విలియం లీ : "నన్ను హీరో అని పిలుస్తుంటే నా గుండె బద్దలవుతోంది"

విలియం లీ , హాంకాంగ్‌
ఫొటో క్యాప్షన్, భవనంలో మంటలు అంటుకున్నాయని విలియం లీకి ఆయన భార్య ఫోన్ చేసి చెప్పారు.
    • రచయిత, కోయి లీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

విలియం లీ తాను పుట్టినప్పటి నుంచి నివసించిన హాంకాంగ్ ‌గృహసముదాయంలో ఇటీవల భారీ అగ్నిప్రమాదం జరిగింది . ఆ ఘటనలో తన పక్కింటివారిని రక్షించిన లీని అక్కడి వారు హీరో అని పిలుస్తున్నారు, అయితే అది తనకు నచ్చడం లేదంటున్నారు లీ.

దాదాపు 159 మంది ప్రాణాలను బలిగొన్న వాంగ్‌ఫుక్ కోర్టు అగ్నిప్రమాదంలో ఇంకా కొంతమందిని రక్షించి ఉండాల్సిందనే అపరాధ భావన ఆయన్ను వెంటాడుతోంది.

"ఎవరైనా నన్ను హీరో అని పిలిచినప్పుడల్లా నా గుండె బద్దలైపోతోంది " అని 40 ఏళ్ల లీ ఏడుస్తూ చెప్పారు.

విషాదం జరిగిన వారం రోజుల తర్వాత కూడా, జాడతెలియని 30 మంది మృతదేహాల కోసం అగ్నిమాపక సిబ్బంది ఇప్పటికీ దగ్ధమైన ఆ ఏడు భవనాలలో గాలిస్తున్నారు. అగ్నిప్రమాదం ప్రారంభమైనప్పుడు లీ మాదిరే వీరు కూడా వారి ఇళ్లలోనే ఉన్నారు.

మంటలు ఎలా మొదలయ్యాయి, అందరూ ఎందుకు తప్పించుకోలేకపోయారు అనే విషయాలపై హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆదేశాల మేరకు ఒక స్వతంత్ర కమిటీ దర్యాప్తు చేస్తోంది. భవనంలో మంటలు సులభంగా అంటుకునేలా నెట్స్ ఉన్నాయని, అగ్నిమాపక అలారాలు సరిగ్గా పనిచేయ లేదని కనుగొన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
వాంగ్ ఫక్ కోర్ట్ అగ్నిప్రమాదం

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, వాంగ్‌ఫుక్ కోర్టు అగ్నిప్రమాదంలో దాదాపు 159 మంది చనిపోయారు.

ప్రమాద సమయంలో ‘లీ’ ఏం చేశారు?

గృహసముదాయంలోని వాంగ్ చియోంగ్ హౌస్‌లో మంటలు చెలరేగాయని చెప్పడానికి తన భార్య ఫోన్ చేసినప్పుడు లీ పెద్దగా ఆందోళన చెందలేదు. అగ్నిమాపక అలారాలు మోగకపోవడంతో ఆయన నింపాదిగా ఉన్నారు. తొందరపడటానికి బదులుగా, దాదాపు 10 నిమిషాలు తన వస్తువులను ప్యాక్ చేసుకున్నారు లీ.

కానీ, లీ తన ఇంటి తలుపు తెరిచినప్పుడు, పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో గ్రహించారు. దట్టమైన పొగ లోపలికి వచ్చింది. దీంతో, ఆయన తన ఫ్లాట్‌లోకి తిరిగి వెళ్లారు. లీ భార్య ఫోన్‌లో కేకలు వేస్తోంది, కానీ ఆయన ప్రశాంతంగా ఆలోచించారు. పొగ లోపలికి రాకుండా తలుపు కింద తడి తువ్వాలను ఉంచి, తర్వాత ఏం చేయాలా అని ఆలోచించారు.

అప్పుడే లీ కారిడార్‌లో కొన్ని గొంతులు విన్నారు. పొగ చాలా ఎక్కువగా ఉండటంతో ఆయన ఏమీ చూడలేకపోయారు. తడి టవల్‌తో తన ముఖాన్ని కప్పుకుని, కారిడార్‌లోకి మెల్లిగా నడిచారు. ఇద్దరు వ్యక్తులను తాకడం ద్వారా వారు పక్కింటివారని అర్థం చేసుకున్నారు . వెంటనే, వారిని తన ఫ్లాట్‌లోకి లాగారు లీ.

