అరకు అందాలకు వన్నెలద్దే వలిసె పూలు క్రమంగా ఎందుకు కనుమరుగవుతున్నాయి?

వలిసె పూలు అరకు, విశాఖపట్నం, ఏజెన్సీ, ఆంధ్రప్రదేశ్
ఫొటో క్యాప్షన్, శీతాకాలంలో అరకు వలిసె పూల అందాలను అద్దుకుంటుంది.
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

అరకు వెళ్తే ఎటుచూసినా పసుపు పచ్చని పువ్వులు పలకరించేవి. వాటి అందాలను ఆస్వాదిస్తూ ముందుకు సాగిపోతుంటే, పసుపు పచ్చని కొండలెక్కుతున్నామా అన్నట్లుగా ఆహ్లాదంగా అనిపించేది. కానీ, ఆ అనుభవం దశాబ్దం క్రితం నాటి ముచ్చట అయిపోతోంది.

ఇప్పుడు ఆ పసుపు వర్ణమే పెద్దగా కనిపించట్లేదు. ఆ పూలు ఎక్కడ కనిపిస్తాయా అని పర్యటకులు వాటిని వెతుక్కుంటూ వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.

సాధారణంగా జనవరి నుంచి అక్టోబర్ వరకు అరకు పర్యటనలో పాముల్లాంటి రోడ్లు, వాటి పక్కనే లోయలు, చక్కటి వాతావరణం, వాటి మధ్య గిరిజనుల జీవనం కనిపిస్తే.. మిగిలిన నవంబర్, డిసెంబర్ నెలల్లో మాత్రం వలిసె పూల అందాలదే పైచేయి.

ఈ వలిసె పూలు కాస్త ఎండ పడగానే బంగారం రంగులో మెరిసిపోతాయి. చిన్న గాలి వీస్తే అటూ ఇటూ తల ఊపినట్లు ఊగుతాయి. కాస్త చల్లబడితే మృదువుగా పక్కకి ఒదిగిపోతాయి. అరకు వచ్చే టూరిస్టులలో ఈ పూలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు.

కేవలం ఈ వలిసె పూల తోటల్లో సెల్ఫీలు, ఫ్యామిలీతో ఫోటోలు దిగేందుకే అరకు వచ్చే టూరిస్టులున్నారంటేనే, వాటి క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.

తరచుగా, సినిమా షూటింగ్‌లు కూడా వలిసె పూల మధ్య జరుగుతుంటాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

నవంబర్, డిసెంబర్ మాసాల్లో పర్యటకులతో పాటు సినిమా యూనిట్‌ల సందడి కూడా అధికంగా కనిపిస్తుంటుంది.

"ఏటా ఆగస్ట్ నెలలో విత్తనాలు వేస్తారు. నవంబర్ నాటికి మొదటి దశ పువ్వులు వస్తాయి. డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో వికసిస్తాయి. పొలాలన్నీ పసుపు రంగు కప్పేసినట్లుగా కనిపిస్తాయి. సంక్రాంతికి వీడ్కోలు పలికే పంట ఇది. గిరిజన ప్రాంతంలో ఇదొక పండుగ వాతావరణం తెస్తుంది" అని అరకు నివాసి ప్రశాంత్ బీబీసీతో చెప్పారు.

"నవంబర్, డిసెంబర్ నెలల్లో అరకు వచ్చే మాలాంటి టూరిస్టులకు వింటర్ మూడ్ తీసుకురావడంలో మంచు, చలి, అరకు కాఫీతో పాటు వలిసె పూలు వెరీ స్పెషల్'' అన్నారు రాజమహేంద్రవరం పట్టణానికి చెందిన శిరీషా దేవి.

ఆమె బీబీసీతో మాట్లాడుతూ, "వలిసె పూల సీజన్ ఎప్పుడో తెలుసుకుని, ప్రత్యేకంగా టూర్ ప్లాన్ చేసుకుని మరీ వచ్చాను. ఈ వలిసె పూలను చూడగానే మనసు ఎంతో ఆహ్లాదకరంగా మారిపోతుంది" అని అన్నారు.

