‘‘భారత్‌లో మా జట్టు టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడదు’’ ఐసీసీకి వర్తమానం పంపుతామన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు

ఫొటో సోర్స్, AFP via Getty Images
భారత్‌లో 2026 టీ 20 ప్రపంచ కప్ మ్యాచ్‌లు ఆడేందుకు తమ జట్టును భారత్‌కు పంపకూడదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. ఈమేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కు ఈమెయిల్ ద్వారా వర్తమానం పంపనుంది.
భారత్‌లో బంగ్లాదేశ్ ఆడాల్సిన మ్యాచ్ వేదికలను శ్రీలంకకు మార్చాలని అభ్యర్థిస్తూ ఐసీసీకి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు దరఖాస్తు చేయనుంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు చెందిన 17మంది డైరక్టర్లతో ఆదివారం మధ్యాహ్నం జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ విషయంపై తర్వాత బీసీబీ వివరణాత్మక ప్రకటనను విడుదల చేయనుందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ నజ్ముల్ అబెదీన్ ఫాహిమ్ తెలిపారు.
2026 ఐసీసీ టీ20 ప్రపంచకప్ మ్యాచులకు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఫిబ్రవరి 7 నుంచి ఈ టోర్నమెంట్ మొదలు కానుంది.తొలిరోజే కోల్‌కతా వేదికగా వెస్టిండీస్‌తో బంగ్లాదేశ్ జట్టు తలపడనుంది.
ఇప్పటికే పాకిస్తాన్ తన మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడాలని నిర్ణయించుకుంది.

ఐపీఎల్ 2026 కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ తీసుకున్న ముస్తాఫిజుర్ రెహమాన్‌ను జట్టు నుంచి విడుదల చేయాలని ఆ ఫ్రాంచైజీని భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆదేశించడంపై బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వానికి చెందిన పలువురు సలహాదారులు, క్రీడా నిర్వాహకులు గట్టిగా స్పందించారు.
బంగ్లాదేశీ క్రికెటర్లను, దేశాన్ని ఏ రూపంలో అవమానించినా ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని బంగ్లాదేశ్ యువజన , క్రీడల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ చెప్పారు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదేశాల మేరకు.. బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ 2026 నుంచి రిలీజ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించిన ఆయన, ''ఎట్టి పరిస్థితుల్లో కూడా బంగ్లాదేశ్ క్రికెట్‌ను, క్రికెటర్లను, బంగ్లాదేశ్‌ను ఏ రూపంలో అవమానించినా ఒప్పుకోం. బానిసత్వ రోజులు పోయాయి'' అని అన్నారు.
మతతత్వ గ్రూప్‌ల నుంచి వచ్చిన ఒత్తిడితో స్క్వాడ్ నుంచి ముస్తాఫిజుర్ రెహమాన్‌ను విడుదల చేయాలని కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)ను బీసీసీఐ ఆదేశించినట్లు ఆసిఫ్ నజ్రుల్ తన వెరిఫైడ్ ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేశారు.
అలాగే, క్రీడా మంత్రిత్వ శాఖకు బాధ్యతాయుతమైన సలహాదారుగా ఈ మొత్తం వ్యవహారాన్ని ఐసీసీకి వివరించమని క్రికెట్ కంట్రోల్ బోర్డును కోరినట్లు ఆయన పేర్కొన్నారు.
"ఒప్పందం ప్రకారం బంగ్లాదేశ్ క్రికెటర్ భారత్‌లో ఆడలేకపోతే, ప్రపంచ కప్ మ్యాచ్‌లకు వెళ్లడం మొత్తం బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు కూడా సురక్షితం కాదు. వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించాలని అభ్యర్థించాలని కూడా బోర్డును కోరాను" అని ఆయన ఆ పోస్టులో రాశారు.

