రూ.90కి దగ్గర్లో డాలర్ విలువ, రూపాయి పతనం ఆర్థిక వేగానికి బ్రేకులు వేస్తుందా? నిపుణులు ఏమంటున్నారు..

డాలరు, రూపాయి, ద్రవ్యోల్బణం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, దిల్‌నవాజ్ పాషా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

డిసెంబర్ 4, 2025 గురువారం నాడు డాలర్ విలువ రూ.89.63 వద్ద ట్రేడైంది.

భారతదేశ వాస్తవ జీడీపీ వృద్ధి రేటు 2025-26 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో 8.2 శాతంగా ఉందని భారత ప్రభుత్వం ఇటీవల నివేదించింది.

ఒకవైపు ఈ బలమైన ఆర్థిక వృద్ధి గణాంకాలు ఉండగా, మరోవైపు భారతీయ రూపాయి విలువ దినదినం పడిపోతూనే ఉంది. అమెరికా డాలర్ విలువ దాదాపు రూ. 90మార్క్‌కు చేరుకునే పరిస్థితి ఏర్పడింది.

గత ఆర్థిక సంవత్సరంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ అత్యల్ప స్థాయి డాలర్‌కు రూ. 84.22 కాగా, ఐదేళ్ల కిందట అంటే జనవరి 2021లో అది రూ.72.

గడచిన ఐదేళ్లుగా, భారత రూపాయి విలువ అమెరికా డాలర్‌తో పోలిస్తే నిరంతరం పడిపోతోంది. అయితే ఈ కాలంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 'సవ్యంగా', ప్రపంచంలోని చాలా దేశాల కంటే 'మెరుగ్గా' ఉంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

2030 నాటికి జీడీపీ 7.3 ట్రిలియన్ డాలర్లుగా ఉండొచ్చని భారత్ అంచనా వేసింది. అయితే, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) మాత్రం భారతదేశపు జీడీపీ, నేషనల్ అకౌంట్స్‌ డేటాకు ‘సి’ రేటింగ్ ఇవ్వడం ద్వారా దాని కచ్చితత్వంపై సందేహాలు లేవనెత్తింది.

ఈ డేటాను ఐఎమ్ఎఫ్ నాలుగు వర్గాలుగా విభజిస్తుంది. సి గ్రేడ్ అంటే డేటాలో కొన్ని లోపాలు ఉన్నాయని అర్థం.

నవంబర్ 26న విడుదలైన ఒక నివేదికలో, భారత్‌కు 'సి’ గ్రేడ్ ఇచ్చింది ఐఎమ్ఎఫ్.

8.2శాతం వృద్ధిరేటు గణాంకాలు వచ్చిన తర్వాత కూడా షేర్ మార్కెట్‌లో ఆశించినంత ఉత్సాహం కనిపించకపోవడం విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

అదే సమయంలో రూపాయి బలహీనత కొనసాగింది.

రూపాయి పతనం, విలువ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికా డాలర్‌తో పోలిస్తే ఐదేళ్లుగా భారత రూపాయి విలువ పతనమవుతూనే ఉంది.

ప్రభావం ఎలా ఉండనుంది?

2025-26 ఆర్థిక సంవత్సరంలో, డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి 6.19 శాతం క్షీణించగా, ఒక్క గత నెలలోనే 1.35 శాతం తగ్గుదల నమోదైంది.

"రూపాయి బలహీనత అంతర్జాతీయంగా భారత ఆర్థిక వ్యవస్థకు ప్రతిష్ఠ తగ్గుతోందని సూచిస్తోంది" అని జేఎన్‌యూ ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు.

వాణిజ్య లోటు, విదేశీ పెట్టుబడుల నిష్క్రమణ (డేటా ప్రకారం,16 బిలియన్ డాలర్లకుపైగా ఈక్విటీ ఔట్‌ఫ్లో), అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందంలో ఆలస్యంలాంటివి దీనికి కారణాలు.

‘‘ ట్రంప్ అధిక సుంకాలు మన ఎగుమతులను దెబ్బతీశాయి. దీని వలన కరెంట్ అకౌంట్ క్షీణించడంతో ఎఫ్‌డీఐ బయటకు వెళ్తోంది. ఈ అంశాలన్నీ కలిసి రూపాయి బలహీనతకు దారితీస్తాయి" అని ప్రొఫెసర్ అరుణ్ కుమార్ అన్నారు.

భారత జీడీపీ వృద్ధి రేటు, రూపాయి బలహీనతను కలిపి చూడటం సరైన అంచనా కాదని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్‌లో ఆర్థికవేత్త యామిని అగర్వాల్ అభిప్రాయపడ్డారు.