సమీపంలోని ఒక బ్లాక్‌లో ఉన్న బాయి షుయ్ లిన్ అనే మహిళ కూడా పక్కింటివారికి సహాయం చేయడానికి ప్రయత్నించారు. 66 ఏళ్ల ఆ మహిళ మూడు ఇళ్ల తలుపులు తట్టి, అగ్ని ప్రమాదం గురించి హెచ్చరించి, వారిని రక్షించినట్లు చెబుతున్నారు. కానీ, బాయి ప్రాణాలతో బయటపడలేదు. బాయి కుమారులు వారాంతంలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు.

" ఆమెను ఒక నిమిషం ముందుగా వెళ్లిపోవాలని అడిగి ఉంటే, ఆమె బతికే ఉండేదని అనుకుంటున్నా" అని ఇప్ కా-కుయ్ అనే వ్యక్తి బీబీసీ యూఎస్ పార్ట్‌నర్ సీబీఎస్‌కు చెప్పారు.

"ఆమె గురించి మాకు తెలుసు. ఇతరులను హెచ్చరించకుండా తన మానాన తాను వెళ్లే మనిషి కాదావిడా" అని ఇప్ అన్నారు.

లీ ఫ్లాట్‌లోకి తిరిగి వచ్చినప్పుడు, ఆయన రక్షించిన జంట కారిడార్‌లో మరొక స్వరం విన్నట్లు చెప్పారు - ఒక ఇంటి పనిమనిషి వృద్ధ మహిళను పిలుస్తున్నారు. కానీ, ఇప్పుడు ఆ గొంతు నిశ్శబ్దంగా మారింది.

ఈ సారి లీ సాయం అందించలేని నిస్సహాయస్థితిలో ఉన్నారు.

"నేను చాలా అపరాధభావానికి గురయ్యాను . కొంతమందిని రక్షించలేదు. వారి కోసం నేను మళ్లీ నా తలుపు తెరవలేదు" అన్నారు లీ.

కారిడార్‌లో అరిచిన మహిళకు ఏం జరిగిందో లీకి ఇంకా తెలియదు.

విలియం లీ, వాంగ్ ఫక్ కోర్ట్ అగ్నిప్రమాదం

ఫొటో సోర్స్, William Li

ఫొటో క్యాప్షన్, మంటలు చెలరేగిన దాదాపు రెండున్నర గంటల తర్వాత, అగ్నిమాపక సిబ్బంది ఏరియల్ లాడర్ ఉపయోగించి విలయం లీ ఇంటిని చేరుకున్నారు.

అత్యవసర ద్వారం మూసివేశారా?

చనిపోయిన వారిలో తొమ్మిది మంది ఇండోనేషియన్, ఒక ఫిలిప్పీన్స్ ఇంటి పనివారు ఉన్నట్లు సమాచారం. కానీ, కొందరు ప్రాణాలతో బయటపడ్డారు. అందులో 28 ఏళ్ల రోడోరా అల్కరాజ్ కూడా ఉన్నారు.

ఆమె తన యజమాని మూడు నెలలబిడ్డను , వృద్ధ తల్లిని చూసుకుంటూ మరొక ఫ్లాట్‌లో చిక్కుకున్నారు. ఆ సమయంలో కూడా వారిని అంటిపెట్టుకునే ఉండటంతో ఆమెను కూడా హీరో అని జనం పిలుస్తున్నారు.

అగ్నిమాపక సిబ్బంది చివరికి ఆ ముగ్గురినీ రక్షించారు. ప్రమాద సమయంలో, అల్కరాజ్ తన సోదరికి అనేక వాయిస్ మెసేజ్‌లు పంపారు.

"నేను చాలా బలహీనంగా ఉన్నాను. ఊపిరి పీల్చుకోలేకపోతున్నాను" అని ఆమె ఒక క్లిప్‌లో చెప్పినట్లు రాయిటర్స్ తెలిపింది.

లీ రక్షించిన జంటను స్థానిక మీడియా 'చౌస్‌'గా పిలిచింది. మంటలు తగ్గకపోవడంతో వారంతా తప్పించుకోవాలనుకున్నారు. అప్పటికే చాలాగంటలు గడిచాయి, వారికి వేరే దారి లేదు.

ఒక అగ్నిమాపక నిష్క్రమణా మార్గం మంటల కారణంగా మూసుకుపోయింది. మరొక మార్గం లాక్ చేసి ఉందని లీ పొరుగింటి వ్యక్తి భావించారు. మంటలు చాలా తీవ్రంగా ఉండటం, పేలుడు కారణంగా రెండవ అంతస్తు కిటికీ నుంచి దిగలేమని వారికి అర్థమైంది.

డానిష్ కంపెనీ ఐఎస్ఎస్ అనుబంధ సంస్థ అయిన వాంగ్ ఫుక్ కోర్ట్ ప్రాపర్టీ మేనేజర్, అత్యవసర నిష్క్రమణ ద్వారం మూసివేశారనే రిపోర్టుల గురించి బీబీసీ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు.

