పుతిన్ భారత పర్యటనతో రెండు దేశాలకు వచ్చే లాభం ఏంటి? నిపుణులు ఏమంటున్నారంటే...

ఫొటో సోర్స్, Getty Images
ఒకపక్క ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ చైనా పర్యటనలో ఉండగా, రష్యా అధ్యక్షుడు పుతిన్ గురువారం నుంచి భారత్‌లో రెండు రోజుల పర్యటనకు వచ్చారు.
అయితే, పుతిన్ భారత పర్యటనను పాశ్చాత్య దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఈ రెండు దేశాల సంబంధాలతో అవి కొంచెం ఆందోళన చెందుతున్నట్లు కూడా కనిపిస్తున్నాయి.
భారతదేశంలోని ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ దౌత్యవేత్తలు టైమ్స్ ఆఫ్ ఇండియాకు సంయుక్తంగా రాసిన ఒక వ్యాసం డిసెంబర్ 1న ప్రచురితమైంది.
యుక్రెయిన్ యుద్ధాన్ని సాగదీస్తున్నారంటూ ఈ వ్యాసంలో వారు రష్యాపై విమర్శలు చేశారు.
దీనికి ప్రతిస్పందనగా, భారతదేశంలోని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ అదే వార్తాపత్రికలో ఒక వ్యాసం రాశారు. యుక్రెయిన్ యుద్ధం గురించి ఈ కథనం భారతీయులను 'తప్పుదారి పట్టించేది'గా ఉందని అభిప్రాయపడ్డారు.


ఫొటో సోర్స్, AFP via Getty Images
ఈ టూర్‌ను రష్యన్ నిపుణులు ఎలా చూస్తున్నారు?
రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్‌లోని సెంటర్ ఫర్ సైంటిఫిక్ అండ్ అనలిటికల్ ఇన్ఫర్మేషన్ విభాగాధిపతి నికోలాయ్ ప్లాట్నికోవ్, ‘ది హిందూ’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘‘భారత విదేశాంగ విధానం ఆచరణాత్మకమైనది' అని అభివర్ణించారు .
"రెండు దేశాలు దీర్ఘకాల స్నేహాన్ని, వ్యూహాత్మక సహకారాన్ని కొనసాగిస్తున్నాయి. అంతర్జాతీయ సంస్థలలో ద్వైపాక్షిక సంబంధాలు, సహకారం కూడా స్థిరంగా కొనసాగుతోంది. న్యూదిల్లీలో జరిగే చర్చల అజెండా ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ నుంచి వస్తున్న తీవ్రమైన ఒత్తిడిని మనం ఎలా తట్టుకోగలం అన్న అంశం మీదే ఉంటుంది" అని ప్లాట్నికోవ్ అన్నారు.
అమెరికా ఆంక్షలను తట్టుకోవడానికి రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ చాలా వరకు తగ్గించిందని కొన్ని రిపోర్టులు వచ్చినప్పటికీ, దీని వల్ల ఇండియాకు ఇప్పటికీ ప్రయోజనాలు ఉన్నాయని ప్లాట్నికోవ్ అంటున్నారు.
''భారత దిగుమతుల్లో రష్యా చమురుకు గణనీయమైన వాటా ఉంది. దానిని కొనడం ద్వారా భారతదేశం మంచి లాభాలను ఆర్జిస్తోంది. ప్రభుత్వ ఖజానాను నింపడానికి అవకాశం కల్పించే ఇలాంటి ‘ప్రాఫిటబుల్ ఆఫర్’ను ఎవరైనా ఎందుకు వద్దనుకుంటారు?" అని ప్లాట్నికోవ్ అన్నారు.
అయితే, కేవలం చమురే కాకుండా, ఇతర రంగాలలో కూడా మంచి భాగస్వామ్యం కోసం రెండు దేశాలు ప్రయత్నిస్తున్నాయని మరికొందరు నిపుణులు అంటున్నారు.
"రష్యాలో భారతీయులకు మంచి డిమాండ్ ఉంది. సెమీ స్కిల్డ్ కార్మికుల అవసరం దేశానికి ఉంది. రష్యాకు ఐదు లక్షలమంది భారతీయ కార్మికులు కావాల్సి రావొచ్చు" అని 'ది హిందూ' తో మాస్కోకు చెందిన విశ్లేషకుడు ఆరిఫ్ అసాలియోగ్లు అన్నారు.