ఆహార ద్రవ్యోల్బణం, జీడీపీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆహార ద్రవ్యోల్బణం తగ్గడం జీడీపీ మెరుగుదలకు కారణమని భావిస్తున్నారు.

"డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ అంతర్జాతీయ డిమాండ్, సరఫరాపై ఆధారపడి ఉంటుంది. ఇది డిసెంబర్ నెల. ఈ టైంలో బ్యాలెన్స్ షీట్‌లను సమీక్షిస్తారు. ఎందుకంటే ఇది అంతర్జాతీయంగా 'క్లోజింగ్ టైమ్'. అందువల్ల, భారతదేశంలోని చాలా మంది విదేశీ పెట్టుబడిదారులు, ఇతర పెట్టుబడిదారులు తమ దేశంలో బ్యాలెన్స్ షీట్‌లను బలంగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు" అని యామిని చెప్పారు.

రూపాయి పతనం భారత్‌లోని దేశీయ మార్కెట్‌పై కూడా ప్రభావం చూపిస్తుందని ప్రొఫెసర్ అరుణ్ కుమార్ అంటున్నారు.

డోనల్డ్ ట్రంప్, సుంకాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ట్రంప్ అధిక సుంకాలు భారతదేశ ఎగుమతులపై ప్రభావం చూపాయని విశ్లేషకులు భావిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)

జీడీపీ వృద్ధి రేటు మెరుగైన సంకేతమా?

2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్) భారతదేశ ఆర్థిక వ్యవస్థ 8.2% వాస్తవ జీడీపీ వృద్ధిని నమోదు చేసింది. ఇది అంచనాల కంటే చాలా ఎక్కువ.

గత ఏడాది ఇదే త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 5.6%గా ఉండటంతో ఇది నిజమే అనుకోవాలి. గత ఆరు నెలల్లో ఇది అత్యంత వేగవంతమైన వృద్ధి రేటు.

‘‘దీనికి ప్రధాన కారణం ప్రైవేట్ వినియోగం పెరగడం. ఆహార ద్రవ్యోల్బణం తగ్గడం. దీని కారణంగా విచక్షణా వ్యయం కూడా పెరుగుతోంది" అని క్రిసిల్ (క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) చీఫ్ ఎకనామిస్ట్ డీకే జోషి అన్నారు.

భారత వృద్ధి అంచనాను క్రిసిల్ 6.5 శాతం నుంచి 7 శాతానికి పెంచింది.

భారతదేశ వృద్ధి గణాంకాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. కానీ వాటి విశ్వసనీయత గురించి కూడా సందేహాలున్నాయి.

ఐఎమ్ఎఫ్, క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్

‘‘ జీడీపీ గణన నాణ్యతపై ప్రశ్నలు లేవనెత్తింది ఐఎమ్ఎఫ్. భారతదేశ అసంఘటిత రంగానికి సంబంధించిన డేటా అందుబాటులో లేదు. దీని ఆధారం 2011-12కి చెందింది. ఇది పాతది. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కూడా అప్‌డేట్ చేయలేదు. ఉత్పత్తి, వ్యయ పద్ధతిలో గణనీయమైన అసమానతలు ఉన్నాయి. రాష్ట్రాలు, స్థానిక సంస్థలకు సంబంధించిన ఏకీకృత డేటా 2019 తర్వాత అందుబాటులో లేదు. ఈ కారణాల వల్ల, మన జీడీపీ డేటా విశ్వసనీయత బలహీనంగా ఉంది. అందువల్ల, చాలామంది 8.2% వృద్ధి రేటును అంగీకరించట్లేదు" అని ప్రొఫెసర్ అరుణ్ కుమార్ అంటున్నారు.

అయితే, యామిని అగర్వాల్ 8.2 శాతం వృద్ధి రేటును భారత ఆర్థిక వ్యవస్థకు సానుకూల సంకేతంగా భావిస్తున్నారు.

‘‘జీడీపీ వృద్ధి అన్ని ఆర్థిక సూచికలను ప్రతిబింబిస్తూ, భారత ఆర్థిక వ్యవస్థ మంచి పనితీరు చూపుతోందని సూచిస్తోంది. జీఎస్‌టీ రేట్ల తగ్గింపు ఈ త్రైమాసికంలో ప్రత్యక్ష సానుకూల ప్రభావాన్ని చూపింది. అయితే, తక్కువ ద్రవ్యోల్బణం ఆందోళన కలిగించే విషయం. జీఎస్‌టీ, ధరల తగ్గుదలే ప్రతి ద్రవ్యోల్బణానికి దారితీస్తోంది. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి" అని ప్రొఫెసర్ అగర్వాల్ అన్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)