భారత్ - బంగ్లాదేశ్ సంబంధాలు రెండు రోజుల్లో ఎలా మారిపోయాయి?

ఫొటో సోర్స్, Getty Images
ఇంక్విలాబ్ మంచ్ విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హాదీ మరణం తరువాత బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సహా పలు ప్రాంతాల్లో భారీగా హింస చెలరేగింది. నిరసనలు, విధ్వంసాలు, ఆస్తుల దహనాలతోపాటు రెండు పత్రికా కార్యాలయాలపైనా దాడులు జరిగాయి. భారత హై కమిషనర్ కార్యాలయం ఎదుట గుమిగూడిన ఓ గుంపు రాళ్లదాడులకు పాల్పడింది.
ఢాకాలో డిసెంబర్ 12న ఉస్మాన్ హాదీపై కాల్పులు జరిగాయి. ఈఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను సింగపూర్‌కు తరలించగా, చికిత్స పొందుతూ గురువారం (డిసెంబర్ 18న) మృతి చెందారు.
ఈ తాజా పరిణామాలు బంగ్లాదేశ్, భారత్ మధ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భారత్‌కు వ్యతిరేకంగా కొంతమంది బంగ్లాదేశ్ నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.


ఫొటో సోర్స్, Riaz Hamidullah/X
''బంగ్లాదేశ్‌లో అస్థిరత ఏర్పడితే, భారత్ నుంచి ఈశాన్య రాష్ట్రాలు దూరం కావాల్సిన పరిస్థితి వస్తుంది'' అని బంగ్లాదేశ్ నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్‌సీపీ) సదరన్ చీఫ్ ఆర్గనైజర్ హస్నత్ అబ్దుల్లా హెచ్చరించారు. దేశం నుంచి ఇండియన్ హై కమిషనర్‌ను బహిష్కరించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.
ఈ వ్యాఖ్యలు ఇప్పటికే సున్నితంగా ఉన్న ఇరుదేశాల సంబంధాలను మరింత ఒత్తిడికి గురిచేశాయి. భారత ప్రభుత్వం దిల్లీలోని బంగ్లాదేశ్ రాయబారిని పిలిపించి, బంగ్లాదేశ్‌లోని భారత్ హై కమిషన్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది.
అయితే, భారత్ పట్ల బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వ ధోరణి అంత సానుకూలంగా లేదు.
బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సలహాదారు మొహమ్మద్ తౌహీద్ హుస్సేన్ బుధవారం నాడు ''1971 విముక్తి పోరాటంలో బంగ్లాదేశ్ పాత్రను భారత్ ఎప్పుడూ తక్కువ చేసి చూపుతోంది'' అని ఆరోపించారు.
బంగ్లాదేశ్ స్వాతంత్య్ర సమరయోధులు లేకుండా ఈ విజయం సాధ్యమయ్యేది కాదని తౌహీద్ హుస్సేన్ అన్నారు.

పరిస్థితులు మారిపోయేలా బుధవారం నాడు ఏం జరిగింది?
దిల్లీ, ఢాకా మధ్యనున్న సంబంధాలు మొత్తం ఒక్కరాత్రిలోనే మారిపోయాయి.
దిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషనర్ ఆహ్వానం మేరకు, ఇరుదేశాల చారిత్రక స్నేహాన్ని స్మరించుకుంటూ మంగళవారం సాయంత్రం నిర్వహించిన వేడుకల్లో భారత ప్రస్తుత, మాజీ దౌత్యవేత్తలు, సైనికాధికారులు, థింక్‌ట్యాంక్ సభ్యులు పాల్గొన్నారు.
ఈ వేడుక జరిగిన మరుసటిరోజు.. అంటే బుధవారం ఉదయమే భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ హై కమిషనర్‌ను సౌత్‌బ్లాక్‌కు పిలిపించింది.
ఢాకాలోని భారత్ హై కమిషన్ వద్ద 'కొన్ని అతివాద గ్రూపుల' వల్ల కనిపిస్తున్న భద్రతాపరమైన ముప్పే బంగ్లాదేశ్ కమిషనర్‌ను పిలవడానికి కారణమని భారత ప్రభుత్వం చెప్పినప్పటికీ, కొంతమంది బంగ్లాదేశీ రాజకీయ నాయకులు ఇటీవల కాలంలో చేస్తున్న 'రెచ్చగొట్టే భారత వ్యతిరేక ప్రకటనలు' కూడా దీని వెనకున్న కారణమని విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారులు అంటున్నారు.
