ఇండిగో విమానాల రద్దు : రీఫండ్‌పై ఇండిగో ఏం చెప్పింది, నిబంధనల సడలింపుతో అంతా చక్కబడుతుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
దేశవ్యాప్తంగా ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ నడిపే వందలాది విమానాలు రద్దు కావడానికి, ఆలస్యం కావడానికి అసలు కారణమేంటి..? ఇండిగో చేసిన విజ్జప్తి మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) సడలించిన నిబంధనలతో సర్వీసులు గాడిన పడతాయా..?
హైదరాబాద్ విమానాశ్రయంలో గురువారం అర్ధరాత్రి 12 గంటల నుంచి శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల వరకు 155 విమాన సర్వీసులు రద్దు అయినట్లుగా జీఎంఆర్ విమానాశ్రయాధికారులు ప్రకటించారు.
ఇందులో 84 హైదరాబాద్ నుంచి వెళ్లాల్సిన సర్వీసులు కాగా, 74 హైదరాబాద్ రావాల్సినవిగా ఉన్నాయి.
శుక్రవారం కూడా వివిధ ఎయిర్ పోర్టుల వద్ద వందలాది విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి విమానాశ్రయాల్లో కనిపించింది. ''రద్దయిన సర్వీసులన్నింటికీ సంబంధించి టికెట్ డబ్బులను రీఫండ్ చేయనున్నాం'' అని ఇండిగో ప్రకటించింది.
మరోవైపు, పైలెట్ల విశ్రాంతి, రాత్రి డ్యూటీ విధుల విషయంలో కొత్తగా తీసుకువచ్చిన నిబంధనను కొన్నిరోజులపాటు వెనక్కి తీసుకుంటున్నట్లుగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ప్రకటించింది.

సిబ్బందితో వాగ్వాదం.. సోషల్ మీడియాలో వైరల్
ఇండిగో ఎయిర్ లైన్స్ అనేది భారతీయ విమాన సేవల్లో 60 శాతం మార్కెట్ కలిగి ఉంది.
విమాన సర్వీసుల రద్దుతో వందలాది మంది ప్రయాణికులు విమానశ్రయాల్లో పడిగాపులు కాస్తున్న చిత్రాలు పెద్దఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇండిగో సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి.
ఇండిగో విమాన సర్వీసులు రద్దు కావడంతో కర్ణాటక హుబ్లీలో ఓ విచిత్రమైన ఘటన జరిగింది. భువనేశ్వర్ నుంచి హుబ్లీకి వెళ్లాల్సిన విమానం రద్దు కావడంతో కొత్తగా పెళ్లయిన జంట హుబ్లీకి చేరుకోలేకపోయారు. దీనివల్ల వారి కోసం ఏర్పాటు చేసిన రిసెప్షన్‌కు , ఆ జంట రాలేకపోయారని ఎన్డీటీవీ రాసింది. దీంతో తమకోసం వచ్చిన బంధువుల ఆశీస్సులు అందుకోవడానికి ఆ జంట ఆన్‌లైన్‌లోకి వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అయితే, ఈ వీడియోను బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.

ఫొటో సోర్స్, Hindustan Times via Getty Images
ఇండిగో ఏం చెబుతోందంటే..
దేశంలో అతిపెద్ద ఎయిర్ లైన్స్‌లో ఇండిగో ఒకటి. ప్రతిరోజూ సుమారు 2300కుపైగా విమాన సర్వీసులు నడుపుతున్నట్లుగా ఆ సంస్థ చెబుతోంది. ఇందులో దేశీయ సర్వీసులతోపాటు అంతర్జాతీయ సర్వీసులు కూడా ఉన్నాయి.
గత కొన్ని రోజులుగా పెద్దసంఖ్యలో విమాన సర్వీసులు రద్దు కావడం, ఆలస్యం కావడంతో గందరగోళానికి దారితీసింది.
విమానాశ్రయాల్లో పెద్దసంఖ్యలో ప్రయాణికులు వేచి చూస్తున్న దృశ్యాలు మీడియాలో కనిపిస్తున్నాయి.
పీటీఐ వార్తా సంస్థ ప్రకారం, గురువారం 550కుపై ఇండిగో విమాన సర్వీసులు రద్దు అయినట్లుగా చెప్పింది. ఇందులో న్యూదిల్లీలో అత్యధికంగా 172 సర్వీసులు రద్దు కాగా, హైదరాబాద్ విషయానికి వస్తే 75 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి.
విమాన సర్వీసులు పెద్దసంఖ్యలో రద్దు కావడం, ప్రయాణికుల ఇబ్బందులపై విచారం వ్యక్తం చేస్తున్నట్లుగా ఇండిగో ప్రకటించింది.
