ఆన్‌లైన్ కంటెంట్ నియంత్రణకు స్వతంత్ర సంస్థ ఉండాలని సుప్రీం కోర్టు ఎందుకు సూచించింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అభిక్ దేవ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆన్‌లైన్‌లో యూజర్ జనరేటెడ్ కంటెంట్‌ను నియంత్రించడానికి ‘‘ప్రభావాలకు అతీతమైన’’ ఓ స్వతంత్ర సంస్థ ఉండాలని సుప్రీంకోర్టు గురువారం మౌఖికంగా సూచించింది.
అశ్లీల, చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను తొలగించడానికి ఎక్కువ సమయం తీసుకోవడం ద్వారా స్వీయ నియంత్రణ వ్యవస్థలు ఆన్‌లైన్ కంటెంట్‌ను నియంత్రించడంలో విఫలమయ్యాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తి జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చిలతో కూడిన ధర్మాసం వ్యాఖ్యానించింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో 'ఇండియాస్ గాట్ లాటెంట్' అనే యూట్యూబ్ షోలో వివాదాస్పద వ్యాఖ్యలపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను సవాలు చేస్తూ పాడ్‌కాస్టర్ రణ్‌వీర్ అలహాబాదియా మరికొంతమంది దాఖలు చేసిన పిటిషన్లపై ధర్మాసనం విచారణ జరుపుతోంది.
అలాగే ఈ కేసు పరిధిని విస్తరించిన సుప్రీంకోర్టు గత మార్చిలో యూట్యూబ్ సహా ఇతర ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌లలో అశ్లీలతపై నియంత్రణ కోసం నిబంధనలు రూపొందించే అవకాశాన్ని పరిశీలించాలని కేంద్రప్రభుత్వానికి సూచించింది.
గురువారం ఈ కేసు విచారణ సందర్భంగా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో యూజర్ జనరేటెడ్ కంటెంట్ విషయంలో జవాబుదారీతనం లోపించడంపై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు.
‘‘నేను సొంతంగా ఛానెల్ పెట్టుకుంటాను, నేను ఎవరికీ జవాబుదారీని కాను అంటే ఎలా'' అని ఆయన వ్యాఖ్యానించినట్లు 'లైవ్ లా' పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రాతినిధ్యం వహించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ, వాక్ స్వాతంత్య్రం విశృంఖలత్వానికి దారితీయకూడదన్నారు.
అయితే, సుప్రీంకోర్టు సూచనలు కొంతమంది కంటెంట్ క్రియేటర్‌లు, డిజిటల్ రైట్స్ యాక్టివిస్టులలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఆన్‌లైన్ కంటెంట్‌ను నియంత్రించడానికి ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటుచేయడమనేది సెన్సార్‌షిప్‌కి దారితీస్తుందనేది వారి ఆందోళన.


ప్రస్తుత నియంత్రణ ఎలా ఉంది?
ప్రస్తుతం, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో యూజర్-జనరేటెడ్ కంటెంట్‌కు సంబంధించిన నిబంధనలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్-2021కు లోబడి ఉన్నాయి.
ప్రస్తుత నిబంధనల ప్రకారం, చట్టవిరుద్ధమైన ఏ కంటెంట్‌ను అయినా తొలగించడానికి యూట్యూబ్ సహా ఇతర సాంకేతిక అనుసంధాన వేదికలు (Intermediary platforms) బాధ్యత వహిస్తాయి.
అశ్లీలత, అభ్యంతరకరమైన కంటెంట్‌ను తొలగించాలని ఏదైనా ఇంటర్‌మీడియరీ ప్లాట్‌ఫామ్‌కు ప్రభుత్వ సంస్థ నోటీసు పంపితే, ఆ ఆదేశాన్ని 36 గంటలలోపు కచ్చితంగా పాటించాలని నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. ఇంటర్‌నెట్ వినియోగదారుడెవరైనా ఫిర్యాదు చేస్తే, 24 గంటలలోపు ఆ కంటెంట్‌ను గుర్తించి, 15 రోజులలోపు తగిన చర్యలు తీసుకోవాలి.
ఈ దృష్ట్యానే, ప్రస్తుత వ్యవస్థలో చట్టవిరుద్ధమైన కంటెంట్‌కు వ్యతిరేకంగా తీసుకొనే 'ప్రతిస్పందన సమయం', తరుచుగా దాని ప్రధాన ఉద్దేశాన్ని నెరవేర్చడంలో విఫలమవుతోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
''కంటెంట్ ఏదైనా జాతి వ్యతిరేకమైనదిగానో, లేదా సామాజిక నిబంధనలను ఉల్లంఘించినట్లుగానో ఉందని భావించినప్పుడు, ఆ కంటెంట్ క్రియేటర్ బాధ్యత వహిస్తారా? స్వీయ నియంత్రణ సరిపోతుందా?'' అని జస్టిస్ జాయ్‌మాల్య ప్రశ్నించారని 'లైవ్ లా' పేర్కొంది.
