సుప్రీంకోర్టుకు కాబోయే ప్రధాన న్యాయమూర్తి గతంలో తీసుకున్న కీలక నిర్ణయాలు, ఆయనపై ఉన్న వివాదాలేంటి?

ఫొటో సోర్స్, ANI
- రచయిత, ఉమంగ్ పోద్దార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తదుపరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను నియమిస్తున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అక్టోబర్ 30న ఉత్తర్వులు జారీ చేశారు.
జస్టిస్ సూర్యకాంత్ 2025 నవంబర్ 24న ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయన ఇటీవలి ప్రధాన న్యాయమూర్తుల కంటే 15 నెలలు ఎక్కువగా అంటే 2027 ఫిబ్రవరి వరకు చీఫ్ జస్టిస్‌గా ఉంటారు.
ప్రధాన న్యాయమూర్తి భారత న్యాయ వ్యవస్థకు ప్రధాన అధికారి. న్యాయమూర్తిగా కేసులను నిర్ణయించడమే కాకుండా, సుప్రీంకోర్టుకు సంబంధించిన పాలనాపరమైన విషయాలపైనా నిర్ణయం తీసుకుంటారు.
ఒక కేసును ఎప్పుడు విచారించాలి, దానిని ఏ న్యాయమూర్తికి కేటాయించాలని నిర్ణయించడం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు ఉండే ప్రధాన అధికారాల్లో ఒకటి.
ఇటీవల చర్చనీయాంశంగా మారిన అనేక అంశాల్లో జస్టిస్ సూర్యకాంత్ వార్తల్లో నిలిచారు. బిహార్‌లో 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్', హాస్యనటుడు సమయ్ రైనాతో ముడిపడిన ‘ఇండియాస్ గాట్ లాటెంట్’ వివాదం, అశోక విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అలీఖాన్ మెహుమూదాబాద్ అరెస్టులాంటి కొన్ని కేసులు ఇందులో ఉన్నాయి.


ఫొటో సోర్స్, ANI
న్యాయవృత్తిలోకి ఎలా వచ్చారు?
జస్టిస్ సూర్యకాంత్ హరియాణాలో 22 ఏళ్ల వయసులో న్యాయవాద వృత్తిలోకి వచ్చారు. ఏడాది తర్వాత1985లో చండీగఢ్‌లోని పంజాబ్, హరియాణా హైకోర్టులో ప్రాక్టీస్ మొదలు పెట్టారు. 16ఏళ్లు లాయర్‌గా పని చేశాక హరియాణా అడ్వకేట్ జనరల్‌గా నియమితులయ్యారు.
అప్పుడాయనకు 38 ఏళ్లు. అంత చిన్న వయసులో అడ్వకేట్ జనరల్ కావడం అరుదు. అప్పటికి ఆయన సీనియర్ అడ్వకేట్ కూడా కాదు.
2001లో ఆయన సీనియర్ అడ్వకేట్‌గా పదోన్నతి పొందారు.
2004లో పంజాబ్ హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2019 వరకు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు, ఆ తర్వాత ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు.
అయితే ఈ మధ్య కాలంలో ఆయనపై అనేక తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. వీటి గురించి కారవా అనే పత్రిక కథనాలు రాసింది. ఈ కథనాల్లో రాసిన దాని ప్రకారం, 2012లో జస్టిస్ సూర్యకాంత్ పలు ఆస్తులను కొనుగోలు చేసేటప్పుడు, అమ్మేటప్పుడు వాటి విలువను తక్కువగా చేసి చూపించి మోసాలకు పాల్పడ్డారని సతీశ్ కుమార్ జైన్ అనే వ్యాపారవేత్త అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు.
ఇలా చేయడం వల్ల ఆయన 7 కోట్ల రూపాయల విలువైన లావాదేవీలపై పన్నులు చెల్లించలేదని ఆ నివేదిక పేర్కొంది. 2017లో పంజాబ్‌లో కొంతమందికి బెయిల్ ఇచ్చేందుకు జస్టిస్ సూర్యకాంత్ లంచాలు తీసుకున్నారని సుర్జీత్‌సింగ్ అనే ఖైదీ ఆరోపించినట్లు కారవా పత్రిక కథనం తెలిపింది.

ఫొటో సోర్స్, ANI, BBC
ఈ ఆరోపణలపై చర్చ జరిగినప్పటికీ, వాటిపై చర్య తీసుకున్నారా లేదా అనే దానిపై స్పష్టత లేదు.
జస్టిస్ సూర్యకాంత్‌ను హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని ప్రతిపాదించినప్పుడు, కారవా, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికల్లో ఆయనపై వచ్చిన కథనాల గురించి అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయెల్ అప్పటి ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాకు ఒక లేఖ రాశారు.
జస్టిస్ సూర్యకాంత్‌పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని తాను 2017లో కోరానని అయితే దాని గురించి ఏం జరిగిందో తనకు తెలియదని ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు.
ఆరోపణలపై దర్యాప్తు జరిగే వరకు జస్టిస్ సూర్యకాంత్‌ను హిమాచల్ ప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తిగా నియమించరాదని కూడా ఆయన పేర్కొన్నారు.
అయితే జస్టిస్ సూర్యకాంత్‌పై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 2019లో రాసిన ఒక లేఖలో పేర్కొంది. జస్టిస్ సూర్యకాంత్‌పై వచ్చిన ఆరోపణల గురించి సుప్రీంకోర్టును, జస్టిస్ సూర్యకాంత్‌ను బీబీసీ వివరణ కోరింది. వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. వారి స్పందన రాగానే ఈ కథనంలో చేరుస్తాం.
జస్టిస్ సూర్యకాంత్ ఆస్తులు, సంపద చర్చల్లో నిలిచింది. 2025 మేలో సుప్రీంకోర్టు తొలిసారి తన వెబ్‌సైట్‌లో న్యాయమూర్తుల ఆస్తులను బహిరంగంగా ప్రకటించింది. జస్టిస్ సూర్యకాంత్ తనకు 8 ఆస్తులు, కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు ఉన్నట్లు ప్రకటించారు.

