రోహిణీ ఆచార్య: తండ్రికి ఒక కిడ్నీ దానం చేసిన ఈమె ఇప్పుడు తనకు కుటుంబమే లేదని ఎందుకు అంటున్నారు?

రోహిణీ ఆచార్య

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రోహిణీ ఆచార్య ప్రకటనతో బిహార్‌లోని లాలూ కుటుంబంపై అనేక రాజకీయ సందేహాలు రేకెత్తుతున్నాయి (ఫైల్ ఫోటో)
    • రచయిత, చందన్ కుమార్ జజ్‌వాడే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన కొన్ని గంటల్లోనే రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) నేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో అంతర్గత కలహాలు బహిర్గతమయ్యాయి.

తన కుటుంబంతో సంబంధాలు తెంచుకుంటున్నట్లు, రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నట్లు శనివారంనాడు ప్రకటించారు ఆర్‌జేడీ నాయకురాలు, లాలూ కుమార్తె రోహిణీ ఆచార్య.

ఆదివారం కూడా లాలూ కుటుంబం పై రోహిణీ ఆచార్య పలు ఆరోపణలు చేశారు.

తన తండ్రి లాలూ ప్రసాద్‌కు తన కిడ్నీలలో ఒకదాన్ని దానం చేసిన రోహిణీ ఆచార్య అప్పట్లో దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించారు.

అప్పుడు కుటుంబసభ్యులంతా భావోద్వేగ ప్రకటనలతో ఆమెతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.

ఇప్పుడు అదే రోహిణీ ఆచార్య తనకెలాంటి కుటుంబం లేదని అంటున్నారు.

ఆమె శనివారం మీడియాతో మాట్లాడుతూ, ''నాకు కుటుంబం లేదు. ఇప్పుడు మీరు (జర్నలిస్టులు) వెళ్లి సంజయ్, రమీజ్, తేజస్వీ యాదవ్‌లను అడగండి. వారు బాధ్యత తీసుకోదలచుకోలేదు కాబట్టి, వాళ్లే నన్ను కుటుంబం నుంచి బహిష్కరించారు. పార్టీ ఈ స్థితికి ఎందుకు చేరుకుందని యావత్ దేశం, యావత్ ప్రపంచం అడుగుతోంది'' అన్నారు.

ఈ వివాదం ఆమె సోదరుడు తేజస్వీ యాదవ్‌కు, ఆర్‌జేడీలో ఆయన సన్నిహితులకు ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టించవచ్చు.

అయితే, ఇప్పటివరకూ తేజస్వీగానీ, లాలూగానీ లేదా వారి కుటుంబ సన్నిహితులలో ఎవరూ ముందుకొచ్చి ఈ వివాదంపై మాట్లాడలేదు.

ఆర్‌జేడీ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ మాట్లాడుతూ, ''ఇది కుటుంబ వ్యవహారం. దీనిపై కుటుంబ సభ్యులే స్పందిస్తారు. పార్టీ అధిష్టానం ఈ మొత్తం విషయాన్ని పరిశీలిస్తోంది'' అని అన్నారు.

''రోహిణి ఆదర్శంగా నిలిచిన తీరు అందరికీ తెలుసు. రోహిణీ లాంటి కుమార్తె ఉండాలని ప్రతి తల్లి, ప్రతి తండ్రి, రోహిణీ లాంటి సోదరి ఉండాలని ప్రతి సోదరుడు కోరుకుంటారు'' అని ఆయన అన్నారు.

అయితే, రోహిణి తన ప్రకటనలో 'చాణక్య' అనే పదాన్ని ఉపయోగించారు. సాధారణంగా తేజస్వీకి సన్నిహితుడైన సంజయ్ యాదవ్‌ను ‘చాణక్య’ అని బిహార్ రాజకీయవర్గాల్లో పేర్కొంటుంటారు.

ఆర్‌జేడీ, తేజస్వీ యాదవ్‌లకు సంజయ్ యాదవ్ వ్యూహకర్తగా పని చేశారు. పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాల్లో ఆయన ముఖ్యపాత్ర పోషిస్తారని అంటుంటారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
రోహిణీ ఆచార్య

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రోహిణీ ఆచార్య ఫైల్ ఫోటో

తండ్రికి కిడ్నీ దానంతో రోహిణి వెలుగులోకి...

రోహిణీ ఆచార్య గత ఏడాది సారణ్ లోక్‌సభ స్థానం నుంచి ఆర్‌జేడీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

లాలూ ప్రసాద్ తొమ్మిది మంది సంతానంలో మీసా భారతి పెద్ద కుమార్తె కాగా, రోహిణి రెండో సంతానంగా 1979 జూన్ 1వ తేదీన పట్నాలో జన్మించారు.

