‘‘వడ్డీ వ్యాపారుల అప్పు తీర్చేందుకు కంబోడియాకు వెళ్లి కిడ్నీ అమ్మేశా’’

రైతు, కిడ్నీ అమ్మకం, వడ్డీ వ్యాపారం
ఫొటో క్యాప్షన్, వడ్డీ వ్యాపారుల అప్పులు తీర్చేందుకు ఎడమవైపు కిడ్నీ అమ్మేసినట్టు రోషన్ కుల్లే చెప్పారు
    • రచయిత, భాగ్యశ్రీ రౌత్
    • హోదా, బీబీసీ కోసం

వడ్డీ వ్యాపారుల వలలో చిక్కుకున్న రోషన్ కులే అనే రైతు తన అప్పు తీర్చడానికి కంబోడియా వెళ్లి కిడ్నీ అమ్మినట్టు ఆరోపించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో జరిగింది.

నాగ్‌భిడ్‌ తాలూకాలోని మింతూర్ గ్రామానికి చెందిన రోషన్ కులే అనే 36 ఏళ్ల రైతు తాను వడ్డీ వ్యాపారుల అప్పుల ఉచ్చులో చిక్కుకుని, తన కిడ్నీని అమ్ముకోవడానికి కంబోడియాకు వెళ్లాల్సి వచ్చిందంని ఆరోపిస్తూ వీడియో విడుదల చేశారు.

ఆయన వీడియో విడుదలచేసిన మరుసటి రోజు ఉదయం మింతూర్‌లోని ఆయన ఇంటికి మేం వెళ్లాం. ఆ సమయంలో పోలీసులు కూడా అక్కడే ఉన్నారు. రోషన్‌ను మాట్లాడమని అభ్యర్థించాం. కానీ ఆయన నిరాకరించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, ఆ విషయం గురించి ఇకపై మాట్లాడకూడదని చెప్పారు.

కానీ రోషన్ కులే తండ్రి వడ్డీ వ్యాపారులతో తనకు ఎదురైన ఇబ్బందుల గురించి చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

"నా కొడుకు పాల వ్యాపారం చేసేవాడు. కానీ కరోనా కాలంలో మా వ్యాపారం కుప్పకూలింది. ఆ తర్వాత, 6 ఆవులు లంపీ వైరస్‌తో చనిపోయాయి. ఒక ఆవుకు చికిత్స చేయడానికి, ఒక్కొక్కరి నుంచి రూ.50,000 చొప్పున ఇద్దరు వడ్డీ వ్యాపారుల నుంచి మొత్తం లక్షరూపాయలు అప్పుగా తీసుకున్నాడు. ఇది 2021లో జరిగింది. కానీ ఈ రుణం తిరిగి చెల్లించడానికి, మరొక వడ్డీ వ్యాపారి నుంచి మరొక రుణం తీసుకున్నాడు. బ్రహ్మపురిలో ఆరగురితో కూడిన ఓ ముఠా ఉంది " అని రోషన్ తండ్రి శివదాస్ కుల్లె బీబీసీకి తెలిపారు.

"వడ్డీ వ్యాపారులు ఇంటికి వచ్చి నా కొడుకుని వేధించేవారు, దుర్భాషలాడేవారు, చంపేస్తామని బెదిరించేవారు" అని ఆయన వెల్లడించారు.

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రోషన్ బిజినెస్ కరస్పాండెంట్‌గా కూడా పనిచేశాడు. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆయనను అప్పుకట్టమని వేధించేవారు. ఈ కారణంగా రోషన్ ఉద్యోగం మానేసినట్టు ఆయన తండ్రి ఆరోపించారు.

రైతు, కిడ్నీ అమ్మకం, వడ్డీ వ్యాపారం
ఫొటో క్యాప్షన్, కిడ్నీఆపరేషన్ జరిగిందంటున్న రోషన్

రూ.లక్ష అప్పు భారం రూ.50 లక్షలకు చేరుకుంది. దీని కోసం రైతు పొలాన్ని అమ్మేసి, అర ఎకరం పొలాన్ని వడ్డీ వ్యాపారి పేరు మీదకు బదిలీ చేసినట్టుగా ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.

"నా ఇంట్లో ఉన్న 6 తులాల బంగారాన్ని అమ్మేశాను. కానీ ఇప్పటికీ రుణం తీరలేదు. కాబట్టి నా కిడ్నీని అమ్మాలని నిర్ణయించుకున్నాను. నేను కంబోడియా వెళ్లి నా కిడ్నీని 8 లక్షల రూపాయలకు అమ్మేశాను" అని రైతు చెప్పినట్టుగా ఎఫ్ఐఆర్‌లో ఉంది.

