సుప్రీంకోర్ట్ గత 75 ఏళ్లలో దళితుల హక్కులను కాపాడింది.. కానీ, వారి విషయంలో సరైన భాష వాడలేదా? తాజా అధ్యయనం ఏం చెప్తోంది?

సుప్రీంకోర్టు, దళితులు

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, భారతదేశంలో సుమారు 16 కోట్ల మంది దళితులు ఉన్నారు.
    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దేశంలో అత్యంత దారుణమైన కుల వివక్షను ఎదుర్కొన్న దళితుల హక్కులను కాపాడటంలో సుప్రీంకోర్టు కీలకంగా వ్యవహరించింది.

కానీ, న్యాయస్థానం ఇప్పటికీ కుల శ్రేణులను(కాస్ట్ హైరార్కీస్) ప్రతిబింబించే భాషను ఉపయోగిస్తోందని ఒక కొత్త అధ్యయనం చెబుతోంది.

భారతదేశంలో సుమారు 16 కోట్ల మంది దళితులు ఉన్నారు. వీరిని గతంలో "అంటరానివారు" అనేవారు. వీరిలో చాలామంది ఇప్పటికీ పేదరికం, అవకాశాల లేమిని ఎదుర్కొంటున్నారు.

అనేక దశాబ్దాలుగా, దళితుల గురించి గౌరవప్రదంగా మాట్లాడటానికి న్యాయమూర్తులు ఇబ్బంది పడుతున్నారని కొత్త అధ్యయనం గమనించింది.

ఈ పరిశోధనకు మెల్‌బోర్న్ విశ్వవిద్యాలయం నిధులు సమకూర్చింది, సుప్రీంకోర్టుతో కలిసి ఈ అధ్యయనం చేపట్టారు. ఇది దేశంలోని 1950 నుంచి 2025 వరకు 75 సంవత్సరాల సుప్రీంకోర్టు కీలక తీర్పులను సమీక్షించింది. ఇవి అయిదుగురు, అంతకన్నా ఎక్కువ మంది న్యాయమూర్తులున్న ధర్మాసనం ఇచ్చిన తీర్పులు. ఈ కేసులు ముఖ్యమైనవి ఎందుకంటే అవి చట్టపరమైన ఉదాహరణలను నిర్దేశిస్తాయి. తరచుగా అధ్యయనం జరుగుతుంటాయి, వీటిని ఉటంకిస్తుంటారు కూడా.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కోర్టు, చట్టాలు

ఫొటో సోర్స్, Getty Images

అధ్యయనంలో తేలిందేంటి?

అనేక తీర్పులు దళితుల హక్కులకు మద్దతు ఇచ్చినప్పటికీ, కొన్ని తీర్పులలోని పదాలు సున్నితత్వం లేకుండా ఉన్నాయని ఈ అధ్యయనం గుర్తించినట్లు మెల్‌బోర్న్ లా స్కూల్ ప్రొఫెసర్, అధ్యయనకర్తలలో ఒకరైన ఫరా అహ్మద్ అన్నారు.

కొన్నితీర్పులు కుల అణచివేతను వైకల్యంతో పోల్చాయి, అణచివేతకు గురైనవారు సహజంగానే తక్కువ స్థాయిలో ఉంటారని సూచించాయి.

కొన్ని తీర్పులు సామాజిక అడ్డంకులను గుర్తించడానికి బదులుగా, విద్య మాత్రమే కుల వివక్షను అంతం చేయగలదని ఊహిస్తూ, దళితులపైనే బాధ్యతను ఉంచాయి. దళితులు ఉద్యోగాలు, రుణాలు, మార్కెట్లను పొందకుండా నిరోధిస్తూ, వారిని పేదలుగా మార్చే కుల ఆధారిత అడ్డంకులను మరికొన్ని తీర్పులు విస్మరించాయి.

కొన్ని సందర్భాల్లో, న్యాయమూర్తులు దళితులను 'ఆర్డినరీ హార్సెస్' అన్నారు, అదేసమయంలో ఉన్నత కులాలను 'ఫస్ట్ క్లాస్ రేస్ హార్సెస్'తో పోల్చారు. కొంతమంది న్యాయమూర్తులు దళితులకు రిజర్వేషన్లు, ఇతర మద్దతు 'క్రచెస్(ఊతకర్ర)' లాంటివని, వాటిపై ఎక్కువ కాలం ఆధారపడకూడదని అన్నారు.

కులం మొదట్లో అపాయం లేనిదిగా, శ్రమ విభజనగా మాత్రమే ప్రారంభమైందని కొంతమంది న్యాయమూర్తులు అన్నారు.

