Airbus విమానాలకు ఏమైంది, భారత్ సహా పలు దేశాల్లో హఠాత్తుగా ఎందుకు ఆపేయాల్సి వచ్చింది?

ఎయిర్ బస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎయిర్ బస్ ఏ 320 విమానం (ఫైల్ ఫోటో )
    • రచయిత, హఫ్సా ఖలీల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘‘మా A320 ఫ్యామిలీకి చెందిన విమానాలన్నింటికీ తప్పనిసరిగా నిర్వహించాల్సిన టెక్నికల్ అప్‌డేట్‌ను పూర్తి చేశాం. మా దగ్గరున్న 200 విమానాలు ఇప్పుడు పూర్తిగా అప్‌డేట్ అయ్యాయి’’ అంటూ భారత్‌లో ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రకటించింది.

మరోవైపు టాటాల ఆధ్వర్యంలో నడిచే ఎయిర్ ఇండియా కూడా తమ దగ్గరున్న A320 ఫ్యామిలీకి చెందిన విమానాల అప్‌డేషన్ 90 శాతం పూర్తయిందని ప్రకటించింది.

విమానాల రద్దు, షెడ్యూల్‌లో మార్పులు చేయాల్సిన అవసరం రాకుండా తమ సిబ్బంది ఈ సాంకేతిక సమస్యను సరిదిద్దుతున్నారని ఎయిర్ ఇండియా పేర్కొంది.

ఎయిర్ బస్‌కు చెందిన కొన్ని మోడళ్ల విమానాలలో సాంకేతిక సమస్యలు ఉన్నాయంటూ ప్రపంచవ్యాప్తంగా ఆయా మోడళ్లకు చెందిన పలు ఎయిర్‌క్రాఫ్ట్‌లను నిలిపేయడం కలకలం సృష్టించింది.

ఈ సాంకేతిక సమస్య కారణంగా ఒక్క భారతదేశంలోనే కాక, ప్రపంచవ్యాప్తంగా వేలాది విమానాల రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఎయిర్ బస్ క్షమాపణలు

ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ కంపెనీ తన A320 మోడల్‌కు చెందిన దాదాపు ఆరువేల విమానాలు ప్రభావితమయ్యాయని తెలిపింది.

దీంతో చాలా విమానాలకు వేగంగా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయాల్సిరాగా, దాదాపు 900 పాత విమానాలకు కొత్త కంప్యూటర్ అవసరం పడింది.

విమానాలను నియంత్రించే కంప్యూటర్లను సోలార్ రేడియేషన్ ప్రభావితం చేస్తున్నదనే హెచ్చరికతో వేలాది ఎయిర్‌బస్ విమానాలు కొన్నిగంటలపాటు నిలిపివేశారు.

సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ తర్వాత రాకపోకలు సాధారణ స్థితికి చేరుకున్నాయి.

ఐదువేలకు పైగా విమానాలకు అప్‌డేట్స్ సజావుగా జరిగాయని ఫ్రెంచ్ రవాణా మంత్రి ఫిలిప్ టాబరోట్ తెలిపారు.

మరో, 100 లోపు విమానాలకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అవసరమని మంత్రికి ఎయిర్‌బస్ సమాచారమిచ్చినట్లు స్థానిక మీడియా తెలిపింది.

శుక్రవారం నుంచి ఏర్పడిన రవాణా సమస్యలు, ఆలస్యాలకు ఎయిర్‌బస్ సీఈఓ గుయిలౌమ్ ఫౌరీ క్షమాపణలు చెప్పారు. టెక్నికల్ అప్‌డేట్ వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి ఎయిర్‌బస్ బృందాలు నిరంతరాయంగా పనిచేస్తున్నాయని తెలిపారు.

శనివారం ఉదయం, పారిస్‌లోని చార్లెస్ డి గల్లె విమానాశ్రయంలో ఎయిర్ ఫ్రాన్స్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన కొన్ని విమానాలు ఆలస్యమవగా, మరికొన్ని రద్దయ్యాయి.

అమెరికన్ ఎయిర్‌లైన్స్ తన 340 విమానాలు ప్రభావితమయ్యాయని, కొన్ని ఆలస్యంగా నడవవచ్చని తెలిపింది.

కానీ, చాలా విమానాలకు అప్‌డేట్స్ శుక్రవారం, శనివారం జరుగుతున్నాయని తెలిపింది. ఇక, డెల్టా ఎయిర్‌లైన్స్ తన విమానాలపై ప్రభావం తక్కువగా ఉంటుందని తెలిపింది.