''ఈ విషయంలో మేం సాధ్యమనంత వరకు సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం.రద్దు చేసిన విమాన సర్వీసులకు సంబంధించి టికెట్ బుక్ చేసుకున్నప్పుడు డబ్బులు ఏ విధంగా చెల్లించారో.. అదే విధానంలో రీఫండ్ చేస్తాం. డిసెంబరు 5 నుంచి 15 మధ్య జరిగిన క్యాన్సిలేషన్స్ లేదా రీషెడ్యూల్ కు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా చెల్లింపులు చేస్తాం'' అని ఇండిగో ప్రకటించింది.

ఫొటో సోర్స్, Getty Images
అసలు ఎందుకీ గందరగోళం..?
ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్(ఎఫ్‌డీటీఎల్) పేరుతో డీజీసీఏ ఈ ఏడాది జనవరి 20వ తేదీన కొన్ని నిబంధనలు తీసుకువచ్చింది.
ఈ నిబంధనల ప్రకారం, వారపు విశ్రాంతి సమయం(వీక్లీ రెస్ట్ అవర్స్) 36 గంటల నుంచి 48 గంటలకు పెంచింది.
అలాగే రాత్రిళ్లు ల్యాండింగ్ (నైట్ డ్యూటీ)ను గతంలో ఆరు సార్ల వరకు అనుమతి ఉండగా, రెండుసార్లకు కుదించింది.
ఈ నిబంధనలు పైలెట్ల అలసట లేదా బడలిక తగ్గిస్తుందని, తద్వారా పౌర విమానయాన భద్రతకు పెద్దపీట వేసినట్లు అవుతుందని డీజీసీఏ అప్పట్లో ప్రకటించింది.
మొదట ఈ నిబంధనలను నిరుడు జూన్ నుంచే అమలు చేయాల్సి ఉండగా, ఎయిర్ లైన్స్ నుంచి వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో వాయిదా వేసుకుంది.
ఒక్కసారిగా నిబంధనలు అమలు చేస్తే, రోటా(పైలెట్లు, క్యాబిన్ సిబ్బంది విధులు) కేటాయింపులో ఇబ్బందులు తలెత్తుతాయని ఇండిగో సహా ఎయిర్ లైన్స్ సంస్థలు డీజీసీఏకు చెప్పాయి. దశల వారీగా నిబంధనలు అమలు చేస్తామని అప్పట్లో ప్రకటించాయి.
దిల్లీ హైకోర్టు ఆదేశాలతో అమలు
డీజీసీఏ నిబంధనలు అమలు చేయకపోవడంపై ఎయిర్ లైన్స్ పైలెట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. డీజీసీఏ నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని దిల్లీ హైకోర్టు ఆదేశించింది. దీంతో డీజీసీఏ జనవరిలో కొత్త ఎఫ్‌డీటీఎల్ నిబంధనలు జారీ చేసింది.
జులై, నవంబరు నుంచి రెండు దశల్లో నిబంధనలు అమల్లోకి తీసుకురావాలని స్పష్టం చేసింది.
''మొదట విక్లీ రెస్ట్ అవర్స్ జులై నుంచి అమలు చేస్తుండటంతో ఇండిగో రోటాలో సర్దుబాటు చేయగలిగింది. కానీ, తర్వాత రాత్రిళ్లు ల్యాండింగ్ నిబంధనలకు వచ్చేసరికి సర్దుబాటు చేయడం కష్టమైంది'' అని పైలెట్ ఒకరు బీబీసీతో చెప్పారు.
నవంబరు 1 నుంచి నిబంధనలు పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురావడంతో రాత్రిళ్లు ల్యాండింగ్ తగ్గిపోయి, ఆ ప్రభావం మిగిలిన సర్వీసులపైనా పడిందని ఆయన వివరించారు.
''ఇండిగో సర్వీసుల పరంగా నైట్ ల్యాండింగ్ చాలా ఎక్కువ సంఖ్యలోనే ఉంటాయి. వాటి ల్యాండింగ్ తగ్గిపోవడం ప్రభావం చూపించింది'' అని సదరు పైలెట్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
'ఫేజ్-2 నిబంధనలతో ఆపరేషన్లపై ప్రభావం'
ఫేజ్-2 నిబంధనలు అమల్లోకి వచ్చాక తమ ఆపరేషన్లు తీవ్రంగా దెబ్బతిన్నట్లుగా డీజీసీఏకు ఇచ్చిన నివేదికలో ఇండిగో తెలిపింది. ఈ విషయాన్ని డీజీసీఏ ప్రెస్ రిలీజ్ లో వెల్లడించింది.
