పుతిన్-మోదీ సమావేశం: ఏయే కీలక ఒప్పందాలు జరిగాయి?

ఫొటో సోర్స్, Getty Images
న్యూదిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం స్వాగతం పలికారు.
భారత్, రష్యా మధ్య 23వ వార్షిక సమావేశం ఇక్కడ ప్రారంభమైంది. రక్షణ, వాణిజ్యం, ఇంధనం, ఆర్థిక సహకారం వంటి కీలక రంగాలలో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం ఈ సమావేశ లక్ష్యం.
నాలుగేళ్ల తర్వాత రెండు రోజుల పర్యటన నిమిత్తం పుతిన్ భారతదేశానికి వచ్చారు. ఉదయం, రాజ్‌ఘాట్ సందర్శించిన పుతిన్ మహాత్మా గాంధీ స్మారకం వద్ద నివాళులర్పించారు. అక్కడి సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు.
రాజ్‌ఘాట్‌కు చేరుకునే ముందు, పుతిన్‌కు రాష్ట్రపతి భవన్‌లో సాదర స్వాగతం లభించింది. త్రివిధ దళాలు గౌరవ వందనం సమర్పించాయి. ఆయనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ స్వాగతం పలికారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా, సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, ఇరు దేశాల సీనియర్ అధికారులు హాజరయ్యారు.
రష్యా నుంచి రక్షణ మంత్రి ఆండ్రీ బెలోసోవ్, క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వంటి ఉన్నతాధికారులు పుతిన్‌తో వచ్చారు.


ఫొటో సోర్స్, Narendra Modi
ఏయే ఒప్పందాలు చేసుకున్నారు?
ఇరుదేశాల మధ్య సహకారం, వలసలు, ఆరోగ్య సంరక్షణ, వైద్య విద్య, ఆహార భద్రత, ప్రమాణాలు, సముద్ర సహకారం, ఎరువులు, పోలార్ షిప్స్పై ఒప్పందాలు కుదిరాయి.
"ఆర్థిక సహకారాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడం మా ఉమ్మడి ప్రాధాన్యం. దీనిని సాధించడానికి, ఈ రోజు మేం 2030 వరకు ఆర్థిక సహకార కార్యక్రమానికి అంగీకరించాం. ఇది మన వాణిజ్యం, పెట్టుబడులను వైవిధ్యభరితంగా, సమతుల్యంగా, స్థిరంగా చేస్తుంది" అని ప్రధాని మోదీ అన్నారు.
"ఇవాళ భారత్-రష్యా బిజినెస్ ఫోరమ్‌కు హాజరయ్యే అవకాశం నాకు, అధ్యక్షుడు పుతిన్‌కు లభించింది. ఈ ఫోరమ్ మా వ్యాపార సంబంధాలకు కొత్త బలాన్ని ఇస్తుందని భావిస్తున్నాను. ఇది ఎగుమతులు, సహ-ఉత్పత్తి, సహ-నవీకరణకు కొత్త ద్వారాలను కూడా తెరుస్తుంది" అని చెప్పారు మోదీ.
"రెండు దేశాల మధ్య కనెక్టివిటీని పెంచడం మా ప్రాధాన్యత. ఐఎన్ఎస్‌టీసీ, నార్తర్న్ సీ రూట్, చెన్నై-వ్లాడివోస్టాక్ కారిడార్‌లో కొత్త శక్తితో మేం ముందుకు సాగుతాం. ధ్రువ జలాల్లో భారతీయ నావికులకు శిక్షణ ఇవ్వడంలో సహకరించుకుంటాం. ఇది ఆర్కిటిక్ ప్రాంతంలో మా సహకారానికి కొత్త బలాన్ని ఇవ్వడమే కాకుండా, భారత యువతకు కొత్త ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తుంది"
"నౌకా నిర్మాణంలో సహకారం మేక్ ఇన్ ఇండియాను బలోపేతం చేయగలదు. ఇది ఉపాధి, నైపుణ్యాలు, ప్రాంతీయ అనుసంధానం పెంచుతుంది" అన్నారు మోదీ.
"పౌర అణుశక్తి రంగంలో దశాబ్దాల నాటి సహకారం క్లీన్ ఎనర్జీ ఉమ్మడి ప్రాధాన్యతలో ముఖ్యమైనది" అని మోదీ చెప్పారు.
