కేరళ నటిపై గ్యాంగ్ రేప్ కేసులో ఆరుగురికి 20 ఏళ్ల జైలు శిక్ష

ఫొటో సోర్స్, IMRAN QURESHI
- రచయిత, ఇమ్రాన్ ఖురేషి
- హోదా, బీబీసీ ప్రతినిధి
సినీ నటి కిడ్నాప్, గ్యాంగ్ రేప్ కేసులో కేరళలోని సెషన్స్ కోర్టు ఆరుగురికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ. 50 వేల జరిమానా విధించింది.
దోషులందరికీ జీవిత ఖైదు విధించాలని ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అయితే, ఎర్నాకుళం సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ హనీ వర్ఘీస్ ప్రాసిక్యూషన్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోలేదు.
గ్యాంగ్ రేప్, నేరపూరిత కుట్రకు పాల్పడటం వంటి నేరాలకు ఐపీసీ సెక్షన్ల కింద గరిష్టంగా జీవిత ఖైదును శిక్షగా విధిస్తున్నారు.
2018 ఫిబ్రవరి 17 సాయంత్రం త్రిస్సూర్ నుంచి కొచ్చికి వెళ్తున్న నటిపై లైంగిక దాడికి కుట్ర పన్నారనే అభియోగాల్లో ఎన్ఎస్ సునీల్ అలియాస్ పల్సర్ సునీల్, మార్టిన్ ఆంటోనీ, మణికందన్, విజయేష్, వడివాల్ సలీం, ప్రవీణ్‌లను కోర్టు దోషులుగా తేల్చింది.
మళయాళ నటుడు దిలీప్ ఈ కుట్రకు ప్రధాన సూత్రధారి అనే ఆరోపణలు వచ్చాయి. అయితే, డిసెంబర్ 8న కోర్టు ఆయనను నిర్దోషిగా విడుదల చేసింది.
ఈ కేసులో శిక్ష పడిన దోషులకు విధించిన జరిమానా చెల్లించకపోతే, అదనంగా మరో ఏడాది జైలు శిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశించింది.


ఫొటో సోర్స్, IMRAN QURESH
తీర్పును సవాలు చేస్తామన్న ప్రభుత్వం
సెషన్స్ కోర్టు తీర్పుపై ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్‌కు వెళ్తుందని కేరళ న్యాయ శాఖ మంత్రి పి. రాజీవ్ తెలిపారు.
"కోర్టు తీర్పుతో విభేదించడం తప్పేమీ కాదు. అయితే, న్యాయమూర్తిని విమర్శించాల్సిన అవసరం లేదు. తీర్పు కాపీ మొత్తం చదివాక ఒక అవగాహనకు రావొచ్చు" అని ఆయన అన్నారు.
స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వి.అజకుమార్ బీబీసీతో మాట్లాడుతూ, "హైకోర్టులో అప్పీల్ చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. 7 నుంచి 10 వరకు నలుగురు నిందితులను (వీరిలో ఎనిమిదో నిందితుడు దిలీప్) నిర్దోషులుగా విడుదల చేయడాన్ని మేం హైకోర్టులో సవాల్ చేస్తాం. ఇది సమాజానికి తప్పుడు సందేశం పంపుతుంది" అని అన్నారు.
ఈ కేసులో ప్రాసిక్యూషన్ వాదన ప్రకారం, ఎర్నాకుళంలోని అంగమాలి సమీపంలో నటి కారును వెనుక నుంచి వచ్చిన వాహనం ఢీకొట్టింది. ఆ తర్వాత ఆరుగురు వ్యక్తులు డ్రైవర్‌ను కొట్టి, బలవంతంగా కారులో ఎక్కి, అక్కడి నుంచి తీసుకెళ్లారు.
పల్సర్ సునీల్ అలియాస్ ఎన్ఎస్ సునీల్ నటిపై లైంగికంగా దాడికి పాల్పడ్డారు. ఆ సంఘటనను తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించారు. ఆ తర్వాత ఆమెను ఒక సినీ దర్శకుడి ఇంటి బయట వదిలేసి వెళ్లారని ప్రాసిక్యూషన్ పేర్కొంది.
ఈ కేసు కేరళలోనే కాకుండా దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఈ సంఘటనతో ప్రభావితమైన మళయాళ చిత్ర పరిశ్రమ తీవ్రంగా స్పందించింది. ఆ తర్వాత, మహిళలపై లైంగిక వేధింపులు, దాడులకు సంబంధించి అనేక కథనాలు వెలుగులోకి వచ్చాయి.
దీంతో రాష్ట్ర ప్రభుత్వం హేమ కమిటీని ఏర్పాటు చేసింది. మళయాళ చిత్ర పరిశ్రమకు చెందిన అనేక మంది మహిళలు తమపై జరిగిన దాడుల గురించి, తాము ఎదుర్కొన్న పరిస్థితుల గురించి ఈ కమిటీకి ఫిర్యాదు చేశారు.
#MeToo ఉద్యమానికి ప్రతిస్పందనగా, ఫిర్యాదులపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ బృందం ఇప్పటికీ కొన్ని కేసులపై దర్యాప్తు చేస్తోంది.

