ఎవరీ నికోలస్ మదురో, ట్రంప్ ఆయనను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు?

అమెరికా, వెనెజ్వెలా, నికోలస్ మదురో, డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Truth Social

వెనెజ్వెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను ఆయన భార్యతో సహా తమ సైన్యం అదుపులోకి తీసుకుని దేశం బయటకు తరలించినట్టు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు.

పనామాలో 1989లో అప్పటి సైనికపాలకుడు మాన్యుయెల్ నొరియేగాను పదవి నుంచి తొలగించేందుకు పనామాపై దాడి చేసినప్పటి నుంచి లాటిన్ అమెరికాలో అమెరికా ఇంత ప్రత్యక్ష జోక్యం చేసుకున్న దాఖలాలు లేవు. ఆ దృష్ట్యా, వెనెజ్వెలాలో తాజా పరిణామాలు చరిత్రాత్మకంగా కీలకమైనవిగా భావిస్తున్నారు.

ట్రంప్ చెప్పినట్టుగా మదురోను బలవంతంగా వెనెజ్వెలా నుంచి బయటకు తరలించి ఉంటే అది ట్రంప్ పరిపాలనలో కఠినవైఖరి కలిగిన నేతలు భారీ విజయంగా భావిస్తారు. ఈ నేతలు చాలాకాలంగా వెనెజ్వెలాలో ప్రభుత్వ మార్పును బహిరంగంగానే సమర్థిస్తున్నారు.

అయితే మదురోను ట్రంప్ ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు? అసలు మదురో ఎవరు? వెనెజ్వెలాలో ఏం జరుగుతోంది?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
నికోలస్ మదురో

ఫొటో సోర్స్, Reuters

ఎవరీ మదురో?

వామపక్ష అధ్యక్షుడు హ్యూగో చావెజ్, యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ వెనెజ్వెలా హయాంలో నికోలస్ మదురో ఎదిగారు. గతంలో బస్సు డ్రైవర్‌గా, యూనియన్ నాయకుడిగా పనిచేసిన మదురో, చావెజ్ స్థానంలో 2013 నుంచి అధ్యక్షుడిగా ఉన్నారు.

చావెజ్, మదురో గత 26 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారు. ఆయన పార్టీ జాతీయ అసెంబ్లీ, న్యాయవ్యవస్థలోని ప్రధాన భాగాలు, ఎన్నికల మండలి సహా అనేక కీలక సంస్థలపై నియంత్రణ సాధించింది.

2024లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మదురోను విజేతగా ప్రకటించారు. అయితే, ప్రతిపక్షాలు మాత్రం తమ అభ్యర్థి ఎడ్ముండో గోంజాలెజ్ ఉర్రుతియా ఓట్ల లెక్కింపులో భారీ మెజారిటీతో గెలిచారని చెప్పుకొచ్చాయి.

మదురో పక్కన వెనెజ్వెలా రక్షణ మంత్రి లోపెజ్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, మదురో పక్కన వెనెజ్వెలా రక్షణ మంత్రి లోపెజ్

ప్రధాన ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనాపై ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించడంతో ఆమె స్థానంలో గొంజాలెజ్ నియమితులయ్యారు.

నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యానికి, న్యాయబద్ధమైన, శాంతియుత పరివర్తన కోసం ఆమె చేసిన పోరాటానికి గాను మచాదోకు 2025 అక్టోబర్‌లో నోబెల్ శాంతి బహుమతి లభించింది.

నెలల తరబడి అజ్ఞాతంలో ఉన్న ఆమె ప్రయాణ ఆంక్షలను ధిక్కరిస్తూ, ఈ అవార్డును స్వీకరించడానికి ఓస్లోకు వెళ్లారు.

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ట్రంప్‌కు మదురో ఎందుకు లక్ష్యంగా మారారు?

వెనెజ్వెలా నుంచి అమెరికాకు అక్రమ వలసదారులు రావడానికి మదురో కారణమని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఆర్థిక సంక్షోభం, అణచివేత కారణంగా 2013 నుంచి వెనెజ్వెలా నుంచి పారిపోయిన 80 లక్షల మంది ప్రజల్లో ఈ అక్రమ వలసదారులు కూడా ఉన్నారని చెబుతున్నారు.

