జస్టిస్ దీపక్ మిశ్రా ‘ఆర్బిట్రేషన్ అవార్డ్’ ‘కాపీ-పేస్ట్’లా ఉందన్న సింగపూర్ సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఉమాంగ్ పొద్దార్
- హోదా, బీబీసీ న్యూస్
భారత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా ఇచ్చిన ఓ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ తీర్పును సింగపూర్ సుప్రీంకోర్ట్ కొట్టివేసింది.
ఆ తీర్పులో ఎక్కువ భాగం కాపీ-పేస్ట్ కంటెంట్ ఉందని సింగపూర్ అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ప్యానల్ ఒకటి ఈ మధ్యవర్తిత్వ తీర్పు ఇచ్చింది. ఆ ప్యానల్‌లో భారత్‌కు చెందిన మరో ఇద్దరు విశ్రాంత న్యాయమూర్తులున్నారు.
రైల్వే రవాణా కారిడార్ల నిర్వహణకు చెల్లించాల్సిన వేతనాలపై పలు కంపెనీల మధ్య తలెత్తిన వివాదంపై వీరు విచారణ జరిపారు.
ఈ వివాదంపై మూడు మధ్యవర్తిత్వ కేసులు సమాంతరంగా నడిచాయి. ఈ మూడింటిలో రెండు భారత్‌లోనూ, మరొకటి సింగపూర్‌లోనూ కొనసాగగా.. మూడింటికీ జస్టిస్ మిశ్రా ప్రధాన మధ్యవర్తిగా(ఆర్బిట్రేటర్) ఉన్నారు.

ఆర్బిట్రేషన్ (మధ్యవర్తిత్వం) అంటే.. కోర్టు వెలుపల ప్రత్యామ్నాయ పరిష్కార విధానం. ఆర్బిట్రేటర్లుగా పిలిచే న్యూట్రల్ ఎక్స్‌పర్ట్ ప్యానల్ సభ్యులను పార్టీలే ఎంపిక చేసుకోవచ్చు.
వాణిజ్యపరమైన లావాదేవీల్లో మధ్యవర్తిత్వాన్ని ఎక్కువగా వాడతారు.
సంప్రదాయ కోర్టు ప్రక్రియలతో పోలిస్తే వేగంగా, మరింత సులభతరంగా కేసులు పరిష్కారమవుతాయన్న ఉద్దేశంతో ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయిస్తారు.
ప్యానల్ ఇచ్చిన తీర్పులకు కేసులోని అన్ని పక్షాలు కట్టుబడి ఉండాలి.
అయితే, కొన్ని కారణాలతో మధ్యవర్తిత్వ పరిష్కార నిర్ణయాలను కోర్టులు పక్కన పెట్టేయొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
‘అసాధారణ చర్య’
జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని ప్యానల్ రాసిన ఈ తీర్పులోని 451 పేరాలలో 212 పేరాలు.. ఆయన గతంలో భారతదేశంలో ఇచ్చిన రెండు తీర్పుల నుంచి కాపీ చేసినట్లు సింగపూర్ సుప్రీంకోర్టు ఏప్రిల్ 8న పేర్కొంది.
ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అవార్డ్‌లను కొట్టివేయడం అసాధారణ చర్య అని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌లో ఆర్బిట్రేషన్ చైర్ ప్రొఫెసర్ స్టావ్రోస్ బ్రెకౌలాకిస్ అన్నారు.
బీబీసీతో మాట్లాడిన పలువురు ఆర్బిట్రేటర్లు ఈ అభిప్రాయంతో ఏకీభవించారు. ప్రముఖ ఆర్బిట్రేటర్ అయిన జస్టిస్ మిశ్రాకు సంబంధించి ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడం తానెన్నడూ చూడలేదని దిల్లీకి చెందిన న్యాయవాది, ఆర్బిట్రేటర్ అషిమ్ సూద్ చెప్పారు.
జస్టిస్ మిశ్రా భారత సుప్రీంకోర్టులో 2017లో ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలో నలుగురు సీనియర్ న్యాయమూర్తులు మీడియా సమావేశం నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా సున్నితమైన కేసులను సెలెక్టివ్ బెంచ్‌లకు కేటాయించారని ఆరోపించారు.
జస్టిస్ మిశ్రాను బీబీసీ టెక్స్ట్, మెయిల్స్ ద్వారా సంప్రదించింది. కానీ, ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
‘‘అంతకుముందు కూడా ఎన్నోసార్లు ఆర్బిట్రేటర్ల తీర్పులను కొట్టివేశారు. ఈ కేసు అవమానకరమైనది. ఎందుకంటే, ఇది భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి తీర్పు ఇచ్చిన కేసు. కాపీ చేశారని ఈ కేసు తీర్పును కొట్టివేశారు'' అని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మదన్ లోకుర్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సింగపూర్ కోర్టు ఏం చెప్పింది?
ఈ వ్యవహారం సింగపూర్ సుప్రీంకోర్టుకు చేరకముందే జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని ప్యానల్ ఇచ్చిన మధ్యవర్తిత్వ తీర్పు కాపీ పేస్ట్‌లా ఉందనే కారణంతో రద్దు చేయాలంటూ మరో కోర్టులోనూ వ్యాజ్యం దాఖలైంది.
అనంతరం సింగపూర్ సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలైంది.
