బంగ్లాదేశ్: ఉస్మాన్ హాదీ ఖననం, ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చిన ఇంక్విలాబ్ మంచ్

బంగ్లాదేశ్, ఢాకా, ఉస్మాన్ హాదీ, ఇంక్విలాబ్ మంచ్

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, ఇంక్విలాబ్ మంచ్ నాయకుడు ఉస్మాన్ హదీ అంత్యక్రియలు ఢాకాలో శనివారం జరిగాయి.

బంగ్లాదేశ్‌లో ఇంక్విలాబ్ మంచ్ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీ అంత్యక్రియలు శనివారం జరిగాయి.

ఢాకా విశ్వవిద్యాలయంలోని జాతీయ కవి కాజీ నజ్రుల్ ఇస్లామ్ సమాధి దగ్గర ఉస్మాన్ హాదీని ఖననం చేశారు.

అంత్యక్రియల ప్రార్థనల్లో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు ముహమ్మద్ యూనస్‌ సహా రాజకీయ పార్టీల నేతలు, హాదీ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

హాదీ మృతదేహాన్ని శుక్రవారం సాయంత్రం సింగపూర్ నుంచి ఢాకా తీసుకొచ్చారు.

హాదీని చంపిన వారిని 24 గంట్లలోగా పట్టుకోవాలంటూ బంగ్లా ప్రభుత్వానికి ఇంక్విలాబ్ మంచ్ అల్టిమేటం జారీ చేసింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

హాదీ అంత్యక్రియల రోజున, యూరోపియన్ దేశాల రాయబార కార్యాలయాలు సంతాపాన్ని ప్రకటించాయి. జర్మనీ రాయబార కార్యాలయం తమ పతాకాన్ని అవనతం చేసింది.

ముహమ్మద్ యూనస్ శనివారం జాతీయ సంతాప దినంగా ప్రకటించారు.

అయితే, ఉస్మాన్ హాదీకి సంబంధించి ఢాకాలోని భారత హై కమిషన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

గురువారం ఉస్మాన్ హాదీ మృతి తర్వాత బంగ్లాదేశ్, భారత్ సంబంధాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఎందుకంటే, హాదీపై కాల్పులు జరిపిన వ్యక్తులు భారత్‌కు పారిపోయారనే పుకార్లు వ్యాపించాయి.

హాదీపై దాడి జరిగిన ఒకరోజు తర్వాత బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం, ఓటింగ్ షెడ్యూల్‌ను ప్రకటించింది.

బంగ్లాదేశ్‌లో ఫిబ్రవరి 12న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.

డిసెంబర్ 12 (శుక్రవారం)న ఢాకాలో ఉస్మాన్ హాదీపై అజ్ఞాత వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.

హాదీ మరణ వార్త వెలువడ్డాక చెలరేగిన హింసలో భారత హై కమిషన్‌ను కూడా లక్ష్యంగా చేసుకున్నారు.

బంగ్లాదేశ్, ఢాకా, ఉస్మాన్ హాదీ, ఇంక్విలాబ్ మంచ్

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, ఉస్మాన్ హాదీ అంత్యక్రియలకు పెద్దయెత్తున ప్రజలు హాజరయ్యారు.

జర్మనీ జెండా అవనతం, అమెరికా తీవ్ర సంతాపం

హాదీ మరణంపై అమెరికా, బ్రిటన్, జర్మనీ సహా పలు యూరప్ దేశాలు ప్రగాఢ సంతాపం తెలిపాయి.

జాతీయ సంతాప సూచకంగా ఢాకాలోని జర్మనీ ఎంబసీ శనివారం తమ జెండాను అవనతం చేసింది.

'ఉస్మాన్ హాదీ మరణం, జాతీయ సంతాప దినం నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం, దేశ ప్రజలకు సంఘీభావంగా ఫ్రాంకో-జర్మన్ ఎంబసీపై జెండాలు సగం ఎత్తులో ఎగురుతాయి' అని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఎంబసీ ట్వీట్ చేసింది.