"మేం ఈ సహకారాన్ని కొనసాగిస్తాం. ప్రపంచవ్యాప్తంగా సురక్షితమైన, వైవిధ్యభరితమైన సరఫరా గొలుసులను నిర్ధరించడంలో కీలకమైన ఖనిజాలలో సహకారం చాలా ముఖ్యమైనది. ఇది క్లీన్ ఎనర్జీ, హైటెక్ మ్యానుఫాక్చరింగ్, నూతన పరిశ్రమలలో మా భాగస్వామ్యాలకు దృఢమైన మద్దతును అందిస్తుంది"
"ఇటీవల, రష్యాలో భారతదేశానికి చెందిన రెండు కొత్త కాన్సులేట్‌లు ప్రారంభించారు. ఇది రెండు దేశాల పౌరుల మధ్య సంబంధాలు, సాన్నిహిత్యాన్ని పెంచుతుంది. ఈ సంవత్సరం అక్టోబర్‌లో కల్మికియాలోని అంతర్జాతీయ బౌద్ధ వేదికలో లక్షలాది మంది భక్తులు బుద్ధుని పవిత్ర అవశేషాల ఆశీర్వాదాలను పొందారు" అని ప్రధాని మోదీ అన్నారు.
"వృత్తి విద్య, నైపుణ్య అభివృద్ధి, శిక్షణపై కూడా మేం కలిసి పని చేస్తాం. రెండు దేశాల నుంచి విద్యార్థులు, పండితులు, క్రీడా సంబంధిత వ్యక్తుల మార్పిడిని కూడా పెంచుతాం"
"పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి అయినా లేదా క్రోకస్ సిటీ హాల్‌పై పిరికి దాడి అయినా, వీటన్నింటికీ ఒకే మూలం ఉంది. ఉగ్రవాదం మానవాళి విలువలపై ప్రత్యక్ష దాడి అని భారత్ నమ్ముతోంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచం ఐక్యంగా ఉండటం మన అతిపెద్ద బలం. ఐక్యరాజ్యసమితి, జీ20, బ్రిక్స్, ఎస్‌సీఓ ఇతర వేదికలలో రెండు దేశాల మధ్య సన్నిహిత సహకారం ఉంది" అన్నారు మోదీ.

ఫొటో సోర్స్, Narendra Modi
భారత్ తటస్థంగా లేదన్న మోదీ
హైదరాబాద్ హౌస్‌లో జరిగిన ద్వైపాక్షిక చర్చల సందర్భంగా భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్, ప్రధానమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి శక్తికాంత దాస్, ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను మోదీ ప్రశంసిస్తూ, "మీ ఈ పర్యటన చాలా చరిత్రాత్మకమైనది. మీరు పదవీ బాధ్యతలు స్వీకరించి 25 సంవత్సరాలు అయింది, ఆ సమయంలోనే మొదటిసారి భారత్‌ను సందర్శించారు. మీ మొదటి పర్యటనలోనే మన వ్యూహాత్మక భాగస్వామ్యానికి బలమైన పునాది పడింది"అన్నారు.
"ఇది నాకు వ్యక్తిగతంగా కూడా చాలా ఆనందాన్ని కలిగించే విషయం. 2001లో మీరు పోషించిన పాత్ర, ఒక దార్శనిక నాయకుడు ఎలా ఆలోచిస్తాడో, ఆయన ఎక్కడి నుంచి ప్రారంభిస్తారు, సంబంధాన్ని ఎంత దూరం తీసుకెళ్లగలరో చూపిస్తుంది. భారత్-రష్యా సంబంధాలు దీనికి ఉత్తమ ఉదాహరణ" అన్నారు మోదీ.
యుక్రెయిన్ సంక్షోభంపై మోదీ మాట్లాడుతూ "యుక్రెయిన్ సంక్షోభం నుంచి మేం నిరంతరం చర్చలు జరుపుతున్నాం. మీరు కూడా, నిజమైన స్నేహితుడిలా ఎప్పటికప్పుడు ప్రతి విషయాన్ని మాకు తెలియజేస్తున్నారు. ఈ నమ్మకం మన సంబంధానికి గొప్ప బలం" అన్నారు.