కానీ, "అణచివేతకు గురైన కులాలను విలువ తగ్గించిన లేదా తక్కువ జీతం ఉన్న పనులకే పరిమితం చేసే అన్యాయమైన స్థితికి ఇది మద్దతు ఇస్తోంది" అని పరిశోధకులు అంటున్నారు.

సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, సుప్రీంకోర్టు

'ఆ పదాలు గౌరవప్రదం కాదు'

2020లో వచ్చిన ఒక తీర్పు, షెడ్యూల్డ్ తెగల లేదా అట్టడుగున ఉన్న గిరిజనుల ఆదిమ జీవన విధానం వారిని ప్రధాన స్రవంతి సమాజానికి, సాధారణ చట్టాలకు అనర్హులుగా చేసిందని, ఆదిమ సంస్కృతిలో ఉండటానికి బదులుగా జాతీయ అభివృద్ధిలో భాగం కావడానికి వారికి 'చేయూత' అవసరమని పేర్కొంది.

ఈ భాష కేవలం పేలవమైన పదాలు మాత్రమే కాదని, దళితుల గురించి అన్యాయమైన నమ్మకాలను బలపరుస్తుందని అధ్యయనం అభిప్రాయపడింది.

"దళితులను జంతువులతో లేదా వైకల్యాలున్నవారితో పోల్చడం ఎవరికీ గౌరవప్రదం కాదు. అసలు సమస్య ఏమిటంటే, దళితులకు విజయం సాధించడానికి అవసరమైన మద్దతును అందించడంలో సమాజం విఫలమవడం" అని ప్రొఫెసర్ ఫరా అహ్మద్ అన్నారు.

ఈ 'కించపరిచే అభిప్రాయాలు' దళితుల హక్కులకు మద్దతు ఇచ్చే తీర్పులలో కూడా కనిపించాయని అధ్యయనం కనుగొంది.

"న్యాయమూర్తులు వారు ఉపయోగిస్తున్న భాష తెచ్చే చిక్కులు, వారి వైఖరిని ఎలా చూపుతుందో నిజంగా గ్రహించలేదని భావిస్తున్నాను. ఈ సందర్భాలలో దేనిలోనూ, దళిత ప్రజలను అవమానించే లేదా కించపరిచే ఉద్దేశం ఉందని నేను అనుకోను" అని ఫరా అహ్మద్ అన్నారు.

ఇంతకీ, ఈ భాషా పక్షపాతం కోర్టు తార్కికతను లేదా ఫలితాలను ప్రభావితం చేస్తుందా, లేదా ప్రగతిశీల నిర్ణయాలతో కలిసి ఉండే పక్షపాతమా?.

కుల వ్యవస్థను తక్కువగా చూసే, కించపరిచే పదాలతో సహా ఈ రకమైన భాష న్యాయమూర్తుల నిర్ణయాలపై ప్రభావం చూపకపోతే నాకు ఆశ్చర్యమే అని ప్రొఫెసర్ ఫరా అహ్మద్ బీబీసీతో చెప్పారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తులు భారతీయ సమాజాన్ని, రాజకీయాలను విస్తృతంగా ప్రభావితం చేస్తారు; వారి భాష ముఖ్యమైనది ఎందుకంటే అది విస్తృతంగా రిపోర్టవుతుంది, చర్చిస్తుంటారు.

కెజి బాలకృష్ణన్, సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Hindustan Times via Getty Images

ఫొటో క్యాప్షన్, 2007, 2010 మధ్య కేజీ బాలకృష్ణన్ సుప్రీంకోర్టుకు మొదటి దళిత ప్రధాన న్యాయమూర్తి.

'వేరే ఉద్దేశం లేదు'

కుల వివక్షను పరిష్కరించడానికి కోర్టు కూడా చురుకుగా చర్యలు తీసుకుంది. గత సంవత్సరం అక్టోబర్‌లో, ఒక దర్యాప్తు నివేదికను సమీక్షించిన తర్వాత, కుల ఆధారిత వివక్షను తొలగించడానికి జైలు నియమాలను నవీకరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. కార్మికుల విభజన, బ్యారక్‌లను వేరు చేయడం, అణగారిన వర్గాలను అన్యాయంగా లక్ష్యంగా చేసుకున్న జైలు నియమాలలో పక్షపాతాన్ని ఈ రిపోర్ట్ ప్రస్తావించింది.

