‘‘అలా బతికి బయటపడ్డా’’- సౌదీ బస్సు ప్రమాదం గురించి వివరించిన మృత్యుంజయుడు షోయబ్

సౌదీ బస్సు ప్రమాదం, మహ్మద్ అబ్దుల్ షోయబ్
ఫొటో క్యాప్షన్, సౌదీ అరేబియాలో నవంబరు 17న జరిగిన బస్సు ప్రమాదంలో మహ్మద్ అబ్దుల్ షోయబ్ ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

''కొన్ని సెకన్లలోనే బస్సు అంతా మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత ఏమీ అర్థం కాలేదు. నేను బయటకు దూకేశాను. నాకు కూడా మంటలు అంటుకోవడంతో బట్టలు తీసి పారేశాను'' అని చెప్పారు మహ్మద్ అబ్దుల్ షోయబ్.

సౌదీ అరేబియాలో నవంబరు 17న జరిగిన బస్సు ప్రమాదంలో షోయబ్ ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో మొత్తం 45 మంది సజీవ దహనమయ్యారని తెలంగాణ పోలీసులు అప్పట్లో ప్రకటించారు.

తనకు కూడా మంటలు అంటుకున్నప్పటికీ, బస్సు అద్దాలు పగలగొట్టి, బయటకు దూకి ప్రాణాలు రక్షించుకున్నానని షోయబ్ చెప్పారు.

సౌదీ అరేబియాలో చికిత్స తీసుకుని ఆయన హైదరాబాద్‌ తిరిగి వచ్చారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

కాలిన గాయాలతో..

పాతబస్తీలోని టప్పాచబుత్ర ప్రాంతంలోని నటరాజ్ నగర్‌కు చెందిన షోయబ్ ఇంటికి బీబీసీ వెళ్లింది.

ఆ సమయంలో ఆయన చెకప్ కోసం ఆసుపత్రికి బయల్దేరారు. ఎక్కువ‌సేపు నిల్చుని ఉండలేను అని చెప్పి మాతో మాట్లాడారు షోయబ్. ఆయన చెవులు, చేతులు, కాళ్లపై కాలిన గాయాలు కనిపించాయి. కుడికాలికి తీవ్ర గాయం కావడంతో పూర్తిగా కట్టు కట్టి ఉంది. సోదరుడు సమీర్, మరో స్నేహితుడి సాయంతో నడుస్తున్నారు.

సౌదీలో బస్సు ప్రమాదం ఎలా జరిగిందో ఆయన బీబీసీకి వివరించారు.

''ప్రమాదం జరిగిన సమయంలో బస్సు ఆగి ఉంది. ఒక వ్యక్తి మూత్ర విసర్జనకు వెళ్లాలని చెప్పడంతో బస్సును ఆపారు. ఒక్కసారిగా వెనక నుంచి వచ్చిన ఆయిల్ ట్యాంకర్ బస్సును ఢీకొంది'' అని షోయబ్ చెప్పారు.

మదీనా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మదీనా(ఫైల్ ఫోటో)

ప్రమాదానికి ముందు ఏం జరిగిందంటే..

బదర్ ప్రాంతం నుంచి మదీనాకు వెళ్లేందుకు బస్సులో బయల్దేరినట్లు షోయబ్ చెప్పారు. నవంబరు 16 మధ్యాహ్నం మూడున్నర గంటలకు మక్కా నుంచి బయల్దేరామని చెప్పారు షోయబ్.

''ఎనిమిది గంటలకు బదర్ చేరుకున్నాం. అక్కడ నమాజ్ పూర్తయ్యాక మదీనాకు బయల్దేరాం. ఆ తర్వాత కాసేపటికే.. సుమారు తొమ్మిది, తొమ్మిదిన్నర గంటల సమయంలో యాక్సిడెంట్ జరిగింది'' అని చెప్పారు.

ఆయిల్ ట్యాంకర్ వెనక నుంచి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని సౌదీ అరేబియా అధికారుల నుంచి సమాచారం ఉన్నట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ చెప్పారు.

