‘‘టీవీ చూడటానికి మేనమామ ఇంటికి వెళుతున్నా అని చెప్పింది, 13 ఏళ్లయినా తిరిగి రాలేదు’’

ఫొటో సోర్స్, Rohit Lohia/BBC
- రచయిత, విష్ణుకాంత్ తివారీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
''మేం చాలా వెతికాం, ఎక్కడా జాడ తెలియలేదు. నా సోదరి తప్పిపోయి 13 సంవత్సరాలైంది'' అని సనత్ మిశ్రా చెబుతున్నారు.
మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో తన ఇంటి ముందు కూర్చున్న సనత్ మిశ్రా.. తన సోదరి గురించి చెప్తున్నప్పుడు ఆయన కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. ఆయన గొంతులో అలసట తెలుస్తోంది.
ఆ సంఘటన జరిగి దశాబ్దానికి పైగా గడిచిపోయింది. కానీ, కుముదిని గురించి కుటుంబంలో ఎప్పుడు చర్చ వచ్చినా, వారి ఇంట్లో నిశ్శబ్దం అలముకుంటుంది.
2012లో సనత్ సోదరి కుముదిని మిశ్రా టీవీ చూడటానికని చెప్పి తమ మేనమామ ఇంటికి వెళ్లింది. ఆ రోజు రాత్రి 8:30 గంటలవుతున్నా, ఆమె తిరిగిరాలేదు.
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కుముదిని ఆచూకీ దొరకలేదని ఆమె కుటుంబసభ్యులు చెబుతున్నారు.


ఫొటో సోర్స్, Rohit Lohia/BBC
‘నా అంతరాత్మ ఘోషించదా?’
కుముదిని ప్రస్తావన రాగానే ఆమె తల్లి ఊర్మిళ కళ్లు చెమ్మగిల్లాయి. ఆ భావోద్వేగాన్ని తన ముడతలు పడిన ముఖంలో దాచుకోవడానికి ఆమె ప్రయత్నిస్తున్నారు. చాలా ఓదార్చిన తర్వాతే ఆమె మాతో మాట్లాడారు.
మనోధైర్యాన్ని కూడగట్టుకున్న ఆమె మాట్లాడుతూ, ''నా కూతురు తప్పిపోయి 13 ఏళ్లు అవుతోంది. నా అంతరాత్మ ఘోషించదా? తనకు ఇష్టమైనది ఏదైనా ఇంట్లో వండినప్పుడల్లా, నేను ఒక్క ముద్ద కూడా తినలేను'' అని చెప్పారు.
''ఎంతకాలం గడిచినా, ఆమె రాలేదనేదానికి అలవాటుపడలేని కష్టం ఇది'' అని ఆమె అన్నారు.
రెండేళ్లలో 2 లక్షల 'అదృశ్యం' కేసులు
ఇలా కుముదిని ఒక్కరే కాదు, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దాదాపు ప్రతి జిల్లాలోనూ ఇళ్ల నుంచి తప్పిపోయిన అమ్మాయిలు, మహిళల కథలు చాలా ఉన్నాయనడానికి అధికారిక గణాంకాలే నిదర్శనం.
2019 నుంచి 2021 మధ్యకాలంలో, కేవలం ఒక్క మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే దాదాపు 2 లక్షల 'అదృశ్యం' కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఇది దేశంలోనే అత్యధికం.
ఇక మధ్యప్రదేశ్ ప్రభుత్వ సమాచారం ప్రకారం, 2024 జనవరి నుంచి 2025 జూన్ వరకూ 23,129 మంది బాలికలు, మహిళలు కనిపించకుండాపోయారు.
ఈ గణాంకాల ప్రకారం చూస్తే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సగటున రోజుకు 43 మంది బాలికలు, మహిళలు 'మిస్సింగ్' అవుతున్నారు.
ఇది కేవలం ఆ కుటుంబాల మనోవేదన మాత్రమే కాదు, మొత్తం సమాజానికి ఇదొక పెద్ద సమస్య అని ఈ గణాంకాలను చూస్తే అర్థమవుతుంది.