యుక్రెయిన్ యుద్ధం తర్వాత పాశ్చాత్య ఆంక్షల ఒత్తిడిని ఎదుర్కోవడంలో చైనా, భారత్‌ల మద్దతు రష్యాకు ఎంతో కీలకంగా మారిందని అసాలియోగ్లు అన్నారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
భారతదేశంలోని దౌత్య నిపుణులు ఎలా చూస్తున్నారు?
యుక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి వరల్డ్ ఆర్డర్‌లో పవర్ బ్యాలన్స్ మారుతోందని రష్యా చెబుతోంది.
ఆగస్ట్ నెలాఖరులో భారత్, చైనా, రష్యా నేతలు టియాంజిన్‌లో సమావేశమైనప్పుడు, బహుళ ధ్రువ ప్రపంచం అనే అంశం ప్రత్యేకంగా ప్రస్తావనకొచ్చింది.
భారతదేశం దశాబ్దాలుగా అలీన విధానాన్ని అనుసరిస్తోంది. కానీ, అంతర్జాతీయంగా దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెరగడంతో అమెరికా వైపు నిలబడాలన్న ఒత్తిడి భారత్‌పై పెరిగింది.
'ది న్యూ రైజింగ్ పవర్స్ ఇన్ ఎ మల్టీపోలార్ వరల్డ్' రచయిత, భౌగోళిక రాజకీయ వ్యవహారాలపై నిపుణుడు జోరావర్ దౌలత్ సింగ్ దీని గురించి మాట్లాడుతూ భారతదేశం న్యూ వరల్డ్ ఆర్డర్ కోసం తనను తాను సిద్ధం చేసుకుంటోందని అన్నారు.
"2000ల మధ్యలో భారతదేశం గురించి అమెరికా రూపొందించిన నియో కన్జర్వేటివ్ ప్లాన్ ప్రధాన లక్ష్యం రష్యా స్థానంలో మరో 'సూపర్ పవర్'ను తీసుకురావడం. కానీ రష్యా ఎదుగుదల వారి ప్లాన్‌లకు అడ్డుకట్ట వేసింది" అని ఆయన ఎక్స్‌లో రాశారు.
"ఈ వారం చాలా ముఖ్యమైంది. ఎందుకంటే భారతదేశం చివరకు తన భ్రమలను తొలగించుకుని న్యూ వరల్డ్ ఆర్డర్ కోసం తనను తాను సిద్ధం చేసుకుంటోంది" అని దౌలత్ సింగ్ అన్నారు.
"రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన 2025లో భారతదేశానికి అత్యంత ముఖ్యమైన సంఘటన. క్వాడ్ సమ్మిట్ కోసం అధ్యక్షుడు ట్రంప్ భారతదేశానికి వచ్చి ఉంటే, పుతిన్ తన పర్యటనను వాయిదా వేసుకునేవారు" అని వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులు ప్రవీణ్ సాహ్ని సోషల్ మీడియా ఎక్స్‌లో రాశారు.
పుతిన్ పర్యటనకు 2026లో భారతదేశానికి బ్రిక్స్‌లో సభ్యత్వానికి మద్దతును మించిన ప్రాధాన్యత ఉందని సాహ్ని అన్నారు.
బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూట్‌లో సీనియర్ ఫెలో తన్వి మదన్ ఒక వ్యాసంలో పుతిన్ పర్యటన ద్వారా రెండు దేశాల లక్ష్యం ఒక సందేశాన్ని పంపడమే అని పేర్కొన్నారు.
ఆయన అభిప్రాయం ప్రకారం "అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ భారత ప్రభుత్వం తనకు స్వయంప్రతిపత్తి లేదా స్వేచ్ఛ ఉందని నిరూపించాలనుకుంటోంది. అదే సమయంలో, ఈ పర్యటన ద్వారా పశ్చిమ దేశాలతో సంబంధాల విషయంలో భారతదేశంపై ఒత్తిడి తీసుకురావాలని మాస్కో కోరుకుంటోంది’’ అని తన్వి రాశారు.
అందువల్ల భారత్ కూడా పశ్చిమ దేశాలతో తన సంబంధాలను బ్యాలన్స్ చేసుకునే విషయంలో సవాలును ఎదుర్కొంటున్నట్లేనని తన్వి మదన్ అన్నారు.