"ఈ ఫ్లవర్స్ చాలా అందంగా ఉంటాయి. ఫోటోలకైతే సూపర్. పసుపు పచ్చని వలిసె పూల మధ్య సెల్ఫీలు, ఫోటోలు తీసుకోకుండా అరకు టూర్ కంప్లీట్ కాదు" అని అంటున్నారు విశాఖకు చెందిన సౌమ్య.

అంత అందమైన వలిసె పూల తోటలు ఇప్పుడు క్రమంగా కనుమరుగయ్యే పరిస్థితి ఎందుకొచ్చింది?

వలిసె పూలు అరకు, విశాఖపట్నం, ఏజెన్సీ, ఆంధ్రప్రదేశ్

కేవలం అందం మాత్రమే కాదు, ఉపాధి కూడా..

వలిసెలను అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజన రైతులు సాగు చేస్తున్నారు. ఈ వలిసె గింజల (నైజర్ సీడ్స్)ను స్థానికంగా అడుసులు అనే పేరుతో గిరిజనులు పిలుస్తుంటారు.

అరకు, పాడేరు, చింతపల్లి ఏజెన్సీ ప్రాంతాల్లో ఒకప్పుడు విస్తారంగా వలిసెలను సాగుచేసేవారు. కానీ, ఇప్పుడు క్రమంగా వలిసెల సాగు తగ్గిపోతోంది.

అరకు అందాలను ఇనుమడింపజేసే ఈ వలిసె పూల సాగు గిరిజనులకు ఒక ఉపాధి పంట. ఈ పువ్వుల నుంచి వచ్చే విత్తనాలతో "వలిసె నూనె" (అడుసు నూనె) తయారు చేస్తారు.

ఈ నూనె వంటకు కూడా ఉపయోగిస్తారని, ప్రత్యేకమైన స్వీట్లు తయారు చేస్తారని ఆంధ్ర విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర విభాగం ప్రొఫెసర్ పడాల్ బీబీసీతో చెప్పారు.

''ఈ నూనెకు ప్రత్యేకమైన లక్షణాలు ఉండటంతో ఒకప్పుడు గిరిజనులు వేలాది ఎకరాల్లో వలిసెలను సాగు చేసేవారు. ఇది ఐదు నెలల పంట. ఆగస్టులో విత్తనాలు వేస్తారు. డిసెంబర్‌లో పంట చేతికొస్తుంది. ఈ విత్తనాల నుంచి తీసే నూనెలో కొవ్వు తక్కువగా, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. గిరిజనులు దీన్ని వంట నూనెగా వాడతారు" అని ఆయన వివరించారు.

వలిసె పూలు అరకు, విశాఖపట్నం, ఏజెన్సీ, ఆంధ్రప్రదేశ్
ఫొటో క్యాప్షన్, వలిసె పంట సాగు విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతోంది.

తగ్గుతోన్న వలిసెల సాగు..

''ఇంతకుముందు పెద్ద సంఖ్యలో టూరిస్టులు వచ్చేవారు, సినిమా షూటింగ్‌ల సందడి ఉండేది. కానీ, ఇప్పుడా వాతావరణం కనిపించడం లేదు. షూటింగులు తగ్గిపోయాయి'' అని ప్రశాంత్ బీబీసీకి చెప్పారు.

ఒకప్పుడు నాలుగైదువేల ఎకరాల్లో వలిసె తోటలు ఉంటే ఇప్పుడవి దాదాపు వెయ్యి ఎకరాల కంటే తక్కువకే పడిపోయిందని చింతపల్లిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం అసోసియేట్ డైరక్టర్ ఆఫ్ రీసర్చ్ (ఏడీఆర్( డాక్టర్ ఆళ్ళ అప్పలస్వామి తెలిపారు.

"అరకు వస్తే వలిసె తోటల సమీపంలోనే ఎక్కువ సమయం గడుపుతాం. కారణాలు తెలియవు కానీ వలిసె పూలు బాగా తగ్గాయన్నది మాత్రం నిజం" అని అరకు పర్యటనకు వచ్చిన ఇంజినీరింగ్ విద్యార్థిని సౌమ్య బీబీసీతో అన్నారు.

