‘ఆ మహిళపై అత్యాచారానికి బాధ్యత ఆమెదే’ - అంటూ ఓ కేసులో అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యలు

ఫొటో సోర్స్, Getty Images
ఓ వివాదాస్పద వ్యాఖ్యతో అలహాబాద్ హైకోర్టు మళ్లీ వార్తల్లో నిలిచింది. ఒక అత్యాచారం కేసులో ఏప్రిల్ 10న హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యపై వివాదం చెలరేగింది.
''మహిళ తనంత తానుగా ఈ సమస్యను తెచ్చుకున్నారు. జరిగిన దానికి ఆమే బాధ్యురాలు'' అని వ్యాఖ్యానించిన జడ్జ్, ఈ కేసు నిందితునికి బెయిల్ మంజూరు చేశారు.
ఈ కేసును జస్టిస్ సంజయ్ కుమార్ విచారించారు. ఉత్తరప్రదేశ్‌లో ఒక ఎంఏ విద్యార్థిని తన స్నేహితుడు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించారు.
ఈ కేసు గత ఏడాది సెప్టెంబరు నాటిది. ఏప్రిల్ 10న నిందితునికి బెయిల్ మంజూరు అయింది.

కేసు పూర్వాపరాలేంటి?
న్యాయపరమైన అంశాలను ప్రచురించే పోర్టల్ 'బార్ అండ్ బెంచ్'లో ఈ కేసుకు సంబంధించిన వివరాలున్నాయి. 2024 సెప్టెంబరులో ఆ విద్యార్ధిని తన ముగ్గురు స్నేహితురాళ్లతో కలిసి దిల్లీలోని ఒక బార్‌కి వెళ్లారు. అక్కడ వాళ్లకు తెలిసిన కొంతమంది అబ్బాయిలున్నారు, వాళ్లలో నిందితుడు కూడా ఒకరు.
తాను మద్యం తాగి ఉన్నానని, ఆ సమయంలో కూడా నిందితుడు తనకు దగ్గరగా వచ్చారని పోలీసులకు చేసిన ఫిర్యాదులో విద్యార్థిని తెలిపారు. అర్ధరాత్రి 3 గంటల వరకు వాళ్లు బార్‌లో ఉన్నారు. తన వెంట రమ్మని నిందితుడు ఆమెను చాలాసార్లు అడిగారు.
నిందితుడు పదేపదే కోరడంతో విశ్రాంతి కోసం ఆయన ఇంటికి వెళ్లేందుకు తాను అంగీకరించానని విద్యార్థిని తెలిపారు. కానీ నిందితుడు తనను నోయిడాలోని ఆయన ఇంటికి తీసుకెళ్లకుండా, ఒక బంధువు ఫ్లాట్‌కి తీసుకెళ్లారని, అక్కడ తనపై అత్యాచారం చేశారని విద్యార్థిని తన ఫిర్యాదులో చెప్పారు.
ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదుచేసి 2024 డిసెంబరులో నిందితుడిని అరెస్ట్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
బెయిల్ పిటిషన్‌లో నిందితుడు ఏమన్నారు?
"ఆ సమయంలో ఆమెకు సహాయం కావాలి. నాతో రావడానికి ఆమె ఒప్పుకున్నారు. మా మధ్య జరిగిన లైంగిక చర్య ఇద్దరి సమ్మతితోనే జరిగింది.'' అని నిందితుడు చెప్పారు.
అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలను ఆయన ఖండించారు.
హైకోర్టు చేసిన వ్యాఖ్యలేంటి?
''బాధితురాలి ఆరోపణలు నిజమని భావించినప్పటికీ, ఆమెనే సమస్యను తెచ్చుకున్నారని, జరిగిన దానికి ఆమెనే బాధ్యురాలని నిర్ధరణకు రావొచ్చని కోర్టు నమ్ముతోంది. ఆమె తన వాంగ్మూలంలో ఈ విషయాలే చెప్పారు. మెడికల్ పరీక్షలో కూడా లైంగిక దాడి జరిగినట్టు డాక్టర్ ఏమీ చెప్పలేదు'' అని నిందితుని బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో హైకోర్టు వ్యాఖ్యానించింది.
''ఆమె పోస్ట్ గ్రాడ్యుయేట్. తన చర్యల నైతికత, ప్రాధాన్యత అర్థం చేసుకునే సామర్థ్యం ఆమెకు ఉంది'' అని కూడా జస్టిస్ సంజయ్ కుమార్ అన్నారు.
''అన్ని నిజాలను, పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, అలాగే నేర స్వభావం, సాక్ష్యం, ఇరువర్గాల స్టేట్‌మెంట్లు పరిగణనలోకి తీసుకుని, బెయిల్ పొందడానికి పిటిషనర్‌కు అర్హత ఉందని నేను నమ్ముతున్నా. కాబట్టి బెయిల్ మంజూరు చేస్తున్నా.'' అని జస్టిస్ సంజయ్ కుమార్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అలహాబాద్ హైకోర్టు
పోక్సో కేసు విచారణ సమయంలో ఈ ఏడాది మార్చి 17న అలహాబాద్ హైకోర్టు వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
రొమ్ములను తాకడాన్ని, పైజామా తాడు విప్పడాన్ని అత్యాచారం లేదా అత్యాచార ప్రయత్నం అన్నకోణంలో చూడలేమని కోర్టు చెప్పింది.
ఉత్తరప్రదేశ్ కాస్‌గంజ్‌లోని పటియాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసు విచారణ సమయంలో అలహాబాద్ హైకోర్టు అప్పుడు ఈ వ్యాఖ్యలు చేసింది.
నిందితులపై చేసిన ఆరోపణలు, అందుబాటులో ఉన్న వాస్తవాల ఆధారంగా వారు అత్యాచారం చేయడానికి ప్రయత్నించారని నిరూపించడం సాధ్యం కాదని జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా బెంచ్ వ్యాఖ్యానించింది.
అత్యాచార ప్రయత్నం జరిగిందని నిరూపించడానికి నేరానికి పాల్పడే ఉద్దేశం నిందితుడికి ఉందని ప్రాసిక్యూషన్ చూపించగలగాలని కూడా కోర్టు వ్యాఖ్యానించింది.

