డ్రగ్స్ కేసుల్లో రెండు రోజుల్లో ముగ్గురిని ఉరి తీసిన సింగపూర్ ప్రభుత్వం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కెల్లీ ఎన్‌జీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
మాదకద్రవ్యాలకు సంబంధించిన కేసుల్లో సింగపూర్ ప్రభుత్వం రెండు రోజుల్లో ముగ్గురిని ఉరి తీసింది. దీంతో ఈ ఏడాది ఆ దేశంలో అమలైన మొత్తం ఉరిశిక్షల సంఖ్య 17కి చేరింది. 2003 సంవత్సరం తరువాత అక్కడ ఉరిశిక్షల అమలు ఇదే అత్యధికం.
మాదకద్రవ్యాల నేరాలకు ఉరిశిక్ష విధించడం రాజ్యాంగ విరుద్ధమని వాదిస్తున్న ఒక ప్రజాప్రయోజన పిటిషన్ విచారణకు వారం రోజుల ముందు ఈ శిక్షలు అమలయ్యాయి.
మాదకద్రవ్యాలకు సంబంధించి ప్రపంచంలోనే కఠినమైన చట్టాలు ఉన్న దేశాలలో సింగపూర్ ఒకటి.
దక్షిణాసియాలోని ఇతర ప్రాంతాల్లో కూడా మాదకద్రవ్య నేరాలు ప్రధాన సమస్యగా ఉన్నాయని, వాటిని నిరోధించడానికి కఠిన చర్యలు అవసరమని సింగపూర్ చెబుతోంది.

సింగపూర్‌లో 15 గ్రాముల కన్నా ఎక్కువ డయామార్ఫిన్ కానీ, 30 గ్రాముల కోకైన్ కానీ, 250 గ్రాముల మెటాంఫెటామైన్ కానీ, 500 గ్రాముల గంజాయిని కానీ విక్రయించినా, రవాణా చేసినా, సరఫరా చేసినా ట్రాఫికింగ్‌గా పరిగణిస్తారు. ఇలాంటి కేసుల్లో దోషిగా తేలితే ఉరిశిక్ష విధిస్తారు.
సింగపూర్‌లో అమల్లో ఉన్న ‘తప్పనిసరి ఉరిశిక్ష’ చట్టం.. రాజ్యాంగం కల్పించే జీవించే హక్కు, సమాన రక్షణ హక్కులను ఉల్లంఘిస్తుందంటూ ఈ పిటిషన్ దాఖలు చేసిన ఏడుగురు కార్యకర్తలు వాదిస్తున్నారు.
‘చట్టం ప్రకారం ఎవరినీ తమ జీవితానికి, వ్యక్తిగత స్వేచ్ఛకు దూరం చేయరాదు’ అని అక్కడి రాజ్యాంగం చెప్తోంది.
‘సింగపూర్ అమలు చేసే కఠినమైన మాదకద్రవ్య నియంత్రణ వ్యవస్థ ప్రపంచ వేదికపై రోజురోజుకూ ఏకాకిగా మారుతోంది’ అని అక్కడి యాక్టివిస్ట్ గ్రూప్ ‘ట్రాన్స్‌ఫర్మేటివ్ జస్టిస్ కలెక్టివ్’ పేర్కొంది.
మరోవైపు ఉరిశిక్షలను రద్దు చేస్తే మరింత ప్రమాదకరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని సింగపూర్ ప్రభుత్వం అంటోంది.
మరింత తీవ్రమైన నేరాలు, హింస, మాదకద్రవ్యాల వినియోగంతో మరణాలు- అందులోనూ అమాయకపు చిన్నారుల మరణాలు పెరగడం వంటి పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉందని ఆ దేశ హోం మంత్రి కె. షణ్ముగం ఈ ఏడాది ప్రారంభంలో పేర్కొన్నారు.
‘పాలసీలను రూపొందించే బాధ్యత మాపై ఉంది. మా వ్యక్తిగత భావాలను పక్కన పెట్టి, పౌరుల ప్రాణాలను రక్షించేందుకు అవసరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిందే. మరింత మంది అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమయ్యే నిర్ణయాలను మేం తీసుకోదలచుకోలేదు’ ఆయన ఈ ఏడాది జనవరిలో ఫేస్‌బుక్ వేదికగా తెలిపారు.
కాగా గత బుధవారం, గురువారాల్లో ఉరి తీసిన వారిలో డ్రైవర్ సామినాథన్ సెల్వరాజు ఒకరు. 2013 నవంబర్ 21 రాత్రి సమయంలో, ఆయన మలేసియా నుంచి సింగపూర్‌కు 301.6 గ్రాముల డయామార్ఫిన్ తీసుకువచ్చారని కోర్టు తేల్చింది.