సాంకేతికత అప్‌డేట్, ఎయిర్ బస్, ఈజీబెట్

ఫొటో సోర్స్, Getty Images

రాత్రంతా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్

యూకేలో సమస్యలు తక్కువగానే ఉన్నాయి. లండన్ గాత్విక్ విమానాశ్రయం కూడా తమ దగ్గర అంతరాయాలు ఏర్పడినట్లు సమాచారం ఇచ్చింది. కానీ, రద్దు గురించి హీత్రూ విమానాశ్రయం నుంచి ఎలాంటి ప్రకటనలు బయటకు రాలేదు.

మాంచెస్టర్ విమానాశ్రయం పెద్ద సమస్యలను ఊహించడం లేదని, లూటన్ విమానాశ్రయం ఎటువంటి ప్రభావం ఉండబోదని ప్రకటించాయి.

టెక్నికల్ అప్‌డేషన్ కోసం విమానయాన సంస్థలు రాత్రంతా పనిచేశాయని, కొంత అంతరాయం ఉందని అంచనా వేసినప్పటికీ, తక్కువ సంఖ్యలో విమానాలు మాత్రమే ప్రభావితమయ్యాయని యూకే పౌర విమానయాన అథారిటీ తెలిపింది.

బ్రిటిష్ ఎయిర్‌వేస్, ఎయిర్ ఇండియాలు ఈ సమస్య వల్ల మరీ ఎక్కువగా ప్రభావితం కాలేదు.

శనివారం, ఈజీజెట్ తన విమానాలను పెద్ద సంఖ్యలో అప్‌డేట్ చేసినట్లు, ఎప్పటిలాగే విమానాలు నడపాలనే ప్రణాళికలో ఉన్నట్లు తెలిపింది.

విజ్ ఎయిర్ కూడా రాత్రికి రాత్రే టెక్నికల్ అప్‌డేషన్ పూర్తి చేసి విమానాలు నడిపిస్తోంది.

ఆస్ట్రేలియాలో జెట్‌స్టార్ దాని విమానాలలో మూడింట ఒక వంతు ప్రభావితమైనందున 90 విమానాలను రద్దు చేసింది. చాలా విమానాలలో అప్‌డేషన్ పూర్తయినప్పటికీ, వారాంతంలో విమానాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

సాఫ్ట్‌వేర్ అప్‌డేషన్ పూర్తయ్యే వరకు ఎయిర్ న్యూజీలాండ్ తన A320 విమానాలను నిలిపివేసింది. ఇప్పుడు అన్ని విమానాలు తిరిగి ప్రారంభమయ్యాయి.

ఫ్రాన్స్‌, ఎయిర్‌బస్

ఫొటో సోర్స్, Getty Images

అసలేం జరిగింది?

అక్టోబర్‌ నెలలో అమెరికా, మెక్సికో మధ్య ప్రయాణిస్తున్న జెట్‌బ్లూ విమానం గాలిలో ప్రయాణిస్తూ అకస్మాత్తుగా తక్కువ ఎత్తుకు దిగింది. దీంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటనలో కనీసం 15 మంది గాయపడ్డారు.

ఆ తర్వాతే విమానంలో సాంకేతికత సమస్యను ఎయిర్‌బస్ కనుగొంది.

విమానం ఎత్తును లెక్కించే కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లో సమస్య ఉందని కంపెనీ గుర్తించింది. విమానం అధిక ఎత్తులో ఉన్నపుడు, సూర్యుడి నుంచి వచ్చే బలమైన రేడియేషన్ ఈ డేటాను దెబ్బతీస్తున్నట్లు అర్ధం చేసుకుంది.

ఈ సమస్య A318, A319, A320, A321 విమానం మోడళ్లను ప్రభావితం చేసింది.

సాధారణ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌తో దాదాపు 5,100 విమానాలు సమస్యను పరిష్కరించుకోగా, దాదాపు 900 పాత విమానాలకు కొత్త కంప్యూటర్ అవసరం పడింది.

కంప్యూటర్‌ను మార్చే వరకు ఈ పాత విమానాలు ఎగిరే పరిస్థితి లేదు. కంప్యూటర్ల లభ్యతపై ఇవి మళ్లీ ఎగరడానికి ఎంతకాలం పడుతుందన్నది ఆధారపడి ఉంటుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)