
సాయంత్రం బ్రెజ్నెవ్ గౌరవార్థం ప్రధానమంత్రి ఇందిరా గాంధీ రాష్ట్రపతి భవన్‌లో విందును ఏర్పాటు చేశారు. విందు మెనూను వివరిస్తూ ‘ది స్టేట్స్‌మన్’ పత్రిక ఇలా రాసింది, "విందులో క్రీమ్ దోడియు, కబాబ్‌లతో తందూరీ చికెన్, నాన్, కాలీఫ్లవర్ భుజియా, స్టఫ్డ్ టమోటాలు, పచ్చి బఠానీలు, సలాడ్, పాపడ్, పండ్లు, కాఫీ ఉన్నాయి. విందు తర్వాత, ఇందిరా గాంధీ ముదురు పసుపు రంగు సిల్క్ చీర కట్టుకుని హిందీలో ప్రసంగించారు. 1971 నాటి ఇండో-సోవియట్ స్నేహ ఒప్పందం ఏ దేశానికీ వ్యతిరేకంగా లేదని ఆమె అన్నారు"
విందు తర్వాత, సంగీత కళా అకాడమీ కళాకారులు అతిథుల కోసం అశోకా హాల్‌లో కథక్, మణిపురి నృత్యాలను ప్రదర్శించారు. మరుసటి రోజు ఇందిరా గాంధీ తన మనవరాలు ప్రియాంకను బ్రెజ్నెవ్‌ను కలవడానికి రాష్ట్రపతి భవన్‌కు తీసుకువచ్చారు. ఎర్రకోట వద్ద బ్రెజ్నెవ్‌కు పౌర స్వాగతం లభించింది. అక్కడ బ్రెజ్నెవ్ 90 నిమిషాలపాటు ప్రసంగించారు. దానిని ఒక అనువాదకుడు హిందీలోకి ట్రాన్స్‌లేట్ చేశారు.
మరుసటి రోజు ఇందిరా గాంధీ తన మనవడు రాహుల్‌ను బ్రెజ్నెవ్‌కు పరిచయం చేయడానికి తీసుకువచ్చారు. బ్రెజ్నెవ్‌కు రాహుల్ మాట్లాడే మైనాను బహూకరించారు. సాయంత్రం బ్రెజ్నెవ్ భారత పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు. తన మునుపటి పర్యటనలో లభించని అవకాశం ఈసారి బ్రెజ్నెవ్‌కు లభించింది.

ఫొటో సోర్స్, Getty Images
అఫ్గానిస్తాన్ విషయంలో విభేదాలు
ఏడు సంవత్సరాల తర్వాత, ఇందిరాగాంధీ తిరిగి అధికారంలోకి వచ్చిన అనంతరం 1980 డిసెంబరులో బ్రెజ్నెవ్ భారతదేశాన్ని మూడోసారి సందర్శించారు. ఆ సమయానికి బ్రెజ్నెవ్ చాలా వృద్ధుడయ్యారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది.
సోవియట్ దళాలను అఫ్గానిస్తాన్‌లో మోహరించిన కారణంగా బ్రెజ్నెవ్ ప్రాణాలకు ముప్పు పెంచింది. దీనిని దృష్టిలోపెట్టుకుని బ్రెజ్నెవ్ కోసం మాస్కో నుంచి ఒక ప్రత్యేక కారును తెప్పించారు. ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నడపడానికి డ్రైవర్‌ను కూడా సోవియట్ యూనియన్ నుంచి తీసుకొచ్చారు. సోవియట్ కార్ల నంబర్ ప్లేట్‌లపై భారత జాతీయ చిహ్నాన్ని ఉంచారు.
రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి నిర్వహించిన విందుకు ప్రధానమంత్రి, అప్పటి ప్రణాళికా సంఘం సభ్యుడు తర్వాత భారత ప్రధానమంత్రి అయిన మన్మోహన్ సింగ్ హాజరయ్యారు. ఇతర అతిథులలో అటల్ బిహారీ వాజ్‌పేయి, భూపేష్ గుప్తా, మార్క్సిస్ట్-కమ్యూనిస్ట్ నాయకుడు ఇఎంఎస్ నంబూద్రిపాద్ ఉన్నారు.
విందులో బ్రెజ్నెవ్‌కు పాంఫ్రెట్ ఫిష్, హుస్సేని కబాబ్, పనీర్ కట్లెట్స్, పనీర్ కొర్మా, స్విస్ స్లావ్ వడ్డించారు. విందు తర్వాత తన ప్రసంగంలో సంజీవరెడ్డి అఫ్గానిస్తాన్ గురించి ప్రస్తావించలేదు. మరుసటి రోజు ఇందిరా గాంధీ, బ్రెజ్నెవ్ అఫ్గానిస్తాన్ సమస్య గురించి చర్చించారుగానీ ఇద్దరూ ఈ విషయంలో విభేదించుకున్నారు.
"ది హిందూ" పత్రిక 1980 డిసెంబరు 10నాటి సంచికలో ఇలా రాసింది.
"అఫ్గానిస్తాన్‌లో సోవియట్ చర్య భారత్‌పై ప్రభావం చూపుతుందని ఇందిరా గాంధీ బ్రెజ్నెవ్‌కు స్పష్టం చేశారు. ఏ దేశమైనా మరొక దేశం అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని భారత్ వ్యతిరేకిస్తుందని అఫ్గానిస్తాన్ పేరు చెప్పకుండానే ఇందిర అన్నారు"
"భారతదేశానికి వచ్చిన బ్రెజ్నెవ్‌కు అనుకున్న ఆదరణ లభించలేదని న్యూయార్క్ టైమ్స్ వ్యాఖ్యానించింది"
ఈసారి కూడా బ్రెజ్నెవ్‌కు పౌర స్వాగతం లభించిందిగానీ భద్రతా కారణాల దృష్ట్యా వేదికను ఎర్రకోట నుంచి విజ్ఞాన్ భవన్‌కు మార్చారు.
భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి గౌరవార్థం సోవియట్ రాయబార కార్యాలయంలో బ్రెజ్నెవ్ ఏర్పాటు చేసిన విందుతో ఆయన పర్యటన ముగిసింది. ఆయన పాలం విమానాశ్రయానికి బయలుదేరినప్పుడు ప్రజలు వీధుల్లో బారులు తీరి "లాల్ సలాం", "హిందీ-రూసీ భాయీ...భాయీ" అని నినాదాలు చేస్తూ ఆయనకు వీడ్కోలు పలికారు.
బ్రెజ్నెవ్ తర్వాతి రెండు సంవత్సరాలు సోవియట్ యూనియన్‌కు నాయకత్వం వహించారు. 1982 నవంబరు 10న 75 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించారు. ఆయన భార్య విక్టోరియా బ్రెజ్నెవా 1995 వరకు జీవించారు.
(ఈ వ్యాసంలో పేర్కొన్న అధికారిక సమాచారాన్ని భారత రాష్ట్రపతి సచివాలయం రికార్డుల నుండి సేకరించారు.)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