'యువ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణం తీవ్ర విచారకరం. ఈ కఠిన సమయంలో ఆయన కుటుంబానికి, స్నేహితులకు, మద్దతుదారులకు మా ప్రగాఢ సంతాపం' అని ఢాకాలోని బ్రిటిష్ హైకమిషన్ ట్వీట్ చేసింది.

యూఎస్ ఎంబసీ కూడా హాదీ కుటుంబం, స్నేహితులు, మద్దతుదారులకు తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించింది.

అమెరికా ఎంబసీ పోస్టుపై భారత మాజీ విదేశాంగ కార్యదర్శి కన్వల్ సిబల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

'హాదీ తీవ్రంగా భారత్‌ను వ్యతిరేకించేవారు. భారత ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో అల్లా ఒక గొప్ప విప్లవకారుడు ఉస్మాన్ హాదీని అమరవీరుడిగా స్వీకరించారంటూ హాదీ మరణం తర్వాత ఇంక్విలాబ్ మంచ్ వ్యాఖ్యానించింది. అమెరికాకు ఈ భారత వ్యతిరేక సమూహం పట్ల ఆసక్తి ఉన్నట్లుగా వారు చేసిన పోస్టుతో స్పష్టమవుతోంది. అమెరికా రాయబార కార్యాలయం ఆయన మద్దతుదారులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతోంది' అంటూ కన్వల్ సిబల్ ట్వీట్ చేశారు.

బంగ్లాదేశ్, ఢాకా, ఉస్మాన్ హాదీ, ఇంక్విలాబ్ మంచ్

ఫొటో సోర్స్, AFP via Getty Images

భారత్ - బంగ్లాదేశ్ సంబంధాలపై హాదీ మరణం ప్రభావం

నిరుడు ఆగస్టు 5న బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయి, ఆ తర్వాత ఆమె భారత్‌లో ఆశ్రయం పొందినప్పటి నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.

అయితే, గత కొంతకాలంగా ఈ రెండు దేశాల మధ్య సంబంధాలను పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, ముహమ్మద్ యూనస్ ఇద్దరూ థాయిలాండ్‌లో సమావేశమయ్యారు.

ఫిబ్రవరిలో సార్వత్రిక ఎన్నికల తర్వాత బంగ్లాదేశ్‌లో అధికారంలోకి వచ్చే ఏ ప్రభుత్వమైనా ఇరుదేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణకు సహాయపడుతుందని భారత్ ఆశించింది.

కానీ, ఉస్మాన్ హాదీ మరణం తర్వాత, తదుపరి ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందో కచ్చితంగా చెప్పలేమని కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

బంగ్లాదేశ్, ఢాకా, ఉస్మాన్ హాదీ, ఇంక్విలాబ్ మంచ్

హాదీ మరణం తర్వాత ఏర్పడిన తాజా పరిస్థితుల్లో, బంగ్లాదేశ్‌లో రాబోయే ప్రభుత్వం, దిల్లీతో సంబంధాలు పెట్టుకోవడం రాజకీయంగా సురక్షితమేనని భావిస్తుందో లేదో స్పష్టంగా తెలియడం లేదని ఎక్స్‌లో దక్షిణాసియా రాజకీయాల విశ్లేషకుడు మైకేల్ కుగెల్‌మన్ ట్వీట్ చేశారు.

హాదీ మరణవార్త బయటికొచ్చాక గురువారం ఢాకా సహా పలుచోట్ల చెలరేగిన హింసలో తొలిసారి మీడియాను లక్ష్యంగా చేసుకున్నారు.

ప్రథమ్ ఆలో, ద డైలీ స్టార్ అనే రెండు వార్తాపత్రికల భవనాలకు నిప్పంటించారు. ఆ సమయంలో సిబ్బంది అంతా కార్యాలయాల్లోనే ఉన్నారు. వారంతా ఏదో విధంగా ప్రాణాలతో బయటపడ్డారు.