"రష్యా రక్షణ సహకారంపై దృష్టి పెడుతుంది. భారతదేశం ఆర్థిక రంగంతోపాటు ఇతర సంబంధాలను విస్తరించడానికి ప్రయత్నిస్తుంది. రష్యా అత్యాధునిక సుఖోయ్-57 యుద్ధ విమానాన్ని అందించవచ్చు. ప్రస్తుతం, చమురు దిగుమతులను భారతదేశం తగ్గిస్తున్నందువల్ల డాలర్లను సంపాదించడానికి రష్యాకు ఉన్న ఏకైక మార్గం రక్షణ రంగమే" అని తన్వి రాశారు.
ఆయన ఆభిప్రాయం ప్రకారం "ఎస్ -400 డిఫెన్స్ సిస్టమ్ సరఫరా, సుఖోయ్-30 అప్‌గ్రేడ్‌పై భారతదేశం ఒక ఒప్పందాన్ని ఆశిస్తోంది. దీనితో పాటు, ఆర్కిటిక్ ప్రాంతం, హిందూ మహాసముద్రంలో రెండు దేశాల మధ్య సహకారాన్ని మరింత పెంచడంపై ఒప్పందం జరగొచ్చు''

ఫొటో సోర్స్, AFP via Getty Images
రక్షణ రంగానికి మించి...
యుక్రెయిన్‌పై రష్యా దాడిని భారతదేశం ఎప్పుడూ ఖండించలేదు. మరోవైపు, రష్యాతో భారతదేశ వాణిజ్యం పెరుగుతూనే ఉంది. ఇది పాశ్చాత్య దేశాలను ఆగ్రహానికి గురిచేసింది.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియన్ స్టడీస్‌లో విజిటింగ్ ప్రొఫెసర్ సి.రాజమోహన్ ఇటీవల ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఇలా రాశారు "అమెరికా-భారత్ సంబంధాలకు రష్యా-భారత్ సంబంధాలు అడ్డంకిగా మారడానికి జో బైడెన్ అనుమతించలేదు. మరోవైపు, బైడెన్ కంటే రష్యా వ్యతిరేకి కానప్పటికీ, భారతదేశంపై ట్రంప్ అదనంగా 25 శాతం సుంకాన్ని విధించారు. దీనికి రష్యా నుంచి చమురు కొనుగోలును కారణంగా చూపారు''
"రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రష్యాకు అత్యంత అనుకూలంగా ఉండే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ను పరిగణించవచ్చు. రష్యా నుంచి చమురు కొంటున్నందుకు భారతదేశాన్ని శిక్షించినప్పటికీ, రష్యా నుంచి హైడ్రోకార్బన్‌లు, ఖనిజాలను పొందాలని ట్రంప్ కోరుకుంటున్నారు. ట్రంప్ శాంతి దౌత్యంలో రష్యాతో వ్యాపార అవకాశాలను విస్తరించడం, యుక్రెయిన్ నుంచి సహజ వనరులకు యాక్సెస్ పొందడం అనే ఆశయాలు ఉన్నాయి. అమెరికన్, యూరప్‌ల మీడియా నివేదికలు ఇదే విషయం చెబుతున్నాయి" అని రాజమోహన్ అన్నారు.
"యుక్రెయిన్‌పై దిల్లీ వైఖరితో యూరప్ అసౌకర్యంగా ఉంది. అమెరికా తర్వాత భారతదేశానికి యూరప్ అత్యంత ముఖ్యమైన భాగస్వామి. అయితే, ట్రంప్ చేసినట్లుగా భారతదేశంపై యూరప్ సుంకాలు విధించలేదు. భారతదేశం కూడా యూరప్‌తో బలమైన సంబంధాలను కోరుకుంటోంది అందువల్ల, యూరప్, రష్యాల మధ్య శాంతి ఉండాలని భారతదేశం భావిస్తోంది" అని రాజమోహన్ రాశారు.
"2000 సంవత్సరంలో పుతిన్ అధ్యక్షుడిగా మొదటిసారి భారతదేశాన్ని సందర్శించినప్పుడు, సోవియట్ అనంతర రష్యా, భారతదేశంపట్ల చూపిన నిర్లక్ష్యాన్ని తొలగించడమే ఆయన లక్ష్యం. మోదీ, పుతిన్‌లకు బలమైన, ఆధునికమైన సంబంధాలను ఏర్పరచుకోవడానికి ఈ పర్యటన కొత్త అవకాశాన్ని అందిస్తుంది" అని రాశారు రాజమోహన్.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