"శాంతికి మార్గాన్ని కనుగొనడానికి మనందరం కలిసి పనిచేయాలి. ఇటీవలి కాలంలో జరుగుతున్న ప్రయత్నాలు ప్రపంచం మళ్లీ శాంతి వైపు తిరిగి వస్తుందనే పూర్తి విశ్వాసాన్ని నాకు ఇస్తున్నాయి"
"భారతదేశం తటస్థంగా లేదని నేను ప్రతీసారి చెబుతున్నాను. భారత్ ఒక వైఖరిని కలిగి ఉంది, అది శాంతి కోసం. శాంతి కోసం చేసే ప్రతి ప్రయత్నానికి మేం మద్దతు ఇస్తాం. భుజం భుజం కలిపి నిలబడతాం" అన్నారు మోదీ.

ఫొటో సోర్స్, DD News
పుతిన్ ఏం చెప్పారు?
భారత ప్రధాని మోదీతో చాలాసార్లు మాట్లాడినట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పారు. "మేం టెలిఫోన్‌లో అనేక ముఖ్యమైన అంశాలపై చర్చిస్తూనే ఉన్నాం. రష్యా, భారత్ మధ్య పరస్పర సంబంధాలు చాలా బలంగా ఉన్నాయి. ఆర్థిక విషయాల్లోనే కాకుండా అనేక రంగాలలో సంబంధాలు బలపడుతున్నాయి" అన్నారు పుతిన్.
"మా వాణిజ్యం రూబిల్, రూపాయలలో జరుగుతుంది. మేం 'మేక్ ఇన్ ఇండియా'లో సహకరిస్తాం. రెండు దేశాలు లాజిస్టిక్స్ మార్గాల సృష్టి గురించి కూడా చర్చిస్తున్నాయి. మేం హిందూ మహాసముద్ర మార్గం గురించి కూడా మాట్లాడుతున్నాం. ప్రధాని మోదీ హృదయానికి దగ్గరగా ఉన్న మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో సహాయం చేయడానికి కూడా మేం సిద్ధంగా ఉన్నాం" అని పుతిన్ తెలిపారు.
"మేం వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికతపై చర్చలను ముందుకు తీసుకెళ్తున్నాం. రష్యా, భారత ఆర్థిక సహకార సంస్థ కలిసి పనిచేస్తున్నాయి" అన్నారాయన.
నిరంతర ఇంధన సరఫరా
భారతదేశానికి "నిరంతర ఇంధన సరఫరాలను" కొనసాగించడానికి రష్యా సిద్ధంగా ఉందని పుతిన్ ప్రకటించారు. భారత్‌లో అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి సహాయం చేసే రష్యా 'ఫ్లాగ్‌షిప్ ప్రాజెక్ట్' గురించి కూడా పుతిన్ ప్రస్తావించారు.
రష్యా టుడే (ఆర్టీ) న్యూస్ నెట్‌వర్క్ ఇండియా బ్యూరో ఈరోజు ప్రారంభం కావడం వల్ల భారత ప్రజలు రష్యా గురించి మరింత తెలుసుకునే అవకాశం లభిస్తుందని పుతిన్ అభిప్రాయపడ్డారు.
రష్యాలో ఏం జరుగుతుందో ప్రజలు తెలుసుకోవడానికి, ఆర్టీ భారతదేశంలో "నిష్పాక్షికమైన, వాస్తవ ఆధారిత సమాచారాన్ని" ప్రసారం చేస్తుందని పుతిన్ చెప్పారు.
విదేశాంగ విధానంపై భారత్-రష్యా సహకారాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. బ్రిక్స్ దేశాలతో కలిసి భారత్, రష్యా 'మరింత న్యాయమైన', 'బహుళధృవ ప్రపంచం' కోసం కృషి చేస్తున్నాయని పుతిన్ అన్నారు. రక్షణ, సైనిక రంగాలలో కూడా రెండు దేశాలు బలమైన సహకారాన్ని అభివృద్ధి చేస్తున్నాయని చెప్పారు.
బ్రిక్స్ అనేది అభివృద్ధి చెందుతున్న పెద్ద దేశాల సమూహం. ప్రారంభంలో ఇందులో భారత్, రష్యా, చైనా, బ్రెజిల్ ఉన్నాయి. తర్వాత దక్షిణాఫ్రికా చేరింది. ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థలో అమెరికా, యూరప్ 'ఏకపక్ష ఆధిపత్యాన్ని' సవాలు చేయడానికి, అభివృద్ధి చెందుతున్న దేశాల స్వరాన్ని బలోపేతం చేయడానికి 2006లో ఈ గ్రూపు ఏర్పడింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