ఫొటో సోర్స్, Getty Images
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా..
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ఆరేళ్లుగా అనేక కీలక కేసుల విచారణలో భాగమయ్యారు.
ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన కేసు, దేశద్రోహ చట్టానికి వ్యతిరేకంగా విచారణ, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తల ఫోన్లలో పెగాసస్ సాఫ్ట్‌వేర్ ఉందనే ఆరోపణలు, అస్సాంలో పౌరసత్వ సమస్య, అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి మైనారిటీ హోదాకు సంబంధించిన కేసుల విచారణలో ఆయన ఉన్నారు.
2022లో ప్రవక్త మొహమ్మద్ గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ బీజేపీ నాయకురాలు నూపుర్ శర్మను ఆయన మందలించారు. ఆమెపై దేశవ్యాప్తంగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.
అయితే, జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం అప్పట్లో నూపుర్ శర్మ అరెస్టును నిలిపివేసి అన్ని కేసులను దిల్లీకి బదిలీ చేసింది. ఈ ఫిర్యాదులను పరిష్కరించడానికి ఆమె దేశవ్యాప్తంగా ప్రయాణించకుండా నిరోధించింది.
ఆమె చేసిన వ్యాఖ్యల వల్ల జరిగిన హత్యలకు ఆమె బాధ్యురాలని జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ఈ కేసుతోపాటు, భావ ప్రకటనా స్వేచ్ఛకు సంబంధించిన అనేక కేసులను ఆయన విచారించారు.
ఇండియాస్ గాట్ టాలెంట్‌షోలో హాస్యనటుడు సమయ్ రైనా చేసిన కొన్ని వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఆదేశించింది.
ఈ ఏడాది మేలో భారత్- పాకిస్తాన్ సంఘర్షణ సమయంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు అశోక విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అలీ ఖాన్ మెహుమూదాబాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై దేశద్రోహ చట్టం కింద అభియోగాలు మోపారు. జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ఈ కేసుల కారణంగా కారణంగా జస్టిస్ సూర్యకాంత్‌ను భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమించిన తర్వాత కొందరు ఆయనను విమర్శించారు.
జస్టిస్ సూర్యకాంత్ మరో ముఖ్యమైన తీర్పుపై ఇంకా చర్చ జరుగుతోంది.
చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA)వంటి తీవ్రమైన చట్టాల కింద నిందితులుగా ఉన్నవారికి కూడా విచారణ ఆలస్యం అయితే బెయిల్ మంజూరు చేయాలని 2021లో ఒక కేసు విచారణలో చెప్పారు.
ఉపా కింద బెయిల్ పొందడం కష్టం. ఇప్పటికీ ఉపా కింద నమోదయ్యే కేసుల్లో కూడా బెయిల్ సులభంగా అందుబాటులో లేదు. అయితే జస్టిస్ సూర్యకాంత్ ఆదేశాలతో ఉపా కేసుల్లోని చాలామంది నిందితులకు బెయిల్ లభించింది. దిల్లీ అల్లర్ల కేసులో నిందితులు కూడా ఈ నిర్ణయం ఆధారంగా తమకు బెయిల్ ఇవ్వాలని కోరుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సీజేఐ అయితే ఎదురయ్యే సవాళ్లు
జస్టిస్ సూర్యకాంత్ కంటే ముందు ఇద్దరు ప్రధాన న్యాయమూర్తులు దాదాపు ఆరు నెలలు పనిచేశారు. జస్టిస్ డివై చంద్రచూడ్ పదవీకాలం దాదాపు రెండు సంవత్సరాలు.
జస్టిస్ చంద్రచూడ్ పదవీకాలంలో అనేక రాజ్యాంగ ధర్మాసనాలు ఏర్పడ్డాయి. ఇవి ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనాలు. ఇవి చట్టంలో కీలకమైన అంశాలను నిర్ణయిస్తాయి.
జస్టిస్ చంద్రచూడ్ తర్వాత, రాజ్యాంగ ధర్మాసన విచారణలు చాలా తక్కువగా జరిగాయి. జస్టిస్ సూర్యకాంత్ పదవీకాలంలో ఇది మారుతుందో లేదో చూడాలి.
దీంతో పాటు, జస్టిస్ సూర్యకాంత్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సుప్రీంకోర్టులో అనేక పెండింగ్ కేసులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది.
ఉదాహరణకు బిహార్ తర్వాత దేశవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ, 2019లో ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కేసులు, వైవాహిక అత్యాచారాన్ని నేరంగా ప్రకటించాలని పిటిషన్లు, ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామక ప్రక్రియ, మనీలాండరింగ్ చట్టానికి వ్యతిరేకంగా పిటిషన్లు, భారత్‌లో నివసిస్తున్న రోహింజ్యా శరణార్థుల బహిష్కరణ కేసు లాంటివి ఆయన పదవీ కాలంలో విచారణకు రానున్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