ట్రంప్ ఎటువంటి ఆధారాలు చూపించనప్పటికీ, జైళ్లు, మానసిక ఆశ్రయాలను ఖాళీ చేయించి మదురో వారిని అమెరికాకు బలవంతంగా పంపుతున్నారని ఆరోపించారు.

అమెరికాలో పెరుగుతున్న మాదకద్రవ్యాల సరఫరాను, ముఖ్యంగా ఫెంటానిల్, కొకైన్‌ను అరికట్టడంపై కూడా ట్రంప్ దృష్టి సారించారు. ట్రెన్ డి అరగువా, కార్టెల్ డి లాస్ సోలెస్‌ అనే రెండు వెనెజ్వెలా ముఠాలను 'విదేశీ ఉగ్రవాద సంస్థల' జాబితాలో చేర్చారు.

వీటిలో రెండవ గ్రూపునకు మదురో స్వయంగా నాయకత్వం వహిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. ట్రంప్ ప్రకటనను మదురో తీవ్రంగా ఖండించారు.

తనను పదవి నుంచి తొలగించడానికి, వెనెజ్వెలాలోని విస్తారమైన చమురు నిల్వలను స్వాధీనం చేసుకోవడానికి అమెరికా 'మాదకద్రవ్యాలపై యుద్ధాన్ని' ఒక సాకుగా ఉపయోగిస్తోందని మదురో ఆరోపించారు.

కార్టెల్ డి లాస్ సోలెస్ అనేది ఒక నాయకుడో లేదా అతని కింద పనిచేసే వ్యక్తులో ఉన్న వ్యవస్థీకృత ముఠా కాదని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇది వెనెజ్వెలా ద్వారా కొకైన్‌ను అనుమతించే అవినీతి అధికారులను పేర్కొనడానికి ఉపయోగించే పదం.

వెనెజ్వెలా

ఫొటో సోర్స్, Getty Images

వెనెజ్వెలా ఏం చెబుతోంది?

మదురో అంతర్జాతీయ మాదకద్రవ్య అక్రమ రవాణా నెట్‌వర్క్‌కు నేతృత్వం వహిస్తున్నారని అమెరికా ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలను మదురో పూర్తిగా ఖండిస్తున్నారు. అంతేకాదు, 2024లో జరిగిన ఎన్నికలు స్వేచ్ఛాయుతంగానూ, న్యాయసమ్మతంగానూ జరగలేదన్న కారణంతో మదురోను వెనెజ్వెలా చట్టబద్ధ అధ్యక్షుడిగా అమెరికా గుర్తించడం లేదు.

తమ వద్ద ఉన్న అపారమైన చమురు నిల్వలను స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యంతోనే అమెరికా కుట్ర పన్నుతోందని వెనెజ్వెలా ప్రభుత్వం ఆరోపిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు వెనెజ్వెలాలో ఉన్నాయని అంచనా.

మదురో నిజంగా అధికారం నుంచి తప్పుకున్నట్లయితే, ఇప్పుడు వెనెజ్వెలాలో పరిస్థితి ఏ దిశగా సాగుతుందన్నది స్పష్టత లేని ప్రశ్నగా మారింది.

అమెరికా జోక్యాన్ని సమర్థించే వర్గాలు, ఈ పరిణామం వల్ల వెనెజ్వెలా ప్రతిపక్షం అధికారంలోకి వచ్చే అవకాశాలు పెరుగుతాయని వాదిస్తున్నాయి. ఈ ప్రతిపక్షానికి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మారియా కొరీనా, లేదంటే 2024 ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థిగా పోటీ చేసిన ఎడ్ముండో గోన్సాలెజ్ నాయకత్వం వహించే అవకాశముందని వారు భావిస్తున్నారు.

అయితే, పరిస్థితి అంత సులభంగా పరిష్కారమయ్యే అవకాశాలు లేవని మరికొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వెనెజ్వెలా సైన్యం మదురోకు విధేయంగా ఉంది. మదురోపై విమర్శలు చేసే కొంతమంది కూడా ప్రత్యక్ష అమెరికా జోక్యం దేశంలో మరింత అస్థిరతకు దారి తీస్తుందనే భయాన్ని వ్యక్తం చేశారు.

మదురోను అదుపులోకి తీసుకున్నారనే వార్తల నేపథ్యంలో, ఆయనకు సన్నిహితంగా ఉన్న ఇతర కీలక నేతలు కూడా తమ రాజకీయ భవితవ్యంపై ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)