వలిసె పూలు అరకు, విశాఖపట్నం, ఏజెన్సీ, ఆంధ్రప్రదేశ్
ఫొటో క్యాప్షన్, వలిసెల సాగు తగ్గడంతో మన్యంలో తేనె ఉత్పత్తిపై కూడా ప్రభావం పడింది.

'తేనె ఉత్పత్తిపైనా ప్రభావం'

దశాబ్ద కాలంలో సాగు విస్తీర్ణం వేగంగా తగ్గిందని చింతపల్లిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసర్చ్ (ఏడీఆర్) డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి బీబీసీతో అన్నారు. దీని ప్రభావంతో మన్యంలో తేనె ఉత్పత్తి కూడా పడిపోయిందని చెప్పారు.

"వలిసె పూలలో మకరందం అధికంగా ఉండడం వల్ల తేనెటీగలు ఎక్కువగా వలిసె తోటల్లోకి వచ్చేవి. తేనె ఉత్పత్తి కూడా బాగా ఉండేది. కానీ, సాగు తగ్గడంతో తేనె ఉత్పత్తి కూడా తగ్గిపోయింది. తేనె ఉత్పత్తి తగ్గుదలకు పర్యావరణ ప్రభావం కూడా ఉంది'' అని డాక్టర్ అప్పలస్వామి చెప్పారు.

గిరిజన రైతులు గతంలో మాదిరిగా వలిసెల సాగుపై ఆసక్తి చూపించట్లేదు. ప్రత్యామ్నాయంగా రాజ్మా, పొద్దుతిరుగుడు తదితర పంటల వైపు మళ్లుతున్నారని ఆయన వెల్లడించారు.

వలిసె గింజల (నైజర్ సీడ్స్) ధర స్థిరంగా లేకపోవడం, విత్తనాల సమస్య, సస్యరక్షణ ఖర్చు అధికమవ్వడం, గింజలతో నూనె తయారీకి ఖర్చు పెరిగిపోవడం తదితర కారణాలు గిరిజన రైతులను వలిసెల సాగు నుంచి దూరం చేస్తున్నాయి.

''కొన్నేళ్లుగా వలిసె పైరును బంగారు తీగ (Cuscuta) అనే తెగులు దెబ్బతీస్తోంది. ఈ తెగులు మొక్క నుంచి రసం పీల్చేస్తుంది. దీని నుంచి పంటను కాపాడుకోవడానికి కావాల్సిన పురుగుమందుల ఖరీదు ఎక్కువగా ఉంది. పైగా ప్రభుత్వం నుంచి విత్తనాల సరఫరా కూడా తగ్గింది" అని డాక్టర్ అప్పలస్వామి చెప్పారు.

వలిసె పూలు అరకు, విశాఖపట్నం, ఏజెన్సీ, ఆంధ్రప్రదేశ్

'వలిసెలు.. గిరిజన సంస్కృతి'

"అరకులో వలిసెలు కేవలం ఒక పంట మాత్రమే కాదు, అవి గిరిజన ప్రాంత సంస్కృతి కూడా" అని గిరిజన సంఘం నాయకులు గోవిందరావు బీబీసీతో అన్నారు.

"అరకులోయ పర్యటన అంటే వలిసె పూలలో ఫొటోలు తీసుకోవడం టూరిస్టులకు సిగ్నేచర్‌గా మారింది. ఈ పసుపు రంగు పూల అందాలను చూసేందుకే అరకు టూర్ ప్లాన్ చేసుకునేవారు ఉన్నారంటే, వీటికి ఎంత క్రేజో అర్థమవుతుంది. అలాంటిది ఇప్పుడు వలిసె పూలు చూడటానికి వెతుక్కోవాల్సిన పరిస్థితులు వచ్చాయి" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

"మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలంటే, ప్రభుత్వం విత్తనాల సబ్సిడీ పునరుద్ధరించాలి. పంటకు కనీస మద్దతు ధర హామీ ఇవ్వాలి. బంగారు తీగ తెగులు నివారణపై పరిశోధన జరగాలి. గిరిజన రైతులకు ప్రభుత్వం భరోసా కల్పించాలి. వలిసె నూనె ప్రాసెసింగ్ యూనిట్లు పెంచాలి. ప్రత్యేక బ్రాండ్‌గా ప్రమోట్ చేయాలి" అని గోవిందరావు కోరారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)