''ప్రమాదం ఎలా జరిగిందో మొదట అర్థం కాలేదు. వెనుక నుంచి వచ్చి ఏదో ఢీకొందని మాత్రం తెలుసు. ఆయిల్ ట్యాంకర్ బస్సును గుద్దిందనే విషయం బయటికి వచ్చాకే తెలిసింది'' అని షోయబ్ చెప్పారు.

బస్సులో కొందరు నిద్ర పోతుండగా, మరికొందరు మెలకువగా ఉన్నారని షోయబ్ చెబుతున్నారు.

ఆ సమయంలో ఒక్కసారిగా అందరూ సీట్ల నుంచి బస్సులో కింద పడిపోవడంతో ఎటూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని వివరించారాయన.

''చూస్తుండగానే, సెకన్లలోనే మంటలు వ్యాపించాయి. ఆయిల్ ట్యాంకర్ కావడంతోపాటు బస్సు వెనుక గ్యాస్ స్టోరేజీ ట్యాంకర్ ఉంది. దానివల్ల వెంటనే మంటలు బస్సు అంతా అంటుకున్నాయి'' అని షోయబ్ వివరించారు.

'డ్రైవర్ పక్కన ఉండటంతో దూకేశాను''

కిటికీ నుంచి బయటకు దూకి ప్రాణాలు రక్షించుకున్నానని షోయబ్ బీబీసీతో చెప్పారు.

''డ్రైవర్ పక్కనే నిల్చుని ఉన్నాను. బస్సు అద్దాలు పగలగొట్టి డ్రైవర్ దూకేశాడు. నేను కూడా అక్కడి నుంచే దూకాను'' అని చెప్పారు.

''సౌదీ పోలీసులు వచ్చి నా నుంచి అన్ని వివరాలు తీసుకున్నారు. ఆ తర్వాత ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకెళ్లి అక్కడ నా వేలిముద్రలు తీసుకు వెళ్లారు'' అని వివరించారు.

ప్రమాద తీవ్రత ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి షోయబ్. బస్సులో ఉన్న అందరూ చనిపోయారని వెంటనే అర్థమైందని ఆయన బీబీసీతో చెప్పారు.

సౌదీ అరేబియా, బస్సు ప్రమాదం

ఫొటో సోర్స్, NOAH SEELAM/AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, మదీనా సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు (ఫైల్)

ప్రమాదం ఎప్పుడు జరిగిందంటే..

ఈ యాత్రికులందరూ నవంబర్ 9 నుంచి 23 వరకు ఉమ్రా యాత్రకు వెళ్లారు.

భారత కాలమానం ప్రకారం, నవంబరు 16 అర్ధరాత్రి (తెల్లవారితే నవంబరు 17)న ప్రమాదం జరిగింది.

మొత్తం 54 మంది హైదరాబాద్ నుంచి ఉమ్రా యాత్రకు బయల్దేరి వెళ్లారు. వీరిలో నలుగురు మక్కాలోనే ఉండిపోగా, మరో నలుగురు కారులో మదీనాకు బయల్దేరారు.

మిగిలిన 46 మంది బస్సులో మదీనాకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని నవంబరు 17న హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ మీడియాకు చెప్పారు.

మదీనాకు 25 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో సజీవ దహనమైన 45 మందిలో షోయబ్ తల్లిదండ్రులు, తాత కూడా ఉన్నారు.

ప్రమాదం జరిగిన తర్వాత తెలంగాణ మంత్రి అజహరుద్దీన్ నేతృత్వంలోని అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు మృతుల కుటుంబాలకు చెందినవారిని తెలంగాణ ప్రభుత్వం సౌదీ అరేబియాకు పంపించింది. చనిపోయిన వారికి అక్కడే అంత్యక్రియలు నిర్వహించేందుకు సహకరించింది.

''ఇల్లు చేరినందుకు అల్లాకు కృతజ్ఞతలు. తెలంగాణ ప్రభుత్వం, సీఎం, అందరి సాయం వల్ల నేను ఇంటి వరకూ చేరుకోగలిగాను.

ప్రమాదంలో అంతమంది చనిపోవడం, నా కుటుంబ సభ్యులను పోగొట్టుకోవడం జీవితంలో మరిచిపోలేని బాధ'' అని అబ్దుల్ షోయబ్ ఆవేదన వ్యక్తం చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)