దిల్లీలోని చాణక్యపురిలో ఉన్న బంగ్లాదేశ్ హై కమిషన్ ప్రాంగణంలో మంగళవారం రాత్రి నిర్వహించిన విజయ్ దివస్ వేడుకల్లో హై కమిషనర్ రియాజ్ హమీదుల్లా మాట్లాడుతూ, భారత్, బంగ్లాదేశ్ సంబంధాలు ఎంతో లోతైనవి, బహుముఖీయమైనవని, గొప్పచారిత్రక నేపథ్యంలో వాటి పరస్పర ఆధారతత్వాన్ని అర్థం చేసుకోవడం అవసరమని అన్నారు. 1971 యుద్ధంలో బంగ్లాదేశ్ నేలపై ప్రాణత్యాగం చేసిన 1,668 మంది భారత సైనికులను కృతజ్ఞతాపూర్వకంగా స్మరించారు.
ఈ కార్యక్రమానికి బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో పాల్గొన్న పలువురు భారత సైనికులు, భారత లెఫ్టినెంట్ జనరల్ రాకేశ్ కపూర్, విదేశాంగ శాఖలో బంగ్లాదేశ్-మియన్మార్ విభాగాధిపతి బి. శ్యామ్, కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్, ఢాకాలో పనిచేసిన నలుగురు భారత మాజీ దౌత్యవేత్తలు, ఓఆర్ఎఫ్–బ్రూకింగ్స్–ఐడీఎస్ఏ వంటి థింక్‌ట్యాంక్ పరిశోధకులు, దిల్లీకి చెందిన ప్రముఖ జర్నలిస్టులు హాజరయ్యారు.
కార్యక్రమం ముగిసిన వెంటనే, రియాజ్ హమీదుల్లా సోషల్ మీడియాలో "పరస్పర విశ్వాసం, గౌరవం, అభివృద్ధి, ఉమ్మడి ప్రయోజనాలు, విలువల ఆధారంగానే రెండు దేశాల ప్రజల శాంతి, స్థిరత్వం, సౌభాగ్యం సాధ్యమవుతాయి" అని పోస్ట్ చేశారు. ఆ పోస్టులో భారత విదేశాంగ శాఖను కూడా ట్యాగ్ చేశారు. అయితే, రాత్రికల్లా హై కమిషనర్ రియాజ్ హమీదుల్లాను భారత విదేశాంగ శాఖ సౌత్ బ్లాక్‌కు పిలిపించింది.
బంగ్లాదేశ్‌లో పరిస్థితులు వేగంగా దిగజారుతున్నాయని, ఆ పరిస్థితిపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు ఆయనకు తెలిపారు. ప్రత్యేకించి 'ఢాకాలోని భారత హై కమిషన్‌కు ముప్పు కలిగించేందుకు కొన్ని అతివాద గ్రూపులు ప్రణాళికలు రచిస్తున్నాయి' అని ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
సౌత్ బ్లాక్‌లో జరిగిన సమావేశం అనంతరం బంగ్లాదేశ్ ప్రభుత్వం నుంచి వెంటనే అధికారిక స్పందన వెలువడలేదు.
అయితే, ఢాకాలోని దౌత్య వర్గాలు బీబీసీ బంగ్లాకు తెలిపిన వివరాల ప్రకారం, గత వారాంతంలో దిల్లీ-ఢాకా మధ్య చోటు చేసుకున్న 'మాటల యుద్ధం' నేపథ్యంలో ఈ పిలుపు అంత అనూహ్యమైనదేమీ కాదని పేర్కొన్నారు.
గత ఆదివారం బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ఢాకాలోని భారత హై కమిషనర్ ప్రణయ్ వర్మను పిలిపించి, పదవీచ్యుతురాలైన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్‌లో ఉండడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఆమె భారత్‌లో ఉండడం వల్ల ''బంగ్లాదేశ్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను రెచ్చగొట్టే ప్రయత్నాలకు అవకాశం కలగవచ్చని, రానున్న జాతీయ ఎన్నికలను అస్థిరపరచే ప్రమాదం ఉందని'' తెలిపింది
నిజానికి గత ఏడాదిన్నర కాలంగా అటు బంగ్లాదేశ్‌లో ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం, ఇటు భారత్‌లో నరేంద్ర మోదీ ప్రభుత్వం పలుమార్లు హై కమిషనర్లను పిలిపించుకోవడం.. పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలు, వివిధ అంశాలపై ప్రకటనలు చేయడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
బంగ్లాదేశ్ కమిషనర్‌ను ఎందుకు పిలిచారు?
