‘రెండు నెలల కిందటే బీమా, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ​సోదరుడి హత్య, వీడియో రికార్డుల్లో దొరికిన మర్డర్ ప్లాన్’- వెల్లడించిన కరీంనగర్ పోలీసులు

పోలీసులు, హత్య, నిందితులు

ఫొటో సోర్స్, UGC

    • రచయిత, ప్రవీణ్ శుభం
    • హోదా, బీబీసీ కోసం

​ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఓ వ్యక్తి, తన అన్నను హత్య చేసి, దాన్ని ప్రమాదంగా చిత్రీకరించి, ఇన్సూరెన్స్ డబ్బులు పొందడానికి ప్రయత్నించిన ఓ కేసును మీడియాకు వివరించారు కరీంనగర్ జిల్లా పోలీసులు.

ఈ కేసులో ప్రధాన నిందితుడితో సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

​రామడుగు గ్రామానికి చెందిన 30 ఏళ్ల మామిడి నరేశ్ వ్యాపారాల్లో, ముఖ్యంగా షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి సుమారు రూ. 25 లక్షలు నష్టపోయారు.

ఈ ఆర్ధిక సమస్యల నుంచి బయటపడేందుకు అన్నను హత్య చేసేందుకు పథకం పన్నారని పోలీసులు తెలిపారు.

ఈ కేసులో చట్టానికి దొరక్కుండా ఉండేందుకు నిందితుడు తెలివిగా వ్యవహరించారనీ, పలు జాగ్రత్తలు తీసుకున్నారని కూడా పోలీసులు తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మృతుడు వెంకటేష్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, మృతుడు వెంకటేష్

​‘రూ. 1.50 కోట్ల అప్పు... రూ. 4.14 కోట్ల ఇన్సూరెన్స్’

పోలీసులు అందించిన వివరాల ప్రకారం..

‘‘మానసిక పరిపక్వత లేని తన అన్న మామిడి వెంకటేశ్ (37) పేరుపై రూ. 4.14 కోట్ల విలువైన పలు ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నారు నరేశ్.

ఇన్సూరెన్స్‌కు సంబంధించి వివిధ కంపెల నుంచి తీసుకున్న బీమా పాలసీలు మామిడి వెంకటేశ్ పేరు మీద ఉన్నాయి. అలాగే అన్న పేరు మీదే రూ. 20 లక్షల గోల్డ్ లోన్ కూడా తీసుకున్నారు నరేశ్.

వెంకటేశ్ చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి, లోన్ మాఫీ అవుతుంది అనే ఉద్దేశంతోనే నరేశ్ తన అన్నను హత్య చేసేందుకు పథకం వేశారు.

ఈ పథకంలో తన స్నేహితుడు నముండ్ల రాకేశ్ (28), టిప్పర్ డ్రైవర్ మునిగాల ప్రదీప్‌ను (29) భాగం చేశారు’’ అని తెలిపారు.

ఈ ప్లాన్‌కు సంబంధించి జరిగిన చర్చలను వీడియో రికార్డు చేసిన రాకేశ్, వాటిని తన ఫోన్‌లో సేవ్ చేసుకున్నట్లు కరీంనగర్ పోలీసులు వెల్లడించారు.

టిప్పర్‌తో హత్య

ముందుగా అనుకున్న ప్రకారం నవంబర్ 29 రాత్రి ప్లాన్ అమలు చేశారని పోలీసులు తెలిపారు. వారు చెప్పిన వివరాల ప్రకారం..

‘‘​డ్రైవర్ ప్రదీప్ టిప్పర్‌ను మట్టి లోడ్‌తో రామడుగు శివారులోని భారత్ పెట్రోల్ పంప్ వద్దకు తీసుకొచ్చాడు.

బ్రేక్ డౌన్ అయినట్లు నటించి, నరేశ్‌కు ఫోన్ చేశాడు. ​నరేశ్ తన అల్లుడు సాయి ద్వారా వెంకటేశ్‌కు జాకీ ఇప్పించి టిప్పర్ వద్దకు రప్పించాడు. ​నరేశ్ అక్కడికి చేరుకున్నాక, టిప్పర్ స్టార్ట్ చేసి ఉంచి, జాకీని టైర్ కింద పెట్టి తిప్పమని తన అన్న వెంకటేశ్‌కు చెప్పాడు. వెంకటేశ్ సెల్ ఫోన్ లైట్ పెట్టుకొని జాకీ తిప్పుతుండగా, నరేశ్ స్వయంగా టిప్పర్‌ను నడిపి, జాకీ తిప్పుతున్న అన్న వెంకటేశ్ మీదకు ఎక్కించాడు. దీంతో వెంకటేశ్ అక్కడికక్కడే మరణించాడు.

​డ్రైవర్ ప్రదీప్‌ను పారిపోవాలని చెప్పి, నరేశ్ దీన్ని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు’’ అని పోలీసులు చెప్పారు.

పోలీసులు

ఫొటో సోర్స్, UGC

అల్లుడి సాక్ష్యంతో బయటపడ్డ నేరం

డ్రైవర్ మునిగాల ప్రదీప్ టిప్పర్ నడుపుతుండగా ప్రమాదం జరిగిందని నరేశ్ తన కుటుంబ సభ్యులకు, పోలీసులకు చెప్పారు. అయితే, నరేశ్ అల్లుడు తన మామ నడుపుతుండగానే ప్రమాదం జరిగిందని నరేశ్, వెంకటేశ్‌ల తండ్రి మామిడి నర్సయ్యకు చెప్పారు.

టిప్పర్‌ను నరేశ్ నడుపుతుండగానే ప్రమాదం జరిగిందని మామిడి నర్సయ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ప్రమాదంపై రెండు రకాల మాటలు వినిపించడంతో పోలీసులు దీనిపై మరింత విచారణ చేశారు.

డిసెంబర్ 2న నిందితులుగా తాము అనుమానిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా వారు నేరాన్ని అంగీకరించారు. .

​హత్య ప్లాన్ వీడియో ఉన్న మొబైల్ ఫోన్, ఇన్సూరెన్స్ పాలసీలు, బ్యాంకు పాస్‌బుక్స్‌ను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

సంబంధిత సెక్షన్ల కింద నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపించారు.

మరిన్ని సాంకేతిక ఆధారాల కోసం దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

నిందితులు రిమాండ్‌లో ఉండగా, ఈ వ్యవహారం గురించి వారి బంధువులతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ, వారు అందుబాటులోకి రాలేదు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)