మెస్సీతో ఫొటోలు.. రూ. 10 లక్షలు మిగిలాయని నెటిజన్లు ఎందుకంటున్నారు?

ఫొటో సోర్స్, Screengrab
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
మెస్సీ భోజనం చేస్తుంటే పక్కనే కూర్చుని చూస్తుంటుంది ఓ మహిళ..
మెస్సీ భుజం మీద చెయ్యి వేసి మరీ సెల్ఫీ దిగాడో వ్యక్తి..
పోలీసుల రక్షణలో ఉండగా మెస్సీతో సెల్ఫీ తీసుకున్నాడు మరో యువకుడు..
చార్మినార్ ముందు మెస్సీతో ఫొటో తీసుకున్నాడో నెటిజన్..
ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇలాంటి ఫొటోలే.. ఇన్ స్టా, ఫేస్ బుక్, ఎక్స్.. ఇలా ఏ ప్లాట్ ఫాం ఓపెన్ చేసినా మెస్సీతో దిగిన సెల్ఫీలు కనిపిస్తున్నాయి.
ఇంతకీ ఫుట్ బాల్ స్టార్ ఆటగాడు మెస్సీ చార్మినార్ ఎప్పుడు వెళ్లాడు అని మాత్రం అడగకండి..!
ఇప్పటివరకు మీరు చదివిన పోజులకు సంబంధించి ఫొటోలన్నీ ఏఐ జనరేటెడ్. ఆ విషయాన్ని వాటిని పోస్టు చేసిన యూజర్లే చెప్పుకొస్తున్నారు. ఈ విషయంపై తమ పోస్టుల్లో సరదా కామెంట్లు పెడుతూ షేర్ చేస్తున్నారు.
అయితే, ఈ ఫొటోలను ప్రైవసీ కింద చూడలేమని, కేవలం సరదా కోసం తయారు చేసినవని సైబర్ క్రైం నిపుణుడు, ఎండ్ నౌ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అనిల్ రాచమళ్ల చెప్పారు.


ఫొటో సోర్స్, Screengrab
మెస్సీ పర్యటన సాగిందిలా..
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ డిసెంబరు 13 నుంచి 15 వరకు భారత్ లో పర్యటించారు. డిసెంబరు 13న కోల్ కతా, హైదరాబాద్, 14న ముంబయి, 15న దిల్లీలో పర్యటించారు.
హైదరాబాద్ లోని ఉప్పల్లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈవెంట్ కు హాజరయ్యారు.
ఈవెంట్ కోసం టికెట్ ధరలను నిర్వాహకులు రూ.3250 నుంచి మొదలుకుని రూ.30వేల వరకు స్టేడియంలో సీటింగ్ స్థానాన్ని బట్టి నిర్ణయించి విక్రయించారు.
భారీ సంఖ్యలో అభిమానులు ఆయా నగరాల్లో జరిగిన ఈవెంట్లకు తరలివచ్చారు. కోల్‌కతాలో జరిగిన ఈవెంట్ లో తక్కువ సమయమే మెస్సీ స్టేడియంలో ఉన్నారంటూ ఆగ్రహించిన అభిమానులు, స్టేడియంలో బాటిళ్లు, కుర్చీలు విసరడం, స్టేడియంలో ఫర్నీచర్ ధ్వంసం చేస్తున్న వీడియోలు వచ్చాయి.