ఆ దుర్భాష లేదా కించపరిచే కంటెంట్ ఒకసారి అప్‌లోడ్ అయిన తర్వాత అధికారులు ప్రతిస్పందించేసరికి అది లక్షలాది మంది వీక్షకుల మధ్య వైరల్ అవుతుంది, దాన్ని మీరు ఎలా నియంత్రిస్తారు? అని న్యాయమూర్తి ప్రశ్నించారు.
ఈ కారణాల రీత్యానే ప్రభుత్వ ప్రభావం లేని ఒక స్వతంత్ర సంస్థ అవసరమని సుప్రీంకోర్టు సూచించింది.
యూజర్-జనరేటెడ్ కంటెంట్‌ను నియంత్రించడానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రజాసంప్రదింపుల తర్వాత నాలుగు వారాల్లోగా రూపొందించాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు 'ది హిందుస్తాన్ టైమ్స్' నివేదించింది.

ఫొటో సోర్స్, Getty Images
కొత్త నైతిక నియమావళి ఇదేనా?
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రూల్స్-2021 ద్వారా అమలుచేస్తున్న సామాజిక మాధ్యమాల ప్రవర్తనా నియమావళి (డిజిటల్ మీడియా కోడ్ ఆఫ్ ఎథిక్స్)ను సమూలంగా మార్పుచేసే ఒక కొత్త ప్రవర్తనా నియమావళి (ఎథిక్స్ కోడ్)ని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఇప్పటికే పరిశీలిస్తోంది.
ఈ మార్పుల ప్రతిపాదన కాపీ ప్రస్తుతానికి బహిరంగంగా అందుబాటులో లేనప్పటికీ, బీబీసీ దాన్ని సంపాదించింది.
ప్రతిపాదిత మార్పులలో, ఆన్‌లైన్‌లో క్యూరేట్ చేసిన కంటెంట్‌ను ఏయే వయస్సుల వారు వీక్షించవచ్చో రేటింగ్ (యూ, యూ/ఏ, ఏ వంటివి) ఇవ్వడానికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. అశ్లీలతను, అనుమతిలేని ఇతర కంటెంట్‌ను నిర్వచించడానికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా అది సూచిస్తుంది.
ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా సృష్టించిన కంటెంట్ విషయానికొస్తే, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గత నెలలో ప్రజాభిప్రాయం కోసం ప్రచురించిన ముసాయిదా నుంచి నిబంధనలను ఈ ప్రతిపాదిత సవరణలో ప్రభుత్వం చేర్చనుంది.
ఈ సవరణలు అమలులోకి వస్తే, అన్ని రకాల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, ఓటీటీ స్ట్రీమింగ్ సర్వీసులు, డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫామ్‌లలోని డిజిటల్ కంటెంట్‌లన్నింటికీ వర్తిస్తాయి.
ఐటీ విధానాలపై రిపోర్టింగ్‌లో అనుభవం ఉన్న జర్నలిస్టు అదితి అగర్వాల్ అశ్లీలతను నిర్వచించడానికి సంబంధించిన సవరణలోని నిబంధనలను ప్రధానంగా కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్ యాక్ట్-1995 పరిధిలోని ప్రోగ్రామ్ కోడ్ నుంచి తీసుకున్నట్లు ఉందని రాశారు.
ఈ ప్రతిపాదిత సవరణల కాపీని కోర్టుకు, అలాగే ఈ కేసుకు సంబంధించిన కక్షిదారులందరికీ పంపినట్లు, వారిలో ఒకరి తరఫున వాదిస్తున్న న్యాయవాది బీబీసీకి చెప్పారు. అయితే, ఈ విషయం కోర్టు పరిధిలో ఉన్నందున ఆ న్యాయవాది తన పేరును గోప్యంగా ఉంచాలని కోరారు.
ఈ కాపీని ధ్రువీకరించడానికి కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కార్యాలయాన్ని, ఆయన కార్యదర్శిని ఫోన్‌లో బీబీసీ సంప్రదించినా, ప్రతిస్పందన రాలేదు. ప్రభుత్వ స్పందన కోరుతూ ఆయా కార్యాలయాలకు బీబీసీ ఇ-మెయిల్ పంపింది. వారి నుంచి స్పందన వచ్చినట్లయితే ఈ కథనంలో అప్‌డేట్ అవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
సెన్సార్‌షిప్ వైపు దారితీస్తుందా?
