రివెంజ్ పోర్న్‌పై పోరాడే క్రమంలో టెక్ కంపెనీనే ఏర్పాటు చేసిన సెక్స్‌వర్కర్

మేడలీన్ థామస్, ఇమేజ్ ఏంజెల్, సెక్స్ వర్క్

ఫొటో సోర్స్, Image Angel

ఫొటో క్యాప్షన్, తన వ్యక్తిగత చిత్రాలు లీకైన అనుభవం ప్రత్యేకమైన అవగాహన కలిగేందుకు ఉపయోగపడిందని మేడలీన్ అంటున్నారు.
    • రచయిత, నికోలా బ్రియన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రొఫెషనల్ డామినేట్రిక్స్ అయిన మేడలీన్ థామస్ అసాధారణ టెక్ సంస్థ వ్యవస్థాపకురాలు.

సెక్స్ లేదా సెక్స్ సంబంధిత చర్యల్లో శారీరకంగా, మానసికంగా ఆధిపత్య పాత్ర పోషించే ఆడవారిని డామినేట్రిక్స్‌గా వ్యవహరిస్తారు.

తన ప్రైవేట్ ఫోటోలను కొంతమంది క్లయింట్లు లీక్ చేయడంతో ఆమె పలుమార్లు అవమానానికి గురయ్యారు. "అవి చాలా కోపం తెప్పించాయి. ఏదో ఒకటి చేయాలి" అని భావించి ఆమె టెక్నాలజీ వైపు మళ్లారు.

"అవన్నీ అందమైన ఫోటోలే, అందుకు నేను సిగ్గుపడడం లేదు. కాకపోతే సంబంధం లేని వ్యక్తులు కొందరు నన్ను అవమానకరంగా చూపించేందుకు వాటిని ఉపయోగించిన తీరుపైనే సిగ్గుగా ఉంది" అని మేడలీన్ అన్నారు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మేడలీన్ థామస్, ఇమేజ్ ఏంజెల్, సెక్స్ వర్క్
ఫొటో క్యాప్షన్, మేడలీన్ అనేక అవార్డులను గెలుచుకున్నారు.

మేడలీన్ 'ఇమేజ్ ఏంజెల్' అనే సంస్థను స్థాపించారు. ఇది ఇన్విజిబిల్ ఫోరెన్సిక్ వాటర్ మార్కింగ్ టెక్నాలజీతో వేధింపులకు పాల్పడే వారిని ట్రాక్ చేస్తుంది. స్థాపించిన ఏడాదిలోనే ఈ సంస్థ ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. అలాగే, బారోనెస్ బెర్టిన్ ఇండిపెండెంట్ పోర్నోగ్రఫీ రివ్యూ దీనిని ఉత్తమ విధానంగా సిఫార్సు చేసింది.

ప్రైవేట్ ఫోటోలను అసభ్యకరంగా వినియోగించడం.. దీనినే రివేంజ్ పోర్న్‌గా వ్యవహరిస్తారు. ఒకరి వ్యక్తిగత, ప్రైవేట్ ఫోటోలను దుర్వినియోగం నేరం.

అయితే, ఇది కేవలం సెక్స్ ఇండస్ట్రీలో పనిచేసే వారికే పరిమితమైన సమస్య కాదు.

రివెంజ్ పోర్న్ హెల్ప్‌లైన్ నివేదిక ప్రకారం, యూకేలో ప్రతి ఏటా సుమారు 1.42 శాతం మంది మహిళలు దీనికి బాధితులవుతున్నారు.

రివెంజ్ పోర్న్ బాధితులు సిగ్గుతో, అవమానంతో జీవించాల్సి వస్తోందని మోన్మౌత్‌షైర్‌కు చెందిన 37 ఏళ్ల మేడలీన్ అన్నారు

"చాలామంది 'నువ్వే అలాంటి ఫోటోలు ఇంటెర్నెట్‌లో పెట్టావు కదా, ఇంకేం ఆశిస్తున్నావు?' అని అంటారు.

నేను ఆశించేది గౌరవం, మర్యాద, నమ్మకం. ఇవి రాజీపడదగిన విషయాలని నాకు అనిపించడం లేదు" అని ఆమె అన్నారు.

"అలాంటి ఫోటోలను మన చుట్టుపక్కల వారికి పంపడం, నేను ప్రేమించే వ్యక్తులకు పంపించి, వారిని బాధపెట్టేలా ఆ ఫోటోలను వాడడం.. అది నా నియంత్రణలో లేదు, అది నా తప్పు కూడా కాదు, ఎవరో వాటిని దుర్వినియోగం చేస్తున్నారు."