విలియం లీ, వాంగ్ ఫక్ కోర్ట్ అగ్నిప్రమాదం

ఫొటో సోర్స్, William Li

ఫొటో క్యాప్షన్, కిటికీల పక్కన పెట్టిన బొమ్మలు లీ కుటుంబానికి చాలా ఇష్టం.

చనిపోతానంటూ వాట్సాప్‌లో వీడ్కోలు సందేశాలు

"చావు నాకు దగ్గరగా ఉందని భావించడం అదే మొదటిసారి" అని లీ చెప్పారు.

దీంతో, ఆయన వాట్సాప్‌లో తన స్నేహితులకు వీడ్కోలు సందేశాలు పంపడం ప్రారంభించారు.

"నేను తప్పించుకోలేను. నాకు ఏదైనా జరిగితే, దయచేసి నా పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి" అని లీ వారికి చెప్పారు.

మంటలు చెలరేగిన దాదాపు రెండున్నర గంటల తర్వాత, అగ్నిమాపక సిబ్బంది ఏరియల్ లాడర్‌ను ఉపయోగించి లీ ఇంటికి చేరుకున్నారు. ముందుగా అగ్నిమాపక సిబ్బంది తన ఇంటిలోని జంటను రక్షించాలని లీ పట్టుబట్టారని హాంకాగ్ వార్తాసంస్థ హెచ్‌కే01కి చౌ భార్య చెప్పారు.

"మేం పెద్దవాళ్లం, మీరు ముందుగా వెళ్లిపోవాలని లీకి చెప్పాం. కానీ ఆయన నిరాకరించారు. తాను యువకుడినని, పరిస్థితిని హ్యాండిల్ చేయగలనని చెప్పారు" అని ఆమె అన్నారు.

'న్యాయం లభిస్తుందనుకుంటున్నా'

అగ్నిమాపక సిబ్బంది ఆయన కోసం తిరిగి వచ్చినప్పుడు, లీ తన ఇంటిని వదిలి బయటికి రావడానికి ఇష్టపడలేదు. ఆ ఫ్లాట్‌లో ఆయన జ్ఞాపకాలున్నాయి. ఫోటోగ్రఫీ సామగ్రి, బొమ్మల సేకరణలతో ఇల్లు నిండి ఉంది.

"నేను ఏమీ తీసుకెళ్లలేనని మంటలు నాకు చెబుతున్నాయి. అవి నాశనం కాకుండా ఆపడానికి నాకు శక్తి లేదు" అని లీ చెప్పారు.

బయటికొచ్చిన తర్వాత, లీ సమీపంలోని ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్‌లో తన కుటుంబాన్ని తిరిగి కలిశారు.

కానీ, ఆసుపత్రికి చేరుకున్న తర్వాత, తను అనుభవించిన భయానక స్థితిని గ్రహించడానికి ఆయనకు తెల్లవారుజాము వరకు పట్టింది.

"నాలో బలం మిగిలి లేదు. నేను ఎమర్జెన్సీ రూమ్‌కు చేరుకున్నప్పుడు, నా మోకాళ్లు బలహీనపడ్డాయి. నా నాసికకు ఇంకా మండుతున్న వాసన వచ్చింది" అని లీ అన్నారు.

ఆయన్ని వైద్యులు ఒక వార్డులో చేర్చారు. అప్పుడే ఆయనకు చివరకు ఏడవడానికి, ఏం జరిగిందో అర్ధం చేసుకోవడానికి సమయం దొరికింది.

"నేను ఇంతకుముందు ఆసుపత్రికి వస్తే, త్వరగా ఇంటికి వెళ్లాలని కోరుకునేవాడిని. కానీ ఈసారి, మీరు ఇంటికి వెళ్లాలనుకుంటున్నారా అని నర్సు అడిగినప్పుడు, నేను వెళ్లాలని అనుకోలేదు. భవిష్యత్తులో ఎదుర్కోవాల్సిన విషయాలను నేను తప్పించుకుంటున్నట్లు అనిపించింది" అన్నారు లీ.

అయినప్పటికీ, లీ వాటిని ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారు, వీలైనన్ని ఎక్కువ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

"నిజాన్ని కనుగొనడంలో సహాయం చేయడానికి చాలామంది ముందుకు వస్తారని ఆశిస్తున్నాను" అని చెప్పారు.

"వాంగ్‌ఫుక్ కోర్టు నివాసితులకు సమాధానాలు, న్యాయం లభిస్తుందని ఆశిస్తున్నాను" అన్నారు లీ.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)