అసలెందుకీ సమస్య?
'మిస్సింగ్' కేసుల సంఖ్య ఎందుకు ఎక్కువగా ఉంది, ఇలాంటి సంఘటనల వెనుక ఉన్న కారణాలేమిటని మేం మధ్యప్రదేశ్ మహిళా భద్రతా విభాగాన్ని సంప్రదించాం.
ఆ శాఖలో పనిచేసిన మధ్యప్రదేశ్ ఏడీజీ అనిల్ కుమార్ దీనికి వివిధ కారణాలు చెప్పారు.
''2013 తర్వాత, బాలికల మిస్సింగ్ కేసుల్లో కిడ్నాప్ ఆరోపణల కింద వెంటనే ఎఫ్ఐఆర్‌లు నమోదు చేస్తున్నారు. ఈ కేసులను లోతుగా పరిశీలించినప్పుడు గమనించిందేమిటంటే, కోపంతో ఇంటి నుంచి వెళ్లిపోతున్న టీనేజ్ అమ్మాయిల కేసులే సుమారు 42 శాతం ఉన్నాయి. సుమారు 15 శాతం కేసులలో, అమ్మాయిలు తమ ఇష్టపూర్వకంగానే బంధువుల ఇళ్లకు వెళ్లిపోతున్నారు. 19 నుంచి 20 శాతం కేసులలో, అమ్మాయిలు తాము ప్రేమించినవారితో వెళ్తున్నారు'' అని ఆయన తెలిపారు.
హరియాణా, రాజస్థాన్ రాష్ట్రాల్లో మాదిరిగా పెళ్లి కోసం అమ్మాయిలను విక్రయించే ఘటనలు మధ్యప్రదేశ్‌లో చాలా అరుదని.. అలాంటివి వెయ్యి కేసులలో ఒకటి ఉంటాయని అనిల్ కుమార్ చెప్పారు.
పోలీసులు ఏం చెబుతున్నారు?
అదృశ్యమైన 18 ఏళ్లలోపు బాలికలను వెతకడానికి 'ఆపరేషన్ ముస్కాన్' అనే ప్రత్యేక పోలీసు ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు మధ్యప్రదేశ్ పోలీసులు చెబుతున్నారు.
ఏడీజీ అనిల్ కుమార్ ప్రకారం.. పెండింగ్ కేసుల సంఖ్య తగ్గింది. ఈ కేసులపై ప్రతి నెలా సమీక్షిస్తున్నారు.
18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికలు ఎవరైనా తప్పిపోయినట్లు ఫిర్యాదు వచ్చినా ఎఫ్ఐఆర్ తప్పకుండా నమోదుచేయాలని 2013లో సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఆ తర్వాత, కేంద్ర హోంశాఖ 'ఆపరేషన్ ముస్కాన్' అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. తప్పిపోయిన ప్రతి ఆడబిడ్డను రక్షించడం, వారికి పునరావాసం కల్పించడం ఈ కార్యక్రమ లక్ష్యం.
మరి 18 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న యువతులు, మహిళల విషయమేమిటన్న ప్రశ్నకు అనిల్ కుమార్ స్పందిస్తూ, ''ఇందుకు సంబంధించి సంకలనం చేసిన వివరాలు మా వద్ద లేవు. 18 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సున్న యువతులు, మహిళలు తప్పిపోయినట్లు ఫిర్యాదులు వస్తాయి. అయితే, చాలా కేసుల్లో ఎఫ్ఐఆర్‌లు నమోదుచేయరు. మానవ అక్రమ రవాణా లేదా అపహరణ వంటి నేరాలు ఉన్న కేసులలో మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదుచేస్తారు'' అని చెప్పారు.