మేడలీన్ థామస్, ఇమేజ్ ఏంజెల్, సెక్స్ వర్క్

గత పదేళ్లుగా, ముఖ్యంగా ఆన్‌లైన్‌లో డామినేట్రిక్స్‌గా ఉన్న మేడలీన్ తన పనిని సాధాకారత, సంతృప్తినిచ్చేదిగా భావిస్తారు.

"ఒక డామినేట్రిక్స్‌గా, దృఢమైన మహిళగా.. నేను కోరుకున్నట్లు, నా ఇష్ట ప్రకారం, ఇది నా శరీరం కాబట్టి, నా శరీరాన్ని మరొకరికి బహుమతిగా ఇస్తున్నాను" అని ఆమె అన్నారు.

"చాలామంది దీనిని వింతగా చూస్తారు. కానీ, ఒక న్యూట్రిషనిస్ట్‌, ఒక అకౌంటెంట్ ఎలా సేవలందిస్తారో ఇది కూడా అంతే."

టెక్ రంగంలో ప్రత్యేకంగా ఉండడాన్ని మేడలీన్ ఆస్వాదిస్తున్నారు.

"ఒక డామినేట్రిక్స్ టెక్ కంపెనీని స్థాపించడం వింతగా అనిపించవచ్చు. కానీ, ఇందులో ఉన్న లోపాలు, రావాల్సిన మార్పులను ఆహ్వానించడం అనుభవం ఉన్నవారికే సాధ్యం" అని ఆమె అంటున్నారు.

తానేమీ టెక్నాలజీపై అవగాహన ఉన్న వ్యక్తిని కాదన్నారు మేడలీన్. కానీ ఎన్నో నిద్రలేని రాత్రులు శ్రమించి, పరిశోధించి, టెక్నాలజీ గురించి బాగా తెలిసిన వారిని విసిగించి తన కంపెనీని నిర్మించగలిగానని ఆమె చెప్పారు.

"డామినేట్రిక్స్‌ను కాబట్టి తక్కువగా ఎప్పుడూ అనుకోను. అది నన్ను దృఢంగా మార్చింది. ఎందుకంటే, ఇందులో నేను ఇవ్వగలిగినంత అనుభవం, జ్ఞానాన్ని వాళ్లు ఎప్పటికీ పొందలేరు."

ఇమేజ్ ఏంజెల్ ఎలా పనిచేస్తుంది?

ఇమేజ్ ఏంజెల్ టెక్నాలజీని డేటింగ్ యాప్‌లు, సోషల్ మీడియా, సాధారణ వెబ్‌సైట్ల వంటి ఫోటోలను షేర్ చేసుకునే అన్ని ప్లాట్‌ఫాంలలో ఉపయోగించవచ్చు.

ఎవరైనా ఒక ఫోటోను యాక్సెస్ చేస్తే, అది ఆటోమేటిక్‌గా ఆ వ్యక్తికి కనిపించకుండానే ఒక ప్రత్యేకమైన డిజిటల్ వాటర్‌మార్క్‌ను క్రియేట్ చేస్తుంది.

ఈ టెక్నాలజీని వాడుతున్నట్లయితే.. ఏదైనా ఫోటోను ఏదైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫాం లేదా వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసినప్పుడు, ఆ ఫోటోకు వాటర్‌మార్క్‌(ప్రత్యేకమైన కోడ్) క్రియేట్ అవుతుంది. అది ఇతరులకు కనిపించదు. ఒకవేళ ఎవరైనా ఆ ఫోటోను దుర్వినియోగం చేస్తే, ఆ వాటర్‌మార్క్ కోడ్ ద్వారా డేటా రికవరీ నిపుణులు ఆ పని ఎవరు చేశారో గుర్తించవచ్చు. తద్వారా సదరు వ్యక్తిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం ఒక ప్లాట్‌ఫాం ఈ టెక్నాలజీని అమలు చేయగా, మరిన్ని సంస్థలతో చర్చలు జరుపుతున్నారు మేడలీన్.

"ఇది హాలీవుడ్, క్రీడా ప్రసారాల్లో ఇప్పటికే ఉపయోగిస్తున్న టెక్నాలజీ. కొత్తదేమీ కాదు, కాకపోతే ఇదొక కొత్త అప్లికేషన్, కొత్త సిస్టమ్" అని మేడలీన్ అన్నారు.

"మేం దీన్ని పరీక్షించాం. ఈ టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో 30 ఏళ్ల అనుభవమున్న ఒక సంస్థతో మేం పనిచేస్తున్నాం. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, దీనిని పెద్ద స్థాయిలో పరీక్షించడమే."