సామినాథన్ మాత్రం మాదకద్రవ్యాలను దేశంలోకి తెచ్చిన సమయంలో తాను ఆ వాహనాన్ని నడపలేదని వాదించారు. ఆ రోజు ముందుగా కంపెనీ ట్రైలర్‌ను నడిపినట్లు చెప్పారు. ఆ రాత్రి డ్రగ్స్ వచ్చినప్పుడు వేరెవరో వాహనాన్ని వాడి ఉంటారని చెప్పారు. అదే వాహనాన్ని పలువురు డ్రైవర్లు ఉపయోగించేవారని ఆయన వాదించారు.
కానీ దర్యాప్తులో, వాహనంలో ఆయన సంతకాలతో సిద్ధంగా ఉన్న ఇమిగ్రేషన్ కార్డులు లభించాయి అందులో ఒక కార్డులో మాదకద్రవ్యాలు లభ్యమైన స్థలం చిరునామా కూడా ఉంది. కాని తాను ఆ కార్డును రాయలేదని ఆయన వాదించారు. మలేసియా పౌరుడైన ఈ డ్రైవర్ వాదనను న్యాయమూర్తి తిరస్కరించారు. గురువారం సామినాథన్‌ను ఉరితీశారు.
2022లో ఉరిశిక్ష విధించిన మరికొందరితో కలిసి సామినాథన్ సింగపూర్ మాదకద్రవ్యాల చట్టాల్లోని పలు నిబంధనలపై పిటిషన్ దాఖలు చేశారు.
సింగపూర్ అత్యున్నత న్యాయస్థానం సామినాథన్‌తో పాటు శిక్షను ఎదుర్కొన్న మరో ముగ్గురి పిటిషన్‌ను ఆగస్టులో తిరస్కరించింది. "సమాజానికి ముప్పుగా భావించే సమస్యను పరిష్కరించేందుకు" ఈ చట్టాలను రూపొందించారని కోర్టు పేర్కొంది.
సెప్టెంబర్‌లో సామినాథన్, మరో ముగ్గురు ఖైదీలు అధ్యక్షుడికి క్షమాభిక్ష కొరుతూ దరఖాస్తు చేశారు. వారి దరఖాస్తును ఆ దేశాధ్యక్షుడు తిరస్కరించారు.
సింగపూర్‌లో హత్య, కిడ్నాప్ వంటి నేరాలకు ఉరిశిక్ష ఉంది, అయితే మాదకద్రవ్య నేరాల్లో ఉరి శిక్ష అమలు విమర్శలను ఎదుర్కొంటుంది.
అధికంగా అట్టడుగు వర్గాలు, తక్కువ ఆదాయం గల వర్గాల నుంచి వచ్చిన చిన్న రవాణాదారులు, కొరియర్‌లకు మాత్రమే ఉరిశిక్షి పడుతుందని, కానీ అసలు నేర ముఠా నేతలకు శిక్ష పడదనే వాదన విమర్శకులది.
ఇలాంటి కేసులలో ఉరిశిక్షను సమర్థిస్తూ వాదించిన న్యాయవాది మర్విన్ చియాంగ్.. "హత్య లేదా కొన్ని మాదకద్రవ్య నేరాలకు తప్పనిసరి ఉరిశిక్ష ఉండగా, మరింత తీవ్రమైన అంతర్జాతీయ నేరాలకు అలాంటి శిక్షలు ఎందుకు లేవనేది వివరించడం కష్టమవుతోంది’ అన్నారు.
కొన్ని దేశాలలో జీనోసైడ్, యుద్ధ నేరాలు వంటివాటికి కూడా గరిష్ఠ శిక్ష జీవిత ఖైదే అని అన్నారు.
యూరోపియన్ యూనియన్ సింగపూర్ మిషన్.. గత వారం అమలు చేసిన ఉరిశిక్షలు "సింగపూర్‌లో మరణదండన అమలు గణనీయంగా పెరిగినట్లు" సూచిస్తున్నాయని పేర్కొంది.
అయితే సింగపూర్ ప్రభుత్వం మాత్రం.. ఉరిశిక్ష సింగపూర్‌ను ప్రపంచంలో అత్యంత సురక్షిత ప్రదేశాల్లో ఒకటిగా మార్చిందని వాదిస్తోంది. ఈ శిక్షను "సమాజానికి అత్యంత తీవ్రమైన హాని కలిగించే నేరాలకు" వర్తింపజేస్తామని ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది.
2023లో హోమ్ మినిస్ట్రి నిర్వహించిన ఒక సర్వేలో పాల్గొన్న 2,000 మంది పౌరుల్లో సుమారు 69% మంది.. మాదకద్రవ్యాలను రవాణా చేసే నేరస్థులకు ఉరిశిక్ష సరైనదేనని పేర్కొన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