18 ఏళ్ల వయస్సు పైబడిన యువతులు, మహిళలకు సంబంధించిన కేసులలో తరచుగా ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయకపోవడంతో, వాటిపై దర్యాప్తు స్థానిక పోలీసు స్టేషన్లలో ఫైళ్లకే పరిమితమవుతోందని ఏడీజీ అన్నారు.
ఈ విషయంలో సనత్ మిశ్రా కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
ఎందుకంటే, బాలికలు తప్పిపోయినప్పుడు తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ నమోదుచేయాలన్న నిబంధన 2013లో అమల్లోకి రావడానికి ముందే, అంటే 2012లోనే సనత్ మిశ్రా సోదరి తప్పిపోవడంతో పోలీసులు పట్టించుకోలేదని వారి ఆరోపణ.
''పోలీసుల యాక్షన్‌పై మేం ఏమాత్రం సంతృప్తిగా లేం. అనుమానం ఉన్నవారిని సరిగ్గా విచారించలేదు. మొదటి నుంచీ, మా కేసును సీరియస్‌గా తీసుకోలేదనే మేం భావిస్తున్నాం'' అని సనత్ మిశ్రా అన్నారు.
బాలికలు, మహిళలు కనిపించకుండాపోయినప్పుడు ఫిర్యాదు చేయడం సర్వసాధారణం. అయితే, ఫిర్యాదు చేసిన తర్వాత మొదటి కొన్ని గంటలు, తొలి రోజుల్లో పోలీసులు సీరియస్‌గా తీసుకోకపోవడం తర్వాత దర్యాప్తును సంక్లిష్టం చేస్తోందని బాధిత కుటుంబాలు చెబుతున్నాయి.
కారణాలేమిటి?
మధ్యప్రదేశ్ రాజకీయాల్లో మహిళలు అత్యంత ముఖ్యమైన ఓటు బ్యాంకుగా పార్టీలు పరిగణిస్తున్నాయి.
గత రెండు దశాబ్దాల్లో అధిక కాలం బీజేపీయే అధికారంలో ఉంది. ఎన్నికల కోణంలో మహిళల కోసం పలు పథకాలను ప్రారంభించింది.
శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లాడ్లీ లక్ష్మి, లాడ్లీ బెహనా వంటి నగదు బదిలీ పథకాలను విస్తృతంగా అమలుచేశారు.
అయితే, ఈ పథకాలు ఆర్థికంగా ప్రోత్సహించినప్పటికీ, మహిళల భద్రత, ముఖ్యంగా మిస్సింగ్ కేసుల నివారణ వంటి సున్నితమైన సమస్యల విషయంలో ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన, నిర్మాణాత్మకమైన పురోగతిని చూపించలేకపోయిందని సామాజిక కార్యకర్త అర్చనా సహాయ్ అన్నారు.
మహిళల సంక్షేమానికి సంబంధించిన వాగ్దానాలతో ఓట్లు వస్తున్నప్పటికీ, సంక్లిష్టమైన వారి భద్రతాపరమైన సమస్యలపై జవాబుదారీతనం నిర్ధరించడానికి అవసరమైన స్థిరత్వం, సంకల్పం చాలాకాలంగా లోపించాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
రాష్ట్రంలోని బాలికలు, మహిళలకు సంబంధించిన అంశాలపై అర్చనా సహాయ్ మూడు దశాబ్దాలుగా పనిచేస్తున్నారు. అధిక సంఖ్యలో మిస్సింగ్ కేసులకు కేవలం వ్యక్తిగత కారణాలు మాత్రమే కాదని ఆమె చెబుతున్నారు.
''బాలికల విషయంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కొంత మంచిపని చేసింది. కానీ, 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సున్న మహిళలు అదృశ్యమైనప్పుడు, చాలా కేసులను నేరంగా పరిగణించట్లేదు. ఆమె ఎక్కడికో వెళ్లి ఉంటుంది, తిరిగి వచ్చేస్తుంది అనే ధోరణి ఉంది. వారిని వెతకడానికి తీవ్ర ప్రయత్నాలేవీ కనిపించవు. అందుకే తప్పిపోయిన మహిళల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది'' అని అర్చనా సహాయ్ చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Rohit Lohia/BBC
ఇంటికి తిరిగొచ్చినా భయం పోలేదు...