బంగ్లాదేశ్‌లో 'జులై ఒయిక్య' అనే సంస్థ బుధవారం మధ్యాహ్నం ఢాకాలో 'మార్చ్ టు ఇండియన్ హై కమిషన్' నిర్వహించేందుకు పిలుపునిచ్చింది. హై కమిషన్ ఎదుట నిరసన ర్యాలీ నిర్వహించడమే తమ లక్ష్యమని ప్రకటించింది.
అదే రోజు మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో బంగ్లాదేశ్ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి ఆందోళనకారులను మధ్యలోనే అడ్డుకున్నారు.
ఇక, డిసెంబర్ 16న నిర్వహించిన విజయ్ దివస్ సందర్భంగా, దాదాపు 15 ఏళ్ల కిందట సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) కాల్పుల్లో మృతి చెందిన బంగ్లాదేశ్ బాలిక ఫెలానీ ఖాతూన్ జ్ఞాపకార్థం ఢాకాలోని ఒక ప్రధాన రహదారికి 'ఫెలానీ అవెన్యూ' అని పేరు పెట్టనున్నట్లు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది.
''సరిహద్దు హత్యలకు ముగింపు కావాలని బంగ్లాదేశీయులు కోరుకుంటున్నారు. మా సోదరి ఫెలానీ ప్రాణాలు కోల్పోయింది. భారత్ పాల్పడిన ఈ దారుణాన్ని జ్ఞాపకంగా ఉంచేందుకే ఈ రహదారికి ఫెలానీ పేరు పెట్టాం" అని గ్రామీణాభివృద్ధి, సహకార, గృహ నిర్మాణ,ప్రజాపనుల శాఖల సలహాదారు ఆదిలుర్ రహ్మాన్ ఖాన్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఉస్మాన్ హాదీపై కాల్పులు జరిపిన వ్యక్తులు భారత్‌కు పారిపోయి ఉండవచ్చని సీనియర్ ఎన్‌సీపీ నేత హస్నత్ అబ్దుల్లా కొద్దిరోజుల కిందట ఆరోపించారు.
"బంగ్లాదేశ్ శత్రువులకు భారత్ ఆశ్రయం ఇస్తే, బంగ్లాదేశ్ కూడా భారత్ వ్యతిరేక శక్తులకు ఆశ్రయం ఇచ్చి 'సెవెన్ సిస్టర్స్' ప్రాంతాన్ని భారత్ నుంచి వేరుచేసేందుకు ప్రయత్నిస్తుంది" అని వ్యాఖ్యానించారు.
భారత జాతీయ భద్రత దృష్ట్యా ఈశాన్య భారత ప్రాంతం అత్యంత కీలకమైనది, సున్నితమైనదిగా భావిస్తున్న నేపథ్యంలో.. హస్నత్ అబ్దుల్లా వ్యాఖ్యలను ''రెచ్చగొట్టేవిగా'' భారత్ పరిగణించింది.
ప్రత్యేకించి ఈశాన్య భారతానికి చెందిన అనేక సాయుధ వేర్పాటువాద గ్రూపులు గతంలో బంగ్లాదేశ్‌లో ఆశ్రయం పొందిన సందర్భాలున్నాయని, గతంలోని అక్కడి కొన్ని ప్రభుత్వాలు వారికి రక్షణ కూడా కల్పించాయని భారత్ విశ్వసిస్తోంది.
ఈ నేపథ్యంలో, హస్నత్ అబ్దుల్లా వ్యాఖ్యలను తేలికగా తీసుకోకూడదని దిల్లీ అధికారులు భావిస్తున్నారు. అందుకే బుధవారం ఉదయం బంగ్లాదేశ్ హై కమిషనర్‌ను పిలిపించామని సౌత్‌బ్లాక్‌లోని ఉన్నతాధికారులు బీబీసీ బంగ్లాతో చెప్పారు.
తరువాత భారత ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో, "బంగ్లాదేశ్‌లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల ఆధారంగా కొన్ని అతివాద గ్రూపులు ఒక 'తప్పుడు కథనాన్ని' సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీనిని భారత్ పూర్తిగా తిరస్కరిస్తోంది" అని పేర్కొంది.