ఫొటో సోర్స్, Dr. Asif Nazrul/Facebook
అలాగే బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ ప్రసారాలను కూడా నిలిపేయాలని సమాచార, ప్రసార సలహాదారుడిని కోరుతున్నానని డాక్టర్ ఆసిఫ్ నజ్రుల్ అన్నారు.
బీసీసీఐ ఆదేశాల మేరకు, ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కేకేఆర్ జట్టు నుంచి రిలీజ్ చేసింది.
డిసెంబర్ 16న అబుదాబీలో జరిగిన వేలంలో ఈ బంగ్లాదేశ్ పేసర్‌ను రూ.9.2 కోట్లకు కేకేఆర్ కొనుగోలు చేసింది.
ఈ పరిస్థితిపై మాట్లాడిన ముస్తాఫిజ్, ''వారు నన్ను విడుదల చేస్తే, నేనేం చేయగలను?'' అన్నారు.
ఈ ఘటనపై బంగ్లాదేశ్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ తబీత్ అవాల్ తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు.
ముస్తాఫిజుర్ రెహమాన్ క్రికెట్ నైపుణ్యాలను ఆధారంగా చేసుకుని కోల్‌కతా నైట్ రైడర్స్ ఆయనను ఎంపిక చేసిందని తబీత్ అవాల్ తెలిపారు.
కానీ, రాజకీయ జోక్యంతో టోర్నమెంట్ నుంచి ఆయన్ను తొలగించడం చాలా దురదృష్టకరమని అన్నారు.
భారత అధికారులు, బీసీసీఐ క్రీడలను ఒక రాజకీయ సాధనంగా వాడటం ఆపేయాలని తబీత్ అవాల్ ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు.
క్రీడలు ఎప్పటికీ కూడా విభజనకు కారణం కావన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ముస్తాఫిజుర్ రెహమాన్‌కు సంఘీభావం ప్రకటించిన తబీత్ అవాల్, ''ధైర్యంగా ఉండు ముస్తాఫిజ్. దేశమంతా నీవైపే ఉంది'' అని అన్నారు.
దీనిపై సాంస్కృతిక వ్యవహారాల సలహాదారు ముస్తాఫా సర్వార్ ఫరూఖీ కూడా స్పందించారు. ఇది చాలా అవమానకరమని అన్నారు.
ఈ సంఘటన ద్వారా ద్వేషపూరిత రాజకీయాల ప్రతిబింబాన్ని బంగ్లాదేశ్ ప్రజలు చూశారని తెలిపారు.
భారత్‌లో మైనార్టీలపై జరుగుతోన్న వేధింపు ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారా? అనేది విచారించాలని కోరారు.
భవిష్యత్‌లో భారత్‌లో బంగ్లాదేశీ క్రీడాకారుల భద్రతపై కూడా ఫరూఖీ పలు ప్రశ్నలు లేవనెత్తారు.
ముస్తాఫిజ్ విషయంలో బీసీబీ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ప్రపంచకప్ సమయంలో కోల్‌కతా, ముంబయిలో బంగ్లాదేశీ క్రికెటర్ల భద్రతపై స్పందించిన బీసీబీ ప్రెసిడెంట్ అమినుల్ ఇస్లాం.. అవసరమైతే ఈ విషయాన్ని ఐసీసీతో చర్చిస్తామని చెప్పారు.
వేదికకు సంబంధించిన తుది నిర్ణయం ఐసీసీ చేతిలోనే ఉంటుందని మీడియా కమిటీ హెడ్ అమ్జాద్ హస్సేన్ తెలిపారు.
ఈ విషయంపై ఐసీసీకి, ఐపీఎల్ అథారిటీలకు అధికారిక లేఖను పంపేందుకు బీసీబీ సిద్ధమవుతోంది.
భారత్‌లో మిశ్రమ స్పందన
మరోపక్క భారత్‌లో బీసీసీఐ నిర్ణయాన్ని బీజేపీ నేత సంగీత్ సోమ్ స్వాగతించారు. 100 కోట్ల సంప్రదాయ భారతీయుల మనోభావాలను గౌరవించే ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా హిందువులకు విజయమని వార్తా సంస్థ ఏఎన్ఐతో అన్నారు.
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులోకి ముస్తాఫిజుర్ రెహమాన్‌ను చేర్చుకున్నందుకు షారుఖ్ ఖాన్‌ను 'దేశద్రోహి' అని సంగీత్ సింగ్ సోమ్ విమర్శించారు.
కాంగ్రెస్ నేత, లోక్‌సభ సభ్యులు శశి థరూర్ ఈ నిర్ణయాన్ని రాజకీయ ప్రేరేపిత, అన్యాయమైన నిర్ణయంగా పేర్కొన్నారు.
కోల్‌కతా స్క్వాడ్ నుంచి ముస్తాఫిజుర్‌ను రిలీజ్ చేసిన తర్వాత తన ఎక్స్ అకౌంట్‌లో ఓ వీడియోను షేర్ చేసిన శశి థరూర్.. ఈ నిర్ణయంలో ఎవరు శిక్షను అనుభవిస్తున్నారు, ఒక క్రీడాకారుడా? ఒక దేశమా? లేదా ఒక మతమా? అని ప్రశ్నించారు.
క్రీడలను రాజకీయం చేయడం వల్ల ఎదురయ్యే పర్యవసనాలపై కూడా ఆయన ప్రశ్నించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ముస్తాఫిజుర్ రెహమాన్ వ్యక్తిగతంగా ఎలాంటి తప్పిదం చేయలేదని, కానీ, భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతలకు ఆయన బాధితుడిగా మారారని భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత కామెంటర్ ఆకాశ్ చోప్రా అన్నారు.
భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు బాగోలేకపోవడంతో ఎన్నో ఏళ్లుగా ఐపీఎల్‌లో ఆడలేని పాకిస్తానీ క్రికెటర్ల పరిస్థితి మాదిరిగానే ఈ పరిస్థితి ఉందని అభిప్రాయపడ్డారు.
''బంగ్లాదేశ్‌లో తాజా పరిస్థితులతో పాటు మొత్తం పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది'' అని ఆకాశ్ చోప్రా తన వెరిఫైడ్ ఎక్స్ హ్యాండిల్‌లో పోస్టు చేసిన వీడియోలో పేర్కొన్నారు.
''కోల్‌కతా నైట్ రైడర్లకు ఇది కొంత ఇబ్బందికర పరిస్థితి కలిగించిప్పటికీ, నా అభిప్రాయం ప్రకారం.. బీసీసీఐ సరైన నిర్ణయం తీసుకుంది'' అని అన్నారు.
ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ రెహమాన్‌ను రిలీజ్ చేయాలనే నిర్ణయం తెలివి తక్కువ నిర్ణయమని బీసీసీఐ మాజీ అడ్మినిస్ట్రేటర్, చరిత్రకారుడు రామచంద్ర గుహ అన్నారు.
బంగ్లాదేశ్‌తో మంచి సంబంధాలను కొనసాగించడం భారత దేశ ప్రయోజనాలకు విడదీయరాని సంబంధాన్నికలిగి ఉన్నాయని, దీనిలో క్రికెట్ సంబంధాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