ఫొటో సోర్స్, Getty Images
సుప్రీంకోర్టు స్టే
అయితే పోక్సో కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఈ వివాదాస్పద తీర్పుపై ఈ యేడాది మార్చి 26న సుప్రీంకోర్టు స్టే విధించింది.
అలహాబాద్ హైకోర్టు మార్చి 17న ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ' వుయ్ ది విమెన్ ఆఫ్ ఇండియా' అనే సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఈ విషయాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించింది.
హైకోర్టు తీర్పును సున్నితత్త్వం లేనిదిగా, అమానవీయమైనదిగా జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మసీహ్‌ల సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.
''హైకోర్టు తీర్పులో చేసిన కొన్ని వ్యాఖ్యలు...ముఖ్యంగా 21, 24, 26 పేరాలు తీర్పు ఇచ్చిన వారికి సున్నితత్వం లేకపోవడాన్ని ప్రతిబింబిస్తున్నాయని తెలియజేయడానికి మేము చింతిస్తున్నాం.'' అని సుప్రీంకోర్టు తన ఉత్తర్వులో చెప్పినట్టు ‘లైవ్ లా’ వెబ్‌సైట్ తెలిపింది.

ఫొటో సోర్స్, www.allahabadhighcourt.in
జస్టిస్ సంజయ్ కుమార్ ఎవరు?
జస్టిస్ సంజయ్ కుమార్ 1969లో జన్మించారు. కాన్పూర్‌లోని దయానంద్ కాలేజ్ ఆఫ్ లా నుంచి 1992లో లా డిగ్రీ పొందారు. 1993లో ఉత్తరప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో లాయర్‌గా చేరారు.
2018 నవంబరు 22న అలహాబాద్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
2020 నవంబరు 20న అలహాబాద్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా జస్టిస్ సంజయ్ కుమార్ నియమితులయ్యారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