సుప్రీంకోర్టు సూచనలు, కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనల నేపథ్యంలో డిజిటల్ రైట్స్ నిపుణులు, కంటెంట్ క్రియేటర్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
డిజిటల్ పాలసీ, మానవ హక్కులపై పనిచేసే స్వచ్ఛంద సంస్థ టెక్ గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రోగ్రామ్స్ హెడ్ ప్రతీక్ వాఘ్రే బీబీసీతో మాట్లాడుతూ, యూజర్-జనరేటెడ్ కంటెంట్ అనే పదం చాలా విస్తృతమైందని, ఈ పదాన్ని సుప్రీంకోర్టు ప్రత్యేకంగా నిర్వచించలేదని అన్నారు. ఆ పదం ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ లేదా సోషల్ మీడియా ప్లాట్‌ఫాంపై వ్యాఖ్య కూడా కావచ్చని అభిప్రాయపడ్డారు.
సుప్రీంకోర్టు సూచించిన స్వతంత్ర సంస్థ, కంటెంట్‌ను ప్రచురించడానికి ముందే పరిశీలిస్తుందా, లేదా తర్వాతా అనేదానిపై స్పష్టత లేదని వాఘ్రే అన్నారు. ఏమైనప్పటికీ, ఈ సంస్థ తాలూకా ప్రభావం వాక్ స్వాతంత్య్రాన్ని తీవ్రంగా నియంత్రించడమే అవుతుందని చెప్పారు.
''ఏ రూపంలోనైనా లేదా ఏ విధానంలోనైనా సరే, ఇది సురక్షితమైన భావ ప్రకటనపై తీవ్ర ప్రభావం చూపుతుంది, ఇక స్వేచ్ఛాయుత భావ ప్రకటన గురించి మర్చిపోండి'' అని ఆయన వ్యాఖ్యానించారు.
డాక్టర్ మెడుసా అనే స్క్రీన్ పేరుతో ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో లక్షల మంది ఫాలోవర్లు కలిగిన వ్యంగ్య రచయిత మాద్రి కాకోటి కూడా వాఘ్రే అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు సూచించిన స్వతంత్ర సంస్థ బయటి ప్రభావం లేకుండా ఉండటం అసాధ్యమని ఆమె బీబీసీతో అన్నారు.
సూత్రప్రాయంగా ఏ నియంత్రణ సంస్థ అయినా మంచి విధానానికి దోహదపడుతుందని, అయితే ప్రస్తుత ప్రభుత్వంలో గతానుభవాల(ట్రాక్ రికార్డు)ను చూస్తే, ఆ సంస్థను కొన్ని వర్గాలను హింసించడానికి దుర్వినియోగం చేయవచ్చని తనకు ఇప్పటికీ సందేహంగానే ఉందని ఆమె చెప్పారు.
కొత్త ప్రవర్తనా నియమావళిలో ప్రతిపాదనలపై మాద్రి కాకోటి స్పందిస్తూ, 'జాతి వ్యతిరేకం', 'అశ్లీలత' వంటి పదాలు చాలా విస్తృతమైనవని, ప్రభుత్వాన్ని విమర్శించే కంటెంట్ క్రియేటర్లను అణచివేయడానికి వాటిని తప్పుగా అన్వయించవచ్చని అన్నారు.
సైబర్ లా నిపుణుడైన సీనియర్ న్యాయవాది పవన్ దుగ్గల్ మాట్లాడుతూ, స్వతంత్ర సంస్థ ఉండాలని సూచించడం ద్వారా సుప్రీంకోర్టు సరిగ్గా సమస్యను గుర్తించిందన్నారు. చైల్డ్ పోర్నోగ్రఫీ, ఇతర అశ్లీల కంటెంట్ కేసులలో ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు వాటిని తొలగించడానికి తీసుకొనే సమయం, బాధితులను ప్రమాదంలో పడేస్తోందని చెప్పారు.
ఈ ఆందోళనలను పరిష్కరించడానికి ఒక యంత్రాంగాన్ని అందించడంలో ఐటీ రూల్స్-2021 విఫలమయ్యాయని, ఒక స్వతంత్ర సంస్థ ఉండటమనేది మరింత ప్రభావవంతమైన చర్యగా కనిపిస్తోందని పవన్ దుగ్గల్ అన్నారు.
అయితే, స్వతంత్ర సంస్థ వల్ల వాక్ స్వాతంత్య్రం ఉండదని, అది సెన్సార్‌షిప్ సంస్థగా పనిచేయవచ్చనే కొన్ని వర్గాల ఆందోళనపై ఆయన స్పందిస్తూ, అవసరమైన 'చెక్స్ అండ్ బ్యాలెన్సెస్' విధానాన్ని అమలుచేసే బాధ్యతను ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పారు.
''ప్రభుత్వం ఫలానా చర్య తీసుకుంటుందనేది స్పష్టమవ్వలేదు. కానీ 1990 దశాబ్దంలో కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్ కోసం రూపొందించిన చట్టం 2025లో ఇంటర్‌నెట్‌ను నియంత్రించడానికి ఉపయోగపడదు. మనకు మరింత ఆచరణాత్మకమైన, వాస్తవికమైన విధానం అవసరం'' అని న్యాయవాది పవన్ దుగ్గల్ అభిప్రాయపడ్డారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














