బంగ్లాదేశ్: హిందూ యువకుడిని కొట్టిచంపిన గుంపు, ప్రభుత్వం ఏమంటోంది?

ఫొటో సోర్స్, Getty Images
(ఈ కథననంలోని కొన్ని అంశాలు మిమ్మల్ని కలచి వేయవచ్చు.)
మతాన్ని అవమానించాడనే ఆరోపణతో బంగ్లాదేశ్‌లోని మైమన్‌సింగ్ జిల్లాలోని భాలూకాలో ఓ హిందూ యువకుడిని ఒక గుంపు కొట్టి చంపింది.
భాలుకా సబ్ డిస్ట్రిక్ట్‌లోని దుబాలియా పడాలో గురువారం రాత్రి ఈ సంఘటన జరిగిందని పోలీసులు బీబీసీతో చెప్పారు.
ఆ యువకుడిని కొట్టి చంపేసి, మృతదేహాన్ని చెట్టుకు కట్టేసి నిప్పింటించారని భాలూకా పోలీస్ స్టేషన్ డ్యూటీ ఆఫీసర్ రిపన్ మియా బీబీసీతో చెప్పారు. మృతుడిని దీపూ చంద్ర దాస్‌గా పోలీసులు గుర్తించారు.
ఆ యువకుడు స్థానిక దుస్తుల కర్మాగారంలో పనిచేస్తున్నారని, అదే ప్రాంతంలో అద్దెకు ఉంటున్నట్లు అధికారులు తెలిపారు.
"గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ప్రవక్తను అవమానించారని ఆరోపిస్తూ కొంతమంది వ్యక్తులు ఆయన్ను కొట్టి చంపారు. ఆ తర్వాత మృతదేహానికి నిప్పంటించారు" అని భాలూకా పోలీస్ స్టేషన్ డ్యూటీ ఆఫీసర్ రిపన్ మియా బీబీసీతో చెప్పారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారని అధికారులు తెలిపారు.
దాస్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మైమన్‌సింగ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి పంపారు.
"మేం ఆయన బంధువుల కోసం వాకబు చేస్తున్నాం. వారు వచ్చి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం" అని రిపన్ మియా బీబీసీతో అన్నారు.

ముహమ్మద్ యూనస్ ఏమన్నారు?
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు ముహమ్మద్ యూనస్ మైమన్‌సింగ్ జిల్లాలో జరిగిన హత్యను ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.
"మైమన్‌సింగ్‌లో ఒక హిందూ యువకుడిని కొట్టి చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నూతన బంగ్లాదేశ్‌లో అలాంటి హింసకు తావు లేదు. ఈ దారుణమైన నేరానికి పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదు" అని ముహమ్మద్ యూనస్ ప్రెస్ విభాగం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.
"ఈ సున్నిత సమయంలో.. హింస, రెచ్చగొట్టడం, ద్వేషాన్ని రగిలించే వారిని వ్యతిరేకించడం ద్వారా ప్రతి పౌరుడూ అమరవీరుడు హాదీకి నివాళి అర్పించాలని పిలుపునిస్తున్నాం" అని ఆ సందేశంలో ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
భారత్ స్పందన
బీజేపీ నాయకుడు, ఆ పార్టీ ఐటీ విభాగం అధిపతి అమిత్ మాలవీయ ఈ హత్యను ఖండిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేశారు.
"ఈ భయంకరమైన సంఘటన ఇస్లామిక్ తీవ్రవాదం అడ్డూఅదుపూ లేకుండా పెరగడం, బంగ్లాదేశ్‌లో మైనారిటీలకు భద్రత నిరాకరణ వంటి క్రూరమైన వాస్తవికతకు నిదర్శనంగా నిలుస్తోంది" అని అందులో రాశారు.
వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు, రచయిత బ్రహ్మ చెల్లానీ కూడా యువకుడిని కొట్టి చంపడం, ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితులపై ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టారు.
"బంగ్లాదేశ్ బహిరంగ అరాచకంలోకి జారుకుంటోంది. ప్రభుత్వ మద్దతున్న మిలిటెంట్లు వార్తా పత్రిక కార్యాలయాలకు నిప్పు పెట్టారు. భారత దౌత్యవేత్తల కార్యాలయాలు, ఇళ్లపై దాడి చేశారు. హిందూ మైనారిటీ యువకుడిని చెట్టుకు కట్టేసి సజీవ దహనం చేశారు" అని అందులో రాశారు.
"అల్లరిమూకలు వీధుల్లోకి వస్తుండడంతో నోబెల్ బహుమతి గ్రహీత నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ప్రజలను అణచివేసే కార్యక్రమం చేపట్టింది."
"ఒకటైతే స్పష్టం: అసమ్మతికి, మైనారిటీలకు ఇకపై రక్షణ లేదు. ఈ దాడుల తర్వాత, దేశంలోని రెండు ప్రముఖ వార్తాపత్రికలు మూసివేయాల్సి వచ్చింది" అని రాశారు.
ఈ హత్యాకాండను విమర్శిస్తూ పశ్చిమ బెంగాల్ బీజేపీ కూడా ఎక్స్‌లో ఒక సందేశాన్ని పోస్ట్ చేసింది.
"బంగ్లాదేశ్‌లో నిన్న రాత్రి దీపూ చంద్రదాస్ అనే హిందువును కొట్టి చంపారు. ఇది బంగ్లాదేశ్‌లోని దీపూ చంద్రదాస్ కేసు మాత్రమే కాదు. మమతా బెనర్జీ పాలనలో పశ్చిమ బెంగాల్‌లో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న హరగోబిందో దాస్, చందన్ దాస్ పరిస్థితి కూడా ఇదే" అని ఆ పోస్టులో రాసింది.

ఫొటో సోర్స్, Getty Images
బంగ్లాదేశ్‌లో హింస, దహనాలు
బంగ్లాదేశ్‌లో యువ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణం తర్వాత అక్కడ హింసాత్మక నిరసనలు చెలరేగాయి. 2024లో షేక్ హసీనాను పదవీచ్యుతురాలిని చేసిన తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వారిలో హాదీ ఒకరు.
గత వారం ఢాకాలో ముసుగు వేసుకున్న కొంతమంది వ్యక్తులు హాదీపై కాల్పులు జరిపారు. గురువారం రాత్రి ఆయన సింగపూర్‌లోని ఆసుపత్రిలో మరణించారు.
షేక్ హసీనా అధికారం కోల్పోయిన తర్వాత, వచ్చే ఫిబ్రవరిలో బంగ్లాదేశ్‌లో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసే యోచనలో ఉన్నారు హాదీ.
నిరసనకారులు రాత్రంతా బంగ్లాదేశ్‌లో ప్రముఖ వార్తా పత్రికలైన ది డైలీ స్టార్, ప్రాథోమ్ ఆలో కార్యాలయాలను ధ్వంసం చేసి నిప్పంటించారు.
శుక్రవారం కూడా నిరసనలు కొనసాగాయి. హాదీ మృతదేహాన్ని సింగపూర్ నుంచి ఢాకాకు తీసుకొచ్చారు.
హాదీ మరణం "దేశానికి కోలుకోలేని నష్టం" అని ముహమ్మద్ యూనస్ అభివర్ణించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