జమ్‌షెడ్‌పూర్‌లోని ఎంజీఎం మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివారు రోహిణి. కానీ, వైద్య ‌వృత్తిని చేపట్టలేదు.

సింగపూర్‌కు చెందిన సమరేష్ సింగ్‌ను 2002 మే 24న వివాహం చేసుకున్నారు.

రోహిణి అత్తమామల స్వస్థలం ఔరంగాబాద్ (బిహార్) సమీపంలోని దావునగర్. వారికి రాజకీయ నేపథ్యమేమీ లేదు.

తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు 2022లో కిడ్నీ దానం చేసిన సందర్భంలో రోహిణి తన చిన్ననాటి ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ, ''నా తల్లిదండ్రులు నా పాలిట దేవుళ్లు. వారి కోసం నేను ఏదైనా చేయగలను...'' అని రాశారు.

ఆ సందర్భంలో ఆమె పలు భావోద్వేగమైన ట్వీట్లు చేశారు. తండ్రీకూతుళ్ల అనుబంధంపై అప్పట్లో పెద్ద చర్చ జరిగింది.

ఇప్పుడదే రోహిణి ప్రస్తుత వివాదానికి సంబంధించి తన తల్లిదండ్రులను కూడా నిందించారు. కుటుంబంతో తన సంబంధాన్ని వదులుకున్నట్లుగా మాట్లాడారు.

రాహుల్ గాంధీతో రోహిణి సోదరుడు, ఆర్‌జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్

ఫొటో సోర్స్, @yadavtejashwi

ఫొటో క్యాప్షన్, రాహుల్ గాంధీతో రోహిణి సోదరుడు, ఆర్‌జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ (ఫైల్ ఫోటో)

వివాదానికి కారణమేమిటి...

కుటుంబపరమైన ఇలాంటి వివాదాలు గతంలోనూ జాతీయ పార్టీల నుంచి ప్రాంతీయ పార్టీల వరకూ అనేకం బయటపడ్డాయి.

బిహార్‌‌లోనే అలాంటి వివాదమొకటి ఇటీవల కనిపించింది.

2021లో లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ)లో రామ్ విలాస్ పాశ్వాన్ సోదరుడు పశుపతి కుమార్ పారస్, మరో కుమారుడు చిరాగ్ పాశ్వాన్ మధ్య చీలిక వచ్చింది.

''ఆర్‌జేడీలో సంజయ్ యాదవ్ జోక్యం, తేజస్వీపై ఆయన నియంత్రణ పెరగడంపై సాధారణ కార్యకర్తల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీల వరకూ ఫిర్యాదు చేశారు. ఈ పరిస్థితిని తేజస్వీ ఎలా పరిష్కరిస్తారో చూడాలి. అదే అసలైన పరీక్ష'' అని సీనియర్ జర్నలిస్టు నళిన్ వర్మ అన్నారు.

లాలూ ప్రసాద్ యాదవ్ రాజకీయాల్లో చురుకుగా ఉన్నప్పుడు, ఆయన పార్టీ కార్యకర్తలకు, మద్దతుదారులకు అందుబాటులో ఉండేవారు. కానీ, ఇప్పుడు తేజస్వీ యాదవ్‌ను కలవడం పార్టీలోని ముఖ్యమైన నాయకులకు కూడా కష్టంగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి.

సంజయ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబసభ్యులు (ఫైల్ ఫోటో)

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, సంజయ్ యాదవ్ రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్ల దాఖలు కార్యక్రమానికి హాజరైన లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబసభ్యులు (ఫైల్ ఫోటో)

ఎవరీ 'చాణక్య' సంజయ్ యాదవ్?

''రమీజ్, సంజయ్ యాదవ్‌లపై రోహిణి పలు ఆరోపణలు చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రమీజ్ గురించి బహిరంగంగా ఎవ్వరికీ తెలియదు. రమీజ్‌ కూడా సంజయ్ యాదవ్‌లాగే క్రికెట్ మైదానం నుంచి తేజస్వీకి సన్నిహిత మిత్రుడు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన ప్రస్తుతం ఆర్‌జేడీ సోషల్ మీడియా, ఎన్నికల ప్రచార వ్యవహారాలను చూస్తున్నారు. పార్టీ నిర్ణయాల్లో ఆయన జోక్యం గురించి పెద్దగా తెలియదు'' అని సీనియర్ జర్నలిస్టు ఫైజాన్ అహ్మద్ చెప్పారు.

సంజయ్ యాదవ్‌కు పార్టీ నిర్ణయాల్లో పాత్ర ఉందని చెబుతున్నప్పటికీ, సాధారణంగా ఆయన తెర వెనుక మాత్రమే పనిచేశారు.