ఫొటో సోర్స్, Arun Chandra Bose
కోర్టులో ఏం జరిగింది?
శుక్రవారం ఉదయం, న్యాయమూర్తి వర్ఘీస్ శిక్షను ప్రకటించడానికి ముందు ఏమైనా మాట్లాడతారా? అని అడిగారు. ఆరుగురిలో ఐదుగురు తాము నిర్దోషులమని వాదించారు. సునీల్ మాత్రం అలా చేయలేదు.
అయితే, వృద్ధురాలైన తల్లిని చూసుకోవాల్సి ఉందని కోర్టుకు చెప్పారు.
మరో దోషి మణికందన్ తాను నిర్దోషినని వాదించారు. కుటుంబానికి తానే ఏకైక ఆధారమని, భార్య, తొమ్మిదేళ్ల కుమారుడు, రెండున్నరేళ్ల కుమార్తెను చూసుకోవాల్సి ఉందని చెప్పారు.
మూడో దోషి మార్టిన్ ఆంటోనీ, తాను ఐదున్నరేళ్లు జైలు జీవితం గడిపానని, తాను నిర్దోషినని చెప్పారు. తనను విడుదల చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
తాను నిర్దోషినని చెబుతూనే వింత అభ్యర్థన చేశారు విజయేష్. తలస్సేరీకి చెందిన వాడిని కాబట్టి తనను కన్నూర్ జైలులో ఉంచాలని కోర్టును కోరారాయన.
ఐదో దోషి వాడివాల్ సలీం కూడా తాను నిర్దోషినని, తనకు భార్య, మూడేళ్ల కుమార్తె ఉన్నారని కోర్టులో చెప్పారు.
వీళ్లందరిపైనా నేరపూరిత కుట్ర, అక్రమ నిర్బంధం, మహిళ గౌరవానికి భంగం కలిగించడం, సామూహిక అత్యాచారం, సాక్ష్యాలను నాశనం చేయడం, కిడ్నాప్, నేరపూరిత బెదిరింపు, లైంగిక అసభ్యకరమైన విషయాలను రికార్డ్ చేయడం, షేర్ చేయడం వంటి అభియోగాలు మోపారు.
న్యాయమూర్తి వర్ఘీస్ తీర్పు వెలువరిస్తూ, "అసలు నేరస్తుడు సునీల్‌తో పాటు మిగతా ఐదుగురికి కూడా నేరంలో భాగస్వామ్యముంది" అని అన్నారు.
సునీల్ కేసు ఇతరులకన్నా భిన్నంగా ఉందని కోర్టు కూడా పేర్కొంది.
"ఆ మహిళ నిస్సహాయతను అర్థం చేసుకోవాలి. ఇది ఆమె గౌరవానికి సంబంధించిన విషయం" అని కోర్టు పేర్కొంది.
శుక్రవారం మధ్యాహ్నం 3:30 గంటలకు తీర్పు చెప్పడానికి ముందు న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ కేసులో 261 మంది సాక్షులను విచారించారు. వారిలో చాలామందిని కెమెరా ముందు విచారణ జరిపారు. వీరిలో అనేక మంది సినీ ప్రముఖులు ఉన్నారు.
విచారణ సమయంలో దాదాపు 28 మంది సాక్షులు ప్లేటు ఫిరాయించారు. ఈ కేసు విచారణలో అనేక ఒడిదొడుకులు ఎదురయ్యాయి.

ఫొటో సోర్స్, ANI
ఐటీ యాక్ట్ కింద కూడా శిక్ష..
సామూహిక అత్యాచారం, నేరపూరిత కుట్ర ఆరోపణలపై దోషులుగా నిర్ధరించడంతో పాటు సమాచార సాంకేతిక చట్టం(ఐటీ యాక్ట్)లోని సెక్షన్ 66E కింద లైంగిక దాడి వీడియోను రికార్డ్ చేసినందుకు సునీల్‌కు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించింది న్యాయస్థానం.
వీడియోలను షేర్ చేసినందుకు ఐటీ యాక్ట్ సెక్షన్ 67A కింద అదనంగా ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
ఐపీసీ సెక్షన్ 201 కింద సాక్ష్యాలను నాశనం చేసినందుకు మార్టిన్ ఆంటోనీకి మూడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.25 వేల జరిమానా విధించారు.
కిడ్నాప్ కేసులో దోషులుగా తేలిన ఆరుగురికి 10 ఏళ్ల జైలు శిక్ష, రూ. 25 వేల జరిమానా పడింది.
మొత్తం మీద సునీల్ రూ.3.25 లక్షలు, మార్టిన్ ఆంటోనీ రూ.3.25 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.
దోషుల నుంచి పోలీసులు రికవర్ చేసిన డబ్బులో రూ.5 లక్షలు, బాధితురాలి నుంచి లాక్కున్న ఉంగరాన్ని ఆమెకు తిరిగి అందించనున్నారు.
దోషులు ఇప్పటి వరకు జైలులో గడిపిన రోజుల్ని వారి శిక్ష నుంచి తగ్గిస్తారు.
సునీల్ 7 ఏళ్ల 6 నెలల 29 రోజులు, మార్టిన్ ఆంటోనీ 5 సంవత్సరాల 21 రోజులు, మణికందన్ 4 సంవత్సరాల 8 నెలల 27 రోజులు, విజయేష్ 5 సంవత్సరాల ఒక నెలా 15 రోజులు, సలీం ఏడాది 11 నెలల 12 రోజులు, ప్రదీప్ 3 సంవత్సరాల మూడు నెలల 28 రోజులు జైలు శిక్ష అనుభవించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