ఇలా చిత్రాలను దుర్వినియోగం చేయాలనుకునే వారిని నిరోధించగలదని మేడలీన్ ఆశిస్తున్నారు.

బాధితులను నిందిచడం సరికాదు...

సౌత్‌వెస్ట్ గ్రిడ్ ఫర్ లెర్నింగ్ (SWGFL)కు చెందిన రివెంజ్ పోర్న్ హెల్ప్‌లైన్ ప్రతినిధి కేట్ వర్తింగ్టన్ మాట్లాడుతూ, ఈ అశ్లీల చిత్రాల దుర్వినియోగం బాధితుల్లో కలిగించే భయాన్ని, ఆందోళనను, తమకు తాము నిందించుకోవడాన్ని ప్రత్యక్షంగా చూశానని అన్నారు.

"అసలు నువ్వు అలాంటి ఫోటోలు ఎందుకు తీసుకున్నావు? అని అడిగే అవగాహనలేని స్నేహితులు లేదా ఇతరుల వల్ల తమను తాము నిందించుకోవడం ఎక్కువవుతుంది. బాధితుల పరిస్థితి ఇంకా దిగజారుతుంది. అందుకే బాధితులతో మాట్లాడేప్పుడు, వారు ఏ తప్పూ చేయలేదని వారికి చెప్పడం చాలా ముఖ్యం" అని ఆమె అన్నారు.

మేడలీన్ తన స్వీయానుభవాన్ని మార్పు తీసుకొచ్చేందుకు ఉపయోగించడం నిజంగా ప్రశంసనీయమని వర్తింగ్టన్ అన్నారు.

"టెక్నాలజీ ద్వారా జరిగే లింగ ఆధారిత దూషణ, లేదా దుర్వినియోగాన్ని ఎదుర్కొనేందుకు బహుళ అంచెల విధానం చాలా అవసరం. ఒక్క సాధనం, లేదా ఒక్క హెల్ప్‌లైన్ మాత్రమే దీనిని పూర్తిగా ఎదుర్కోలేదు. అనేక స్థాయిల్లో స్పందించే వ్యవస్థ అవసరం" అని ఆమె స్పష్టం చేశారు.

SWGFL నిర్వహిస్తున్న StopNCII.org ఇదే దిశగా పనిచేస్తోంది. ఈ టూల్ అశ్లీల చిత్రాలు, వీడియోలకు ఒక ప్రత్యేక డిజిటల్ 'హ్యాష్' (డిజిటల్ ఫింగర్‌ప్రింట్)ను రూపొందించి, భాగస్వామ్య సంస్థలతో పంచుకుంటుంది. దీని ద్వారా ఆ చిత్రాలు ఆన్‌లైన్‌లో అనుమతి లేకుండా షేర్ అయినప్పుడు, వాటిని గుర్తించి తొలగించడంలో కంపెనీలు సహకరించగలుగుతాయి.

మేడలీన్ థామస్, ఇమేజ్ ఏంజెల్, సెక్స్ వర్క్
ఫొటో క్యాప్షన్, మేడలీన్ థామస్, జెస్ డేవీస్

టీవి ప్రెజెంటర్ జెస్ డేవీస్ 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు, తాను లోదుస్తులతో ఉన్న ఫోటోలు ఊరంతా షేర్ అయ్యాయి.

యుక్త వయసులో జెస్ ఎదుర్కొన్న చేదు అనుభవాల్లో ఇది కూడా ఒకటి. ఇవే తనను మహిళల హక్కుల ఉద్యమ దిశగా ప్రేరణనిచ్చాయి.

"అది నీ తప్పు కాదు, 'అలా జరిగి ఉండకూడదు' అని ఇతరులు నాతో చెప్పడానికి చాలా ఏళ్లు పట్టింది" జెస్ అన్నారు.

ప్రైవేట్ ఫోటోల దుర్వినియోగం వల్ల బాధితులపై పడుతున్న అవమానకరమైన భావనను తొలగించి, అది ఆ ఫోటోలను తప్పుగా వినియోగించిన వారి తప్పుగా చూపించడం కోసం పనిచేస్తున్నారు.

"అంగీకారంతో ఫోటోను పంపడం నేరం కాదు" అని 32 ఏళ్ల జెస్ అన్నారు.

"కానీ, అనుమతి లేకుండా ఫోటోను దుర్వినియోగం చేయడం, ఇతరులకు పంపించడం నేరం. ఆ తప్పు చేసిన వారినే నిందించాల్సి ఉంటుంది."

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)