ఏదైనా పాతకాలపు లేదా సమస్యాత్మక భాష ఉద్దేశపూర్వకంగా ఉపయోగించరని కూడా చాలామంది న్యాయమూర్తులు అభిప్రాయపడుతున్నారు.

"కోర్టులు ఎల్లప్పుడూ మారుతున్న భాషతో అనుగుణంగా ఉండకపోవచ్చు, కానీ దాని వెనుక ఎటువంటి వేరే ఉద్దేశం లేదు" అని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ లోకూర్ బీబీసీకి చెప్పారు.

ఆగస్టు 2023లో, సుప్రీంకోర్టు "కామ్‌బాటింగ్ జెండర్ స్టీరియోటైప్" హ్యాండ్‌బుక్‌ను విడుదల చేసింది. న్యాయమూర్తులు, న్యాయవాదులు నివారించాల్సిన లింగ-పక్షపాత పదాల జాబితా ఇందులో ఉంది. ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వైకల్యాలున్న వ్యక్తులు, అలాగే లైంగిక హింస కేసులలో అగౌరవకరమైన లేదా వివక్షతతో కూడిన భాషను తొలగించడం దీని లక్ష్యం.

కులం గురించి రాసేటప్పుడు న్యాయమూర్తులు మెరుగైన భాషను ఉపయోగించడంలో ఇలాంటి హ్యాండ్‌బుక్ సహాయపడుతుందా?.

దళితులు భాగమైనపుడే..

"న్యాయమూర్తులు కులం గురించి రాసే విధానాన్ని మార్చడంలో ఈ నివేదిక మొదటి అడుగు మాత్రమే" అని ప్రొఫెసర్ ఫరా అహ్మద్ అన్నారు.

ఇలాంటి అంతర్గత అధ్యయనాలు మరిన్ని అవసరమని ఆమె అన్నారు. అణగారిన కులాల ప్రజలను న్యాయ వ్యవస్థలో పూర్తిగా చేర్చినపుడు న్యాయవాదులు, న్యాయమూర్తులు, న్యాయశాస్త్ర ప్రొఫెసర్లు/పరిశోధకులు కుల సమస్యలను బాగా అర్థం చేసుకుంటారని ప్రొఫెసర్ ఫరా అహ్మద్ అభిప్రాయపడ్డారు.

భారత సుప్రీంకోర్టులో దళితుల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది. "మా అంచనా ప్రకారం, సుప్రీంకోర్టులో ఎనిమిది మంది దళిత న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారు" అని పరిశోధకులు తెలిపారు.

గత ఆరు నెలలుగా బిఆర్ గవాయ్ భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఈ పదవిని చేపట్టిన రెండవ దళితుడు ఆయన. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తన పదవీకాలం ముగియడంతో ఆయన గతవారం పదవీ విరమణ చేశారు.

మొదటి దళిత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కెజి బాలకృష్ణన్, ఆయన రెండు కేసులను ఈ అధ్యయనంలో పరిశీలించారు. ఆయన అభిప్రాయాలను నివేదికలో తరచుగా ప్రస్తావించారు.

జస్టిస్ బాలకృష్ణన్ తీర్పుల ప్రకారం, కులం అనేది 'విచ్ఛిన్నం కాని బంధం', ఇది దళితులను 'అపరిశుద్ధమైన' వృత్తిలోకి నెట్టివేస్తుంది. ఇది ఎలాంటిదంటే, 'మరణం కూడా తప్పించుకోలేదు', ఎందుకంటే కుల వివక్షత స్మశానవాటికలు, దహన సంస్కార స్థలాల్లోనూ ఉంటుంది.

కుల వివక్షతను తక్కువగా చూసిన తీర్పులలో ఈ అభిప్రాయం చాలా భిన్నంగా ఉందని పరిశోధకులు చెప్పారు. ఈ వ్యత్యాసం సుప్రీంకోర్టుకు "విభిన్న దృక్కోణాలు ముఖ్యంగా అణగారిన కులాల నుంచి అత్యవసరంగా అవసరం"అని చూపిస్తుందని తెలిపారు.

రాజకీయాలకు అతీతంగా కనిపించే కోర్టుకు, ఈ నివేదిక ఆత్మపరిశీలన చేసుకునే అరుదైన క్షణం. కుల సమానత్వం కోసం పోరాటమనేది కేవలం చట్టాలు, తీర్పుల కోసమే కాకుండా, న్యాయమూర్తులు ఉపయోగించే రూపకాలు, పోలికలు, రోజువారీ భాష గురించి కూడా అని ఇది చూపిస్తుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)