ఫొటో సోర్స్, Screengrab
ఫొటో దిగాలంటే సుమారు రూ.పది లక్షలు
మెస్సీని ప్రత్యేకంగా కలిసి ఫొటో దిగేందుకు ప్రత్యేక ధర నిర్ణయించారు.
''మెస్సీను కలిసి ఫొటో దిగేందుకు రూ.9.95లక్షలు చెల్లించాలి. ఇందుకు జీఎస్టీ అదనంగా ఉంటుంది'' అంటూ మెస్సీ టూర్ కు ముందు హైదరాబాద్ టూర్ సలహాదారు, చీఫ్ ప్యాట్రన్ పార్వతి రెడ్డి చెప్పారు.
మెస్సీతో ఫొటో దిగేందుకు సుమారు రూ.పది లక్షలు చెల్లించాలని చెప్పడంతో చాలా మంది అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
రూ.పది లక్షలు చెల్లించి ఫొటోలు దిగే 'స్తోమత' లేదంటూ ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్)ను ఆశ్రయించారు నెటిజన్లు.
హైదరాబాద్ కు చెందిన అశోక్ వేములపల్లి చార్మినార్ వద్ద మెస్సీతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు.
''ఆ ఫుట్ బాల్ ప్లేయర్ మెస్సీ తో ఫోటో దిగడానికి నా దగ్గర పది లక్షలు లేవు. చార్మినార్ దగ్గర చాయ్ తాగుతుంటే మెస్సీ వచ్చి నాతో సెల్ఫీ కావాలంటే ఇచ్చాను'' అని కామెంట్ చేశారు.
జెమినీ వంటి టూల్స్ ఉపయోగించి మెస్సీతో ఫొటోలు దిగినట్లుగా ఫొటోలు జనరేట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, facebook.com/photo/screengrab
'ముద్దపప్పు అవకాయ బాగుందన్నాడు మెస్సీ'
ఫొటోలు కూడా చిత్రవిచిత్రమైన పోజులతో షేర్ చేస్తున్నారు నెటిజన్లు.
మెస్సీకి వంట వండి పెడుతున్నట్లుగా మహిళ ఫొటో పెడితే, కల్లు తాగుతున్నట్లుగా మరొకరు ఫొటో షేర్ చేశారు.
రవితేజ అనే ఇన్‌స్టా యూజర్.. మెస్సీతో కలిసి డిన్నర్ చేసిన ఫొటో షేర్ చేశారు.
''ఇద్దరం డిన్నర్ చేశాం. ముద్ద పప్పు ఆవకాయ అన్నం బాగుంది అన్నాడు'' అంటూ హోటల్‌లో మెస్సీతో కలిసి ఉన్న ఫొటో షేర్ చేశారు.
''ఆ రూ.10 లక్షలు ఆదా చేసుకున్నాం'' అంటూ పోస్టులు
మెస్సీ తో ఫొటో దిగాలంటే సుమారు పది లక్షల రూపాయలు కట్టాలని నిర్వాహకులు చెప్పడంతో, అప్పటి నుంచి అసలు కథ మొదలైంది. ఫుట్‌బాల్ లవర్స్, నెటిజన్లు ఏఐ ఫొటోలు తయారు చేసి పోస్టులు వదిలారు.
సుభాషిణి తోట అనే యూజర్ తన ఫేస్‌బుక్ వాల్‌పై పోస్టు చేశారు.
మెస్సీ ఏకంగా తన ఇంటికి వచ్చి ఫొటో దిగినట్లుగా పెట్టారామె.
''కోల్‌కతా పోవాలా దీని కోసం. పది లక్షలు పెట్టాలా ఫొటోకి'' అని రాశారు.
ఇలాంటి పోస్టుల కింద ''మీకు పది లక్షలు మిగిలాయి'' వంటి కామెంట్లను ఫాలోవర్లు పెడుతున్నారు.
ఇక మరో యూజర్ ఏకంగా మెస్సీ ఒక స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి వద్ద కూర్చుని చేతిలో ప్లేటు పట్టుకుని సెల్ఫీ దిగుతున్న ఫొటో షేర్ చేశారు.
దీని కింద 'ఏఐ జనరేటెడ్' అని కూడా ఇన్ స్టా లో చూపిస్తోంది.
మరో ఫొటోలో మెస్సీ స్పూన్ తో తింటుండగా, ఒక మహిళ కూర్చుని చూస్తున్న ఫొటో వైరల్ అయ్యింది.
ఎంఎస్ ధోని ఫ్యాన్స్ అనే ఇన్‌స్టా అకౌంట్లో ముంబయి సముద్రం ఒడ్డున మెస్సీతో ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సచిన్ తెందుల్కర్ నిల్చుని మాట్లాడుతున్నట్లుగా ఫోటో షేర్ చేశారు
కొత్తూరి సతీష్ అనే ఫేస్‌బుక్ యూజర్ హుస్సేన్ సాగర్ వద్ద మెస్సీతో కలిసి సెల్ఫీ దిగినట్లుగా ఫొటో షేర్ చేశారు.
''నీ వీడియోలు చూస్తుంటా అని మాట్లాడుతూ ఒక సెల్ఫీ తీసుకుందాం'' అంటూ మెస్సీనే అన్నట్లుగా రాస్తూ ఫొటో పెట్టారు.
''10 లచ్చలు మిగిలాయి'' అని రాశారు సతీష్.
ఫేస్ బుక్ లో శరణ్య ఝాల్కరి అనే ఫేస్ బుక్ యూజర్ చార్మినార్ వద్ద మెస్సీతో దిగిన ఫొటో షేర్ చేశారు.
నా బాధ గ్రహించి వచ్చి ఇలా ఫోటో ఇచ్చి పోయాడు'' అని రాశారు.
మరో యూజర్ మెస్సీ తనతో కలిసి బిర్యానీ తింటున్న ఫొటో షేర్ చేశారు.

ఫొటో సోర్స్, facebook.com/photo/screengrab
ఫొటోలు ప్రైవసీ కిందకు వస్తాయా..?
ఇలాంటి ఫొటోల విషయంలో ఎలా చూడాలనే విషయాన్ని సైబర్ క్రైం నిపుణులతో బీబీసీ మాట్లాడింది.
''ఫొటోలను మిస్ యూజ్ చేయడం లేదా అసభ్యంగా చిత్రీకరించి పోస్టులు పెడితే నేరం కింద పరిగణించవచ్చు. ఇవన్నీ అభిమానంతో చేసే ఫొటోలుగా చూడాలి. వీటిని నేరంగా చూడలేం'' అని అనిల్ రాచమళ్ల బీబీసీతో చెప్పారు.
ఇదే విషయంపై సైబర్ క్రైం నిపుణులు నల్లమోతు శ్రీధర్ బీబీసీతో మాట్లాడారు.
ఒరిజినల్ కంటెంట్, ఏఐ జనరేటెడ్ కంటెంట్ మధ్య హద్దు రేఖలు చెరిగిపోయాయని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏది ఒరిజినల్ కంటెంట్, ఏది ఏఐ జనరేటెడ్ కంటెంట్ అనేది చెప్పడం కష్టంగా మారిందని అన్నారు.
''రానురానూ ఒరిజినల్ కంటెంట్‌ను పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. ఏఐ ద్వారా పెద్దఎత్తున కంటెంట్ జనరేట్ అవుతోంది. కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ తరహా ఫొటోలను ప్రైవసీ కింద చూడలేం'' అని చెప్పారాయన.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