''తేజస్వీని సంజయ్ యాదవ్ తన గుప్పిట్లో పెట్టుకున్నారని చాలామంది ఆరోపించారు. లాలూ సమయంలో ప్రేమ్‌చంద్ గుప్తాపై ఇలాంటి ఫిర్యాదులే ఉండేవి. కానీ వాటిని లాలూ చక్కదిద్దుకున్నారు'' అని నళిన్ వర్మ అన్నారు.

తేజస్వీ యాదవ్, సంజయ్ యాదవ్ మధ్య స్నేహ బంధం ఎంత బలమైందంటే, ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నా వారిందరినీ పక్కనబెట్టి గత ఏడాది సంజయ్ యాదవ్‌ను పార్టీ అధిష్టానం రాజ్యసభకు పంపింది.

ఆర్‌జేడీ పార్టీ గుర్తింపును లాలూ ప్రసాద్ యాదవ్ ఛాయల నుంచి తప్పించి, దాన్ని తేజస్వీ యాదవ్‌తో ముడిపెట్టే ప్రయత్నంలో సంజయ్ యాదవ్‌కు కీలక పాత్ర ఉందని భావిస్తున్నారు.

ఆర్‌జేడీ ప్రభుత్వం ఏర్పాటుచేస్తే 10 లక్షల ఉద్యోగాలు ఇస్తానని 2020 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తేజస్వీ యాదవ్ హామీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఈ హామీతో ఆర్‌జేడీ గణనీయంగా లాభపడిందని చెబుతారు.

ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది ఆర్‌జేడీ. ఈ వ్యూహాన్ని సంజయ్ యాదవ్ రూపొందించారని అంటారు. దీంతో పార్టీలో ఆయన ప్రాధాన్యం పెరిగింది.

సంజయ్ యాదవ్ (ఫైల్ ఫోటో)

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, సంజయ్ యాదవ్ (ఫైల్ ఫోటో)

క్రికెట్ మైదానం నుంచే స్నేహం...

హరియాణా మహేంద్రగఢ్ జిల్లాలో నంగల్ సిరోహిలో 1984లో సంజయ్ యాదవ్ జన్మించారు. కంప్యూటర్ సైన్స్‌లో ఎమ్మెస్సీ చేశారు.

రాజ్యసభ వెబ్‌సైట్ వివరాల ప్రకారం, ఆయన శాశ్వత నివాసం దిల్లీలోని నజాఫ్‌గఢ్‌.

రాజకీయాల్లో ప్రవేశించకముందు తేజస్వీ యాదవ్ దిల్లీ క్రికెట్ మైదానంలో చెమటోడుస్తున్న రోజుల నుంచే సంజయ్ యాదవ్ ఆయనకు స్నేహితుడు.

తేజస్వీ కోసం ఒక బహుళజాతి సంస్థలో ఉద్యోగాన్ని వదులుకొని బిహార్‌కు మకాం మార్చారు.

అవసరాన్నిబట్టి పార్టీలో సంజయ్ యాదవ్ అనేక సాంకేతిక, డిజిటల్ మార్పులు చేయించారు.

ముస్లిం-యాదవ్ సామాజిక సమీకరణం గాకుండా బిహార్‌లో ఇతర వర్గాలతో, యువతతో మమేకం కావడానికి సంజయ్ వ్యూహం రూపొందించారని చెబుతారు.

ఆర్‌జేడీ నాయకులు

ఫొటో సోర్స్, Getty Images

గతంలోనే రోహిణి టార్గెట్ అయ్యారు...

సంజయ్ యాదవ్ వ్యూహాలతో తేజస్వీ యాదవ్, ఆర్‌జేడీలకు అన్నీ బాగా జరిగాయని చెప్పలేం. తేజస్వీని తన గుప్పిట్లో పెట్టుకొని, పార్టీలోని పాత తరం నాయకులను పక్కనబెట్టారని ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ.

ఆయనకు సంబంధించిన వివాదం ఒకటి ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో వెలుగులోకి వచ్చింది.

సెప్టెంబర్ 16న తేజస్వీ యాదవ్ బిహార్ అధికార్ యాత్ర ప్రారంభించిన సందర్భంలో సంజయ్ యాదవ్‌ ముందు వరుసలో కూర్చొన్నారు. దీనిపై రోహిణీ ఆచార్య తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.

అలాగే రోహిణి రాజకీయ ఆశయంపైనా సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది.

ఆ తర్వాత, రోహిణి తన సోదరుడు తేజస్వీ యాదవ్‌ను, తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్‌లను తన ఎక్స్ ఖాతా నుంచి అన్‌ఫాలో చేశారు.

''ఆర్‌జేడీకి బిహార్‌లో ఇప్పటికీ అతిపెద్ద ఓటుబ్యాంకు ఉంది. అందుకే ప్రస్తుత వివాదం చాలా పెద్దదిగా కనిపించినప్పటికీ, భవిష్యత్తులో దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పలేం'' అని నళిన్ వర్మ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)