రణ్‌వీర్ అలహాబాదియాపై వివాదం ఏంటి,ఆయన ఎపిసోడ్లను ఎందుకు బ్లాక్ చేశారు?

ఇండియాస్ గాట్ లాటెంట్

'ఇండియాస్ గాట్ లాటెంట్' అనే షోలో రణ్‌వీర్ అలహాబాదియా చేసిన వ్యాఖ్యలపై పలుచోట్ల అనేక ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. దీంతో రణ్‌వీర్ అలహాబాదియా, సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

రణ్‌వీర్ అరెస్ట్‌ను నిలిపివేయాలంటూ తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది.

కొన్ని రోజుల కిందట, సుప్రీం కోర్టును ఆశ్రయించిన రణ్‌వీర్, తన కేసును తక్షణం విచారించాలని కోరారు.

రణ్‌వీర్ తరపున సుప్రీంకోర్టులో లాయర్ అభినవ్ చంద్రచూడ్ వాదనలు వినిపించారు.

రణ్‌వీర్ అలహాబాదియా తన కేసును అత్యవసరంగా విచారించాలని కోరినప్పుడు సరైన సమయంలో ఆ కేసును విచారిస్తామని చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా చెప్పారు. తర్వాత విచారణ తేదీని నిర్థరించారు.

మహారాష్ట్ర, అస్సాంలలో రణ్‌వీర్ అలహాబాదియాపై అనేక ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కావడంతో అరెస్ట్‌ నుంచి రక్షణ కోరుతూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అసలేం జరిగింది?

యూట్యూబర్, కమెడియన్ సమయ్ రైనా నిర్వహించే కార్యక్రమం 'ఇండియాస్ గాట్ లాటెంట్' బాగా ప్రాచుర్యం పొందింది. ప్రజాదరణతో పాటు అనేక వివాదాలు ఈ కార్యక్రమాన్ని చుట్టుముట్టాయి.

ఈ షోకు సంబంధించిన ఒక ఎపిసోడ్‌లో యూట్యూబర్ రణ్‌వీర్ అలహాబాదియా చేసిన ఒక వ్యాఖ్యపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆ వ్యాఖ్య చేస్తూ ఆయన ఉపయోగించిన భాష చాలా అసభ్యకరంగా ఉందని విమర్శిస్తున్నారు.

యూట్యూబర్లు ఆశిష్ చంచలానీ, అపూర్వ మఖిజా కూడా ఈ షోలో కనిపించారు. రణ్‌వీర్ ఆ షోలో పాల్గొన్న ఒక ప్రెజెంటర్‌ని, ఆయన కుటుంబం గురించి అభ్యంతరకరమైన ప్రశ్న అడిగారు.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల తర్వాత, 'ఇండియాస్ గాట్ టాలెంట్' షోలోని ఆ ఎపిసోడ్‌ను బ్లాక్ చేశారు. రణ్‌వీర్ అభ్యంతరకర వ్యాఖ్య చేసిన ఎపిసోడ్‌ను యూట్యూబ్ నుంచి తొలగించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

వివాదం తీవ్రమవుతుండటంతో ఫిబ్రవరి 12న సోషల్ మీడియాలో సమయ్ రైనా ఒక పోస్ట్ చేశారు.

"ఈ విషయంలో జరుగుతున్న పరిణామాలను తట్టుకోవడం నాకు కష్టంగా ఉంది. నా చానెల్ నుంచి ఇండియాస్ గాట్ లాటెంట్ షో వీడియోలు అన్నింటిని తొలగించాను. ప్రజలను నవ్వించడం, వారిని ఎంటర్‌టెయిన్ చేయడమే నా ఉద్దేశం. ఈ కేసుకు సంబంధించి అన్ని దర్యాప్తు సంస్థలకు నేను పూర్తిగా సహకరిస్తాను'' అని పోస్టులో ఆయన పేర్కొన్నారు.

భారత ప్రభుత్వ ఆదేశాల అనుసారం యూట్యూబ్ నుంచి ఇండియాస్ గాట్ లాటెంట్ షోలో రణ్‌వీర్ వ్యాఖ్యలు చేసిన ఎపిసోడ్‌ను బ్లాక్ చేసినట్లు భారత సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ సలహాదారు కంచన్ గుప్తా ట్వీట్ చేశారు.

ఈ కేసుకు సంబంధించి ముంబయి పోలీసులు కూడా ఒక ఫిర్యాదు నమోదు చేశారు. ఈ విషయాన్ని దర్యాప్తు చేయడానికి ముంబయి పోలీసు శాఖకు చెందిన ఒక బృందం హబీటట్ స్టూడియోకు వెళ్లింది. ఈ స్టూడియోలోనే ఆ ఎపిసోడ్‌ను చిత్రీకరించారు.

రణ్‌వీర్

తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి రణ్‌వీర్ అలహాబాదియా క్షమాపణలు చెబుతూ ఒక పోస్ట్ చేశారు.

''నా వ్యాఖ్యలు సరైనవి కావు. అవి జోక్ కూడా కాదు. హాస్యం చేయడం అనేది నా ఫీల్డ్ కాదు. దీనికి సంబంధించి నేనేం వివరణ ఇవ్వలేను. కానీ, నేను అందరిని క్షమించమని కోరుతున్నా. జరిగినది సరైనది కాదు. నేను ఎవరి కుటుంబాన్ని అవమానించలేదు. వివాదాస్పద వ్యాఖ్యలను తొలగించమని నిర్వాహకులను కోరాను.