ఈ తీర్పుకు, ఇతర నిర్ణయాలకు మధ్య ఉన్న సారూప్యత గురించి న్యాయమూర్తి అనవసరంగా ఆందోళన చెందారని, ఇది మధ్యవర్తిత్వ ఫలితంపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేదని పిటిషనర్లు పేర్కొన్నారు.
అయితే, సింగపూర్ సుప్రీంకోర్టు ఈ వాదనలను తోసిపుచ్చింది.
కాపీ కొట్టడం అభ్యంతరకరం కాదని కోర్టు పేర్కొంది. కానీ, కాపీ చేసిన విషయాలలో చట్టపరమైన పూర్వాపరాలు, ఒప్పంద క్లాజులు, సమర్పణలు సింగపూర్ కోర్టు ముందుకు వచ్చిన మధ్యవర్తిత్వంలో భాగం కావని తెలిపింది.
దీన్నిబట్టి ఈ కేసును జస్టిస్ మిశ్రా ముందే నిర్ణయించారని, అన్యాయంగా నిర్ణయం తీసుకున్నారని సింగపూర్ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
''నిర్ణయ ప్రక్రియ సమగ్రతకు భంగం వాటిల్లింది. పక్షపాతంగా వ్యవహరించారనే విషయం అర్ధమవుతోంది'' అని కోర్టు పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
‘ఓల్డ్ బాయ్స్ క్లబ్’
అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌కు కేంద్రంగా మారాలని భారత్ ప్రయత్నిస్తున్న వేళ ఈ తీర్పు వెలువడింది. భారతదేశ మధ్యవర్తిత్వ వ్యవస్థను విశ్రాంత న్యాయమూర్తుల ఆధిపత్యంలోని ఓల్డ్ బాయ్స్ క్లబ్‌గా పిలుస్తుంటారు.
మధ్యవర్తిత్వాలకు కేంద్రాలుగా పిలిచే ఇతర దేశాలలో దీనినొక పూర్తిస్థాయి వృత్తిగా చూస్తుంటారు.
‘‘భారతదేశ మధ్యవర్తిత్వాలకు తరచూ విశ్రాంత న్యాయమూర్తులు నేతృత్వం వహిస్తారనే అభిప్రాయం విస్తృతంగా ఉంది. వారు అంతర్జాతీయ మధ్యవర్తిత్వ అంచనాలు, ప్రమాణాలకు విరుద్ధంగా న్యాయపరమైన మనస్తత్వం, తాము దీనికి అర్హులమనే భావనతో ఇందులోకి వస్తారు'' అని ప్రొఫెసర్ బ్రెకౌలాకిస్ చెప్పారు.
దీనిని సంస్కరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, అంతర్జాతీయ మధ్యవర్తిత్వ స్థానంగా భారతదేశ విశ్వసనీయతను వారసత్వ అలవాట్లు దెబ్బతీస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ నిర్ణయం మధ్యవర్తిగా మిశ్రా ప్రతిష్ఠను కూడా ప్రభావితం చేస్తుందని ప్రొఫెసర్ బ్రెకౌలాకిస్ తెలిపారు.
ఆదేశాలను రద్దు చేసే సమయంలో ఆ ఆదేశాలను ఇచ్చిన మధ్యవర్తుల పేర్లను ప్రస్తావించడం అసాధారణం కాబట్టే ఈ ఉదంతం ప్రత్యేకమని నిపుణులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
తీర్పుల రాతపైనా చర్చ
సింగపూర్ సుప్రీంకోర్టు తీర్పు భారత్‌లో తీర్పుల రాత గురించి చర్చలేవనెత్తింది. ఈ తీర్పులు సుదీర్ఘమైనవే కాక, కొన్నిసార్లు సరైన ఆధారం లేకుండా కొటేషన్లపై ఆధారపడతాయనే విమర్శ ఉంది.
"భారతీయ తీర్పులు పూర్వాపరాలపై ఎక్కువగా ఆధారపడతాయి. ఇక్కడ అవి గతంలోని తీర్పులను, పేరాగ్రాఫులను ఎక్కువగా ప్రస్తావిస్తాయి" అని దిల్లీకి చెందిన న్యాయవాది దీపక్ జోషి చెప్పారు.
తాము తీర్పులు ఎలా రాస్తామనే దానిపై న్యాయాధికారులకు ఏళ్ల తరబడి ఉన్న శిక్షణ మధ్యవర్తిత్వంలోకి చొరబడిందన్నారు.
భారత సుప్రీంకోర్టుతో పోలిస్తే అనేక ఇతర దేశాల్లో సుప్రీంకోర్టుల తీర్పులు చాలా క్లుప్తంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
1980లకు ముందు సుప్రీంకోర్టు తీర్పులు రాజ్యాంగ న్యాయ పండితుడు వి.కె.త్రిపాఠి రచనల్లోని మొత్తం పేరాలను ఉపయోగించాయని భారతీయ విద్యావేత్త డాక్టర్ ఉపేంద్ర బక్షీ రాసిన ఒక వ్యాసాన్ని జోషి ప్రస్తావించారు.
గతంలో కూడా భారత న్యాయస్థానాల ముందు కాపీ-పేస్ట్‌లపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
ఇద్దరు విద్యావేత్తలు తమ పరిశోధన పత్రాల్లోని పలు పేరాలను తమకు క్రెడిట్ ఇవ్వకుండానే కోర్టు తీర్పులో తీసుకున్నారని 2015లో ప్రస్తావించడంతో దిల్లీ హైకోర్టు క్షమాపణలు చెప్పింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