ఇంక్విలాబ్ మంచ్ మద్దతుదారులు
ఫొటో క్యాప్షన్, ఇంక్విలాబ్ మంచ్ మద్దతుదారులు

ఇంక్విలాబ్ మంచ్ అల్టిమేటం

ఉస్మాన్ హాదీ హంతకులను 24 గంటల్లోగా అరెస్టు చేయాలంటూ ప్రభుత్వానికి ఇంక్విలాబ్ మంచ్ అల్టిమేటం జారీ చేసింది.

'ఉస్మాన్ హాదీ హంతకులను పట్టుకోవడానికి మీరేం ప్రయత్నాలు చేశారు' అని హాదీ అంత్యక్రియల సమయంలో ప్రభుత్వాన్ని ఇంక్విలాబ్ మంచ్ సెక్రటరీ అబ్దుల్లా అల్ జబర్ అడిగినట్లు బీబీసీ బంగ్లా రిపోర్ట్ చేసింది.

'దీనిని సీరియస్‌గా పట్టించుకోకపోతే, హోం అఫైర్స్ అడ్వైజర్ మొహమ్మద్ జహంగీర్ ఆలమ్ చౌధరీ, చీఫ్ అడ్వైజర్ స్పెషల్ అసిస్టెంట్ ఖుదా బక్ష్ చౌధరీ 24 గంటల్లో రాజీనామా చేయాల్సి ఉంటుంది' అని ఆయన అన్నారు.

హాదీ అంత్యక్రియలకు ముందు జరిగిన ప్రార్థనల సమయంలో ఉస్మాన్ హాదీ సోదరుడు అబు బకర్ సిద్ధిఖీ మాట్లాడుతూ, 'దేశ రాజధానిలో పట్టపగలు ఉస్మాన్ హాదీని కాల్చిన తర్వాత, హంతకులు ఎలా పారిపోగలిగారు. ఇది జరిగిన ఏడెనిమిది రోజుల తర్వాత కూడా వారిని ఇంకా ఎందుకు పట్టుకోలేకపోయారు? వాళ్లను వీలైనంత త్వరగా పట్టుకొని విచారణ జరపాలి. ఉస్మాన్ హాదీ మాలో అందరికన్నా చిన్నవాడు. ఈరోజు మేం అతని పార్థివదేహాన్ని భుజాలపై మోయాలి' అని అన్నారు.

మొహమ్మద్ యూనుస్
ఫొటో క్యాప్షన్, ముహమ్మద్ యూనస్

ముహమ్మద్ యూనస్ ఏమన్నారు?

ఉస్మాన్ హాదీ అంత్యక్రియల ప్రార్థనలు పార్లమెంట్ సౌత్ ప్లాజాలో జరిగాయి. భారీ సంఖ్యలో ప్రజలు దీనికి హాజరయ్యారు.

శనివారం మధ్యాహ్నం జరిగిన అంత్యక్రియల్లో ముహమ్మద్ యూనస్ సహా అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు, ఇతర రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ), జమాతే ఇస్లామీ, నేషనల్ సిటిజన్స్ పార్టీ (ఎన్‌సీపీ) నాయకులు కూడా హాజరయ్యారు.

అయితే, ఇంక్విలాబ్ మంచ్ డిమాండ్ల గురించి ముహమ్మద్ యూనస్ ప్రస్తావించలేదు.

కానీ, అంత్యక్రియల ప్రార్థనలకు ముందు హాదీ మద్దతుదారులను ఉద్దేశించి యూనస్ ప్రసంగించారు.

బంగ్లాదేశీ ప్రజల మనస్సుల్లో హాదీ ఎప్పుడూ జీవించి ఉంటారని ఆయన అన్నారు.

బంగ్లాదేశ్ దైనిక్ ట్రిబ్యూన్ వార్తా పత్రిక ప్రకారం, 'హాదీ, మిమ్మల్ని ఎప్పుడూ మరవలేం. తరతరాలుగా మీరు మాతోనే ఉంటారు. ఈరోజు మీరు ఏ ఆశయాల కోసమైతే నిలబడ్డారో, వాటిని మేం పూర్తి చేస్తాం. మేమే కాదు బంగ్లాదేశ్ ప్రజలు కూడా ఈ బాధ్యత తీసుకుంటారు' అని యూనస్‌ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)