''తాత్కాలిక ప్రభుత్వం దీనిపై సరిగ్గా విచారణ జరపకపోవడం.. లేదంటే ఆధారపడదగిన ఆధారాలను భారత్‌తో పంచుకోకపోవడం అత్యంత దురదృష్టకరం'' అని భారత్ ఆ ప్రకటనలో పేర్కొంది.
బంగ్లాదేశ్‌లో శాంతి, స్థిరత్వం కోసం ''సజావుగా, స్వేచ్ఛగా అందరి భాగస్వామ్యంతో జరిగే ఎన్నికలను భారత్ కోరుకుంటోందని బంగ్లాదేశ్ హై కమిషనర్ రియాజ్ హమీదుల్లాకు భారత్ మరోసారి స్పష్టం చేసింది.

ఫొటో సోర్స్, Riaz Hamidullah/X
భారత్, బంగ్లాదేశ్ స్నేహానికి ప్రతీకగా నిలిచే ఒక విశేష ఘట్టం మంగళవారం దిల్లీలో చోటు చేసుకుంది. ఇరుదేశాలకు చెందిన వక్తలు 1971 నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
భారత విదేశాంగ విధానానికి సజీవ ప్రతీకగా భావించే మాజీ విదేశాంగ కార్యదర్శి ఎంకే రస్గోత్రా కూడా బంగ్లాదేశ్ హై కమిషన్‌లో నిర్వహించిన విజయ్ దివస్ వేడుకలకు ప్రత్యేక అతిథిగా హాజరుకావాల్సి ఉంది.
ప్రస్తుతం 101 ఏళ్ల వయసున్న రస్గోత్రాను బంగ్లాదేశ్ హై కమిషనర్ రియాజ్ హమీదుల్లా ఆయన ఇంటికివెళ్లి స్వయంగా ఆహ్వానించారు. ఇందుకు రస్గోత్రా కూడా కార్యక్రమానికి హాజరవుతానని, 1971 డిసెంబర్ 16న దిల్లీలో చోటు చేసుకున్న చారిత్రక పరిణామాలను పంచుకుంటానని హామీ ఇచ్చారు. ఆ సమయంలో ఆయన ప్రధాని ఇందిరా గాంధీకి సన్నిహిత సలహాదారుగా ఉన్నారు.
అయితే, అనారోగ్య కారణాల వల్ల చివరి నిమిషంలో ఆయన కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. ఈ సందర్భంగా హై కమిషనర్ ఆయనను కృతజ్ఞతపూర్వకంగా స్మరించుకున్నారు.
భారత్, బంగ్లాదేశ్ సంయుక్తంగా భుజం భుజం కలిపి పోరాడి సాధించిన విముక్తి చరిత్రను మరిచిపోయేలా చేయాలనే ఉద్దేశపూర్వక ప్రయత్నాలు బంగ్లాదేశ్‌లో గత ఏడాదిన్నర కాలంగా జరుగుతున్నాయని భారత పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.
ఈ నేపథ్యంలో మంగళవారం బంగ్లాదేశ్ హై కమిషన్ నిర్వహించిన విజయ్‌దివస్ వేడుకలను ద్వైపాక్షిక సంబంధాలకు అవసరమైన ఒక ముందడుగుగా, అత్యంత సానుకూల సంకేతంగా పరిశీలకులు భావించారు.
ఆ కార్యక్రమానికి హాజరైన భారత మాజీ హై కమిషనర్ ఒకరు బీబీసీతో మాట్లాడుతూ "ఢాకాలోని తాత్కాలిక ప్రభుత్వం వరుసగా రెండుసార్లు విజయ్ దివస్ పరేడ్‌ను రద్దు చేసిన నేపథ్యంలో దిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషన్ ఇంత ఘనంగా విజయ్ దివస్‌ను జరుపుకుంటుందని ఊహించలేదు" అన్నారు.
కానీ, ఈ స్నేహపూర్వక వాతావరణం క్షీణించడానికి ఎక్కువకాలం పట్టలేదు
విజయ్ దివస్ కార్యక్రమం జరిగిన కొన్ని గంటలకే, బుధవారం 'బంగ్లాదేశ్ హైకమిషనర్‌ను తక్షణమే సౌత్ బ్లాక్‌కు పిలిపించారు' అన్న వార్తలు వెలుగులోకి రావడంతో, సంబంధాలను మెరుగుపరిచేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ దిల్లీ, ఢాకా మధ్య పరిస్థితులు ఇప్పటికీ పూర్తిగా సజావుగా లేవన్న వాస్తవం మరోసారి స్పష్టమైంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














