ఆస్ట్రేలియా బీచ్‌లో యువతిని హత్య చేసి ఏళ్లపాటు ఇండియాలో దాక్కున్న వ్యక్తికి ఏం శిక్ష పడిందంటే...

ఫొటో సోర్స్, Queensland Police Service
- రచయిత, టిఫానీ టర్న్‌బుల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఏడు సంవత్సరాల కిందట ఆస్ట్రేలియాలోని ఓ బీచ్‌లో టోయా కార్డింగ్లీ అనే యువతి మృతదేహం బయటపడింది. నర్సుగా పనిచేసిన రాజ్‌విందర్ సింగ్ ఈ హత్య కేసులో దోషి అని తేలింది.
అక్టోబర్ 2018లో ఆదివారం మధ్యాహ్నం తన కుక్కను తీసుకుని వాకింగ్‌కు వెళ్లినప్పుడు టోయా కార్డింగ్లీని 26 సార్లు కత్తితో పొడిచి హత్య చేశారు రాజ్‌విందర్ సింగ్.
ప్రముఖ పర్యటక ప్రదేశాలైన కైర్న్స్, పోర్ట్ డగ్లస్ మధ్య ఉన్న వాంగెట్టి బీచ్‌లోని ఇసుక దిబ్బలలో సగం పాతిపెట్టిన 24 ఏళ్ల కార్డింగ్లీ మృతదేహాన్ని ఆమె తండ్రి గుర్తించారు.
కార్డింగ్లీ మృతదేహం దొరికిన మరుసటి రోజే రాజ్‌విందర్ సింగ్ (41) భారతదేశానికి పారిపోయి వచ్చారు. నాలుగు సంవత్సరాలు అజ్ఞాతంలో ఉన్నారు.
గత నెల రోజులుగా సాగిన విచారణ తర్వాత, సోమవారం జ్యూరీ అతడిని దోషిగా నిర్ధరించింది. మంగళవారం నాడు శిక్ష విధిస్తూ, రాజ్‌విందర్ సింగ్ 25 సంవత్సరాలపాటు పెరోల్‌కు వీలులేని కారాగారం అనుభవించాలని కోర్టు తీర్పు చెప్పినట్లు ఆస్ట్రేలియాకు చెందిన వన్ న్యూస్ ఆన్‌లైన్ పత్రిక వెల్లడించింది.

ఈ ఏడాది మార్చిలో జరిగిన విచారణలో జ్యూరీ తీర్పు ఇవ్వలేకపోయింది. ఇది రెండో విచారణ.
హెల్త్ స్టోర్‌లో పని చేసిన టోయా కార్డింగ్లే, యానిమల్ షెల్టర్‌లో వలంటీర్ కూడా. స్థానికంగా అందరికీ తెలిసిన, ఇష్టమైన వ్యక్తిగా ఆమెకు పేరుంది. ఆమె హత్య క్వీన్స్‌ల్యాండ్ స్టేట్‌లో విషాదాన్ని నింపింది.
కార్డింగ్లీని ‘‘పదునైన వస్తువుతో చాలాసార్లు పొడిచి, బతికే అవకాశంలేకుండా ఇసుకలో పూడ్చిపెట్టడం’’ అనే ఆరోపణలపై కైర్న్స్ సుప్రీంకోర్టు విచారించింది.
సింగ్ - భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు. హత్య జరిగిన సమయంలో ఇన్నిస్‌ఫైల్‌లో నివసిస్తున్నారు. నేరం జరిగిన ప్రదేశానికి దక్షిణంగా రెండు గంటల దూరంలో ఉన్న పట్టణం ఇది.
డిటెక్టివ్‌లు అతన్ని సస్పెక్ట్‌గా గుర్తించేటప్పటికే సింగ్ దేశంవిడిచి పారిపోయారు. అతని భార్య, ముగ్గురు పిల్లలు, తల్లిదండ్రులను వదిలి వెళ్ళిపోయాడని విచారణలో తేలింది.
హత్యా నేరం నుంచి తప్పించుకోవడానికి భారతదేశం వచ్చి, అజ్ఞాతంలో గడిపిన ఆయన్ను దిల్లీలో పట్టుకుని ఆస్ట్రేలియాకు తరలించారని, 2023 మార్చి నుంచి ఆయనపై విచారణ మొదలైందని వన్ న్యూస్ పత్రిక తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
దేశం విడిచి పారిపోవడమే..అతను నేరం చేశాడన్నదానికి సూచన అని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. ప్రత్యక్ష సాక్ష్యాలు లేవు, కానీ ఉన్న సాక్ష్యాలన్నీ రాజ్‌విందర్ నేరం చేసినట్టుగా చూపిస్తున్నాయి" అన్న ప్రాసిక్యూటర్ల వాదనను కోర్టు విన్నది.
ఆ సాక్ష్యాలలో సంఘటన స్థలంలో ఒక కర్ర నుంచి స్వాధీనం చేసుకున్న డీఎన్ఏ కూడా ఉంది. ఇది సింగ్ దే అనడానికి 3.8 బిలియన్ రెట్లు ఎక్కువ అవకాశం ఉందని తేలింది. అలాగే, టోయా కార్డింగ్లే ఫోన్ సిగ్నల్స్, హత్య తర్వాత కొన్ని నిమిషాల్లో సింగ్ కార్ మూమెంట్లు సరిపోతున్నాయని కూడా ప్రాసిక్యూషన్ తేల్చింది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