''విమాన సర్వీసుల స్లాట్స్ రాత్రిళ్లు అందుబాటులో ఉన్నాయి. ఫేజ్ 2 నిబంధనలు తీవ్ర ప్రతికూలత చూపాయి'' అని ఇండిగో నివేదికలో పేర్కొంది.
''ఎఫ్‌డీటీఎల్ నిబంధనలు మాపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపించాయి. దీనికితోడు సాంకేతిక సమస్యలు, శీతకాల పరిస్థితులు, ప్రతికూల వాతావరణం.. ఇలాంటి కారణాలతో పెద్దసంఖ్యలో విమాన సర్వీసులు రద్దు కావడం లేదా ఆలస్యం కావడం జరిగింది'' అని ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది.

ఫొటో సోర్స్, DGCA
డీజీసీఏ ఏ సడలింపులు ఇచ్చింది?
ఎఫ్‌డీటీఎల్ నిబంధనల్లో ఒక విషయాన్ని సడలిస్తున్నట్లుగా డిసెంబరు 5వ తేదీన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ప్రకటించింది.
‘‘డీజీసీఏ జారీచేసిన ఎఫ్‌డీటీఎల్ ఉత్తర్వులను తక్షణం నిలుపు చేస్తున్నట్టు’’ పౌర విమానయాన శాఖామంత్రి కింజరపు రామ్మోహన్‌నాయుడు ఎక్స్‌లో తెలిపారు.
గతంలో తీసుకువచ్చిన నిబంధనల ప్రకారం, వీక్లీ రెస్ట్ సమయాన్ని తర్వాత సెలవుగా తీసుకోవడానికి అవకాశం ఉండేది కాదు. ఇప్పడీ నిబంధనను సడలిస్తున్నట్లుగా డీజీసీఏ ప్రకటించింది.
''వివిధ ఎయిర్ లైన్స్ సంస్థల విజ్జప్తుల నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ నిబంధనను సమీక్షించాలని నిర్ణయించాం. ఆ మేరకు వీక్లీ రెస్ట్ సమయాన్ని తర్వాత సెలవుగా తీసుకునే వీల్లేదనే నిబంధనను వెనక్కి తీసుకుంటున్నాం'' అని డీజీసీఏ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ హిమాన్షు శ్రీవాత్సవ జారీ చేసిన ప్రకటనలో తెలిపారు.
ఇండిగో ఎయిర్ లైన్స్ విజ్జప్తి మేరకు పౌర విమానయాన శాఖతో సంప్రదింపుల తర్వాత ఒక్కసారి అవకాశం ఇస్తూ మరికొన్ని నిబంధనలు సడలించినట్లుగా డీజీసీఏ ప్రకటించింది.
ఆ మేరకు ఇండిగో సర్వీసుల పరంగా రాత్రి డ్యూటీల్లో కూడా కొన్ని మినహాయింపులు ఇస్తున్నట్లుగా తెలిపింది.
గతంలో తీసుకువచ్చిన కొత్త నిబంధన ప్రకారం, రాత్రి డ్యూటీ అనేది అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఉండేది.
''నైట్ డ్యూటీ అనేది అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 వరకే ఉంటుంది. నైట్ ల్యాండింగ్ రెండుకు తగ్గించగా, గతంలో తరహాలోనే ఆరు కొనసాగుతాయి'' అని ప్రకటించింది డీజీసీఏ. ఈ నిబంధనలు ఫిబ్రవరి 10, 2026 వరకు మాత్రమే వర్తిస్తాయని, ప్రతి 15 రోజులకోసారి సమీక్షిస్తామని స్పష్టం చేసింది.
''ఎఫ్‌డీటీఎల్ నిబంధనల అమలుపై 30 రోజులలో ఇండిగో సంస్థ తన రోడ్ మ్యాప్ సమర్పించాలి'' అని డీజీసీఏ ఆదేశించింది.
''నిబంధనల సడలింపుతో జాతీయ పౌర విమానయాన నెట్ వర్క్, ప్రయాణికుల సేవలు సాధారణ స్థాయికి చేరుతాయని ఆశిస్తున్నాం'' అని డీజీసీఏ ప్రకటించింది.
డీజీసీఏకు ఇండిగో వచ్చిన సమాచారం ప్రకారం, నవంబరులో 1232 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. ఇందులో 755 ఎఫ్‌డీటీఎల్ సంబంధిత నిబంధనలు, 258 ఎయిర్ స్పేస్, ఎయిర్ పోర్టుల పరిస్థితులు, 92 ఏటీసీ వ్యవస్థల విఫలం, 127 వివిధ కారణాలతో రద్దు అయినట్లుగా డీజీసీఏకు ఇచ్చిన నివేదికలో ఇండిగో స్పష్టం చేసింది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