దిండోరి జిల్లాకు చెందిన ఫూల్ (అసలు పేరు కాదు)ను ఈ ఏడాది జనవరిలో తన గ్రామానికి చెందిన పరిచయస్తుడే మెరుగైన ఉద్యోగం, మంచి జీవితాన్ని ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి దిల్లీకి తీసుకెళ్లాడు.
ఆమెను కలవడానికి మేం వెళ్లినప్పుడు, ఆమె కొండల దిగువనున్న తన మట్టి ఇంటి ముందు మంచంపై కూర్చొని చదువుపై దృష్టిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.
బీబీసీతో ఆమె మాట్లాడుతూ, ''నాకు మంచి ఉద్యోగం, చాలా డబ్బు వస్తుందని చెప్పారు. అందుకే దిల్లీకి వెళ్లాను. తీరా నన్ను అక్కడ బలవంతంగా వెట్టిచాకిరీలోకి నెట్టారు'' అని చెప్పారు.
తనకు ఆ పనిస్థలం జైలులా అనిపించిందని, రాత్రిపూట నిద్రపోయేవరకూ ఏడ్చేదానినని, అనేకసార్లు తనను కొట్టారని ఫూల్ అన్నారు.
అనేక ప్రయత్నాల తర్వాత ఎట్టకేలకు ఆమె అక్కడి నుంచి బయటపడి జూన్‌లో ఇంటికి తిరిగిరాగలిగారు.
ఫూల్ తల్లి ఒంటరి మహిళ.. మాట్లాడుతూ, ''నా కూతురి ఆచూకీ తెలిసినప్పుడు నాకు ఊరట కలిగింది. ఇన్నిరోజులు ఎంతో ఆందోళన చెందాను. వారు నా కూతురిని అమ్మేశారేమోనని భయపడ్డాను'' అని చెప్పారు.
ఫూల్ ఇప్పుడు ఇంట్లోనే ఉన్నా, తరచుగా ఆమె భయపడుతోందని, మౌనంగా ఉంటోందని, దిల్లీలో ఏంజరిగిందో చెప్పట్లేదని కుటుంబసభ్యులు అంటున్నారు.
''ఈ మిస్సింగ్‌ల వెనుక కారణాలు పేదరికం, బ్రోకర్లు, కాంట్రాక్టర్ల నెట్‌వర్క్, వలసలు, సామాజిక వెనుకబాటుతనం, అక్రమ రవాణా, బలహీనమైన పోలీసు వ్యవస్థ. ఇవన్నీ కలిసి ఈ సంక్షోభాన్ని సృష్టించాయి'' అని అర్చన చెప్పారు.
''బాలికల ఆచూకీని పోలీసులు తెలుసుకుంటున్నప్పటికీ, వారు ఇంటికి తిరిగొచ్చిన తర్వాత సాధారణ జీవితాన్ని గడపగలరనే భరోసా లేదు. ఈ బాలికలకు పునరావాసం కల్పించడానికి ప్రభుత్వస్థాయిలో తీసుకుంటున్న చర్యలు సరిపోవు. వారికి కౌన్సెలింగ్, విద్య, కాలానుగుణంగా వారి పరిస్థితిని అంచనావేయడం, వారిని నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవడానికి నిర్మాణాత్మకమైన సంస్కరణలు అవసరం'' అని అన్నారు.
మధ్యప్రదేశ్‌లోని ప్రతి జిల్లాలో వందలాది కుటుంబాల కళ్లు తమ బిడ్డ తిరిగివస్తారనే ఆశతో ప్రతి సాయంత్రం తమ ఇంటి తలుపు వైపు ఎదురుచూస్తూనే ఉంటాయి.
కానీ, తిరిగొచ్చే అమ్మాయిలు చాలా తక్కువ.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