నేను తప్పు చేశాను. మీరు నన్ను క్షమించండి. ఈ ప్లాట్‌ఫామ్‌ను నేను మెరుగ్గా ఉపయోగించుకొని ఉండాల్సింది. దీన్నుంచి నేనొక గుణపాఠం నేర్చుకున్నా'' అని రణ్‌వీర్ తన పోస్టులో పేర్కొన్నారు.

దేవేంద్ర ఫడ్నవీస్

ముఖ్యమంత్రి ఏమన్నారంటే?

ఈ అంశంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు.

''ఈ విషయం నా దృష్టికి కూడా వచ్చింది. కానీ, నేను ఆ వీడియోను చూడలేదు. చాలా తప్పుగా, అసభ్యకరమైన భాషలో మాట్లాడినట్లు తెలిసింది. అలా మాట్లాడటం చాలా తప్పు. ప్రతీ ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. కానీ, ఇతరుల స్వేచ్ఛను హరించేలా చేసినప్పుడు మన స్వేచ్ఛ అంతం అవుతుంది. సమాజంలో కొన్ని నియమాలు ఉంటాయి. వాటిని ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటాం'' అని అన్నారు.

రణ్‌వీర్ అలహాబాదియా చేసిన వ్యాఖ్యలను సీనియర్ జర్నలిస్టు, గీత రచయిత నీలేశ్ మిశ్రా తీవ్రంగా విమర్శించారు.

''డబ్బు కోసం ఈ స్థాయికి దిగజారుతున్నారు. భారత ప్రేక్షకులు ఇలాంటి వాటిని ప్రోత్సహించరు. సృజనాత్మకత పేరుతో నోటికొచ్చింది మాట్లాడుతున్నారు'' అని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రియాంక చతుర్వేది

ఫొటో సోర్స్, Getty Images

''పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ముందుకు తీసుకెళ్తాం''

'ఇండియాస్ గాట్ లేటెంట్' కార్యక్రమం గురించి ఐటీ, కమ్యూనికేషన్‌కు సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందుకు తీసుకెళ్తామని శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం)కు చెందిన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది హెచ్చరించారు.

కామెడీ పేరుతో ఇలాంటి చెత్త విషయాలు మాట్లాడటం సరికాదు. ఇలాంటి కార్యక్రమాలు పిల్లలు, యువత పై ప్రభావం చూపుతాయని, ఇవి పూర్తిగా చెత్త కంటెంట్‌ను అందిస్తాయని ఆమె అన్నారు.

గతంలోనూ వివాదాలు

'ఇండియాస్ గాట్ లేటెంట్' షో వివాదంలో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. అభ్యంతరకర వ్యాఖ్యల కారణంగా ఈ షోపై గతంలోనూ వివాదాలు వచ్చాయి.

'ఇండియాస్ గాట్ లేటెంట్' షోలో కమెడియన్ జేసీ నబమ్ అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు కుక్క మాంసం తింటారని వ్యాఖ్యానించడం వివాదానికి దారితీసింది. ఈ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అరుణాచల్ ప్రదేశ్‌లోని తూర్పు కమెంగ్ జిల్లాలోని సెపాక్‌కు చెందిన అర్మాన్ రామ్ వెలీ బఖా అనే వ్యక్తి ఇటానగర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఇదే కాకుండా బాలీవుడ్ నటి దీపికా పదుకొణే గర్భం దాల్చడం, ఆమె డిప్రెషన్ గురించి కూడా హేళన చేశారు. దీని తరువాత సమయ్‌ రైనా సామాజిక మాధ్యమాలలో ట్రోలింగ్‌కు గురయ్యారు.

రణ్‌వీర్

ఫొటో సోర్స్, @BeerBicepsGuy

ఫొటో క్యాప్షన్, రణవీర్ అలహాబాదీయ ఓ యూట్యూబర్

ఎవరీ రణవీర్ అలహాబాదీయా, సమయ్ రైనా?

రణవీర్ అలహాబాదీయ ఓ యూట్యూబర్. 'బీర్‌బైసెప్స్' పేరుతో నడిచే షోకు హోస్ట్‌గా ఉన్నారు. దేశంలోని ప్రసిద్ధ వ్యక్తులను ఈ షోలో ఆయన ఇంటర్వ్యూలు చేస్తుంటారు.

ఆయన 'నేషనల్ క్రియేటర్ అవార్డు'ను 2024లో ప్రధాని మోదీ నుంచి అందుకున్నారు. 2022లో ఫోర్బ్స్‌ ప్రచురించిన ఆసియా 30 అండర్ 30 జాబితాలోనూ రణవీర్ చోటు సాధించారు.

సమయ్ రైనా

ఫొటో సోర్స్, @ReheSamay

ఫొటో క్యాప్షన్, సమయ్ రైనా ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్

సమయ్ రైనా ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్, స్టాండప్ కమెడియన్. యూట్యూబ్‌లో 'ఇండియాస్ గాట్ లేటెంట్' అనే షో నిర్వహిస్తుంటారు. 70 లక్షలమంది ఫాలోయర్లు ఉన్న ఈయన జమ్ము కశ్మీర్‌కు చెందినవారు. ఈయన సంపాదన కోట్లలోనే ఉంటుందని అంచనా.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)