"నా కిడ్నీని అమ్మేసి డబ్బులు సంపాదించమని అత్తమామలు చెప్పారు. అందుకే నేను నా కిడ్నీని అమ్మేశాను"అని రైతు రోషన్ కులే ఆరోపించారు.

పోలీసులు ప్రస్తుతం ఆరుగురు వడ్డీ వ్యాపారులను అరెస్టు చేశారు. మనీష్ పురుషోత్తం ఘట్బంధే, కిషోర్ రాంబావ్ బవాంకులే, లక్ష్మణ్ పుండలిక్ ఉర్కుడే, ప్రదీప్ రాంబావ్ బవాంకులే, సంజయ్ విఠోబా బల్లార్‌పురే, సత్యవాన్ రామ్‌రతన్ బోర్కర్ అక్రమంగా వడ్డీ వ్యాపారం చేస్తున్న కేసులో కేసు నమోదు చేశారు.

వడ్డీ వ్యాపారులు, రైతుల మధ్య కొన్ని లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను కూడా పోలీసులు సేకరించారు.

నిందితులను బ్రహ్మపురి కోర్టులో హాజరుపరిచి డిసెంబర్ 20 వరకు పోలీసు కస్టడీకి తరలించారు.

రైతు, కిడ్నీ అమ్మకం, వడ్డీ వ్యాపారం

"ఎడమ వైపు కిడ్నీ లేదు"

వడ్డీవ్యాపారుల అప్పు తీర్చడానికి తన ఎడమవైపు కిడ్నీని అమ్మేసినట్టు రోషన్ కుల్లే స్థానిక మీడియాకు షేర్ చేసిన వీడియోలో చెప్పారు. నాలుగు నెలలుగా ఆయన న్యాయం కోసం తిరుగుతున్నారు. కానీ ఎవరూ ఆయన ఫిర్యాదును తీసుకోలేదు.

''మేం ఫిర్యాదు నమోదు చేశాం. కేసు విచారణలో ఉంది'' అని చంద్రాపూర్ ఎస్పీ ముముకా సుదర్శన్ బీబీసీ మరాఠీకి చెప్పారు.

ఆయన నిజంగా తన కిడ్నీ అమ్మారా లేదా అనే విషయం తెలుసుకోవడానికి డిసెంబర్ 17న పోలీసుల వైద్య పరీక్షలు చేయించారు. ఆ పరీక్షలలో ఆయన ఎడమవైపు కిడ్నీ లేదని తేలింది.

తన కిడ్నీ విక్రయానికి సాయపడ్డాడంటూ చెన్నైలోని ఓ డాక్టర్ పేరు రోషన్ వెల్లడించారని ఎస్పీ సుదర్శన్ తెలిపారు. ఆ డాక్టరే రోషన్‌ను కంబోడియాకు తీసుకువెళ్లారు. అయితే ఆ వైద్యుడికి ఈ కేసుతో నిజంగా సంబంధం ఉందా అని పోలీసులు విచారణ జరుపుతున్నారు.

అలాగే రోషన్ కిడ్నీని కేవలం వడ్డీ వ్యాపారుల అప్పు తీర్చడానికే అమ్మాడా, లేక తన వ్యక్తిగత అవసరాల కోసం విక్రయించాడా, ఇందులో వడ్డీవ్యాపారుల పాత్ర ఎంత, కిడ్నీ విక్రయాల ముఠా ప్రమేయం ఉందా అనేకోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

నిందితుడి బంధువులు ఏమంటున్నారు?

పోలీసులు అరెస్ట్ చేసిన ఆరుగురి నిందితులలో సంజయ్ బల్లార్‌పురే అనే నిందితుడి భార్య సప్నా బల్లార్‌పురేతో మాట్లాడాం.

''నా భర్త ఓ బీరు షాపు నిర్వహిస్తున్నారు. డబ్బు అవసరం ఉన్నవారికి డబ్బులిస్తాం. కానీ వడ్డీలకు కాదు. రోషన్ అనే వ్యక్తికి నా భర్త డబ్బులివ్వలేదు. ఈకేసులోని ఇతర నిందితులు మా షాపు దగ్గరకు వచ్చి కూర్చుంటూ ఉంటారు'' అని సప్నా చెప్పారు.

తన పేరును కూడా ఇందులో చేర్చారని సప్నా చెప్పారు. ఇతర నిందితుల కుటుంబాల స్పందన తెలుసుకోవడానికి కూడా బీబీసీ ప్రయత్నించింది. వారు స్పందించగానే ఇక్కడ తెలియజేస్తాం.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)